బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Communication gap…


    అసలు ఈ రోజుల్లో కమ్యూనికేషన్లెక్కడున్నాయండి బాబూ, గ్యాప్పులూ గట్రా ఉండడానికి.. ఎక్కడ చూసినా శ్రీరామదాసు గారు చెప్పినట్టు “పలుకే బంగారమాయే...” గానే ఉంటోంది.ఒకరితో ఇంకోళ్ళు మాట్టాడ్డానికి తీరికే ఉండడం లేదూ ఈరోజుల్లో. ఇదివరకటి రోజుల్లో అయితే, ఏదో ఒకే ఇంటిలో అందరూ కలిసే ఉండడంతో, కనీసం రాత్రిళ్ళు భోజనాలు అందరూ కలిసే కూర్చోవాలనేవారు. ఇలాగైనా ప్రతీ రోజూ కొంపలో ఏమౌతొందో తెలిసేది. ఆరోజుల్లో ఇంటి వాతావరణాలు కూడా, మరీ ఈరోజుల్లోలా ఉండేవి కావు. మరీ భక్తి ప్రపత్తులనేవి ఉండకపోయినా, మరీ మొహమ్మీదే చెప్పేయడానికి మొహమ్మాటం అడ్డొచ్చేది.మొహమ్మాటం అనండి లేకపోతే, ఇంటి పెద్దాయనంటే భయమో, అభిమానమో, భక్తో లేక ఇవన్నీ కలిపిన ఇంకోటేదో అనండి, మరీ కొట్టుకునేవారు కాదు. అలాగని ఏదో శ్రీరామరాజ్యాల లా ఉండేదీ అనడానికీ వీల్లేదు. దెబ్బలాటలు వచ్చేవి, కాదనలేము, కానీ ఇంట్లోనో, లేక చుట్టాల్లోనో వయస్సులో పెద్దయినవారెవరో ఇలాటివి పరిష్కారం చేసేవారు.

   పైచదువులకి ఇంకో ఊరెళ్ళవలసివచ్చినప్పుడు, వారానికో, పక్షానికో ఓ ఉత్తరం రావల్సిందే. అలాగే ఉద్యోగరీత్యా ఇంకో ఊరికి వెళ్ళినప్పుడో, క్షేమసమాచారాలతో ఉత్తరాలు వచ్చేవి.కాలక్రమేణా, పైచదువులకెళ్ళిన పిల్లలు కూడా, డబ్బులు అవసరం వచ్చినప్పుడో, మనీఆర్డరు అందనప్పుడో ఇంటికి ఉత్తరాలు వ్రాసే స్థితికి వచ్చేశారుఇంక చుట్టాల సంగతి, less said the better.., మా పెదనాన్నగారు ఒకాయన అనేవారు. “ఉత్తరాలు రాలేదూ అంటే అంతా బాగున్నట్టే అన్నమాట. ఏదైనా వస్తే రాస్తారు లెద్దూ..” అనేవారు.నిజం చెప్పాలంటే ఇదే హాయీ..

   తరువాత్తరువాత టెలిఫోన్లూ, ఎస్.టి.డీ లూ అదేదో రాత్రి పదకొండునుంచి, ఉదయం ఆరు గంటలదాకా సగం రేట్లూ ఉండడంతో, ఎవడో ఒకడు ఫోన్లు చేసేవారు.అవతలివాడున్నాడో పోయాడో కనీసం తెలిసేది. ఆ తరువాత సెల్ ఫోన్లూ, ఇంటర్నెట్లూ వచ్చిన తరువాతైతే, ఊళ్ళోవాళ్ళందరూ ఎలాగున్నారో అని గంటల తరబడి కబుర్లైతే చెప్పుకుంటారు కానీ, తల్లితండ్రులకి ఫోను చేసి, ఓసారి మాట్టాడితే, వాళ్ళు ఎంత సంతోషిస్తారో ఈరోజుల్లో పిల్లలకి ఎందుకు తట్టడం లేదో అర్ధం అవదు. పోనీ వాళ్ళ విషయాలు తల్లితండ్రులతో పంచుకోడానికి ఇష్టం లేకపోయినా, కనీసం వాళ్ళు బ్రతికున్నారో లేదో అనైనా తెలుసుకోవద్దంటారా?

   బయటి దేశాల్లో ఉండేవాళ్ళకైతే పోనీ ఓ excuse ఉందనుకుందాం, అదేదో టైములాగ్గూ సింగినాదం జీలకర్రానూ. పోనీ మాట్టాడడానికి ఏమైనా ఇదివరకటి రోజుల్లోలాగ వందలూ,వేలూ ఖర్చుపెట్టాలా, అదీ లేదు. ఇంటర్నెట్ ద్వారా గంటలు గంటలు మాట్టాడుకోవచ్చు. ఈరోజుల్లో ట్రాజెడీ ఏమిటయ్యా అంటే, క్షేమసమాచారాలు Twitter లోనూ, Facebook లోనూ చూసుకుని సంతోషించవలసిన దౌర్భాగ్య పరిస్థితి. వాటిల్లో లాగిన్ అవడానికి పట్టే, టైముకంటే, ఓ ఫోను చేసి మాట్టాడ్డం తక్కువ అవుతుంది. అయినా సరే, ఆ విషయం మాత్రం తెలియడం లేదు. ఈ తల్లితండ్రులన్నవాళ్ళకి ఎలా ఉందంటే, అదృష్టం బాగోక అరోగ్యం పాడై, ఏ హాస్పిటల్ లోనో చేరినా, ఏ ఫ్రెండు ద్వారానో, లేదా వాళ్ళు చేరిన ఏ హాస్పిటల్ ద్వారానో తెలియడం. ఇలా అంటే, వాళ్ళంటారూ, పోనీ ఎలాటి అవసరం వచ్చినా ఫోను చేయమన్నాను కదా, ఎందుకు చెప్పలేదూ అనడం. ఇలా చీటికీ మాటికీ, ఏదో విషయం లో వీళ్ళనుకునేదొకటీ, తల్లితండ్రులు అనుకునేదోటీ, మొత్తానికి ఓ gap వచ్చేస్తోంది. వాళ్ళు వారానికోసారైనా ఫోనుచేస్తే వాళ్ళ సొమ్మేంపోయిందీ అని పిల్లలూ, ఆమాత్రం బాధ్యత ఉండఖ్ఖర్లేదా పిల్లలకీ అని తల్లితండ్రులూ, మొత్తానికి ఆ బంధాలు strain అయిపోతున్నాయి. ఎప్పుడో కలిసినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా, ఏదో అదీ ఇదీ మాట్టాడేసుకోడం, పనైపోతుంది. మళ్ళీ ఏ వారం రోజులకో, పదిహేను రోజులకోనే మళ్ళీ ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకోడం. అసలు రెగ్యులర్ గా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ అనేది ఉంటేనే కదా, సంబంధబాంధవ్యాలు ఉండేదీ? మళ్ళీ బయటవాళ్ళ దగ్గర మాత్రం పేద్ద పేద్ద ప్రగల్భాలు చెప్పేసికోడం, మా పిల్లలు ఇలాగా, మా పిల్లలు అలాగా అని ఆ తల్లితండ్రులూ, మా తల్లితండ్రులు ఇంత గ్రేట్టూ, అంత గ్రేట్టూ అని ఆ పిల్లలూ.ఎందుకొచ్చిన బడాయిలండీ బాబూ?

   ఏదో కమ్యూనికేషననేది ఉండాలని చెప్తే, ప్రతీరోజూ ఆ పెద్దాళ్ళకి “జోలపాటలు” పాడమని కాదు. కొంతమందుంటారులెండి ప్రతీ రోజూ ఠంచనుగా ఓ టైముకి ఫోను చేసేయడం, అంతా బావున్నట్టేనా అని ఓసారి అడిగేస్తే అయిపోతుందనుకుంటారు. ఇదేమైనా శనివారాలు వెంకటేశ్వరస్వామికి కొబ్బరి కాయ కొట్టినట్టా ఏమిటీ? ఈ తల్లితండ్రులనబడే పూర్ క్రీచర్స్ వాళ్ళ పిల్లలనుండి ఏమీ ఆస్థిపాస్థులు కాదు అడిగేది, ఓ చిన్న పలకరింపు మాత్రమే. కానీ అలాటివికూడా extinct అయిపోతున్నాయి .

19 Responses

  1. మీరు చెప్పినదానిలో ఎంతో నిజముంది.

    Like

  2. Twitter ఎందుకంత పాపులర్ అయ్యిందో నాకు ఇంకా అర్థం కాలేదండీ. It only allows length of 140 characters, But now this became a new world (Social & business). 140 characters lo information convey చెయ్యడం లో కకుర్తి ఉంది అని నా ఫీలింగ్ సర్.

    http://en.wikipedia.org/wiki/Twitter

    In this microblogging still our new channels & others search for news & breaking news 🙂

    Like

  3. హ్మ్, తల్లిదండ్రులు మాత్రం పిల్లలతో కలిసి ఉండకుండా, మేము మా ఇష్టం, విడిగా సుఖం గా ఉంటాం అనుకొనే వాళ్ళని రోజు పలకరించి ఇబ్బంది పెట్టడం ఎందుకండీ 🙂

    ఒక సారి దూరం వెళ్ళాలనుకొన్నాక ఎంత దూరం వెళ్ళారు అన్నది ఎవరి చేతుల్లోను ఉండదు కదా, ఏమంటారు ?

    Like

    • వహ్వా! వహ్వా!
      నిజమే! హెంత హెంత ఇబ్బంది!
      ఆస్థులు, శవాల మీద బంగారు ఒలుచుకుని పంచుకునేటప్పుడు ఇబ్బంది పడటానికి వాటికి ప్రాణముంటేగా! లాజిక్ బాగుంది, మా.. మా.. మాటల్లెవ్వు (నోరు పడిపోనాది) అంతే!

      Like

  4. కరువైన పలకరింపులు,
    అలసి సొలసిన సంభంధాలు,
    వసుదైక కుటుంభాలలో,
    ఏకాకి జీవితాలు.
    చాలా బాగా వివరించారు.

    Like

  5. *ఈ తల్లితండ్రులనబడే పూర్ క్రీచర్స్ వాళ్ళ పిల్లలనుండి ఏమీ ఆస్థిపాస్థులు కాదు అడిగేది, ఓ చిన్న పలకరింపు మాత్రమే.*

    ఆర్యా!

    ఇటువంటి మాటలు మూడుతరాల నుంచి వింట్టున్నాను. వినేవారు ఉంటె ముసలి వారు తమ పిల్లల పైన చాలా కథలు చెపుతారు. మరికొందరు వృద్దులు, ఎదురింటి, పక్కింటి వారి సహాయం తీసుకొని వృదాప్యం గడుపుతారు. బ్రతికినన్ని రోజులు, అవసరమైన సమయాలలో, తమ పిల్లలు వారి గురించి పట్టించుకోకపోయినా, పోతూ పోతూ ఆ స్థితి అంతా వారి చేతిలో పెట్టి పోతారు. పరిస్థితిలో మార్పు రావాలంటే, ఇలా ఊరికే వాపోకుండా తమ ఆస్థిని పిల్లలకు ఇవ్వకుడా, తమను ఆఖరు దశలో చూసుకొనే ఎదురింటి, పక్కింటి వారికి, ఇంకేవరైనా పేద వారికి ఇస్తే బాగుంట్టుంది. ఇలా ఎప్పుడైతే వృద్దులు చేయటం మొదలు పేడతారో, అప్పుడే పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు వస్తాయి.

    Like

    • మూడు తరాలనుంచి ముసలి వారి మాటలు వింటున్న,
      ‘ఆషాడ భూతి’ నాలుగో తరం స్వయం అనుభవించే,
      అనుభవానికి వచ్చే రోజులు రాక మానవు.
      ఆస్తి లో నుంచి వెలివేయాలన్న ‘ఖగ వధూటి’ సలహా ,
      ఆచరణీయం, ఆమోదయోగ్యం. ధన్యవాదాలు.

      Like

      • @CVR mohan,
        మీరు రాసినది నాకు ఎమీ అర్థం కాలేదు. ఇక ఇటువంటి అనుభవాలు ఎన్నో చూశాను. మా పక్క ఇంటి ఆయన పెళ్ల్లాం ఫోయిన తరువాత ఒక్కడే ఉండే వాడు. ముఖర్జి అని బెంగాలతను. అతనిని చూటటానికి పిల్లలు ఎవ్వరు వచ్చే వారు కాదు. ఒకరోజు తెల్లవారు జామున 3గం || గుండేనొప్పొస్తే నేను తీసుకొని పోయి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, పదివేలకుపైన డబ్బులు కట్టను. అతని కూతురు మూడో వీధిలో ఉంట్టుంది. ఆమేకి పోన్ చేశాను. దగ్గరే కనుక గంట లో పు వస్తుందనుకొన్నను, నేను అనుకొన్నదొకటి అయ్యిందొకటి, ఆమే రాలేదు. సాయంత్రం అల్లుడు వేరే ఊరినుంచి ఇతనిని చుడటానికి ఆసుపత్రికి వచ్చాడు. ఇలా రెండో సారి కూడా జరిగింది. విషయానికి వస్తే నాతో పాటుగా ఉన్న పక్కింటి వారు కూడా ఆయనకు సహాయం చేసేవారు. మరికొందరు ఇతనిని పలకరిస్తే తమకు ఎక్కడ పని పడుతుందో అని, తప్పుకు తిరుగుతూ అతనితో అసలికి మాట్లాడేవారు కాదు. ఆ తరువాత ఆయన ఆర్మి వాళ్ల ఒల్డ్ ఏజ్ హోం లో చేరాడు. చనిపోయిన తరువాత ఇల్లు (సుమారు 75లక్షల ఆస్థితి) కూతురు తీసుకొంది. ఇలా పోతూ పోతూ తనని చూడని పిల్లల నెత్తిన అంత ఆస్థిని కొట్టి వేళ్ల్లే బదులు, తమని చూసిన పక్కిళ్ల వారికో కొంత ఇచ్చినా, నిరుద్యోగులో లేక పదవి విరమణ చేసి ఖాళి గా ఉండేవారో, డబ్బుపైన ఆశకొద్ది సహయాం చేయటానికి భవిషత్ లో ముందుకు వస్తారు. లేకపోతే ఎవరినైనా ఒకరిని చేరదీసి వీరిని చూసుకొనేటట్లు ఎర్పాటు చేసుకోవాలి. అలా ఎప్పుడు చేయటం మొదలు పెడతారో, పిల్లలు కూడా భయపడతారు. ఈ రోజుల్లో ఇళ్ల విలువ తక్కువ కాదు కదా! ఎన్ని రోజులు పని చేసి, కూడ బెడితే అంత డబ్బులు (75లక్షలు) వస్తాయి. ఈ రోజులలో అందరూ బిజినే పనులన్ని పక్కిళ్లవారి చేత చేయించుకొని, పైసా వారికి విదల్చకుండా, ఆస్థిని మాత్రం శత్రువుకన్నా ఎక్కువ గా బాధ పెట్టిన పిల్లలకే ఇచ్చిపోతుంటే, భవిషత్ లో ఎవ్వరు ముందుకు రారు.
        __________________________________

        ఫణి గారు, నేను ఎదో చిన్న ఊరిలో పుట్టిన వాడిని కనుక, పెద్దవయసులో ఉండేవరి కష్ట్టసుఖాలు తెలిసినవాడిని కనుక ఆయనకి సహాయం చేశాను. మెట్రొ సిటిలో పుట్టి పెరిగిన వారెవ్వరు డబ్బులు తప్పితే ఇంకొకటి ఆలోచించరు. ఈ రోజుల్లో అన్ని కొన్నుకోవటమే, ఈ సర్విస్ ను కూడా కొనుక్కోవాలి అని నా ఉద్దేశం. ఇలా రాసినందుకు నేను నా పక్కింటి ఆయననుంచి ఆస్థి ఆశించానని మాత్రం అనుకోవద్దు. అన్నిటికన్నా ఆశ్చ్ర్య పోయింది గుండేపోటుతో ఆసుపత్రిలో చేరిపిస్తే ఊర్లో ఉన్న ఇద్దరు పిల్లలు చూడటానికి రాలేదు.

        Like

  6. baga rasaru sir…

    Like

  7. @శ్రీ,

    ఏకీభవించినందుకు ధన్యవాదాలు…

    @readgood,
    ప్రస్తుతపు వేలం వెర్రి ట్విట్టర్.. అదేదో ” కొలవెరి” పాట అంత పాప్యులర్ అవడానికి కారణం ఏమైనా ఉందా? ఈ social networks కూడా అంతే…

    @మౌలీ,

    వాళ్ళకి అవసరాలున్నప్పుడు పిలవడం కరెక్టా? అప్పుడప్పుడు ఓసారి పలకరించమనడం తప్పైపోయిందా వహ్వా..వహ్వా…

    @మోహన్ గారూ,

    థాంక్స్…

    @శ్రీరాం గారూ,

    Easier said than done… అదేదో సామెత ” ఆయనే ఉంటే…….” చెప్పినట్టు, మోహాలు విడిచిపెట్టలేకే, మూడు తరాలనుండీ ఇవే మాటలు వింటున్నారు. ఖంగారు పడకండి,
    మీరు చెప్పిన ఈ “వృధ్ధులు” చరిత్ర లోకి వెళ్ళిపోయాక, అనేవారెవరూ ఉండరులెండి…

    @RAM S,

    థాంక్స్…

    Like

  8. ఫణి గారు, మీరు రాసిన దానిని బట్టి చూస్తే, ఇంకొక వందసంవత్సరాలైనా పరిస్థితిలో మార్పువచ్చేటట్టు లేదని అనిపిస్తున్నాది. నేను ఎంతో మంది ముసలి వారిని చూసి, వారు పడిన కష్ట్టాలను దృష్ట్టిలో ఉంచుకొని చెప్పిన అభిప్రాయం. మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదని గమనించగలరు.

    Like

  9. Sri Ram,

    నేను ఏదో అపార్ధం చేసికున్నానని అనుకోకండి.మీరు చూసినవి మీరు వ్యక్త పరిచారు. నా అభిప్రాయమేదో నేను చెప్పాను..

    Like

  10. @వాళ్ళకి అవసరాలున్నప్పుడు పిలవడం కరెక్టా? అప్పుడప్పుడు ఓసారి పలకరించమనడం తప్పైపోయిందా వహ్వా..వహ్వా…

    అసలు వేరు గా ఉండటం ఎందుకు 🙂

    Like

  11. మౌళీ,

    వేరుగా ఉండడానికి కారణాలనేకం ఉంటాయి. వాటన్నిటినీ వివరిస్తే “ఇప్పటి” వారికి నచ్చకపోవచ్చు !!

    Like

  12. కారణాలు వివరించమని కాదండీ, మీరడిగే ప్రశ్నలకి జవాబులు ఈ కారణాల్లోనే వెతకాలి ముందు.

    Like

  13. మౌళీ,

    ఒకటి మాత్రం చెప్పగలను విడివిడిగా దగ్గరలో ఉండే సుఖం, కలిసున్నప్పుడు మాత్రం ఉండదని. అలాగని వారిది తప్పూ, వీరిది తప్పూ అని కాదు. ఎవరి mind set వారిదీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, preventive action తీసికోడంలోనే ఉంటుంది, “పెద్దల” పెద్దరికం. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరి అభిప్రాయం వారిదీ….

    Like

    • మొదట ఒక చిన్న మాట, మీరు టపా మీ కుటుంబం గురించి వ్రాయలేదు. మరి నాకు ఇచ్చే సమాధానాలు లో మీ కుటుంబం ని కూడా కలిపి (లేదా మీ గురించే ) ఎందుకు చెపుతున్నారు !(ఒక వేళ అపార్ధం చేసుకోలేదు కదా మీరు )

      దగ్గరలో విడిగా ఉన్నా, దూరం లో విడిగా ఉన్నా విడిగా అంటూ ఉన్నపుడు ఎవరికి మాట్లాడాలి అనిపిస్తే వారు చక్కగా మాట్లాడొచ్చు , ఇంకొకరిపై నెపం వెయ్యడం కన్నా!!!. పెద్ద వాళ్లకి పిల్లలే రోజుకొకసారి ఫోన్ చెయ్యాలి అనే రూల్ పెట్టుకొని మరీ ఫోన్ చెయ్యలేదని బాధ పడడం కన్నా preventive action ఎందుకు లేదు.

      అయితే దూరం వుండడం కన్నా దగ్గరలో విడిగా ఉండే తల్లిదండ్రులలో కూడా కొందరు సమస్యలు సృష్టించే వారు బోలెడు .మీరు వ్యాసం ఏకపక్షం గా వ్రాసారని మాత్రమె కాదు, మళ్ళీ పలకరించే వారినేమో శనివారం కొబ్బరికాయ కొట్టినట్లు అని వెటకారం 🙂 నిజం గా అలా అనిపిస్తే అక్కడ సమస్య రెండు వైపులా ఉన్నట్లు !!

      ఈ వ్యాసం వల్ల ఉపయోగం (ఎవ్వరికీ) లేకుండా పోయే ప్రమాదం ఉంది . కాబట్టే నా ప్రశ్న!

      Like

  14. మౌళి,
    మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం త్వరలో ఒక టపా రూపం లో పెడతాను.

    Like

  15. snkr,

    నాకు మరీ శవాలూ, ఒలుచుకోడాల గురించీ తెలియదు. ఏదో రోజువారీ జీవితాల్లో చూసిన వాటి గురించి వ్రాస్తున్నాను. కొంతమందికి నచ్చడం లేదు.

    Like

Leave a comment