బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– తిక్క శంకరయ్యలు….


   మాట్టాడడం అనేది ఓ కళ. అందరికీ అబ్బదు. కొంతమంది చూడండి, ఎంతసేపైనా మాట్టాడాలనిపిస్తుంది. కొంతమందితో, అసలు ఎందుకు పలకరించానురా బాబూ అనుకుంటాము.

   స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ కొందరు గురువులు, చెప్పిన పాఠాలు ఎన్నేళ్ళైనా గుర్తుండి పోతాయి, దానికి కారణం వారు బోధించిన పధ్ధతీ, వారి మాటతీరూ, వారు చూపించిన ప్రేమాభిమానాలూనూ. చెప్పొచ్చేదేమిటంటే, ఎవరితొనైనా మాట్లాడాలంటే ఈ గుణాలన్నీ ఉండాలి అని. చిన్నప్పుడు నేర్చుకున్న ఈ ప్రవర్తన నూటికి తొంభై మందిలో హత్తుకుపోతాయి. అలాటివారు, జీవితంలో ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించుకుంటారు. కానీ ఆ మిగిలిన పది శాతం ఉన్నారే, వారిని గురించన్నమాట ఈ టపా !

   మన బస్ స్టేషన్లలో చూస్తూంటాము ఓ పరకో పాతికో ప్లాట్ ఫారాలుంటాయిబోర్డులు కూడా ఉంటాయనుకోండి, ఏ కొత్తవాడికో, ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో ఛస్తే తెలియదు. అంతా అయోమయం, అధ్వాన్నంగా ఉంటుంది. పోనీ ఎంక్వైరీ కి వెళ్దామా అంటే, సామాన్లెవడైనా కొట్టేస్తాడేమో అని భయం, అలాగని కూర్చున్న సీట్ వదిలేస్తే మళ్ళీ దొరుకుతుందో లేదో అని భయం, పోనీ ఆ సామాన్లనన్నింటినీ మోసుకెళ్ళే ఓపికా ఉండదు.ఇదిగో ఇలాటి విపత్కర పరిస్థితుల్లో ఓ “పెద్దమనిషి” లాటివాడు కనిపించాడనుకోండి, ఈయన్ని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అని పలకరించడం. సాదా సీదా మనిషైతే, తనూ కొత్తవాడిననో, లేదా తనక్కూడా తెలియదనో చెప్పేస్తాడు. గొడవ లేదు. ఇంకో మనిషిని అడుగుదామా అనుకుని, ఇంకోణ్ణి కెలుకుతాము. ” నేనేమైనా ఏపి.ఎస్.ఆర్.టి.సి వాణ్ణనుకున్నారా, నాకుమాత్రం ఏం తెలుస్తుందీ, కావలిస్తే ఇంక్వైరీకి వెళ్ళి అడగండి…” అని మొహం చిటపటలాడుతూ సమాధానం ఇస్తాడు. తెలిస్తే చెప్పొచ్చూ, లేకపోతే తెలియదనేస్తే, ఆయన్నేమైనా తినేస్తామా ఏమిటీ? అలా ఉంటుంది ఒక్కొక్కళ్ళ ప్రవర్తన.సౌమ్యంగా సమాధానం చెప్తే ఆయన సొమ్మేమీ పోదు, తాము ఎంత తిక్కశంకరయ్యో ప్రపంచం అంతా తెలిసికోవాలి ! ఎవరినైనా ఖర్మ కాలి టైమెంతయిందండీ అని అడగండి, సరైన వాడు సమాధానం చెప్తాడు. ఈ రెండో రకం వాళ్ళు “భూతంలా అంత పెద్ద గడియారం కనిపిస్తూంటే, కనిపించి చావడం లేదా..” అని.

   ఎప్పుడైనా ఏ పచారీ కొట్టుకో వెళ్తామనుకోండి, సాధారణంగా మనం ఫలానా వస్తువుందా అని అడిగితే, ఉందనో, లేదనో, అదీకాకపోతే తెప్పిస్తాననో చెప్తాడు. కానీ, కొన్ని చోట్ల చూస్తూంటాము, అసలలాటివి మా కొట్లోనే ఉంచమూ అంటాడు, అక్కడికేదో మనం ఏ sub standard బ్రాండోఅడిగేమన్నట్టు పోజెడతాడు. పక్కవాళ్ళ దృష్టిలోకూడా మనం అపహాస్యం పాలవుతూంటాము! నేను రాజమండ్రీ లో, “కోతికొమ్మచ్చి” పుస్తకం కొనాలని, ఓ ప్రఖ్యాత పుస్తకాల షాప్పు కి వెళ్ళి అడిగితే, “అలాటి పుస్తకాలు మా కొట్లో పెట్టమండి..” అని సమాధానం వచ్చింది! పోనీ ఎన్నో సాహిత్య విలువలున్న షాప్పూ, లైటు గా ఉండే పుస్తకాలు పెట్టరేమో అనుకుందామా అంటే అదీ కాదూ, వాళ్ళ షో కేసులో సినిమా పుస్తకాలూ, కొక్కోక శాస్త్ర పుస్తకాలూ కావలిసినన్నున్నాయి ! ఇంకో కొట్టుకి వెళ్ళి రమణ గారి పుస్తకం వచ్చిందా అని అడగ్గానే, ముళ్ళపూడి వారా, శ్రీరమణ గారా అని అడిగాడు.అదీ తేడా!
ఎప్పుడు పుస్తకాలు కావలిసివచ్చినా, రాజమండ్రీలో ఉన్న ఏణ్ణర్ధమూ ఆ కొట్టుకే వెళ్ళేవాడిని.

    ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈవేళ ప్రొద్దుట, బయటకి వెళ్తూ లిఫ్ట్ లో మా పై అంతస్థులో ఉండే ఆయన్ని కలిశాను. ఎప్పుడూ ఏదో గ్రైండర్ చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఎవరో చెప్పగా విన్నాను- ఇడ్లీ,దోశా లాటివి చేసి బయటి ఆర్డర్లుకూడా తీసికుంటూంటారూ అని.ఎప్పుడైనా అవసరం వస్తే దగ్గరలోనే ఉంటారూ, కావలిసినవేవో తెప్పించుకోవచ్చూ అనుకుని, పైగా ఆయన చేతిలో, ఓ పెద్ద స్టీలు డబ్బా, ఇంకో ప్లాస్టిక్ డబ్బా కూడా చూసి, ఎవరికైనా డెలివరీ చేయడానికి తీసికెళ్తున్నారేమో అనుకుని, హిందీలోనే ” మీ ఇంట్లో ఏమైనా తయారు చేస్తూంటారా…” అన్న పాపానికి నాకొచ్చిన సమాధానం.. ” మా ఇంట్లో సిగరెట్టులు, ఘుట్కా లాటివి తయారుచేయమూ...’ అని! ఇదెక్కడి గొడవరా బాబూ, వాటన్నిటిని గురించీ ఎక్కడడిగానూ, అని ఆలోచించాను. మళ్ళీ ఇంకోసారి అడిగాను ఇడ్లీ దోశా లాటివీ అని.” చేస్తూంటామూ, పిల్లలు తినాలన్నప్పుడు, తప్పా...”. ఏమిటో అర్ధం అవలేదు నాకు
అసలు ఏం తప్పు మాట్టాడేనో అని. తనిష్టం వచ్చినవి చేసుకోనీ, ఏ గంగలో దూకనీ అసలు నాకెందుకూ?

   జోక్కు ఏమిటంటే, స్టీలు డబ్బా, కారు డిక్కీ లో పెట్టుకుని తను కారులోనూ, బస్సెక్కుదామని నేనూ బయలుదేరాము. బస్ స్టాప్ కి వెళ్ళే దారిలో, ఓ హొటల్ లాటిదుందిలెండి, ఆ మనిషి, తన కారు ఆపి ఆ డబ్బాలను హొటల్లో డెలివర్ చేయడం !! నేను అడిగినప్పుడు చెప్పొచ్చుగా, మేము చిన్న చిన్న ఆర్డర్లు తీసికోమూ అని, గొడవుండదు. ఇదిగో ఇలాటి వాళ్ళనే తిక్కశంకరయ్యలంటారు.

    అలాటి వారినుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదీ, కానీ తెలిసికోడం ఎలా ? ఓ నాలుగైదు అనుభవాలయితే అదే తెలుస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలీ అని!

7 Responses

 1. ఫణిబాబుగారు ! శుభ సాయంత్రం ! రమణగారి పుస్తకం అనగానే “ముళ్లపూడివారా, శ్రీ రమణ గారా” అని అడిగిన అంత మంచి పుస్తకాల
  షాపు( రాజమండ్రి ) పేరు చెప్పి పుణ్యం కట్టుకోండి. ఏ పుస్తకం కావలిసినా ఏ విజయవాడకో , విశాఖపట్తణానికో వ్రాయవలసి వస్తున్నది

  Like

 2. naadi apparao gari maate.

  Like

 3. చెప్తే ఆయన సొమ్మేమి పోయిందో…. ఉంటారు ఇలాంటివారు కూడా….

  Like

 4. మీరు కే. యెన్. రావు పుస్తక దుకాణానికి కాని వెళ్ళారా? ఏం నేను వెళ్ళకూడదా? పుస్తకాలు చదవకూడదా? అని మాత్రం అడగకండే 😉 అన్నీ స్వీయానుభవం మీద తెలుసుకోవడం కాస్త కష్టం సుమండీ! కనుక అనుభవజ్ఞులు మీరే సెలవియ్యండి అది కూడా!

  Like

 5. @గురువుగారూ,

  మీకు మెయిల్ పంపాను. చూసే ఉంటారు..

  @ఫణీంద్రా,

  మీరు కూడా రాజమండ్రీ లోనే ఉంటున్నారా?

  @మాధవీ,

  అలాటివారు కూడా ఉంటారని చెప్పడానికే ఈ టపా…

  @రసజ్ఞా,

  మొదటి షాప్ గొల్లపూడి వారిది. రెండోది మణికంఠ ( కదీమ్స్ షూ షాప్ ఎదురుగా)

  Like

 6. ఇడ్లీ డబ్బా ఆయనకీ కుడా బ్లాగు ఉంటె, ఏమి వ్రాసి ఉండే వారు అంటారు (కిడ్డింగ్)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: