బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మాట దాచుకోడం…


    ఈ దాచుకోడాలని గురించి ఇదివరకు ఓ టపా వ్రాశాను. అందులో, వస్తువులు ” దాచుకునే” వారి గురించి ప్రస్తావించాను. వస్తువులే కాకుండా, కొంతమంది, మాటలు కూడా దాచుకుంటూంటారు. తమ మనస్సులో ఉన్నది ఇతరులతో పంచుకోరు. ఏం చెప్తే ఏమి చేసేస్తారో అని భయం. ప్రపంచంలో ప్రతీవారూ తమకు పోటీయే అని ఓ అభిప్రాయం.

    తమపిల్లలు స్కూల్లో చదివేటప్పుడు, వాళ్ళ నోట్సులుకూడా ఇంకోళ్ళకి ఇవ్వనీయరు. అవతలివాళ్ళకెక్కడ మార్కులు ఎక్కువ వచ్చేస్తాయో అని భయం. పోనీ అలాగని, ఇంకోళ్ళ నోట్సులు తీసికోకుండా ఉంటారా అంటే అదీ లేదూ, తమ పిల్లలు ఏ కారణం చేతైనా స్కూలుకి వెళ్ళలేకపోతే, అవతలివాళ్ళ పిల్లల నోట్సులే గతి.అలాగే ప్రతీవారికీ ఏదో ఒక సందర్భంలో అవసరాలు పడుతూ ఉంటాయి. అందరూ అలా ఉంటారని కాదు, సమాజంలో ఇలాటివారినే ఎక్కువగా చూస్తూంటాము. ఉదాహరణకి, ఏ scholarship పరీక్ష గురించో, లేకపోతే ఏ talent test గురించో వీళ్ళకి ముందుగా తెలిసిందనుకోండి, ఛస్తే ఇంకోళ్ళకి చెప్పరు, కారణం వాళ్ళ పిల్లలు ఎక్కడ తమ పిల్లలతో పోటీకి వస్తారో అని !ఇవే కాదు, తమ పిల్లలకి చదువుకోడానికి కొనిపెట్టే పుస్తకాల విషయం కూడా, ఇంకోళ్ళతో పంచుకోరు. వాళ్ళు కూడా ఇవే పుస్తకాలు చదివి మార్కులు ఎక్కువ తెచ్చేసికుంటే అమ్మో !!

    ఇప్పుడంటే నెట్ నిండా పెళ్ళి సంబంధాలే కాబట్టి ఫరవా లేదు కానీ, ఇదివరకటి రోజుల్లో , ఇంట్లో ఆడపిల్లుందంటే చాలు, తెలిసిన సంబంధాల విషయం ఇంకోరితో పంచుకునేవారు కాదు. ఏదో కారణాలవల్ల, వీళ్ళ ప్రయత్నాలు fail అయినప్పుడు మాత్రం, పేద్ద “విశాల హృదయం” తో, అవతలివాళ్ళతో ఒక మాట అనడం. అప్పుడు కూడా పూర్తి వివరాలు చెప్పరు, వీరికి ముందుగానే తెలిసినా కూడా.మళ్ళీ మన విషయం తెలిసిపోతే, వామ్మో ! చివరికి ఎవరిద్వారానో వాళ్ళకీ తెలుస్తుంది.అప్పుడు మొత్తానికి తేలుస్తారు, జాతకాలు కలవక, మేమే వద్దన్నామండి అని. అసలు కారణం ఇంకోటైనా సరే .

    అలాగే, మనం ఏ flat కొనుక్కోడానికో, అద్దెకు తీసికోడానికో, ఖర్మ కాలి ఏ agent/broker నైనా పట్టుకున్నామనుకోండి, తనే వారి దగ్గరకు తీసికెళ్తానంటాడు కానీ, ఆ party ( ఎవరైతే అద్దెకో/అమ్మడానికో ఇచ్చేవారు) వివరాలు మాత్రం మనతో share చేసికోడు. మళ్ళీ మనం direct గా, వాళ్ళని సంప్రదించేస్తే, వీడి commission పోదూ ? అలాగే మనం కూడా ఏ ఇల్లో, భూమో అమ్మడానికి ప్రయత్నిస్తూంటే, ఎవరో తెలిసినవాడు అడుగుతాడు, మాకే అమ్మకూడదోయ్ అంటూ. అక్కడ మళ్ళీ మొహమ్మాటం, మనం అనుకున్న రేటు రాకపోవచ్చు, వీణ్ణి వదిలించేసుకోడానికి, ఇంకో చోట ఎక్కువ బేరం చెప్పినవాడికి ఇచ్చేయడం, మరీ నిలబెట్టి అడిగినా, ” అస్సలు తెలుసున్నవాడివి కదా నీకే ఇచ్చేద్దామనుకున్నానోయ్, కానీ ఆఫీసులో మావాడు అప్పటికే ఇంకోళ్ళకి మాటిచ్చేశాడుట, ఏం చేయనూ, ఆఫీసుల్లో relations maintain చేయాలి కదా…”, అని అంటాడే కానీ అసలు విషయం మాత్రం చెప్పడు! పెళ్ళిళ్ళ విషయాల సంగతికొస్తే “జాతకాలు” safest escape route.

   ఇలాటివన్నీ ఇదివరకటి రోజుల్లో సర్వసాధారణంగా జరిగే విషయాలు. ఇంక ఈ రోజుల్లో తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాల విషయాల్లో చూస్తూంటాము. చెప్పా పెట్టకుండా, ఎప్పుడో ఒకరోజు చేతిలో pink slip వచ్చే రోజులాయె. ఎక్కడెక్కడ ఉద్యోగాలుంటాయో చెప్తే, మళ్ళీ వీడెక్కడ competition కి వస్తాడో అని భయం. ఈ సందర్భం లో నా అనుభవం చెప్తాను. నేను చేసే mystery shopping గురించి అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ చెప్తూంటాను. వాటి గురించి రెండు మూడు టపాలు కూడా వ్రాశాను. వాటిమీద ఆసక్తి ఉన్నవారు చదివారు, లేదా మానేశారు. పేద్ద చెప్తారు కానీ, పూణె లో ఉండడం లేదు కాబట్టి, ఆ సమాచారం తెలిసి, ఎవరైనా చేరినా మీకు competition కి రారు కాబట్టి, బయటి వాళ్ళతో share చేసికున్నారు కానీ, అదే పూణె లో ఉన్నవారితో share చేసికుంటే చెప్పండి అనొచ్చు. అక్కడికే వస్తున్నాను. నాకు తెలిసిన ఓ పెద్ద మనిషికి, దగ్గరుండి, నెట్ లో రిజిస్టర్ చేయించి, వివరాలు చెప్పాను. తను ఇప్పటికే రెండు మూడు evaluations కూడా చేశాడు, వాటికి డబ్బు కూడా వచ్చింది. ఆ పెద్దమనిషి ఓసారి మాటల్లో చెప్పాడు, తనకి TV Ads కీ,Movies లో చూస్తూంటాము junior artists సప్లై చేస్తూంటారు, అలాటి వాటికి వెళ్టూంటాడుట తనూ, తన భార్యానూ. పైగా తనే చెప్పాడు, మీగ్గూడా చెప్తానూ, సరదాగా ఉంటుందీ అని. అక్కడికేదో సినిమాల్లో వేసేద్దామని కాదు కానీ, ఇలాటివి బావుంటాయి కదా అని, కాలక్షేపమూ అవుతుందీ సరే ఇమ్మన్నాను.ఇదిగో ఇస్తానూ అదిగో ఇస్తానూ అంటాడే కానీ, ఆ ఏజెంట్ నెంబరు మాత్రం ఇవ్వలేదు ! No issue ! సందర్భం వచ్చింది కదా అని చెప్పాను.అలాగని నేనేదో ఘనకార్యం చేసేశానూ అని చెప్పుకోడానికి కాదు. అంతదాకా ఎందుకూ, ఎక్కడో ఏదో వస్తువు కొన్నామనుకోండి, అది కూడా ఏ discount sale లోనో, ఆ విషయం మాత్రం ఇంకోళ్ళతో పంచుకోము. అవతలివాడెందుకు సుఖ పడిపోవాలీ?

    ఈరోజుల్లో చూస్తున్నదేమిటీ? పైకోమాటా, లోపలోమాటానూ. ఎక్కడ చూసినా, వాడితో చెప్తే మనకేం వస్తుందీ అనే కానీ, పోనీ మనకి తెలిసినదేదో ఓ నలుగురితో పంచుకుంటే, వాళ్ళూ బాగు పడతారేమో అనుకుంటే, ఎంత బావుంటుందీ? Sharing enhances happiness always…

    ఏదో ఒకటీ అరా ఇలాటి అనుభవాలు జరిగాయి కదా అని బుధ్ధొస్తుందా అంటే అదీ లేదూ, నాకు ఏదైనా విషయం తెలిస్తే చాలు, నోట్లో నువ్వు గింజ నానదు. ఇంకోళ్ళతో చెప్పేసికుంటేనే కానీ కడుపుబ్బరం పోదు !నేను ఇప్పటి దాకా వ్రాసిన టపాలు చదివితేనే తెలుస్తుంది. నా జీవితం లో ఇప్పటిదాకా ఏమైనా “దాచానా” అంటే, నా అర్ధికస్థోమత గురించి, అదీ ఎవరితోనూ, of all the people మా ఇంటావిడతో !! ఆ సంబరమూ తీరిపోయిందిలెండి ఈమధ్యనే !

5 Responses

  1. చాలా బాగా చెప్పారండీ….

    అవునూ ఆ “నా జీవితం లో ఇప్పటిదాకా ఏమైనా “దాచానా” అంటే, నా అర్ధికస్థోమత గురించి, అదీ ఎవరితోనూ,of all the people మా ఇంటావిడతో !! ఆ సంబరమూ తీరిపోయిందిలెండి ఈమధ్యనే ”

    అదేమిటో మీకభ్యంతరం లేకపొతే మాకు చెప్పకూడదూ (ఆహా…నొట్లో నువ్వు గింజ నానదన్నారని అడిగా లెండి… మీ ఇష్టం)

    Like

  2. మాధవీ,

    ఇన్నాళ్ళూ నాకున్న “అప్పుల” సంగతి తెలియనీయలేదు. ఇంక ఆస్థులు అంటావా, మీరే నా ఆస్థులు….

    Like

  3. మీరంతలా చెప్పారు కబట్టి దాచుకోకుండా చెప్పేస్తున్నా, మీరు చెప్పినవి జీవిత వాస్తవాలండి. :))

    Like

  4. @డాక్టరు గారూ,

    ధన్యవాదాలు…

    @Snkr,

    పోన్లెండి దాచుకోకుండా చెప్పేశారు.. ధన్యోశ్మి…

    Like