బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— నీళ్ళు…….


    రోజూ ట్యాప్పు తిప్పితే వస్తూండడంతో ఈ నీళ్ళకున్న ప్రాముఖ్యతా, అవసరం మనకి గుర్తుండదు. ఎప్పుడో టుపుక్కున ఆగిపోయేసరికి ఇంక రోజంతా ఆ నీళ్ళ గురించి చర్చలే. అందులోనూ నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఎపార్టుమెంట్లలో, అవీ బహుళ అంతస్థులాయే, నీళ్ళు రాకపోయేసరికి, వీధిన పడిపోతాము. బిజీబిజీగా ఉండే జీవితం లో, పెద్దాళ్ళు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్ళకీ తయారయి వెళ్ళవలసిన సమయం లో ఇలాటిదేదో జరిగిందంటే ఇంక అడగఖ్ఖర్లేదు. అప్పుడొస్తాయి గొడవలన్నీనూ. ఆ సొసైటీ సెక్రెటరీ మీదో, ఛైర్మన్ మీదో ఎగరడం మొదలెడతారు. వాళ్ళు మాత్రం తక్కువా ఏమిటీ, “Society maintainance charges ఇవ్వాలని గుర్తుండదు కానీ, నీళ్ళు రానప్పుడూ, లిఫ్ట్ పనిచేయనప్పుడూ మాత్రం గుర్తొస్తూంటాము“.అని వాళ్ళూ ఛాన్సొచ్చిందికదా అని,ఘాటుగా జవాబిస్తారు. అక్కణ్ణించి ప్రారంభం, ఎపార్ట్మంట్లలో పాలిటిక్స్, “ఈ దరిద్రపు కమెటీకి అసలు శ్రధ్ధే లేదండీ, ఇదివరకు మేముండే సొసైటీలో నేను సెక్రెటరీగా పనిచేశాను, అక్కడికెళ్ళడగండి ఎలా ఉండేదో. ఓ ప్లానూ, టైంఫ్రేమూ ఉండాలండి బాబూ. అసలు చెప్పాలంటే అదో specialised skiల్లండి బాబూ. ప్రతీవాడికీ రాదు…వగైరా వగైరా”.. వినాలి.Society maintainance charges defaulters లో ఈ మాజీ సెక్రటెరీగారి పేరు మొదట్లోనే ఉండొచ్చు, అది వేరేసంగతనుకోండి. అసలు గొడవంతా ఎక్కడొచ్చిందీ అంటే, క్రితం సారి సొసైటీలో జరిగిన ఎలెక్షన్ లో ఈయనగారి సంగతి ఎవడూ పట్టించుకోలేదు.

ఇంకోటేమిటంటే, టైముకి నీళ్ళురాకపోయేసరికి, ముందుగా బలైపోయేవాడు ఆ సొసైటీ వాచ్మన్. నిన్న మా సొసైటీలో నీళ్ళు రాకపోయేసరికి, మోటార్ ఆన్ చేయలేదూ అని, అతనిమీదే పెట్టేశారు. విషయం తెలిసికోకుండా పెద్ద గొప్పగా నేనూ, నాటపా లో వ్రాసేశాను.అసలు జరిగిందేమిటంటే, మా పూణె/ చించ్వాడ్ కార్పొరేషన్లవాళ్ళు, నీళ్ళ సరఫరాలో కటౌతీ పెట్టారుట.ఆ వాచ్మన్ అసలు నీళ్ళేరాలేదు మొర్రో అంటే వినిపించుకోరే. ఏదో మొత్తానికి ఒకళ్ళనొకళ్ళు కోప్పడేసికుని, ఒకటో రెండో ట్యాంకర్లు తెప్పించారు. జనాలు తెలివిమీరిపోయారు, ఆ ట్యాంకర్ వచ్చీరాగానే, ఎవరికి తోచింది వాళ్ళు ఇంట్లో ఉన్న గిన్నెల్లోనూ, బకెట్లలోనూ, గ్లాసుల్లోనూ నీళ్ళు నింపేసుకునేసరికి, అరగంటలో ఖాళీ అయిపోయింది. ఆఫీసులకెళ్ళే హడావిడిలో ప్రొద్దుటే, ట్యాప్పులు తెరిచేసి ఉంచడం ధర్మమా అని, కొన్ని తాళాలున్న ఫ్లాట్టుల్లో నీళ్ళన్నీ గట్టర్ లోకి వెళ్ళాయి.ఆతావేతా జరిగిందేమిటంటే ట్యాంకు ఖాళీ..ఆ తాళం వేసి, ట్యాప్పులు తెరిచేసిఉంచిన వాళ్ళమీద అవాకులూ చవాకులూనూ.

ఇదివరకటి రోజుల్లో నీళ్ళకెప్పుడూ కరువుండేది కాదు, ఏదో వర్షాల్లేని కొన్నిప్రాంతాల్లో తప్ప. హాయిగా పెరట్లో ఓ నుయ్యుండేది, ఓ చేదా,దానికో చేంతాడూ, ఎప్పుడైనా నూతిలో పడిపోతే దాన్ని తియ్యడానికి ఓ గేలమూ, దాన్ని periodical గా ఓసారి దాంట్లోకి ఎవడో దిగి, మట్టి తీసేవాడు.ఆ టైములో ఎప్పుడో నూతిలో పడ్డ చెంబులూ, గ్లాసులూ, బంతులూ ఒకటేమిటి, సింధునాగరికత టైములో ఉండే ప్రతీ వస్తువూ దొరికేది. ఇంక ఆ నూతుల గురించి, చుట్టుపక్కల ప్రతీవాళ్ళూ చెప్పుకోడమే, ఫలానా వారి నూతిలో నీళ్ళు ఎంత రుచిగా ఉంటాయో అనీ, ఫలానా వాళ్ళింట్లో నీళ్ళు ఉప్ప రొడ్డండి బాబూ అనో… ఏదో ఆ నూతినీళ్ళకీ ఓ పేరొచ్చేసేది. కాలక్రమేణా, ఆ నూతులూ ఎండిపోవడం ప్రారంభం అయింది. జనాభా పెరిగేకొద్దీ అవేవో “రక్షిత మంచినీళ్ళ పథకాలు” ప్రారంభం అయి, కుళాయి చెరువులు, తరువాత్తరువాత Overhead Tank లూ తయారయ్యాయి. వీధికో కుళాయీ, ప్రతీ రోజూ నీళ్ళొచ్చే టైముకి, అక్కడ పెద్ద పెద్ద క్యూలూ, దెబ్బలాటలూ ఒకటేమిటి కావలిసినంత హడావిడి.స్థోమతున్నవాళ్ళు ఇళ్ళలోకి కుళాయిలు, హాయిగా tap తెరిస్తే నీళ్ళొచ్చేసేవి. మనుష్యులూ సుఖానికలవాటు పడ్డారు.

కాలక్రమేణా ఇళ్ళూ,స్థలాలూ అమ్మేసికుని ఎపార్ట్మెంట్ కల్చరొచ్చేసరికి, ముందుగా ఓ బోరు బావోటి తవ్వేవాడు. దాంట్లోంచి వచ్చే నీళ్ళతోనే కట్టాలికదా మరి, ఆ బహుళంతస్థుల భవనాలు. మనం ఏ ఫ్లాట్టో బుక్ చేసికోడానికి వెళ్తే ముందుగా అడిగేది నీళ్ళ గురించేకదా. వాడు స్వర్గం చూపించేస్తాడు. తాగడానికి కార్పొరేషన్ నీళ్ళూ, బ్యాకప్పుకి బోరింగూ అని, ఆ బోరుబావిదగ్గరకు తీసికెళ్ళి మన తల పట్టుకుని, దాంట్లోకి వంచేసి మరీ చూపించేస్తాడు. ఆ చీకట్లో కనిపించకపోయినా సరే నిజమే కాబోసనుకుంటాము.ఆ బోరుబావిలో నీళ్ళు ఓ ఏడాదిపాటు వస్తాయి. కనిపించిన ప్రతీవాళ్ళతో చెప్పుకోడం, మా సొసైటీలోనండీ అస్సలు water probleమే లేదండీ,అసలు అందుకోసమే నేనిక్కడ తీసికున్నాను అంటూ.. పైగా కనిపించినప్పుడల్లా పరామర్శ చేయడం ఓటీ “ఏమిటీ ఎలా ఉన్నారూ నీళ్ళూ అవీ వస్తున్నాయా లేక ఇంకా బయట ట్యాంకర్లేనా”.. అంటూ. ఈ ముచ్చట ఓ కొద్దిరోజులుంటుంది. అదేం ఖర్మమో, సొసైటీ లోని అన్ని ఫ్లాట్ట్లూ occupy అయి, సొసైటీ ఫార్మ్ అయ్యేటప్పటికి, ఆ బోరింగు కాస్తా ఎండిపోతుంది. కార్పొరేషన్వాళ్ళిచ్చే నీళ్ళే గతి. వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకుని, ఎంతో కొంత తినిపించిన తరువాత, అదేదో ఒన్ ఇంచ్ లైనో, టు ఇంచ్ లైనో వేస్తారు.

పొనీ ఏదోలాగ హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా నీళ్ళొస్తున్నాయి కదా, వాటినైనా సరీగ్గా ఉపయోగించే జ్ఞానం ఉందా అంటే అదీ లేదూ. ఇదివరకటి రోజుల్లో గుర్తుండే ఉంటుంది, ఓ చెంబెణ్ణీళ్ళు పట్టుకుని వెళ్తే పనై పోయేది. మరి ఇప్పుడో ఫ్లషులూ గొడవానూ. పైగా ఒకసారి కొట్టేటప్పటికి, రెండో మూడో బకెట్ల నీళ్ళు గోవిందా! ఏమైనా అంటే హైజీనూ, సింగినాదమూనూ. హైజినిక్ గా ఉండాలి, కాదనడం లేదు, కానీ మరీ అంత లగ్జూరియస్ గా ఉంటే నీళ్ళెక్కణ్ణించొస్తాయి? ఇదివరకటి రోజుల్లో, ఓ గ్లాసుడు నీళ్ళో,ఓ బుల్లికప్పుడు నీళ్ళో పెట్టుకుని, ఓ అద్దం చేతిలో పట్టుకుంటే, హాయిగా గెడ్డం గీసుకోడం అయిపోయేది. మరి ఇప్పుడో ఓ వాష్ బేసినూ, దానికో ట్యాప్పూ, పైనో అద్దమూ, దానెదురుగుండా మనం ఓ షేవరో, ఏదో పట్టుకుని షేవింగు చేసికోడం, చేసికున్నంతసేపూ కింద ట్యాప్పు లోంచి నీళ్ళు అలా పోతూనే ఉంటాయి. మరి ఆ నీళ్ళన్నీ, ఎవడు వాడినట్టూ? ఇలాగేదైనా అంటే, పాత చింతకాయ పచ్చళ్ళా ఉంటుంది. ఇంక స్నానాలకొస్తే, ప్రతీ వాళ్ళూ పురిటి స్నానం లాగానే చేయడం. గంటల తరబడి. మళ్ళీ హైజీనే..

అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే, ఎక్కడో ఎవడో పేపర్లో చూస్తాడు, ఫలానా రోజున నీళ్ళుండవూ అని. ఛస్తే ఇంకోడితో చెప్పడు, ఇంట్లో ఉన్న గిన్నెల్లోనూ,బకెట్లలోనూ, వీలుంటే సింటెక్స్ ట్యాంకుల్లోనూ నీళ్ళు నింపేసికోడం, నీళ్ళు లేవని ఏడుస్తున్నవారిని చిద్విలాసంగా చూస్తూ, “అర్రే పేపర్లో చూళ్ళేదా నీళ్ళు రావని వ్రాశారూ..” అంటూ, తనేదో గొప్ప పని చేశాడని చూడ్డం. పోనీ ఆ పట్టుకున్న నీళ్ళైనా సద్వినియోగం చేస్తాడా అంటే అదీ లేదూ, మళ్ళీ నీళ్ళు రావడం మొదలెట్టగానే, ఈ పట్టిన నీళ్ళన్నీ పారపోస్తాడు. అదో పైశాచికానందం మరి.

ఇలా రాసుకుంటూ పోతే కావలిసినన్నున్నాయి. అందరికీ తెలియదా అంటే తెలుసునూ అనే అనాలి. కొంపలో నీళ్ళు రానప్పుడే గుర్తొస్తాయి ఇలాటివన్నీ. మళ్ళీ మామూలే..

అమ్మయ్యా ఓ గొడవొదిలిందండి బాబూ.. సచిన్ వందో సెంచరీ పూర్తిచేశాట్ట. మనందరమూ కిరికెట్టు చూడ్డం మానేయొచ్చు… మనవాళ్ళు ఓడిపోయారనుకోండీ, అదేమీ అంత importanటా ఏమిటీ? అయినా ఇదేమైనా కొత్తా ఏమిటీ……
Life goes on and on....

Advertisements

4 Responses

 1. 🙂

  Reg:Sachin – avunaa naku teleelede…

  Like

 2. టపా టైటిల్లో ‘క’ మిస్సింగ్ అండీ!!

  జిలేబి.

  Like

 3. బాబాయి గారూ…అదిరిపోయే పోస్టు. మీరు భలే రాస్తారు….

  ఇంక స్నానాలకొస్తే, ప్రతీ వాళ్ళూ పురిటి స్నానం లాగానే చేయడం. గంటల తరబడి. మళ్ళీ హైజీనే..
  🙂
  Ramu
  apmediakaburlu.blogspot.com

  Like

 4. @మాధవీ,

  థాంక్స్…

  @జిలేబీ,

  పరిస్థితులు చూస్తూంటే “నిజమే” అనిపిస్తోంది…

  @రామూ,

  చిరకాల దర్శనం…. మీ థీసిస్ కి కంగ్రాట్యులేషన్స్….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: