బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఈ నాలుగురోజులనుండీ టపాలు పెట్టలేదు. నేనిన్నాళ్ళూ వాడుతున్న రిలయన్స్ వాళ్ల బ్రాడ్ బాండ్ దానికి తోచినప్పుడు, ఓ వేళా పాళా లేకుండా, స్పీడ్ జీరోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రారంభం అవడం తనకి తోచినప్పుడే మరి. ఇంక ఇది పని కాదని, బి.ఎస్.ఎన్.ఎల్ వాళ్ళది తీసికుందామనుకున్నాను. రాజమండ్రీ లో ఉన్నప్పుడు పాపం వెర్రిది, చాలా విశ్వాసపాత్రంగా పనిచేసింది. ఈమధ్యనే ల్యాండ్ లైన్ కూడా వచ్చిందేమో, పోనీ వాళ్ళ బ్రాడ్ బాండ్ కూడా తీసికుంటే పోలే అనిపించింది. ఇదేమీ స్వంత ఐడియా కాదనుకోండీ, ఇంటావిడ ఎప్పుడో చెప్పింది, అయినా మీకు తెలుసుగా, నాదంతా ట్యూబ్ లైట్ వ్యవహారమాయె, కొంత టైముపడుతుంది, “వెలగడానికి”! ఒకసారి వెలిగిందీ అంటే చాలు, ఆగడం లేదు. ఎప్లికేషనిచ్చేటప్పుడు, ఇదివరకటిలా ఏమైనా డబ్బులు కట్టాలేమో అనుకున్నాను. అఖ్ఖర్లేదుట, మొదటి బిల్లులో వేస్తారుట. ఆ “మొదటి బిల్లు” అనేదెప్పుడు వస్తుందో అంతా దైవాధీనం! నా ల్యాండ్ లైన్ డిశంబరులో తీసికుంటే, మార్చ్ దాకా రాకపోతే, మళ్ళీ కట్ చేసేస్తారేమో అని ఆఫీసుకెళ్ళి డూప్లికేట్ జనరేట్ చేయించుకుని కట్టొచ్చాను. ఇంతాచేసి, మర్నాడు ఆ బిల్లు కాస్తా రానే వచ్చింది.ఇలా ఉంటుందండి మరి. ఏం చేస్తాం? పోనీ ఆన్ లైన్ లో కట్టేద్దామా అనుకుంటే, వాటన్నిటినీ లెఖ్ఖలోకి తీసికోకుండా, తడిపి మోపెడు బిల్లేస్తారు. అదీ అనుభవం అయింది. బి.ఎస్.ఎన్.ఎల్ వాళ్ళని ఏమీ అనకూడదూ, మా ఇంటావిడ కొత్త పుట్టింటారాయే ( అర్ధం అయిందనుకుంటా). ఏమిటో అన్నీ గందరగోళాలే!!

   ఎప్లికేషనిచ్చేటప్పుడే చెప్పారు, మోడెమో, మొండెమో అదేదో మనమే తెచ్చుకోవాలట. ఇదివరకే బాగుండేది, హాయిగా ఓ వెయ్యి రూపాయలు కట్టించేసికుని, వాళ్ళే ఏదో చేసేసేవారు. ఈ “రాజా” ల గొడవలు మొదలయినప్పటినుంచీ, టెండర్లే పిలవడం లేదుట. వాళ్ళకేం పోయిందీ, మనక్కదా కష్టాలూ.రెండు రోజులు పోయిన తరువాత అడిగితే, నీ బ్రాడ్ బాండ్ వచ్చేసిందీ, మోడెం తెచ్చుకున్నావా అన్నారు. బిఎస్ ఎన్ ఎల్ వాళ్ళిచ్చిన వెండర్లకి ఫోను చేస్తే, వాళ్ళేమో వైర్ లెస్ ది 2000, వైరూ వైఫై ఉన్నది 3000 అన్నారు.మరీ అంతెందుకూ అనుకుని, నాకు తెలిసిన ఇంటిపక్కనుండే వాడినడిగి, ఓ మోడెం తెప్పించుకున్నాను. తీరా దాని ప్యాకెట్టు తెరిస్తే తెలిసిందేమిటంటే, అది వీళ్ళ వైర్డ్ దానికి కంపాటిబుల్ కాదూ అని. మళ్ళీ కొట్టువాడిదగ్గరకు వెళ్ళి ఇది కాదు నాయనా, అదేదో ADSL కావాలిట అన్నాను. ప్యాకెట్టు తెరిచేశావూ అంటాడేమో అనో భయం, మరీ కోప్పడకుండా, కొత్తది తెచ్చి ఇచ్చాడు. ఆ బి.ఎస్.ఎన్.ఎల్ వాడేమో, exchange కే తీసుకుని రండీ, మీకు Installation charges పడవూ అన్నడు. ఎంతైనా వెధవది మధ్యతరగతి మనస్థత్వాలూ, పోన్లే ఏదో కొంత తగ్గుతుంది కదా అని, అక్కడికే వెళ్ళి వాడి నెత్తిమీద కూర్చున్నాను.

    ఏదో అదీ ఇదీ చూసి, ఏవేవో నొక్కి, మొత్తానికి ఆ కాన్ఫిగరేషనేదో చేసేసి చేతిలో పెట్టాడు. దీన్నేం చేసికోనూ నాయనా అంటే, పాపం ఏమేం చేయాలో వివరంగా చెప్పి పంపాడు. ఆ గొడవలన్నీ నాకెక్కడ తెలుసూ, పోనీ అబ్బాయిని అడిగితే పోలే అనుకుని, తనకి ఫొను చేస్తే ఈవేళొచ్చి చేస్తానన్నాడు. అయినా, నేనా ఊరికే కూర్చునేదీ, ఇదేమైనా బ్రహ్మవిద్యా ఏమిటీ అనుకుని ( పైగా మా ఇంటావిడ చెప్పేధైర్యమోటీ..), అదీ ఇదీ కెలికి, మొత్తానికి ఆ మోడెం లో బ్లింకులదాకా వచ్చానండి. అదేదో కనెక్టవడానికి, అదేదో పోర్టలో ఏదో కావల్సుంటుందని ఎక్కడో విన్నాను. కనెక్టు చేయాలంటే ముందుగా నొక్కడానికి ఏదో ఒకటి కావాలికదా, అదన్నమాట… మొత్తానికి దాన్ని కూడా వెదికి పట్టుకుని, తీరా కనెక్ట్ మీద నొక్కితే,దీనిల్లుబంగారం గానూ, కనెక్టవదే… మళ్ళీ ఇదో గొడవా. అబ్బాయికి ఫోను చేసి చెప్తే అన్నాడూ.. “వచ్చి చేసిపెడతానన్నాను కదా, మరీ అంత తొందరెందుకూ, రేపొచ్చి చేస్తానూ..” అన్నాడు. అయినా ఏమిటో ఇలా అయిపోయిందీ అనుకున్నాను. మాకు అలవాటేలెండి, ఇంట్లోకి ఏ కొత్త వస్తువు తెచ్చినా సరే, మొదటి రోజు ఏదో ఒక తిప్పలు పెడుతూనే ఉంటుంది. ఇది మాత్రం తక్కువ తిందా ఏమిటీ?

   ప్రొద్దుటే అబ్బాయొచ్చి స్టార్ట్ చేసి, అదేమిటి డాడీ, కనెక్టయే ఉందిగా అన్నాడు… అందుకే అన్నాను, ఏ విషయమైనా పూర్తిగా తెలియనైనా తెలియాలి, లేదా ఎవరైనా చెప్తేనైనా వినాలి, కానీ ఈ వయస్సొచ్చిన తరువాత కొంచం కష్టమే కదూ… ఆ బి.ఎస్ ఎన్.ఎల్ అతను చెప్పనే చెప్పాడు, ఇంటికి తీసికెళ్ళి దేని “చిల్లు” లో దాన్ని పెట్టండీ, హాయిగా బ్రౌజ్ చేసికోండీ అని. వింటేగా… ఇదండి విషయం.ఇటుపైన కనెక్టివిటీ గొడవ లేకుండా, హాయిగా టపాలు వ్రాస్తానని ఆశిస్తున్నాను…

    రేపు ఉగాది కదా, ఏదో మామిడాకులూ, వేప్పువ్వూ తెద్దామని బజారుకెళ్ళాను. చెరుగ్గడ, బెల్లం,పువ్వులూ, మామిడికాయా ప్రొద్దుటే తెచ్చేశాను. ఇద్దివరకటి రోజుల్లో ఎప్పుడైనా ఇలా బజార్లలో కొనుక్కునేవాళ్ళమా? ఎక్కడ చూసినా మామిడిచెట్లూ, వేపచెట్లూనూ. ఇప్పుడు తుపాగ్గుండుక్కూడా దొరకడం లేదు. వాడిచ్చే నాలుగు రొబ్బలకీ పదేసి రూపాయలడుగుతాడు. అయినా మానుతామా ఏమిటీ? మన దౌర్భాగ్యం ఏమిటంటే, తోరణాలకి కట్టే మావిడాకులుకూడా కొనుక్కోవలసిరావడం… మేరా భారత్ మహాన్

అందరికీ నందననామ సంవత్సర శుభాకాంక్షలు….

Advertisements

5 Responses

 1. అయ్యా ఫణిబాబు గారు,

  మీకున్నూ ఉగాది శుభాకాంక్షలు ! ఇక మీ బాతా ఖానీ కబుర్లు , ‘వైర్లేస్స్’ వయ్యారాలు , వగలమారి దాని టెక్కులు వున్నది చూసారూ… అది నందన ఆనంద తపకీ ‘తుపాకీయం!’

  చీర్స్
  జిలేబి.

  Like

 2. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు….

  Like

 3. పణిబాబుగారు మీ మోడెమ్ గొడవ చదివేను. నిన్న మా ఆవిడ పండగ క్లీనింగంటూ కంప్యూటర్ కూడా మోడెమ్తో సహా బాగా తుడిచే సరికి
  నే ఓపెన్ చేయగానే కనెక్టవదే ! మామాలూగా “పద్మా” అంటూ అరచి చివరికి చూస్తే ఓ కనెక్షన్ ఊడిపోయింది. అది సరిచేస్తే పనిచేసింది. అదీ
  మా కధ. మీరెప్పుడూ మీ చెల్లినే సపోర్ట్ చేస్తారుగా ! మీకు మీ అబ్బాయి ,అమ్మాయి వాళ్ళ కుటుంబాలకూ మా ఉగాది శుభాకాంక్షలు.

  Like

 4. Wish u all a happy ,healthy and prosperous UGADI
  Waiting for ur new posts in the NEW YEAR

  Like

 5. @జిలేబీ,

  ధన్యవాదాలు.

  @మాధవీ,

  థాంక్స్…

  @గురువుగారూ,

  మొత్తానికి బి.ఎస్.ఎన్.ఎల్ వారి సౌజన్యంతో, కొత్తమోడెమూ,అస్తమానూ ఆగిపోకుండా, మంచి నెట్ స్పీడూ ప్రస్తుతం అంతా బాగానే ఉంది…

  @డాక్టరు గారూ,

  ధన్యవాదాలు. రాద్దామనే అనుకుంటున్నాను. కానీ “వాతావరణం” కూడా బాగుండాలి కదా…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: