బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో ఏడాద్దాకా ఫరవాలెదు….

    అమ్మయ్య ఇంకో ఏడాద్దాకా ఫరవాలేదు, హాయిగా ఉండొచ్చు.Olympics, FIFA World Cup, Winter Olympics etc... లాటి పెద్ద పెద్ద events ఎప్పుడు ఎక్కడ జరగాలో ఎనిమిదేళ్ళ ముందర నుంచీ fix చేసేస్తారుట. ఈ events ని host చేసేవాళ్ళు, ప్రిపరేషన్లు చేసుకోవచ్చనీ, ఆ సందర్భంలో ఏదో కొద్ది కొద్దిగా కక్కూర్తులు పడొచ్చనీ ( మా సురేష్ కల్మాడీ లాగ!), ఏది ఏమైనా టైముకి అన్నీ సమకూర్చేలా అంతా హడావిడే. ఇలా ముందుగానే తెలియచేయడంతో పన్లు కూడా సావకాశంగా చేసికోవచ్చు. ఏదో దేశాలూ వగైరాలంటే కావలినన్ని సదుపాయాలూ, man powerలూ ఉంటాయి. గొడవ లేదు. ఏదో పిల్లకి పెళ్ళి చేయాలంటే చూడండి, ఇంట్లో అంతా హడావిడే. ప్రతీవాళ్ళూ ఆ రోజు దగ్గరకొచ్చేసరికి ఉరకలూ పరుగులూనూ. ఒక్కళ్ళకీ మనశ్శాంతుండదు. పైగా పెళ్ళికూతురి తల్లితండ్రులకైతే మరీనూ. మొగపెళ్ళివారికి కోపాలూ అలకలూ రాకుండా చేయగలమో లేదో, వాళ్ళకి క్యాటరింగూ అదీ సరీగ్గా చేస్తామో లేదో, వాళ్ళకి విడిదులూ, మర్యాదలూ సరీగ్గా చేస్తామో లేదో అనుకుంటూ, ప్రతీ దానికీ టెన్షనే.

    ఈ ఉపోద్ఘాతమంతా దేనికీ అంటే, మా ఇంటావిడ ప్రతీ నెలా ఇంకొందరు వాళ్ళ ఫ్రెండ్స్ తో అదేదో కిట్టీ పార్టీ లాటిది చేసుకుంటూంటారు.దీంట్లో చిట్లూ, పాటలూ లాటివుండవులెండి, ఏదో నెల నెలా ఓ ఫిక్సెడ్ అమౌంట్ ఇవ్వడమూ, ప్రతీ నెలా ఓ చీటీ తీయడమూ, అలా చిట్ వచ్చినవాళ్ళింట్లో మీటింగూ, వాళ్ళకి లంచీ , ఓ నాలుగ్గంటల పాటు కబుర్లు చెప్పుకోడమూ, అందరూ ఇచ్చిన డబ్బులు బ్యాంకుల్లో వేసికోడమూ,పై నెల నుంచి, ఈ చిట్ వ్యవధి పూర్తయేదాకా మొగుడనబడే పక్షి నెలనెలా డబ్బులు కడుతూండడమూ. పాపం మా ఇంటావిడ అలా కూడబెట్టిన డబ్బులు కావలిస్తే తీసికోండీ పోనీ అని అంటూంటుంది, మొహమ్మాటానికి, ఆ offer కూడా 24 గంటల్లో expire అయిపోతుంది.అదృష్టం బాగుందా ఒప్పుకోడం. లేదా అదేదో rain cheque లాగ, అవసరార్ధం అడుగుతూండడం. రెండో దే హాయి లెండి, మన క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది.

    క్రిందటి సారి పదిహేనో నెలలో వచ్చింది. ఏ నెలకానెల, పై నెలలో మన పేరొస్తుందేమో అని ఓ suspence, expectation లాటివుండేవి. ప్రతీ నెలా డబ్బులిచ్చేటప్పుడు, నా లెక్చరూ… ఊరికే నెలకీ రెండేసి వేలివ్వడమూ, ఓ నయా పైసా లాభం లేకుండా ఏడాది పొడుగునా కట్టుకుంటూండడమూనూ అంటూ ( నా ఉవాచ). ఇదే ఏ బ్యాంకులోనైనా వేసికుంటే వాడు వడ్డీయేనా ఇచ్చేవాడూ అంటూ నేనూ, ఏదో పాత ఫ్రెండ్స్ ని కలుసుకోడానికే కదా ఇవన్నీనూ, ఈ మాత్రందానికే పేద్ద రాధ్ధాంతం చేసేస్తున్నారూ, ఏమైనా మణులడిగానా, మాణిక్యాలడిగానా అంటూ తనూ, ప్రతీ నెలా ఏ ” నెలా తప్పకుండా” దెబ్బలాడుకోడమూనూ. నెల మొదటి వారం వచ్చేసిందంటే ఇదో కాలక్షేపం !!!

    ఈసారి ఈవిడకి నాలుగో నెలకే వచ్చెసింది ! పైగా మొదటి పేరాలో చెప్పానే అలాగ కిందటి నెలలోనే చెప్పేశారు. ఇంక చూడండి హడావిడి. నెల రోజుల్నుంచి ఒక్కరోజు మనశ్శాంతి లేదు. ప్రతీ దానికీ హడావిడే. మా అమ్మాయి పెళ్ళిక్కూడా, ఇంకో ఊరునుంచి పూణె వచ్చి పెళ్ళి చేసినప్పుడు కూడా ఇంత హైరాణ పడలేదు. ప్రతీ దానికీ ఖంగారే. తను ఖంగారు పడిపోవడమూ, నన్ను ఖంగారు పెట్టేయడమూనూ. అమ్మమ్మ..మ్మమ్మమ్మ... ఎంత హడావిడండి బాబూ.

    మెనూ ఏమిటీ, బయట్నుంచి తెచ్చేద్దామా పోనీ… వద్దులెండి మన వంటకాలంటే మా ఫ్రెండ్సందరికీ ఇష్టం, పైగా నా చేత్తో చేసినవి చాలా బావుంటాయంటారుకూడానూ అంటూ ప్రతీ రోజూ ఏదో ఓ టైములో దీనిగురించే చర్చ. ఇంకో తెలుగావిడున్నారులెండి వీళ్ళ గ్రూప్ లో, అవిడకి మొదటి నెలలోనే వచ్చేసింది, ఆ ఇంటాయన ప్రతీ నెలా డబ్బులు కట్టుకుంటున్నాడు! ఈవిడేం చేసేస్తోందో అని అవిడకి ఆత్రుత, మళ్ళీ ఆవిడతో చెప్పకూడదూ అంతా సస్పెన్సూ. ఏదో ఒకటీ బయట్నుంచైతే ఓ రోజు ముందర చెప్పేయ్, తీసికొచ్చి పెట్టేస్తానూ అని నామట్టుకు నేను చెప్పేశాను. అంతదృష్టంకూడానా.. మొత్తానికి ఓ మెనూ decide చేసేసింది. కొబ్బరి రైస్సూ, దోశలూ, సాంబారూ, మజ్జిగ పులుసూ, ఓ స్వీటూ, ఎవరో ఈవిడ చేసిన వడలు మెత్తగా దూదిలా ఉంటాయన్నారుట, మళ్ళీ అదోటీ, దాంట్లోకో పచ్చడీ. ఇప్పటికి మొత్తానికి sketch డ్రాయింగు బోర్డు మీదకొచ్చింది. ఇంక execution part మిగిలింది.

    అక్కణ్ణుంచి నా role ప్రారంభం! కోకోనట్ రైసు ఊరికే వస్తుందా, దానికి కొబ్బరికాయలుండాలి, వాటిని కొట్టాలి, మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కలు చేయాలి, అవన్నీ మిక్సీ లో పడేసి పాలు తియ్యాలి ( పాపం ఆ పాల సంగతేదో తనే చూసుకుందిలెండి)

    మర్నాడు ఆ వడలేవో చేయడానికి మినప్పప్పేదో నానబెట్టాలికదా, అప్పుడొచ్చి అడుగుతుందీ, “ఇది మినప్పప్పేనంటారా, మరీ చిన్నగా ఉంది పప్పూ, పెసరపప్పేమోనండీ...”, నాకూ అవునేమో అనిపించింది నిజం చెప్పొద్దూ… ఏదో మొత్తానికి డిసైడయిపోయి, దానికి మినప్పప్పని పేరెట్టేసింది. లేకపోతే అంత రాత్రి బయటకెళ్ళి మళ్ళీ మినప్పప్పెక్కడ తీసుకురానూ, పొద్దుటకల్లా నానాలంటే ఉన్నదేదో నీళ్ళల్లో ఇప్పణ్ణుంచీ పెట్టకపోతే పని జరగదు. ఇంక రాత్రంతా ఖంగారే… ఓ రాత్రివేళ లేచి అది మినప్పప్పేనంటారా అనడం.. మహా అయితే పెసర పుణుకులవుతాయి, ఈ మాత్రందానికి నన్ను ఖంగారు పెట్టేయడం.

   ఇంక దోశలకోసం పిండి తయారు చేసి ఓ గిన్నెలో పెట్టుకుంది. మళ్ళీ దానిగురించో ఖంగారూ, “సరిపోతుందంటారా, పోనీ బయట్నుంచి రెడీమేడ్ దో ప్యాకెట్టు తెచ్చి ఉంచుతారా ఏమిటీ....”.

    ఇంకోటండోయ్ మర్చేపోయాను,,, సాంబారులోకి చిన్న ఉల్లిపాయలు… వాటిని ఒలవాలంటే ప్రాణం మీదకొస్తుంది.ఈవిడేమో డైనింగు టేబిలూ అవీ, చకా చక్ మని క్లీన్ చేసేసి పెట్టేసికుంది. ఆ ఉల్లిపాయలు తెచ్చి, ఓ న్యూసు పేపరేసికుని ఒలవడం మొదలెట్టాను. మధ్య మధ్యలో వచ్చి చూడ్డం, తను క్లీను చేసి పెట్టిన టేబిల్ మీదెక్కడ ఆ ఉల్లిపాయల తొక్కలేసేస్తున్నానో అని ! ఆ మాత్రం తెలియదా నాకూ, నలభై ఏళ్ళ కాపరం… ఈలోపులో మర్నాటికి కావలిసిన స్టీలు పళ్ళాలూ, స్పూన్లూ, కటోరీలూ వంటింట్లో కింద ఓ గుడ్డేసి, వాటిమీద క్లీన్ చేసి ఆర పెట్టడం, ఒకటా రెండా పదహారు మందికి ప్లేట్లూ, రెండేసి కటోరీలూ... మాకున్నదా ఓ బుల్లి కిచెనూ, దాంట్లో ముప్పాతిక భాగం ఈ “ఆరపెట్టడానికే” సరిపోయింది. కిచెన్ లోకి అడుగెట్టకూడదూ, మళ్ళీ ఏ నీళ్ళ తుంపర్లేనా పడి మరకలైపోతే… ఓర్నాయనోయ్…

    మర్నాడేమో ఈవిడకి ఓ mystery shopping assignment అది కూడా ఈవిడపేర్నే.. మళ్ళీ చివాట్లూ… మీరెప్పుడూ ఇంతే, నా పార్టీ రోజునే ఏదో ఒకటి పెట్టేసికుని, బయటకు పారిపోతారు… అంటూ… నేనేమైనా కావాలని చేశానా, ఏదో కాలక్షేపమూ…ఆ కబురూ ఈ కబురూ చెప్పేసి, పదింటికల్లా వెళ్ళి, ఈవిడ పార్టీ మొదలెట్టేలోపల పన్నెండున్నరకల్లా వచ్చేస్తానని బయటకెళ్ళిపోయాను. అలా కాకుండా పోనీ ఇంట్లోనే ఉండిపోదామా అంటే, ఏదో ఒక దానికి ఖంగారు పడిపోయి, నన్ను ఖంగారు పెట్టేస్తుంది, అంతకంటే ఇదే హాయి...

   నా ఖర్మకాలి, నేను వచ్చేసరికి రెండున్నర అయిపోయింది. తీరా చూద్దునుకదా, ఆ పదిహేనుమందీ రానూ వచ్చారూ, హాయిగా ప్లేట్లల్లో పెట్టుకుని తిననూ తిన్నారు, నాకు మాత్రం విడిగా ఓ ప్లేట్లో ” మడిగా” పెట్టేసింది…. అలా కథ సుఖాంతం……

    ఈ ఏడాదికి అయింది. మళ్ళీ ఇంకో పది నెలలపాటు ప్రతీ నెలా ఎవరింటికో వెళ్ళడం, డబ్బులిచ్చేయడం… ఓ ఆటో కుదిర్చేసి ఆవిణ్ణి పంపెస్తే సరిపోతుంది…..

%d bloggers like this: