బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– చుట్టాలతోనూ, తెలిసినవారితోనూ లావాదేవీలు


   బాగా పరిచయం ఉన్నవారితోనైనా సరే, చుట్టాలైనా సరే, వారితో ఎటువంటి లావాదేవీలూ పెట్టుకోనంతసేపే మన జీవితాలు హాయిగా వెళ్ళిపోతాయి. ఆ లావాదేవీలు ఏవైనా అవొచ్చు, ఓ పెళ్ళి సంబంధం కావొచ్చు, వాళ్ళింట్లో అద్దెకుండడానికి వెళ్ళొచ్చు, కాదూ కూడదూ అనుకుంటే, మనింట్లో ఏదో వస్తువు తెలిసినవారికి అమ్మొచ్చు, చివరకి మన ఇల్లు వాళ్ళకో, వాళ్ళ ఇల్లు మనమో కొనుక్కోవడం అవొచ్చు. చెప్పిన ఈ విషయాల్లో, ఎప్పుడూ కూడా బయటి వాళ్ళతో పెట్టుకోవాలి కానీ, చుట్టాలూ,పరిచయస్థులతో మాత్రం దూరంగానే ఉండాలి. మహ అయితే సలహా లాటిదోటి అడగొచ్చు, నచ్చిందా సరే సరి, లేదా ఏదో కారణం చెప్పేసి తప్పించేసికోవచ్చు.

   వీళ్ళతో ఏమిటంటే లేనిపోని మొహమ్మాటాలూ, మొహం మీద చెప్పాలేము, అలాగని నెత్తిమీదకు తెచ్చుకోలేమూ. మనవాడే కదా వినకపోతాడా అని మనమూ, పైవాణ్ణేమిటీ అని ఆ రెండో ఆయనా. అడక్కండి అప్పటిదాకా ఉన్న రిలేషన్స్ తగలడిపోతాయి. ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకోరు, అప్పటిదాకా అక్కయ్యా, అన్నయ్యా అని పిలుచుకునేవాళ్ళు, రాత్రికి రాత్రి బధ్ధశత్రువులైపోతారు. ఇంక వీళ్ళ మీద వాళ్ళూ, వాళ్ళ మీద వీళ్ళూ యాగీ చేసేసికోడం మొదలెట్టేస్తారు. అన్ని సంవత్సరాలనుండీ మిత్రులు గా ఉన్నవారి మధ్య ఇలాటివి అవసరమంటారా?

   ఇలా అంటే, చెప్తారు లెద్దూ బాపూ గారూ, ముళ్ళపూడీ వారూ అరవై సంవత్సరాలు కలిసి ఉండలేదా అంటారు. వారు “యుగపురుషులు” మాస్టారూ.మామూలు మానవమాత్రులకి సాధ్యం కాదు. మీ చుట్టుపక్కల చూస్తే మీకే తెలుస్తుంది. ఏదో తెలిసినవారింట్లో ఈడొచ్చిన పెళ్ళి కొడుకున్నాడు కదా, పోనీ మన పిల్లని అడుగుదామా అనుకుంటారు. ఎవరో మధ్యవర్తి ద్వారానో, ఒక్కొక్కప్పుడు డైరెక్టు గానో ( ఎలాగూ వీరికీ పరిచయం ఉందిగా), సంబంధం ప్రస్తావిస్తారు. పెళ్ళికొడుకు వాళ్ళు, ఓ పట్టాన సమాధానం చెప్పరు. కారణాలనేకం. వీళ్ళకి కావలిసిన కట్నం అడగడానికి మొహమ్మాటం, మరీ అడిగేస్తే బావుండదేమో, పోనీ అలాగని జాతకాలు కలువలేదా అనుకోడానికీ వీలు లేదు. ఏదో తంటాలు పడి, చల్లగా చెప్పేస్తారు, మా వాడు అప్పుడే చేసికోనంటున్నాడండీ అని. చివరకి జరిగేదేమిటీ అంటే కొద్ది రోజుల్లో ఆ పిల్లాడికి సంబంధమూ కుదురుతుంది, కానీ ఆ పెళ్ళికి, రిసెప్షన్ కీ వీళ్ళని పిలవరు. కారణం మరేం లేదూ మొహం చెల్లకనండి, లేదా అప్పుడు పిల్లాడు పెళ్ళికి సుముఖంగా లేడూ అన్నామే, మరీ ఇప్పుడు పెళ్ళికి పిలిస్తే బాగుండదేమో అనీ అవొచ్చు. చివరకి వీరిద్దరికీ ఫ్రెండు అయినవారి ద్వారా తెలుస్తుంది ఫలానా వారి అబ్బాయి పెళ్ళీ అని!ఎంతదాకా వెళ్తుందీ అంటే, ఈ పిల్లకి ఏ పురుడో వస్తే చూడ్డానికి కూడా వెళ్ళరు. చిత్రం ఏమిటంటే, వీళ్ళ పిల్లకీ పెళ్ళయింది, వాళ్ళ పిల్లాడికీ పెళ్ళయింది. కానీ loser వీళ్ళfriendship.చూశారా తెలిసినవారు కదా అని సంబంధానికి వెళ్తే, ఈ ఇద్దరి మధ్యా ఉన్న స్నేహం కాస్తా కొండెక్కేసింది.

   అలాగే ఏ కొంపో అమ్ముదామని ప్రయత్నించి, చెప్పలేదంటాడేమో అని, ముందుగా స్నేహితుడి వద్ద ప్రస్తావిస్తాడు. ఆ పెద్దమనిషేమో, తెలిసున్నవాడేకదా చవకలో కొట్టేద్దామనుకుంటాడు. కానీ ఈయనకీ ఏవో కొన్నిexpectations ఉంటాయిగా, అవి చెప్పడానికి ఈయనకి మొహమ్మాటం. అప్పటికీ చెప్తాడు, ఏదో ఫలానా లక్షల దాకా బేరాలు వస్తున్నాయీ, ఇంకా డిసైడ్ చేసికోలేదూ, నీ చెవిని కూడా ఓ మాటేద్దామని చెప్తున్నానూ అని.అనుకున్నదానికంటే ఓ లక్షో, రెండు లక్షలో ఎక్కువే చెప్తాడు, ఎందుకైనా మంచిదని.తనకీ ఓ కొంప కావాలి కదా, ఎంతైనా స్నేహితుడూ, మొత్తం అంతా ఒకేసారివ్వఖ్ఖర్లేకుండా ఏదైనా వాయిదాల్లో ఇస్తాడేమో చూద్దామనుకుంటాడు. అక్కడే వస్తుంది సమస్య అంతా, ఈయనకేమో, ఏదో అవసరం వచ్చే కదా ఇల్లు అమ్మకానికి పెట్టాడూ, మళ్ళీ మధ్యలో ఈ ఫిట్టింగేమిటీ? పైగా ఏ కారణం చేతైనా ఆ ఫ్రెండు ఓ వాయిదా ఇవ్వలేకపోతే, అడగడానికి లేదూ ఏమిటో అంతా గందరగోళం. చివరకి భార్యా భర్తలు ఆలోచించి ఓ నాలుగైదు రోజులు ఆగి, చెప్పేస్తారు– మా వాడికి డబ్బవసరం పడిందీ, అందుకోసం వాడే బేరం తెచ్చాడూ, ఆ వచ్చినతను తన ఆఫీసులోనే పని చేస్తున్నాడుటా, బ్యాంకు లోన్ కూడా వచ్చేసింది. ఎలాగూ నువ్వు ఒకేసారి ఇవ్వలేనన్నావు కదా, అందుకోసం ఆ అబ్బాయికే ఇచ్చేస్తున్నామూ అని!ఇది పచ్చి అబధ్ధం అని ఇద్దరికీ తెలుసు, అయినా సరే బయట పడరు.!!

   అలాగే ఏదైనా వస్తువో, ఏ బండో అమ్మాలనుకున్నా, ఛస్తే తెలుసున్నవారికి ఇవ్వకూడదు. దానికి ఏ రిపేరీ వచ్చినా మనతో చెప్తూంటాడు.అలాగని మనల్ని రిపేరీ చేయించమని కాదు, “చూశావా ఎలాటి దరిద్రపు వస్తువు అంటకట్టావో, ఛస్తున్నాను దీనితో. కొన్నప్పటినుంచీ ఒక్కరోజైనా మనశ్శాంతి లేదు” లాటి అర్ధం వచ్చే చూపులతో…మళ్ళీ వాడి మొహం మనం చూడమూ, మన మొహం వాడు చూడడూ… గోవిందో గోవింద.. హాయిగా ఏ ఏజెంట్ తో చెప్పినా సరిపోయేది, లేనిపోని తద్దినం తెచ్చికున్నారా బాబూ అని జీవితాంతం గిల్టీ ఫీల్ అవాలి.

   ఈ గొడవంతా ఎందుకు వ్రాశానూ అంటే, ఈమధ్యన మా అబ్బాయి, తన ఆఫీసుకోసం ఇంకో బంగ్లా తీసికున్నాడు, అద్దెకేలెండి. ఇదివరకు వెళ్ళినప్పుడల్లా, ఆ ఇంటాయనా, ఇంటావిడా నోరారా పలకరించేవారు. యోగక్షేమాలడిగేవారు… అలాటిది సడెన్ గా ఈవేళ ప్రొద్దుట కనిపించినా,అసలు పలకరింపే లేదు. కారణం తెలుసా, అబ్బాయి ఇల్లు ఖాళీ చేయడం… అదండీ విషయం…

6 Responses

 1. అదే మరి లోకం తీరు…. 🙂

  Like

 2. 🙂 నిజమే. తెలిసిన వారితో కలిసి బిజినెస్ మొదలు పెడితే.. అప్పుడు ఇంకా ఇంకా తెలుస్తుంది..

  Like

 3. అదేమిటో గానీ నేనెప్పుడు ఇల్లు ఖాళీ చేసినా ఇంటి వాళ్ళు తెగ సంబర పడిపోతారు. కనిపిస్తే మా మనవరాళ్ళ కి చాక్లెట్లు కొనిపెడతారు…….. దహా.

  @కృష్ణ ప్రియ గారు,
  ఏం బిజినెస్సు మొదలు పెడదామండి? ,,,,,,,,, దహా.

  Like

 4. క్రిష్ణప్రియ గారు గోడలు కూల్చటం గురించి వ్రాస్తే, మీరు గోడలు ఎలా మొలుస్తాయో వ్రాసారన్న మాట.

  Like

 5. Shakespeare  మహానుభావుడు  అన్నట్లు …
  నిన్న నే అశ్విన్ స్కూల్ వాళ్ళు  చేసిన  Hamlet  నాటకం లో  ఈ మాట వచ్చింది.

  Neither a borrower nor a lender be;
  For loan oft loses both itself and friend..

  Like

 6. @మాధవీ,

  నిజమే…

  @కృష్ణప్రియా,

  ఏదైనా ఆలోచనుందా …. బులుసు వారు అప్పుడే ప్రపోజల్ కూడా ఇస్తున్నారు!! ఓ సారి ఆలోచించి అడుగెయ్యమ్మా….ఎందుకైనా మంచిది…..

  @సుబ్రహమణ్యం గారూ,

  అదేమిటోనండీ, కొంతమంది చేసికున్న పుణ్యం అనుకుంటాను !! పోన్లెండి, మీ ధర్మమా అని మీ మనవరాళ్ళకి చాకొలేట్లు దొరుకుతున్నాయి…

  @బోనగిరి గారూ,
  మీ పరిశీలనా శక్తికి జోహార్లు…

  @అరుణ తల్లీ,

  శతాబ్దాల కిందటే తెలిసికున్నారు. ఇంకా ఇప్పటివారే మొహమ్మాటాలకి వెళ్ళి ప్రాణం మీదకు తెచ్చికుంటున్నారు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: