బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Phasing out………


   ఒకానొకప్పుడు ఒంటెద్దు బళ్ళుండేవి, వాటిని గుర్రబ్బళ్ళు వచ్చిన తరువాత మర్చిపోయారు. అలాగే మొదట్లో లాగుడు రిక్షాలూ, తరువాత సైకిలు రిక్షాలూ, క్రమక్రమంగా అవీ పోయి, ఆటోరిక్షాలూ,టాక్సీలూ, అవేవో సిక్స్ సీటర్లూ. ఒకానొకప్పుడు పెద్ద నగరాల్లో ట్రాములనేవి ఉండేవి. ప్రస్తుత స్పీడ్ తో పోలిస్తే, పాపం అవి నత్తనడకలాగే ఉంటుందనుకోండి. సిటీ బస్సులూ అవీ వచ్చేసి, ఆ ట్రాములని పక్కకి తోసేశాయి. ఇంకా కొల్కత్తాలో అనుకుంటా, ఇంకా అవి ఉన్నాయి.అలాగే ఇప్పుడంతా మెట్రో హవా. రైళ్ళే చూడండి, మొదట్లో ఛుక్ ఛుక్ మంటూ బొగ్గింజన్లూ, తరువాత డీసెలింజన్లూ, ఇప్పుడు ఏకంగా ఎలెట్రీ ఇంజన్లే. ఎప్పుడో బుల్లెట్ ట్రైన్లుకూడా వచ్చేస్తాయి.అలాగే బస్సులూనూ, మొదట్లో అవేవో బొగ్గుబస్సులుండేవిట, ఇప్పుడు ఎక్కడ చూసినా వోల్వోలూ, మెర్సిడీజ్ స్లీపర్లూ, సెమీస్లీపర్లూనూ…

   కొత్తవి రాగానే, పాతవాటిని Phase out……… చేసేస్తారు. కరెక్టే చేయాల్సిందే. ఎప్పుడు చూసినా పాతవాటినే వేళ్ళాడుతూ ఉంటామంటే, దేశం “ముందుకు” పోయేదెలా? అలాగే మొదట్లో మనకి నీళ్ళిచ్చే పెరట్లో నూతులు, “రక్షిత మంచినీళ్ళ” పథకాలకి చోటిచ్చేశాయి. కానీ, పాతవన్నీ మంచివి కావూ అనలేము కదా. కొత్తవి రానప్పుడు, ఆ పాతవాటివల్లే మన రోజులు వెళ్ళేవి. ఇప్పుడంటే ప్రయాణాల్లో ఏరేటెడ్, మినరల్ వాటర్ బాటిళ్ళూనూ, ఇదివరకో మరచెంబే గతి. అలాగే గుర్తుండేఉంటుంది, అదేదో కాన్వాస్ బాగ్ లో నీళ్ళు పట్టేసి, దాన్ని కిటికీకి బయట పెట్టేవారు రైళ్ళలోనూ, బస్సుల్లోనూ, ఆ మంచినీళ్ళ ” చల్లదనానికి”, ఏ ఫ్రిజ్ వాటరూ సరిపోదు.

   ఏమిటీ సడెన్ గా ఫిలాసఫీలోకి వెళ్ళిపోయారేమిటీ అనుకుంటున్నారా, ఏం లేదూ, ఈవేళ మా స్నేహితుడిని కలిశాను. చాలా కాలం తరువాత కలిశామేమో, ఇన్నేళ్ళూ, జరిగిన పరిణామాలూ వగైరాల గురించి కబుర్లు మొదలెట్టాము. ఏదో పని మీద వచ్చాడులెండి ఇక్కడకి. తనుండే ఊళ్ళో తనూ, భార్యా ఒక ఇంట్లోనూ, కొడుకూ కోడలూ పిల్లలూ ఇంకో చోటా ఉంటున్నారుట.మొదటినుండీ, మా స్నేహితుడిదీ, మాదీ అభిప్రాయాలు ఒక్కలాగానే ఉండేవి. బహుశా అదే కారణం కూడా అవొచ్చు, ఇన్నాళ్ళైనా మా స్నేహం ఇంకా నిలబడ్డానికి.అదేదో same wavelengతో ఏదో అంటారనుకుంటా. ఎవరి స్పేస్ వాళ్ళకి ఉండాలనే నా అభిప్రాయంతో తనూ నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తాడు.తన అవసరం ఉన్నంత కాలమూ, తనూ భార్యా వెళ్ళి పిల్లలతో గడిపేవారు, ఏదో వాళ్ళకీ సహాయంగా ఉండొచ్చు కదా అని.రిటైరయ్యాడు కదా అని హాయిగా కొంపలో కూర్చోకుండా తనూ, వంట్లో ఓపికున్నా లేకపోయినా పిల్లలు చిన్నవాళ్ళూ అని భార్యా, వళ్ళొంచుకోకుండా చూసేవారు. అలాగని తను ఏదో పేద్ద “త్యాగం” చేసేడని ఎప్పుడూ అనుకోనూ లేదూ, ఎవరితోనూ అనా లేదూ. కొడుకూ కోడలూ ఆఫీసులకెళ్ళిపోయినా, మనవరాలిని స్కూలు బస్సెక్కించేందుకూ, మనవణ్ణి ఎప్పుడైనా డే కేర్ సెంటర్ నుండి తెచ్చేందుకూ వెళ్ళడం ఇలాటివి చేయడంలో ఓ ఆనందం పొందేవారు. బయటివాళ్ళనుకోవచ్చు, ఇదీ పేద్ద పనేనా ఏమిటీ అని. ఓ వయస్సొచ్చిన తరువాత, ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇవికూడా పేద్ద పనులే అవుతాయి. ప్రతీవారికీ వయస్సొచ్చిన తరువాత తెలుస్తాయి వీటిలో ఉండే తిప్పలేమిటో..

   ముందొచ్చిన చెవులకంటే, వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువా అన్నట్టు, కొడుకులూ, కూతుర్ల కంటే, మనవలూ మనవరాళ్ళే ఎక్కువవుతారు ఈ తాతలకీ, అమ్మమ్మలకీ, నానమ్మలకీనూ. ఎక్కువ రోజులు వాళ్ళతో గడిపేటప్పటికి వాళ్ళతో ఓ bonding ఏర్పడిపోతుంది. వాళ్ళని చూడకుండా ఉండలేకపోతారు. ఇంక పిల్లలకీ చిత్రవిచిత్ర ఆలోచనలు రావడం మొదలెడతాయి. మన పిల్లలు, మన మాటకంటే, తాతా, నానమ్మా లకే చేరువైపోతున్నారేమో అనే ఓ feeling of insecurity… germinate అవడం ప్రారంభం అవుతుంది. ఇన్నాళ్ళూ అవసరం వచ్చినప్పుడల్లా వీళ్ళ rescue కి వచ్చిన ఆ గ్రాండ్ పేరెంట్స్, ఓ లయబిలిటీ గా కనిపిస్తారు.అలాగని మొహమ్మీదే చెప్పలేరుగా, ఏదో subtle గా మొదలవుతాయి సన్నాయి నొక్కులు. అమ్మకి మరీ “శ్రమైపోతోందేమో” తో మొదలూ. ఇన్నాళ్ళూ గుర్తురాలేదా మరి? అవసరం వాళ్ళదిగా, అలాటప్పుడు ఇలాటి చిన్న చిన్న విషయాలు ఎక్కడ గుర్తొస్తాయి? నాన్నగారూ, ఊరికే ఎండలో తిరక్కండి, రెస్ట్ తీసికోండి, అవసరం ఉన్నప్పుడు నేను ఫోను చేస్తానుగా, అప్పుడు వద్దురుగాని.అంటే indirect గా చెప్పడం ఇంక మీఅవసరం మాకంతలేదూ అని…నువ్వే మరీ ఎక్కువగా react అయ్యావేమోనయ్యా, మరీ మీ అబ్బాయి ఉద్దేశ్యం అలా కాకపోవచ్చు, నిజంగా మీకు రెస్ట్ ఇవ్వాలనే అలా అన్నాడేమో అని చెప్పాను. లేదయ్యా నువ్వెప్పుడూ ప్రతీదాంట్లోనూ పాజిటివ్వే చూడాలంటావు, కానీ ఇక్కడ మాత్రం జీర్ణం చేసికలేక ఇదిగో ఇలా పాత స్నేహితుల్ని ఓసారి కలిస్తేనేనా మనశ్శాంతిగా ఉంటుందేమో అని ఊళ్ళమీద పడ్డామూ…అన్నాడు..

    ఇదిగో దీన్నే మొదటి రెండు పేరాల్లోనూ వ్రాశానే అలాగ Phase out…. చేసేయడం అన్న మాట…వచ్చిన గొడవల్లా ఎక్కడా అంటే, పైన చెప్పినవన్నీ యంత్రాలు వాటికి ఓ ఫీలింగూ అవీ ఉండవు. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటంటే మానవ సంబంధాలు. మరీ మా స్నేహితుడూ, తన భార్యా జడపదార్ధాలు కాదుకదా, వాళ్ళకీ పిల్లల్ని చూడాలనే ఉంటుంది, కానీ కొడుకూ కోడలూ, ఫరవాలేదూ మేమే చూసుకుంటామూ అనేటప్పటికి వీళ్ళు మాత్రం ఏం చేస్తారూ? ఆ కొడుకు దగ్గరనుంచో, కోడలు దగ్గరనుంచో ఫోనెప్పుడొస్తుందా అని ఎదురుచూడ్డం తప్ప...

    మరి ఇప్పుడు మీరు చెప్పండి, యంత్రాలూ, ప్రయాణ సాధనాలూ Phase out చేసినట్టు, తాతల్నీ, అమ్మమ్మల్నీ,నానమ్మల్నీ కూడా చేసేయాలంటారా, మా ఫ్రెండు కి తొందరలో చెప్పాలి..….

Advertisements

5 Responses

 1. Out dated,old horses too need phasing out,
  HARD BUT REAL FACTS OF LIFE.
  Mohan

  Like

 2. A very moving post, thanks for reminding all of us

  Like

 3. మోహన్ గారూ,

  ప్రతీవారికీ జీవితంలో ఇలాటివి తప్పవు. కానీ, మా ఫ్రెండు చెప్పింది విన్న తరువాత, అదృష్టం బాగుంటే, అలాటి పరిస్థితి రాకుండా వెళ్ళిపోతేనే బావుంటుందేమో అనిపిస్తుంది….
  చూద్దాం ఎవరి రాతలెలాగున్నాయో అలా జరగక తప్పదు కదా…

  Like

 4. నిజమేనండీ…. అలా అలోచిస్తే ఎందుకో ఒక్క క్షణం భయం వేసింది

  ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి కష్టపడి మనల్ని ఇంత పైకి తీసుకొచ్చిన వారిని అలా ‘ఇంక నీ అవసరం లేదు పో…’ అనడం ……

  Whatever goes around comes around
  లాగా మనకీ ఆ పరిస్థితి రాకుండా పోతుందా అనే అలోచన రానివ్వదేమో కొంతమందికి….

  Like

 5. మాధవీ,

  భయపడ్డంవల్ల లాభం ఏమీ లేదు..”Whatever goes around comes around
  లాగా మనకీ ఆ పరిస్థితి రాకుండా పోతుందా అనే అలోచన రానివ్వదేమో కొంతమందికి…” అన్నది మాత్రం నిజం…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: