బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కర్తవ్యం, బాధ్యత…


    అవడం రెండు మాటలవొచ్చు, చాలా మంది, ఆ … పేద్ద తేడా ఏమిటిలెద్దూ అనికూడా అనుకోవచ్చు. ఆ రెండు పదాల మధ్య అర్ధం లో కూడా, ఓ బుల్లి వెంట్రుకవాసి తేడా మాత్రం ఉంది. నాకు తెలిసిన బుడి బుడి ఇంగ్లీషులో వీటిని Duty, Responsibility/Accountability అంటారని అనుకుంటున్నాను.
వీటి మధ్య ఉండే తేడా మన perception బట్టి ఉంటుంది. నా ఇంగ్లీషు నచ్చకపోతే తిట్టడం మాత్రంతిట్టకండి.

    అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందంటే, ప్రతీ రోజూ ఉదయం 8.30 కి “మా” టీవీ లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి, ప్రవచనాలు వినడం ధర్మమా అని. ఈవేళ ప్రొద్దుట, ఏదో విషయం గురించి ప్రసంగిస్తూ ఈ పై పదాలగురించి ప్రస్తావించారు. అదన్నమాట ఈ టపాకి కారణం. చాగంటి వారి లాటివారు చెప్తే వినాలి కానీ, మీరు చెప్పే సోదంతా వినాలని రూల్ ఏమైనా ఉందా అంటే నేనేమీ చెప్పలేననుకోండి. ఆయన చెప్పవలసినవేవో చెప్పారు, నాకంటే పనీ పాటా లేదు కాబట్టి, ప్రతీ రోజూ ఈ ప్రవచనాలతోనే సరిపోతోంది. కానీ అందరి విషయమూ అలా ఉండదుగా, ఏదో నాకు తోచింది, నాకు వచ్చిన భాషలో చెప్దామని ఈ తాపత్రయం అంతానూ..

   ఇష్టమైతే చదవండి, లేదా దాటవేసేయండి. నా Duty మాత్రం నేను చేస్తాను. చూశారా నేను మొదట్లో మూడేళ్ళ క్రితం బ్లాగులోకం లోకి ప్రవేశించినప్పుడు, నేను వ్రాసే టపాలు, వాటిమీద వచ్చే వ్యాఖ్యలూ ( ఎన్నెన్నొచ్చేవండీ..) చూసి, అబ్బో మనమూ వ్రాయగలమూ, ఎంతోకొంతమందికైనా నచ్చుతున్నాయీ అనుకుని, ఓ “బాధ్యత” తో వ్రాసేవాడిని. ఎవరినీ నొప్పించకూడదూ, కొంతమందికైనా ఉపయోగపడాలీ అనుకుని, వ్యాఖ్యలు కూడా మరి అలాగే ఉండేవి. కానీ చదవగా చదవగా మొహం మొత్తేసినట్టుంది, నా టపాల మీదా ఓ టైప్ ఆఫ్... ఎందుకులెండి ఆ మాటనడం… దానితో ఏమయ్యిందీ, ఓ అలవాటైపోయిందికాబట్టి ఓ Duty లా చేస్తున్నాను కానీ, ఓ Responsibility లా చేయడానికి మనసు రావడం లేదు.అయినా నా గొడవెందుకులెండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రాస్తూనే ఉంటాను.

    ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను.చాలా మందికి గుర్తుండేఉంటుంది, ఇదివరకటి రోజుల్లో మనకి పాఠాలు చెప్పిన గురువులు, చదువు చెప్పడం ఓ Duty లా మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఇంకో మెట్టు పైకి వెళ్ళి ఓ ” బాధ్యత” కూడా తీసికునేవారు. వారు చెప్పింది మనకర్ధమయిందా లేదా, లేకపోతే ఇంకోసారి చెప్పి, అప్పటికీ అర్ధం అవకపోతే ఇంటికి కూడా పిలిపించుకుని మరీ, చెప్పేవారు. ఏదో జీతం ఇస్తున్నారు కదా, సిలబస్ పూర్తిచేసేస్తే సరిపోలేదా అని ఎప్పుడూ అనుకునేవారు కాదు. మరి ఇప్పుడు ఎన్ని కోచింగ్ సెంటర్లలో, ఎన్ని కార్పొరేట్ కాలేజీల్లో అటువంటి వాతావరణం చూడకలుగుతున్నాము? ఆ మధ్యన హైదరాబాద్ లో ఓ Day Care Centre లో పాపం ఒక పాప, చపాతీ గొంతుకడ్డం పడి, ఊపిరాడక ప్రాణం విడిచిందిట.It was so sad.. కారణం ఏమిటీ, అక్కడుండే ఆయా, ఏదో పిల్ల తింటోందీ,టైముకి తింటోందా లేదా చూడ్డమే కదా మన Duty అనుకుందేకానీ, సరీగ్గా తింటోందా లేదా అని చూడాలని అనుకోలేదు. అక్కడే కర్తవ్యానికీ బాధ్యత కీ ఉన్న తేడా. Parents paid a heavy price.

    ఏ బ్యాంకుకైనా, ఎల్ ఐ సీ ఆఫీసు, అలాగని ఏ ప్రభుత్వ ఆఫీసుకైనా వెళ్ళి చూడండి. మనం నింపిన ఫారాలు సరీగ్గాఉన్నాయో లేదో చూడ్డం వరకే తమ కర్తవ్యం అనుకుంటారు కొంతమంది. ఓ సారి చూసేసి, “సరీగ్గా లేదండీ..” అనేసి మొహాన్న కొట్టేసి Next... అంటూ ఇంకోణ్ణి పిలుస్తారు. అంతేకానీ, తప్పెక్కడుందీ ఎలా సరి చేయాలీ అని మాత్రం చెప్పడు. అలాగని అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది Poor Souls ని కూడా చూస్తూంటాము. అలా కాదు మాస్టారూ, ఇలాగ నింపాలీ అంటూ ఓపిగ్గా చెప్త్పడమే కాదు, కొన్ని కొన్ని సార్లు వాళ్ళే నింపి పెడతారు కూడానూ. దీన్నే “బాధ్యత” అంటారు.రోజంతా ప్రజాసేవ చేయడమేనా మా పనీ, అనుకుని, ఇలా ఉపకారం చేసేవాడినికూడా వేళాకోళం చేస్తారు. దానితో ఆ మనిషికూడా, పోన్లెద్దూ మనకెందుకులే అనుకుని, ఎవడెలా పోతే మనకెందుకులే అనుకుని గుంపులో గోవిందా అయిపోతాడు. చూశారా ఈ so called Duty minded వారి నిర్వాకం ?

    ఈమధ్యన ఎక్కడ చూసినా ఎప్పుడో జరిగిన స్కామ్ముల్లో డబ్బు తినేసేరనో, ఎవడికో disproportionate assets విషయంలో సహాయం చేశారనో, మన IAS IPS Officers లను జైళ్ళల్లో పెట్టారు. వాళ్ళంటారూ, మా Duty మేము చేశామూ, అదికూడా తప్పేనా అని. ఇంక మన మంత్రులు, మేమేం చెయ్యమూ, ఆ ఆఫీసరు సంతకం పెట్టాడు కదా అని మేమూ సంతకాలు పెట్టేశామూ, ప్రతీ కాయితమూ చూసి సంతకాలు పెట్టాలంటే, ఇంక మాకేమీ పనే లేదా, ఎన్నెన్ని పనులుండవూ,భూకబ్జాలు చెయ్యాలి,డబ్బులు తినాలి, ఇంకో పార్టీవాణ్ణి తిట్టాలి, మనవాడికి టెండర్లిప్పించాలి, విదేశాల్లో చదివే మన పిల్లలకి ఎవడినో చూసి డబ్బిప్పించాలి ఎన్ని గొడవలూ? మాకేముందీ ఉండేదా అయిదేళ్ళు .. అంటూ. చివరకి ఎవడు చూసినా Duty చేస్తున్నాడంటాడే కానీ, ఆ రెండో దాన్ని గురించి మాత్రం ఎవ్వడూ ఎత్తడు… our life goes on...

    ఇంక ఇళ్ళల్లో పిల్లలకి చెప్పిచేయించడం ఓ కర్తవ్యం అనుకుంటే సరిపోదు. దాన్ని ఓ బాధ్యతలాగే తీసికోవాలి. రేపెప్పుడో మన పిల్ల ఇంకో ఇంటికి వెళ్ళవలసినదే. అక్కడ ఏదైనా తేడా ( పిల్ల నడవడిక, మాటల్లో) వస్తే, అత్తారింట్లో చివాట్లు తినేది, మన పిల్ల కాదు, మనమే, “ అబ్బ ఏం పెంపకమండీ, ఓ మాట తీరువైనా నేర్పలేదు ఆ మహా తల్లి, అసలు వాళ్ళమ్మని అనాలి...” అంటూ.అలాగే కొడుకు విషయం లోనూ, ” ప్రతీ రోజూ నిత్యసంధ్యావందనం లాగ చెప్తూనే ఉన్నామండీ, వాడు వినడం లేదూ..” అనుకుని ఓ డ్యూటీ చేసేసికున్నట్టు, ఓ సీడీ పెట్టేస్తే సరిపోతుందా, ఒకటికి పదిసార్లైనా చెప్పి, ఆ పిల్లాడిని సరైన మార్గం లో పెట్టే బాధ్యత తల్లితండ్రులదే గా.

5 Responses

 1. ఏమోనండీ నాకిలాగు సూక్ష్మబేధాలు కనిపెట్టటం రాదేమో. నాదృష్టిలో కర్తవ్యం అంటే తాను యేది చేయవలసి ఉందో అది. మొక్కుబడిగా చేస్తే కర్తవ్యంనిర్వహించినట్లు కాదు. చేసేది సక్రమంగా చేస్తేనే కర్తవ్యంనిర్వహించినట్లు అవుతుంది. అప్లికేషన్ ఫారం సరిగా ఉంటేనే అంగీకరించి లేకపోతే ఒక్క మాటలో ‘నో’ అంటూ పోయే వాడు కర్తవ్యం నిర్వహించినట్లు కాదు. యేమి తప్పు ఉందో చెప్పితీరాలి. ఏ కార్యనిర్వహణ మనం మోసి తీరాలో దానినే బాధ్యత అంటారు – అంటే బధ్దుడై ఉందవలసిన విషయం అని. కర్తవ్యం అనే దాని వ్యుత్పత్తి మనం కర్తృత్వం వహించవలసిని విషయం అని – అంటే మనం కార్య నిర్వహణకు పూనుకోవలసిన విషయం అని. ఈ రెండు మాటలకు బేధాలు తీయవలసినదేమీ పెద్దగా లేదు. సందర్భాన్ని బట్టి మాట వాడతాం. అంతే.

  Like

 2. మా అమ్మ చెప్పిన మాటలు
  మనుష్యులలో రెండు తెగలు.
  పనులు చేసే వారు, పనులు చేయించు కొనే వారు.
  బరువు-భాద్యత , కర్తవ్యం అనేవి
  ప్రతి తరంలో పని చేసే వాళ్ళకు గుర్తుంటాయి.
  చేయించుకొనే వారికీ అదొక హక్కులగా అనిపిస్తుంది.
  మంచి విషయాన్నీ చర్చించారు.

  Like

 3. డాక్టరు గారూ,

  థాంక్స్ సర్…

  Like

 4. @శ్యామలరావు గారూ,

  మీరు వ్రాసినదీ, పైన నేను చెప్పినదీ ఒకలాగే ఉన్నట్టున్నాయి…..

  @రాఘవ గారూ,

  ధన్యవాదాలు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: