బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “ఎరువు” అడగడం లో ఉండే మజా…

   ఏమిటో ఇన్నాళ్ళూ ఏదో లైట్ గా టపాలు వ్రాసేవాడిని. ఈమధ్యన మేము మనవైపు వెళ్ళిరావడం, అక్కడ ప్రత్యక్షంగా చూసినవీ, విన్నవీ పోనీ నా టపాల్లో వ్రాద్దామా అనిపించి, ఎరక్కపోయి కొద్దిగా సీరియస్సు టైపులోకి వెళ్ళిపోయాను. దీనికి సాయం మా ఇంటావిడ కూడా మరీ ఎమోషనల్ అయిపోయింది. ఎందుకు చెప్పండీ, మా దారినమేముండకుండా, జీవిత సత్యాలూ వగైరా అంటూ “ప్రవచనాల” లోకి ఎందుకు చెప్పండి? ఇంక మూడ్ మార్చాలనే ఈ “టపా”…

ఒకే ఏరియాలో ఉండే కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి ఉండే రోజుల్లో అన్నమాట, ఏ చిన్న అవసరం వచ్చినా, ఏ చిన్న వస్తువు కావల్సివచ్చినా, ఇంట్లో ఉండే చిన్న పిల్లాడినో, లేదా ఇంటి పనిమనిషినో, ఆ పక్కింటి వారింటికి వెళ్ళి ఫలానా వస్తువు తెమ్మనేవారు. అది ఓనిచ్చెనవొచ్చు, నూతిలో చేద పడిపోతే తీయడానికి ఉపయోగించే “గేలం” అవొచ్చు, మావిడికాయలు కోసుకోడానికి ఓ గెడకర్ర చివర ఓ హుక్కూ, దానికి ఓ వలలాటిది వేళ్ళాడదీసింది ( కాయలు కింద పడిపోకుండా), బరకాలు కుట్టుకోడానికి ఓ దబ్బనం పురుకొసా అవొచ్చు, బూజులు దులుపుకునే కర్రైనా అవొచ్చు. ఇలాటివి ప్రతీ ఇంట్లోనూ అవసరం వచ్చేవి, అయినా సరే తమ ఇంటిలో అనవసర inventory పెరిగిపోతుందనిన్నూ, పైగా ఇంకోరికెవరికైనా అవసరం వస్తే వాళ్ళకి ఎరువియ్యాల్సివస్తుందనిన్నూ, వాళ్ళు తిరిగిచ్చేదాకా నిద్ర పట్టదనిన్నూ ఇలా అనేక కారణాల వలన ఊరికే ఇలాటివన్నీ కొంపల్లో పెట్టుకునేవారు కాదు. అంత అవసరం వస్తే పక్కింటివాడో, ఆ ఇంకో పక్కింటివాడో ఎలాగూ ఉన్నారు.

పైన చెప్పిన జాబితాలో ఇంకో ముఖ్యమైన వస్తువు, సత్తెన్నారాయణ పూజ చేసికోడానికి దేముడి పీట.ఛస్తే ఎవరింటిలోనూ ఉండేది కాదు. ఇవే కాకుండా ఇత్తడి గంగాళాలూ, అడ్డెడు గిన్నెలూ, గోకర్ణాలూ ఇలాటివి ఉండనే ఉన్నాయి. అంతదాకా ఎందుకూ, స్కూల్లో నోట్స్ వ్రాయడానికి పెన్ను లేకపోతే పక్కవాణ్ణి ఎరువడగడం. బుధ్ధులెక్కడికి పోతాయి, పక్కవాణ్ణడిగితే పనైపోతుందిగా…అవసరం వచ్చినప్పుడు అడగడం బాగానే ఉంది, కానీ తిరిగిచ్చేటప్పుడు మాత్రం అంత జాగ్రత్త తీసికోరు.వాళ్ళు అవసరానికి తీసికున్న వస్తువు, ఎక్కడో విరిగినా,ఇంకోటేదో అయినా, తిరిగిచ్చేటప్పుడు ఓసారి చెప్తే వాళ్ళ సొమ్మేంపోయిందిట? మళ్ళీ కావాల్సొచ్చినప్పుడు ఇవ్వరేమో అని భయం.

ఇవేకాకుండా, ఇంట్లో ఏ పెళ్ళికూతుర్నైనా చూపించాల్సొచ్చినప్పుడు, “ ఏమే నీ చంద్రహారం ఓసారిస్తావేమిటీ, సాయంత్రం మా పిల్లదానికి పెళ్ళిచూపులూ, మరీ బోసి మెడతో ఎలా చూపిస్తామూ..” అంటూ.చుట్టాలైతే వీళ్ళ పట్టుచీరల దగ్గరనుంచీ, ఏ భర్తో ప్రేమగా ఇచ్చిన చీర దాకా అడిగేయడమే. కొంతమందికి ఆ రక్తంలోనే ఉంటుంది, ఎలాటి అవసరం వచ్చినా, అవతలివాళ్ళు ఏమనుకుంటారో అనైనా ఆలోచించకుండా అడిగేయడమే. పైగా అవసరానికి ఇవ్వడమూ ఓ గొప్పేనా ఏమిటీ.. అచ్చంగా ఉంచేసికుంటామన్నామా ఏమిటీ… అంటూ సమర్ధింపోటీ. కొంతమందికి తాము కట్టుకున్న చీరో, డ్రెస్సో ఓసారి ఇంకోళ్ళెవళ్ళైనా వాడారో, తిరిగి ఛస్తే కట్టుకోరు, ఏదో గొంగళీ పురుగు పాకినట్టుంటుందిట!!. స్టీల్ సామాన్లవాడికైనా ఇచ్చేస్తారు కానీ, తిరిగి వాళ్ళ వంటి మీదకు మాత్రం రానీరు. అయినా సరే అవసరార్ధం ఇలాటి “త్యాగాలు” చేస్తూనే ఉంటారు. కొంతమందైతే మొహమ్మీదే చెప్పేస్తారు ” నాకలాటివి ఇష్టం లేదండీ..” అని. ఇంక అలాటప్పుడు చూడాలి ఎవరైతే ఎరువు అడిగారోవారి స్పందన “ అంత అరిగిపోతుందా అమ్మా, ఏమైనా ఇస్టేట్లడిగామా, ఓ గంటకోసం పట్టుచీర. అదైనా పిల్ల ఇష్టపడింది కాబట్టీ...”

తరువాత్తరువాత ఇళ్ళల్లో కావలిసిన ఏ వస్తువైనా సరే “అద్దెకు” దొరకడం ప్రారంభం అయింది. ఇంట్లోకి కావలిసిన ఫర్నిచరనండి, వంటసామాన్లనండి, అంతదాకా ఎందుకూ, రోల్డ్ గోల్డ్ నగలదాకా ఏ వస్తువైనా సరే దొరికేస్తుంది. ఏదో కొంత డిపాజిట్టేదో పెట్టేసి, కావలిసినదేదో తెచ్చేసికోడం. హాయి కదూ. అయినా సరే పక్కవాళ్ళని “ఎరువు” అడగడం లో ఉన్న “మజా” వస్తుందా ఏమిటీ? ఇంటికి చుట్టాలొచ్చేరని, గ్లాసుడు పాల దగ్గరనుంచీ, ఓ బుల్లి కప్పుతో కప్పుడు టీ పొడుమో, కాఫీ పొడో, అదేచేత్తోటి ఓ బుల్లిగ్లాసుడు పంచదారా కూడా ఇయ్యమ్మా..అనే డయలాగ్గులు ఈమధ్యన కరువైపోయాయి. అవతలి వాళ్ళు తిరిగిమ్మని అడగా అడగరూ, వీళ్ళకీ “అప్పు” తీర్చేద్దామని ఆలోచనా రాదూ. అడక్కపోతే, మళ్ళీ ఈవిడ గొడవుండదూ అని ఆ ఇచ్చినవాళ్ళ అభిప్రాయం. ఉభయతారకం. వీళ్ళొకళ్ళేనా ఏమిటీ, ఆవిడ కాపోతే ఇంకొకర్తీ.. ఎరువులు తెచ్చుకోవాలంటే మనుష్యులే కరువా ఏమిటీ అనుకుంటూ జాలీగా జీవితం లాగించేస్తూంటారు… Life goes on and on….
..

నిన్న ఓ మిస్టరీ షాపింగు చేశాను Thomas Cook లో. ఇదిగో రేపు వెళ్ళి, మా ఇంటావిడదోటీ, నాదోటీ షాపర్ స్టాప్ కి వెళ్ళాలి….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Communication gap…

    అసలు ఈ రోజుల్లో కమ్యూనికేషన్లెక్కడున్నాయండి బాబూ, గ్యాప్పులూ గట్రా ఉండడానికి.. ఎక్కడ చూసినా శ్రీరామదాసు గారు చెప్పినట్టు “పలుకే బంగారమాయే...” గానే ఉంటోంది.ఒకరితో ఇంకోళ్ళు మాట్టాడ్డానికి తీరికే ఉండడం లేదూ ఈరోజుల్లో. ఇదివరకటి రోజుల్లో అయితే, ఏదో ఒకే ఇంటిలో అందరూ కలిసే ఉండడంతో, కనీసం రాత్రిళ్ళు భోజనాలు అందరూ కలిసే కూర్చోవాలనేవారు. ఇలాగైనా ప్రతీ రోజూ కొంపలో ఏమౌతొందో తెలిసేది. ఆరోజుల్లో ఇంటి వాతావరణాలు కూడా, మరీ ఈరోజుల్లోలా ఉండేవి కావు. మరీ భక్తి ప్రపత్తులనేవి ఉండకపోయినా, మరీ మొహమ్మీదే చెప్పేయడానికి మొహమ్మాటం అడ్డొచ్చేది.మొహమ్మాటం అనండి లేకపోతే, ఇంటి పెద్దాయనంటే భయమో, అభిమానమో, భక్తో లేక ఇవన్నీ కలిపిన ఇంకోటేదో అనండి, మరీ కొట్టుకునేవారు కాదు. అలాగని ఏదో శ్రీరామరాజ్యాల లా ఉండేదీ అనడానికీ వీల్లేదు. దెబ్బలాటలు వచ్చేవి, కాదనలేము, కానీ ఇంట్లోనో, లేక చుట్టాల్లోనో వయస్సులో పెద్దయినవారెవరో ఇలాటివి పరిష్కారం చేసేవారు.

   పైచదువులకి ఇంకో ఊరెళ్ళవలసివచ్చినప్పుడు, వారానికో, పక్షానికో ఓ ఉత్తరం రావల్సిందే. అలాగే ఉద్యోగరీత్యా ఇంకో ఊరికి వెళ్ళినప్పుడో, క్షేమసమాచారాలతో ఉత్తరాలు వచ్చేవి.కాలక్రమేణా, పైచదువులకెళ్ళిన పిల్లలు కూడా, డబ్బులు అవసరం వచ్చినప్పుడో, మనీఆర్డరు అందనప్పుడో ఇంటికి ఉత్తరాలు వ్రాసే స్థితికి వచ్చేశారుఇంక చుట్టాల సంగతి, less said the better.., మా పెదనాన్నగారు ఒకాయన అనేవారు. “ఉత్తరాలు రాలేదూ అంటే అంతా బాగున్నట్టే అన్నమాట. ఏదైనా వస్తే రాస్తారు లెద్దూ..” అనేవారు.నిజం చెప్పాలంటే ఇదే హాయీ..

   తరువాత్తరువాత టెలిఫోన్లూ, ఎస్.టి.డీ లూ అదేదో రాత్రి పదకొండునుంచి, ఉదయం ఆరు గంటలదాకా సగం రేట్లూ ఉండడంతో, ఎవడో ఒకడు ఫోన్లు చేసేవారు.అవతలివాడున్నాడో పోయాడో కనీసం తెలిసేది. ఆ తరువాత సెల్ ఫోన్లూ, ఇంటర్నెట్లూ వచ్చిన తరువాతైతే, ఊళ్ళోవాళ్ళందరూ ఎలాగున్నారో అని గంటల తరబడి కబుర్లైతే చెప్పుకుంటారు కానీ, తల్లితండ్రులకి ఫోను చేసి, ఓసారి మాట్టాడితే, వాళ్ళు ఎంత సంతోషిస్తారో ఈరోజుల్లో పిల్లలకి ఎందుకు తట్టడం లేదో అర్ధం అవదు. పోనీ వాళ్ళ విషయాలు తల్లితండ్రులతో పంచుకోడానికి ఇష్టం లేకపోయినా, కనీసం వాళ్ళు బ్రతికున్నారో లేదో అనైనా తెలుసుకోవద్దంటారా?

   బయటి దేశాల్లో ఉండేవాళ్ళకైతే పోనీ ఓ excuse ఉందనుకుందాం, అదేదో టైములాగ్గూ సింగినాదం జీలకర్రానూ. పోనీ మాట్టాడడానికి ఏమైనా ఇదివరకటి రోజుల్లోలాగ వందలూ,వేలూ ఖర్చుపెట్టాలా, అదీ లేదు. ఇంటర్నెట్ ద్వారా గంటలు గంటలు మాట్టాడుకోవచ్చు. ఈరోజుల్లో ట్రాజెడీ ఏమిటయ్యా అంటే, క్షేమసమాచారాలు Twitter లోనూ, Facebook లోనూ చూసుకుని సంతోషించవలసిన దౌర్భాగ్య పరిస్థితి. వాటిల్లో లాగిన్ అవడానికి పట్టే, టైముకంటే, ఓ ఫోను చేసి మాట్టాడ్డం తక్కువ అవుతుంది. అయినా సరే, ఆ విషయం మాత్రం తెలియడం లేదు. ఈ తల్లితండ్రులన్నవాళ్ళకి ఎలా ఉందంటే, అదృష్టం బాగోక అరోగ్యం పాడై, ఏ హాస్పిటల్ లోనో చేరినా, ఏ ఫ్రెండు ద్వారానో, లేదా వాళ్ళు చేరిన ఏ హాస్పిటల్ ద్వారానో తెలియడం. ఇలా అంటే, వాళ్ళంటారూ, పోనీ ఎలాటి అవసరం వచ్చినా ఫోను చేయమన్నాను కదా, ఎందుకు చెప్పలేదూ అనడం. ఇలా చీటికీ మాటికీ, ఏదో విషయం లో వీళ్ళనుకునేదొకటీ, తల్లితండ్రులు అనుకునేదోటీ, మొత్తానికి ఓ gap వచ్చేస్తోంది. వాళ్ళు వారానికోసారైనా ఫోనుచేస్తే వాళ్ళ సొమ్మేంపోయిందీ అని పిల్లలూ, ఆమాత్రం బాధ్యత ఉండఖ్ఖర్లేదా పిల్లలకీ అని తల్లితండ్రులూ, మొత్తానికి ఆ బంధాలు strain అయిపోతున్నాయి. ఎప్పుడో కలిసినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా, ఏదో అదీ ఇదీ మాట్టాడేసుకోడం, పనైపోతుంది. మళ్ళీ ఏ వారం రోజులకో, పదిహేను రోజులకోనే మళ్ళీ ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకోడం. అసలు రెగ్యులర్ గా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ అనేది ఉంటేనే కదా, సంబంధబాంధవ్యాలు ఉండేదీ? మళ్ళీ బయటవాళ్ళ దగ్గర మాత్రం పేద్ద పేద్ద ప్రగల్భాలు చెప్పేసికోడం, మా పిల్లలు ఇలాగా, మా పిల్లలు అలాగా అని ఆ తల్లితండ్రులూ, మా తల్లితండ్రులు ఇంత గ్రేట్టూ, అంత గ్రేట్టూ అని ఆ పిల్లలూ.ఎందుకొచ్చిన బడాయిలండీ బాబూ?

   ఏదో కమ్యూనికేషననేది ఉండాలని చెప్తే, ప్రతీరోజూ ఆ పెద్దాళ్ళకి “జోలపాటలు” పాడమని కాదు. కొంతమందుంటారులెండి ప్రతీ రోజూ ఠంచనుగా ఓ టైముకి ఫోను చేసేయడం, అంతా బావున్నట్టేనా అని ఓసారి అడిగేస్తే అయిపోతుందనుకుంటారు. ఇదేమైనా శనివారాలు వెంకటేశ్వరస్వామికి కొబ్బరి కాయ కొట్టినట్టా ఏమిటీ? ఈ తల్లితండ్రులనబడే పూర్ క్రీచర్స్ వాళ్ళ పిల్లలనుండి ఏమీ ఆస్థిపాస్థులు కాదు అడిగేది, ఓ చిన్న పలకరింపు మాత్రమే. కానీ అలాటివికూడా extinct అయిపోతున్నాయి .

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   నవంబరు 2011 లో ప్రిన్సిపల్ బెంచ్ CAT వారు ఒక judgement ఇచ్చారు. 2006 కి ముందుగా రిటైరయిన కేంద్రప్రభుత్వోద్యోగులకి, 2006 తరువాత వారిలాగానే పెన్షన్ ఇవ్వాలనీ, పైగా ఆ కార్యక్రమం అంతా మూడు నెలల్లో పూర్తవాలనీనూ. మా ” పక్షు” లందరూ ఓహో ఆహా అనేసికుని సంతోషించేశారు. ఇదిగో ఈ నెలలో వచ్చేస్తుందీ, పై నెలలో వచ్చేస్తుందీ అనుకుంటూ. మన ప్రభుత్వం వాళ్ళా అంత తొందరగా లొంగేదీ?పైగా నోరూ వాయీ లేని పెన్షనర్లూ, వీళ్ళకా భయపడేదీ? సరీగ్గా మూడు నెలలూ పూర్తయే రోజున కూల్ గా ఓ ఎపీల్ వేసేశారు, ఢిల్లీ హైకోర్టులో. అదేమైనా ఇప్పట్లో తేలేదా ఏమిటీ? పైగా ఇక్కడ ఓడిపోతే, సుప్రీం కోర్టు ఉండనే ఉంది. ఇవన్నీ పూర్తయేసరికి, సగానికి సగం మంది పోనేనా పోతారు, లేదా కొత్త పేకమీషనైనా వచ్చేస్తుంది. ప్రభుత్వం లో ఇలాటి విషయాల్లో పనితీరు ఎలా ఉంటుందో తెలియాలీ అంటే, ఆ కేసు ఫైలు మీద నోటింగ్స్ ఎలా ఉంటాయో, అసలు ఇలాటి బ్రిలియంట్ ఆలోచనలు ఎవరికొస్తాయో వగైరా .. వగైరా ఇక్కడ చదవండి.

   అదేం ఖర్మమో కానీ ఇలాటివాటికొచ్చేసరికి ప్రభుత్వానికి జమా ఖర్చులూ, సేవింగ్సూ గుర్తుకొస్తూంటాయి. ఇందులో మెచ్చుకోవలసిందేమిటీ అంటే, ప్రభుత్వం స్టే ఆర్డరు అడిగితే, ఠాఠ్ కుదరదూ అని మొహం మీద నీళ్ళు చల్లేశారు. చూద్దాం ముక్తీ మోక్షమూ ఎప్పటికో…

    ఆయనెవడో కర్ణాటక డిజిపి గా నియమింపబడ్డాయన్ని, ఆ రాష్ట్ర హైకోర్టు ధర్మమా అని, తీసేశారు.బావుంది కదూ..

%d bloggers like this: