బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “ఎరువు” అడగడం లో ఉండే మజా…


   ఏమిటో ఇన్నాళ్ళూ ఏదో లైట్ గా టపాలు వ్రాసేవాడిని. ఈమధ్యన మేము మనవైపు వెళ్ళిరావడం, అక్కడ ప్రత్యక్షంగా చూసినవీ, విన్నవీ పోనీ నా టపాల్లో వ్రాద్దామా అనిపించి, ఎరక్కపోయి కొద్దిగా సీరియస్సు టైపులోకి వెళ్ళిపోయాను. దీనికి సాయం మా ఇంటావిడ కూడా మరీ ఎమోషనల్ అయిపోయింది. ఎందుకు చెప్పండీ, మా దారినమేముండకుండా, జీవిత సత్యాలూ వగైరా అంటూ “ప్రవచనాల” లోకి ఎందుకు చెప్పండి? ఇంక మూడ్ మార్చాలనే ఈ “టపా”…

ఒకే ఏరియాలో ఉండే కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి ఉండే రోజుల్లో అన్నమాట, ఏ చిన్న అవసరం వచ్చినా, ఏ చిన్న వస్తువు కావల్సివచ్చినా, ఇంట్లో ఉండే చిన్న పిల్లాడినో, లేదా ఇంటి పనిమనిషినో, ఆ పక్కింటి వారింటికి వెళ్ళి ఫలానా వస్తువు తెమ్మనేవారు. అది ఓనిచ్చెనవొచ్చు, నూతిలో చేద పడిపోతే తీయడానికి ఉపయోగించే “గేలం” అవొచ్చు, మావిడికాయలు కోసుకోడానికి ఓ గెడకర్ర చివర ఓ హుక్కూ, దానికి ఓ వలలాటిది వేళ్ళాడదీసింది ( కాయలు కింద పడిపోకుండా), బరకాలు కుట్టుకోడానికి ఓ దబ్బనం పురుకొసా అవొచ్చు, బూజులు దులుపుకునే కర్రైనా అవొచ్చు. ఇలాటివి ప్రతీ ఇంట్లోనూ అవసరం వచ్చేవి, అయినా సరే తమ ఇంటిలో అనవసర inventory పెరిగిపోతుందనిన్నూ, పైగా ఇంకోరికెవరికైనా అవసరం వస్తే వాళ్ళకి ఎరువియ్యాల్సివస్తుందనిన్నూ, వాళ్ళు తిరిగిచ్చేదాకా నిద్ర పట్టదనిన్నూ ఇలా అనేక కారణాల వలన ఊరికే ఇలాటివన్నీ కొంపల్లో పెట్టుకునేవారు కాదు. అంత అవసరం వస్తే పక్కింటివాడో, ఆ ఇంకో పక్కింటివాడో ఎలాగూ ఉన్నారు.

పైన చెప్పిన జాబితాలో ఇంకో ముఖ్యమైన వస్తువు, సత్తెన్నారాయణ పూజ చేసికోడానికి దేముడి పీట.ఛస్తే ఎవరింటిలోనూ ఉండేది కాదు. ఇవే కాకుండా ఇత్తడి గంగాళాలూ, అడ్డెడు గిన్నెలూ, గోకర్ణాలూ ఇలాటివి ఉండనే ఉన్నాయి. అంతదాకా ఎందుకూ, స్కూల్లో నోట్స్ వ్రాయడానికి పెన్ను లేకపోతే పక్కవాణ్ణి ఎరువడగడం. బుధ్ధులెక్కడికి పోతాయి, పక్కవాణ్ణడిగితే పనైపోతుందిగా…అవసరం వచ్చినప్పుడు అడగడం బాగానే ఉంది, కానీ తిరిగిచ్చేటప్పుడు మాత్రం అంత జాగ్రత్త తీసికోరు.వాళ్ళు అవసరానికి తీసికున్న వస్తువు, ఎక్కడో విరిగినా,ఇంకోటేదో అయినా, తిరిగిచ్చేటప్పుడు ఓసారి చెప్తే వాళ్ళ సొమ్మేంపోయిందిట? మళ్ళీ కావాల్సొచ్చినప్పుడు ఇవ్వరేమో అని భయం.

ఇవేకాకుండా, ఇంట్లో ఏ పెళ్ళికూతుర్నైనా చూపించాల్సొచ్చినప్పుడు, “ ఏమే నీ చంద్రహారం ఓసారిస్తావేమిటీ, సాయంత్రం మా పిల్లదానికి పెళ్ళిచూపులూ, మరీ బోసి మెడతో ఎలా చూపిస్తామూ..” అంటూ.చుట్టాలైతే వీళ్ళ పట్టుచీరల దగ్గరనుంచీ, ఏ భర్తో ప్రేమగా ఇచ్చిన చీర దాకా అడిగేయడమే. కొంతమందికి ఆ రక్తంలోనే ఉంటుంది, ఎలాటి అవసరం వచ్చినా, అవతలివాళ్ళు ఏమనుకుంటారో అనైనా ఆలోచించకుండా అడిగేయడమే. పైగా అవసరానికి ఇవ్వడమూ ఓ గొప్పేనా ఏమిటీ.. అచ్చంగా ఉంచేసికుంటామన్నామా ఏమిటీ… అంటూ సమర్ధింపోటీ. కొంతమందికి తాము కట్టుకున్న చీరో, డ్రెస్సో ఓసారి ఇంకోళ్ళెవళ్ళైనా వాడారో, తిరిగి ఛస్తే కట్టుకోరు, ఏదో గొంగళీ పురుగు పాకినట్టుంటుందిట!!. స్టీల్ సామాన్లవాడికైనా ఇచ్చేస్తారు కానీ, తిరిగి వాళ్ళ వంటి మీదకు మాత్రం రానీరు. అయినా సరే అవసరార్ధం ఇలాటి “త్యాగాలు” చేస్తూనే ఉంటారు. కొంతమందైతే మొహమ్మీదే చెప్పేస్తారు ” నాకలాటివి ఇష్టం లేదండీ..” అని. ఇంక అలాటప్పుడు చూడాలి ఎవరైతే ఎరువు అడిగారోవారి స్పందన “ అంత అరిగిపోతుందా అమ్మా, ఏమైనా ఇస్టేట్లడిగామా, ఓ గంటకోసం పట్టుచీర. అదైనా పిల్ల ఇష్టపడింది కాబట్టీ...”

తరువాత్తరువాత ఇళ్ళల్లో కావలిసిన ఏ వస్తువైనా సరే “అద్దెకు” దొరకడం ప్రారంభం అయింది. ఇంట్లోకి కావలిసిన ఫర్నిచరనండి, వంటసామాన్లనండి, అంతదాకా ఎందుకూ, రోల్డ్ గోల్డ్ నగలదాకా ఏ వస్తువైనా సరే దొరికేస్తుంది. ఏదో కొంత డిపాజిట్టేదో పెట్టేసి, కావలిసినదేదో తెచ్చేసికోడం. హాయి కదూ. అయినా సరే పక్కవాళ్ళని “ఎరువు” అడగడం లో ఉన్న “మజా” వస్తుందా ఏమిటీ? ఇంటికి చుట్టాలొచ్చేరని, గ్లాసుడు పాల దగ్గరనుంచీ, ఓ బుల్లి కప్పుతో కప్పుడు టీ పొడుమో, కాఫీ పొడో, అదేచేత్తోటి ఓ బుల్లిగ్లాసుడు పంచదారా కూడా ఇయ్యమ్మా..అనే డయలాగ్గులు ఈమధ్యన కరువైపోయాయి. అవతలి వాళ్ళు తిరిగిమ్మని అడగా అడగరూ, వీళ్ళకీ “అప్పు” తీర్చేద్దామని ఆలోచనా రాదూ. అడక్కపోతే, మళ్ళీ ఈవిడ గొడవుండదూ అని ఆ ఇచ్చినవాళ్ళ అభిప్రాయం. ఉభయతారకం. వీళ్ళొకళ్ళేనా ఏమిటీ, ఆవిడ కాపోతే ఇంకొకర్తీ.. ఎరువులు తెచ్చుకోవాలంటే మనుష్యులే కరువా ఏమిటీ అనుకుంటూ జాలీగా జీవితం లాగించేస్తూంటారు… Life goes on and on….
..

నిన్న ఓ మిస్టరీ షాపింగు చేశాను Thomas Cook లో. ఇదిగో రేపు వెళ్ళి, మా ఇంటావిడదోటీ, నాదోటీ షాపర్ స్టాప్ కి వెళ్ళాలి….

Advertisements

6 Responses

 1. బాగుందండీ ఎరువు వ్యవహారం…

  Like

 2. రెండు టపాలు అరువు ఇస్తారా? నా బ్లాగు లో వేసుకొని మళ్ళి ఇచ్చేస్తాను…….. దహా.

  Like

 3. @చంద్రమౌళీయం,

  ధన్యవాదాలు…

  @సుబ్రహ్మణ్యం గారూ,

  అరువు కాదండి బాబూ…ఎరువు…

  Like

  • రాయలసీమలో “అరువు సొమ్ము బరువు చేటు” అనే అంటారు మరి.

   Like

 4. నాగపూరు కప్పుతో నాగపూరు కప్పుడు కాఫీ పొడి అరువడిగే బాపూరమణీయమైన పిన్నిగారిని గుర్తు చేశారుగా.

  పనస పొట్టు కొట్టెందుకు ఎదురింటి నుంచి కత్తి తీసుకు రమ్మనే వారు, తిరిగిచ్చేసేటప్పుడు ఓ గిన్నెడు పొట్టు వాళ్ళకు ఇమ్మనేవారు. పొట్టుకూరంటే పడి చచ్చిపోయే నాకు అదెంతో బాధగా ఉండేది. కానయితే సామాజిక సంబంధాల్లో అరువుది గొప్ప పాత్ర కదా 🙂

  అరువు, ఎరువు ఒకటే అయినా… రెండోది పొలాల్లో వేసే ఎరువును గుర్తు చేస్తుంది కదా…

  Like

 5. @మోహన్ గారూ,

  ఎరువో అరువో ఏదో ఒకటీ. నా భావాలు అర్ధం చేసికున్నారు చాలు…

  @ఫణీంద్ర,

  ఊరగాయలు పెట్టినప్పుడు కూడా అదే పరిస్థితిగా! కాయలు కొట్టే కత్తిపీట ఇచ్చినవాళ్ళకీ, ఓ రాచ్చిప్పతో రాచ్చిప్పడు ఆవకాయ ఇచ్చేవారు..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: