బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– నాతో పెట్టుకుంటాడా…


   ఎప్పుడో అకస్మాత్తుగా మన ప్రభుత్వం వారికి, ఏదో ఆలోచనొచ్చేస్తూంటుంది. ప్రభుత్వం అంటే, అందులో పనిచేసే అధికారికన్నమాట. అప్పుడప్పుడు అనుకుంటూంటారనుకుంటాను, ఇలా చేస్తే బావుంటుందేమో, అలా చెస్తే బావుంటుందేమో, వగైరా వగైరా… లేడికి లేచిందే పరుగు కదా, ఓ సర్క్యులర్ మీద సంతకం పెట్టేసి జనం మీదకి వదులుతారు. అదృష్టం బాగుంటే అందరికీ తెలుస్తుంది, లేకపోతే ఓ దండం పెట్టడం. అలా వచ్చిందే “ఆధార్” కార్డు. ఓపికున్నవాళ్ళు వెళ్ళి క్యూల్లో నిలబడి, ఫుటోలూ అవీ తీయించుకున్నారు. మా ఇంట్లో నాదీ,అబ్బాయిదీ, మనవరాలిదీ, మనవడిదీ మొత్తానికి వచ్చేశాయి, ఇంటావిడదీ, కోడలుదీ రావాలి. అమ్మాయికీ, అల్లుడికీ ఫారాలిచ్చాను, వాళ్ళకి తీరికెప్పుడైతే అప్పుడు చేయించుకుంటారు. టైముండడం లేదు డాడీ అంటారు. కాని ఎప్పుడో ఓ రోజున ప్రభుత్వం వాళ్ళు, ఈ ఆధార్కార్డు లేకపోతే, గ్యాస్ సిలిండరు ఇవ్వమూ అనాలి, అప్పుడు మొదలవుతాయి ఉరకలూ, పరుగులూ. ఆ మధ్యన తణుకెళ్ళినప్పుడు, మా అత్తగారినడిగాను, ఆధార్ తీసికున్నారా అని. ఆవిడ తిప్పలావిడవీ, ఎవరో చెప్పారని, రిక్షాకట్టించుకుని ఎండలో వెళ్తే, రోజుకీ యాభయ్యే అని, పంపేశారుట. మరీ బ్రహ్మముహూర్తం లోనే లేచి, వెళ్ళలేరుగా పాపం,దాంతో ఆధార్ కార్డు కార్యక్రమం వెనకబడిపోయింది.ఎప్పుడో వాళ్ళుండే టీచర్స్ కాలనీకి వస్తే, ఎవరైనా దయతలచి చెప్తే, ఆవిడ ఓపిక చేసికుని వెళ్తే, ఆ “కార్యక్రమం” పూర్తవుతుంది.

   ఈ మధ్యలో గ్యాస్ కంపెనీ వాళ్ళకో ఆలోచనొచ్చింది. అదేదో SMS ద్వారా బుక్ చేసికోవాలిట. ముందుగా మన సెల్ ఫోను రిజిస్టర్ చేసికుని, దానితో పాటు,Consumer Number రిజిస్టర్ చేసేసికుంటే, మనకి గ్యాస్సయిపోయినప్పుడు ఓ మెసేజ్ పంపితే చాలుట. ఇదంతా Indane వారిది. అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న అని,Bharat Gas వాడు, అదేదో smart card తయారుచేశాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ smart carడులే కదా.

   ఈ సందర్భం లోనే మా CGHS వాళ్ళకీ ఓ “మంచి ఆలోచన” వచ్చేసింది. మన “జనా” లందరికీ కూడా ఓ smart card ఇచ్చేస్తే పోలే అని. ఆ సందర్భం లోనే ఆమధ్య ఓ టపా కూడా వ్రాశాను.దానంతేదో కొత్త సంవత్సరం లో తేల్చేసికోవాలని,వాళ్ళనీ, వీళ్ళనీ అడిగితే, తలోరూ తలో మాటా చెప్పారు. ఇంకా ఎప్లికేషన్లే ఇవ్వడం లేదూ దగ్గరనుండి, పాతదానితో పనైపోతుందీ దాకా, అయినా మనం అనుకుంటే పనైపోతుందా ఏమిటీ, ఎప్పుడో పాతకార్డు పనికిరాదూ, ప్లాస్టిక్కుదే ఉండాలీ అంటే, ఎక్కడ పరిగెత్తుతామూ. ఏదో ఓపికుందికాబట్టీ, మన ప్రభుత్వం వారి “వెర్రి మొర్రి” రూల్స్ తో పరిచయం ఇంకా ఉంది కాబట్టీ, ఏదో మనం బావున్నప్పుడే ఇలాటివేవో పూర్తి చేసేస్తే, తరువాత మన్నెవళ్ళూ తిట్టుకోరు. ఏదో ఈ కార్డోటుంటే, ఓ యాంబులెన్సు పిలవమని, ఎవరికి చెప్పినా, మనల్నీ కార్డునీ హాస్పిటల్లో పారేస్తారు. ఉత్తినే అవతలివాళ్ళకెందుకూ మన వైద్య ఖర్చులూ?

   ఈ కార్యక్రమం నిన్న మొదలెట్టాను. మేముండే చోటునుండి, పదిహేను కిలోమీటర్లు ఆ ఆఫీసు. ఏదో అదృష్టం బావుండి, సరైన ఎప్లికేషనోటి చేతిలో పెట్టాడు. అందులో మనం పెన్షన్ తీసికునే బ్యాంకు దగ్గరనుండి, ఓ సర్టిఫికేట్టూ, మన PPO( Pension Payment Order) కాపీ ఒకటీ, మన ఎడ్రస్ ప్రూఫూ, ఇవి కాకుండగా ఎవరైతే benificiary లో వారి ఫుటోలూ ( Stamp size only please..) రెండేసి, ఒకటి ఎప్లికేషన్ తోనూ, రెండోది ఓ కవర్ లో పెట్టీ, ఇవన్నీ పూర్తిచేసి, ఓ సంతకం పెట్టిఆ ఎప్లికేషనేదో మన మ.రా.శ్రీ. ప్రభుత్వం వారికి ఇస్తే, ఎప్పుడో వారికి దయ కలిగినప్పుడు, ఆ ప్లాస్టిక్ కార్డేదో మనకి ప్రదానం చేస్తారుట. మన అదృష్టాన్ని బట్టుంటుంది.

   నిన్న ప్రొద్దుట ఆ ఎండలో వెళ్ళి, ఎప్లికేషను తెచ్చుకున్న తరువాత, మధ్యాన్నం 2.00 కి మళ్ళీ ఆ ఎండలో బ్యాంకుకి వెళ్ళి, ఆ సర్టిఫికెట్టేదో సంతకమూ, స్టాంపూ వేయించేసికుని, పన్లోపనిగా, ఆ PPO కాపీమీదా ఎటెస్టు చేయించుకుని, సాయంత్రం ఫుటోఫాస్ట్ కి వెళ్ళి నేనూ, ఇంటావిడా విడివిడిగా ఫుటోలు తీయంచుకుని, మళ్ళీ అవికూడా దమ్మిడీ సైజులో కాపీలు తీసికుని, కొంపకి చేరాము.విడివిడిగా ఎందుకూ అంటే, ఇద్దరికీ ప్రత్యేకంగా కార్డిస్తారుట. ఇదొక్కటే బావుంది. ఏ కారణం చేతైనా భార్యాభర్తలు రెండు వేరువేరు నగరాల్లో ఉండవలసివచ్చినా, సమస్యుండదని, అంతేకానీ ఇచ్చారుకదా అని విడిపొమ్మని. కాదు !!

   నిన్న వెళ్ళినప్పుడు చూశానుగా, ఆ ఆఫీసు పదికి తెరుస్తారు, ఒంటిగంటకి కట్టేస్తారు.క్యూలో ముందరే ఉంటే పనైపోతుందని, తొమ్మిదింటికల్లా వెళ్ళాను. అక్కడ మరీ రైల్వే రిజర్వేషనూ, బ్యాంకుల్లోలాగ, సినియర్ సిటిజెన్ క్యూలు వేరే ఉండవు. వచ్చే “పక్షు” లందరూ ఒకే “జాతి” వారవడం వల్ల.క్రమక్రమంగా జనాలు వచ్చి బెంచి మీద కూర్చుంటూంటే, అదో “తుత్తీ”, అబ్బ మనం ఎంత “తెలివైనవాళ్ళమో” అని! మొత్తానికి పదింటికి ఒకతను వచ్చాడు. అంతకుముందు పరిచయం ఉండడం తో, పరిచయం ఉండక ఛస్తుందా, ఒకే ఆఫీసుకి రెండు మూడు సార్లు వెళ్ళగా వెళ్ళగా అదే అవుతుంది. నాలాటివాడైతే మరీనూ…నా ఎప్లికేషను ఓసారి అటూ ఇటూ తిప్పి, నా ఎడ్రసు ప్రూఫూ, నేను అంటించిన ఫుటోలూ ఎటెస్టు చేయలేదన్నాడు. ఓరినాయనో మళ్ళీ అంతదూరం వెళ్ళాలా అనుకుని, ఓ వెర్రిమొహం పెడితే, పాపం తనే ఓ “ శాపవిమోచన” మార్గం చెప్పాడు. వాళ్ళ ఎడ్మిన్ ఆఫీసర్ చేత చేయించేసికో అని! పాపం ఆయనకీ వీళ్ళకీ ఏం గొడవలో!!ఏం పనీ పాటాలేకుండా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడూ, వీళ్ళందరినీ ఆయనమీదకు వదిలితే, ఒక్క రోజైనా పని చేస్తాడూ అని కాబోలు !! సరే అని ఆ ” పెద్ద మనిషి” దగ్గరకు వెళ్తే, అనుకున్నట్టుగానే ఎవరితోనో కబుర్లు చెప్పుకుంటున్నాడు, నేను ఫలానా, నాకో సంతకం కావాలీ అనేటప్పటికి, చూస్తున్నావుగా ఎంత బిజీగా ఉన్నానో, అని ఓసారి కోప్పడేసి మళ్ళీ కబుర్లలోకి దిగాడు. ఏం చేస్తాం అవసరం మనదీ, ఎవడి కాళ్ళైనా పట్టాల్సిందే. కొంతమందికదో ఆనందం, తమకోసమని ఎంతసేపు వెయిట్ చేయిస్తే అంత గొప్పా అనుకుంటారు.ఈ భోగం అంతా డ్యూటీలో ఉన్నన్నాళ్ళే. రిటైరయిన తరువాత తెలుస్తాయి పాట్లు. ఓ రెండు సంతకాలకోసం నన్ను అరగంటా వెయిట్ చేయించాడు. ఇలా ఉందా నాయనా ఇంతకింతా అనుభవిస్తావు, అని “శాపం” పెట్టేసి (అదొకటే కదా మనకొచ్చిందీ), రూమ్ములోకి వెళ్ళి, ఆ ఎడ్రస్ ప్రూఫ్ ని ఎటెస్ట్ చేయించి, మా ఇద్దరి ఫుటోలూ కూడా చేయమంటే, మీరీవరో నాకేం తెలుసూ, చెయ్యను ఫో అన్నాడు.దొరికావురా నాయనా, నేనూ అదే అంటే, అక్కడ మీ ఆఫీసులో వాళ్ళు, కుదరదంటున్నారు. మరి అలాటి దరిద్రపు రూల్సెందుకూ, ఏదో ఓ సంతకం పడేయ్, వాళ్ళే చూసుకుంటారూ అని బలవంతం పెట్టేసరికి, ఏమనుకున్నాడో ఏమో పెట్టేశాడు.

   ఈ కాగితాలన్నీ తీసికుని మళ్ళీ ఆఫీసుకెళ్ళేటప్పటికి, పేద్ద క్యూ ఉంది. ఎలాగో తిప్పలు పడి, మొత్తానికి పదకొండున్నరకి, నా కాగితాలన్నీ సబ్మిట్ చేసి, ఓ రసీదు తెచ్చుకున్నా. ఓ మూడు నెలల తరువాత ఇస్తారుట!! పనైపోయిందిగా, ఆ “శాపం” వ్యవహారమేదో చూడొద్దూ, ఆ క్యూలో ఉన్న ప్రతీ వాళ్ళకీ వాళ్ళిచ్చిన కాగితాల్లో, అదేదో లేదూ, ఇదేదో ఎటెస్ట్ చేయలేదూ అనడమే. దొరికాడురా బాబూ, అనుకుని అడిగినవాడికీ, అడగని వాడికీ, ” ఆ పక్క రూమ్ములో ఉన్నాడే, ఎడ్మిన్ ఆఫీసరూ, ఆయన దగ్గరకు వెళ్ళండి, పాపం మంచివాడు, చేస్తాడూ…” అని చెప్పడం తో పొలో మని జనాలందరూ ఆయన రూమ్ములో క్యూ కట్టేశారు. చచ్చినట్టు ఎటెస్ట్ చేయొద్దూ మరీ? వదిలింది రోగం, నాతో పెట్టుకుంటాడా.

    పోస్టాఫీసుల బయట కూర్చునుంటారు చూశారా, మనీ ఆర్డర్ ఫారాలు నింపేవాళ్ళు, అలాగ ఈవేళ ఆ CGHS ఆఫీసు దగ్గర నుంచుని, చాలామందికి, వారి వారి ఫారాల్లో ఉండే లోటుపాట్లూ వగైరా చెప్పి, ” జ్ఞానోదయం” చేసి వచ్చాను!! ఎంతైనా ఇదోటి తెలిసిందిగా. ఈ టపా కూడా అందుకోసమే. పాఠకుల్లో ఎవరైనా, వారు కానీ, వారి తల్లితండ్రులు కానీ, ఎవరికైనా ఈ CGHS ఫెసిలిటీ అంటూ ఉంటే, ఈ పనేదో తొందరగా చేసేయండి. ఏదో నాకు తెలిసిందేదో చెప్పాను, తరువాత మీ ఇష్టం….

Advertisements

2 Responses

  1. ఆధార్ కార్డు ఉపయోగం ఏమిటో అది ఎలా పనికొస్తుందో శ్రీ గవర్నమెంట్ మహాశయులు మనకు ఇంకా తెలియ చెప్పనే లేదు మరి, వాటిలో లోపాలు చుస్తే కోకొల్లలు, శ్రీ నందన్ నిలేఖని గారి చలవో మరి శ్రీ మన్మోహన్ గారి చలవో దేశం లో చాల కంపెనిలు ఈ ఆధార్ కార్డు పుణ్యమా అని అంతో ఇంతో సంపాదించేసారూ.

    Like

  2. రీడ్ గుడ్,

    ఏదో ఒకటీ పోనిద్దురూ. ఎప్పుడో ” రేపణ్ణించి ఆధార్” కార్డులేనివాళ్ళకి గ్యాస్ ఉండదూ అని ఓ ప్రకటన చేస్తే, ఎక్కడకి పరిగెడతాం >>>>

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: