బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Communication gap…

    అసలు ఈ రోజుల్లో కమ్యూనికేషన్లెక్కడున్నాయండి బాబూ, గ్యాప్పులూ గట్రా ఉండడానికి.. ఎక్కడ చూసినా శ్రీరామదాసు గారు చెప్పినట్టు “పలుకే బంగారమాయే...” గానే ఉంటోంది.ఒకరితో ఇంకోళ్ళు మాట్టాడ్డానికి తీరికే ఉండడం లేదూ ఈరోజుల్లో. ఇదివరకటి రోజుల్లో అయితే, ఏదో ఒకే ఇంటిలో అందరూ కలిసే ఉండడంతో, కనీసం రాత్రిళ్ళు భోజనాలు అందరూ కలిసే కూర్చోవాలనేవారు. ఇలాగైనా ప్రతీ రోజూ కొంపలో ఏమౌతొందో తెలిసేది. ఆరోజుల్లో ఇంటి వాతావరణాలు కూడా, మరీ ఈరోజుల్లోలా ఉండేవి కావు. మరీ భక్తి ప్రపత్తులనేవి ఉండకపోయినా, మరీ మొహమ్మీదే చెప్పేయడానికి మొహమ్మాటం అడ్డొచ్చేది.మొహమ్మాటం అనండి లేకపోతే, ఇంటి పెద్దాయనంటే భయమో, అభిమానమో, భక్తో లేక ఇవన్నీ కలిపిన ఇంకోటేదో అనండి, మరీ కొట్టుకునేవారు కాదు. అలాగని ఏదో శ్రీరామరాజ్యాల లా ఉండేదీ అనడానికీ వీల్లేదు. దెబ్బలాటలు వచ్చేవి, కాదనలేము, కానీ ఇంట్లోనో, లేక చుట్టాల్లోనో వయస్సులో పెద్దయినవారెవరో ఇలాటివి పరిష్కారం చేసేవారు.

   పైచదువులకి ఇంకో ఊరెళ్ళవలసివచ్చినప్పుడు, వారానికో, పక్షానికో ఓ ఉత్తరం రావల్సిందే. అలాగే ఉద్యోగరీత్యా ఇంకో ఊరికి వెళ్ళినప్పుడో, క్షేమసమాచారాలతో ఉత్తరాలు వచ్చేవి.కాలక్రమేణా, పైచదువులకెళ్ళిన పిల్లలు కూడా, డబ్బులు అవసరం వచ్చినప్పుడో, మనీఆర్డరు అందనప్పుడో ఇంటికి ఉత్తరాలు వ్రాసే స్థితికి వచ్చేశారుఇంక చుట్టాల సంగతి, less said the better.., మా పెదనాన్నగారు ఒకాయన అనేవారు. “ఉత్తరాలు రాలేదూ అంటే అంతా బాగున్నట్టే అన్నమాట. ఏదైనా వస్తే రాస్తారు లెద్దూ..” అనేవారు.నిజం చెప్పాలంటే ఇదే హాయీ..

   తరువాత్తరువాత టెలిఫోన్లూ, ఎస్.టి.డీ లూ అదేదో రాత్రి పదకొండునుంచి, ఉదయం ఆరు గంటలదాకా సగం రేట్లూ ఉండడంతో, ఎవడో ఒకడు ఫోన్లు చేసేవారు.అవతలివాడున్నాడో పోయాడో కనీసం తెలిసేది. ఆ తరువాత సెల్ ఫోన్లూ, ఇంటర్నెట్లూ వచ్చిన తరువాతైతే, ఊళ్ళోవాళ్ళందరూ ఎలాగున్నారో అని గంటల తరబడి కబుర్లైతే చెప్పుకుంటారు కానీ, తల్లితండ్రులకి ఫోను చేసి, ఓసారి మాట్టాడితే, వాళ్ళు ఎంత సంతోషిస్తారో ఈరోజుల్లో పిల్లలకి ఎందుకు తట్టడం లేదో అర్ధం అవదు. పోనీ వాళ్ళ విషయాలు తల్లితండ్రులతో పంచుకోడానికి ఇష్టం లేకపోయినా, కనీసం వాళ్ళు బ్రతికున్నారో లేదో అనైనా తెలుసుకోవద్దంటారా?

   బయటి దేశాల్లో ఉండేవాళ్ళకైతే పోనీ ఓ excuse ఉందనుకుందాం, అదేదో టైములాగ్గూ సింగినాదం జీలకర్రానూ. పోనీ మాట్టాడడానికి ఏమైనా ఇదివరకటి రోజుల్లోలాగ వందలూ,వేలూ ఖర్చుపెట్టాలా, అదీ లేదు. ఇంటర్నెట్ ద్వారా గంటలు గంటలు మాట్టాడుకోవచ్చు. ఈరోజుల్లో ట్రాజెడీ ఏమిటయ్యా అంటే, క్షేమసమాచారాలు Twitter లోనూ, Facebook లోనూ చూసుకుని సంతోషించవలసిన దౌర్భాగ్య పరిస్థితి. వాటిల్లో లాగిన్ అవడానికి పట్టే, టైముకంటే, ఓ ఫోను చేసి మాట్టాడ్డం తక్కువ అవుతుంది. అయినా సరే, ఆ విషయం మాత్రం తెలియడం లేదు. ఈ తల్లితండ్రులన్నవాళ్ళకి ఎలా ఉందంటే, అదృష్టం బాగోక అరోగ్యం పాడై, ఏ హాస్పిటల్ లోనో చేరినా, ఏ ఫ్రెండు ద్వారానో, లేదా వాళ్ళు చేరిన ఏ హాస్పిటల్ ద్వారానో తెలియడం. ఇలా అంటే, వాళ్ళంటారూ, పోనీ ఎలాటి అవసరం వచ్చినా ఫోను చేయమన్నాను కదా, ఎందుకు చెప్పలేదూ అనడం. ఇలా చీటికీ మాటికీ, ఏదో విషయం లో వీళ్ళనుకునేదొకటీ, తల్లితండ్రులు అనుకునేదోటీ, మొత్తానికి ఓ gap వచ్చేస్తోంది. వాళ్ళు వారానికోసారైనా ఫోనుచేస్తే వాళ్ళ సొమ్మేంపోయిందీ అని పిల్లలూ, ఆమాత్రం బాధ్యత ఉండఖ్ఖర్లేదా పిల్లలకీ అని తల్లితండ్రులూ, మొత్తానికి ఆ బంధాలు strain అయిపోతున్నాయి. ఎప్పుడో కలిసినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా, ఏదో అదీ ఇదీ మాట్టాడేసుకోడం, పనైపోతుంది. మళ్ళీ ఏ వారం రోజులకో, పదిహేను రోజులకోనే మళ్ళీ ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకోడం. అసలు రెగ్యులర్ గా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ అనేది ఉంటేనే కదా, సంబంధబాంధవ్యాలు ఉండేదీ? మళ్ళీ బయటవాళ్ళ దగ్గర మాత్రం పేద్ద పేద్ద ప్రగల్భాలు చెప్పేసికోడం, మా పిల్లలు ఇలాగా, మా పిల్లలు అలాగా అని ఆ తల్లితండ్రులూ, మా తల్లితండ్రులు ఇంత గ్రేట్టూ, అంత గ్రేట్టూ అని ఆ పిల్లలూ.ఎందుకొచ్చిన బడాయిలండీ బాబూ?

   ఏదో కమ్యూనికేషననేది ఉండాలని చెప్తే, ప్రతీరోజూ ఆ పెద్దాళ్ళకి “జోలపాటలు” పాడమని కాదు. కొంతమందుంటారులెండి ప్రతీ రోజూ ఠంచనుగా ఓ టైముకి ఫోను చేసేయడం, అంతా బావున్నట్టేనా అని ఓసారి అడిగేస్తే అయిపోతుందనుకుంటారు. ఇదేమైనా శనివారాలు వెంకటేశ్వరస్వామికి కొబ్బరి కాయ కొట్టినట్టా ఏమిటీ? ఈ తల్లితండ్రులనబడే పూర్ క్రీచర్స్ వాళ్ళ పిల్లలనుండి ఏమీ ఆస్థిపాస్థులు కాదు అడిగేది, ఓ చిన్న పలకరింపు మాత్రమే. కానీ అలాటివికూడా extinct అయిపోతున్నాయి .

%d bloggers like this: