బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– తెలియకపోతే నోరుమూసుక్కూర్చోవాలి….

    మనకి ఏదైనా తెలియదనుకోండి, నోరుమూసుక్కూర్చోవాలి కానీ, ఊరికే వెధవ్వేషాలు వేయకూడదూ అని ఇన్నేళ్ళకి నేర్చుకున్నాను… మాకు ప్రయాణంలో సౌకర్యంగా ఉంటుందని అల్లుడూ, అమ్మాయీ ఓ 3G Tab ఇచ్చేరని చెప్పానుగా, ఏదో సంసారపక్షంగా, నాకు తెలిసిన ( అనే అపోహ !) మెయిల్స్ చెక్ చేసికోడం తో ఊరుకోవచ్చుగా, అబ్బే, మనవైపు వెళ్ళినప్పుడు, అందరికీ మనం అంతర్జాలం లో చేస్తున్న ఘనకార్యాలు చూపించుకోవద్దూ మరి, నా కొత్త ఆటవస్తువు లో నా టపాలు వస్తున్నాయో లేదో చూద్దామని, అనుకుంటే అవేవో బాక్సులు వచ్చాయి. ఓరినాయనో నా 774 టపాలు ఎక్కడికెళ్ళిపోయాయి దేముడో అనుకున్నాను. పొనీ పిల్లలని అడగొచ్చుగా, అబ్బే నామోషీ.. అప్పటికీ ఇంటావిడంటూనే ఉంది, ఓసారి అడక్కూడదూ పోనీ అని..ఇంటావిడ చెప్పినవి వింటే ఎప్పుడో బాగుపడుండేవాడిని, కానీ ‘రాసి’పెట్టుండాలిగా.

   నేను ఎక్కడైతే ఆ సిమ్ కార్డు తీసికున్నానో, వాణ్ణడిగాను. వాడేమో నాకంటే భభ్రాజిమానం, ఇందులో ఇంగ్లీషు తప్ప ఇంకో భాష రాదూ అన్నాడు. నేనేమో గొప్పగా మా ఇంటావిడతో చెప్పేశాను. పోనీ అంతటితో ఊరుకోవచ్చుగా, అక్కడికేదో అన్నీ తెలిసున్నట్టు ఇంటికొచ్చి నెట్ లో వెదికితే, అసలు దీనికున్న OS లో ఇంకోభాష రాదూ అనుంది. ఓహో కాబోసూ అనుకున్నాను. ముందర ఈ OS అంటే తెలియదు, నాకు తెలిసిన OS గవర్నమెంటులో ఆఫీసు సూపర్నెంటు మాత్రమే, ( 42 సంవత్సరాల ఉద్యోగ ధర్మమా అని నేర్చుకున్నది), అప్పుడెప్పుడో రెహమాన్ ధర్మమా అని OS అంటే ఏమిటో తెలిసింది.

    ముందర నా 3G Tab లో ఉన్నదేదో తెలిసికుందామని చూస్తే అదేదో android ట !androiడో, ఎండ్రగబ్బో ఏదో సింగినాదం, దానిగురించి చదివాను. ఏతావాతా తేలిందేమిటీ అంటే
నాకు దీనిలో తెలుగులో చదివే యోగం లేదనిన్నూ, ఎప్పుడో వస్తుందీ అనీన్నూ. ఇదికూడా మిడిమిడిజ్ఞానం లోకే వస్తుంది. నాజ్ఞానబోధలు వినడానికి ఇంటావిడోత్తుందిగా, ఆవిడకి జ్ఞానబోధ చేస్తే, ఏదో మొహమ్మాటానికి, “అవునా పాపం, పోన్లెండి, మీకు తెలుగులో చదివే వీలుగా, పిల్లలుపయోగించేదేదో కొని పెడతానులెండి” అంది. పోన్లే ఇదీ బాగానే ఉందీ అనుకున్నా.మార్కెట్ కెళ్ళి చూస్తే ఈమధ్యన వచ్చే కొత్త ఫోన్లలో ఏదో యాపిల్ వి తప్ప మిగిలినవాటన్నిటికీ OS ( ఇదోటి తెలిసింది కదూ !!) ఈ android ఏట. ఇంకెందుకూ భాగోతం, ఉన్నది చాలకా అనుకున్నాను.
.

    పోనీ ఇంత హడావిడి జరుగుతున్నా, ఇంట్లో అబ్బాయున్నాడూ, తన్ని ఓసారి అడిగితే పోలేదూ అన్న ఆలోచన వచ్చిందా, అబ్బే అలాటిదేదీ రాలేదు. మనం అడిగితే చెప్తారు కానీ, అడక్కుండా మన వ్యవహారాల్లో వాళ్ళెందుకు వేళ్ళేడతారూ? ఇందులో మెయిల్ పంపడం ఓటొచ్చింది కదా అని అమ్మాయికి ఓ మెయిల్ పంపాను. పాపం తనుకూడా, సంతోషించింది,ఏదో డాడీ కి కాలక్షేపంగా ఉంటుందీ ప్రయాణం లోనూ అని. అప్పుడు చల్లగా చెప్పాను తనకి ఇందులో తెలుగు రావడం లేదమ్మా అని. దానితో ఊరుకోక ఇంకా నాకున్న మిడిమిడిజ్ఞానంతో, ఈ android లో తెలుగు enabled కాదుటా, టెక్నాలజీ బ్లాగుల్లో చదివానూ అంటూ ఉన్నవీ లేనివీ కోసేశాను. పాపం ఆ వెర్రితల్లి, కాబోసూ, డాడీ అన్నీ చదివేకదా చెప్తున్నారూ అనుకుంది. నేను చెప్పే కబుర్లు విని నిజమే కాబోలూ అనుకుంది. ఇంక తనూ ప్రయత్నించలేదు పని హడావిడిలో ఉండి.కానీ పాపం చాలా నిరుత్సాహపడింది అయ్యో తెలుగులో రావడం లేదా అని.

   మా ఇంటావిడ నా బాధ చూసి భరించలెక, పోనీ రెహమాన్ కి ఫోను చేయండీ, అతనికేమైనా తెలుస్తుందేమో అని. సరే అని ఆఖరి ప్రయత్నంగా ఫొనుచేస్తే, “కాదండీ తెలుగు లో వస్తుందీ, అదేదో బ్రౌజర్ లొకి చూస్తే శుభ్రంగా వస్తుందీ” అని ఏవేవో పేర్లు చెప్పాడు. అవన్నీ గుర్తుపెట్టుకోలేక, నాయనా, ఆ వివరాలన్నీ ఓ మెయిల్ లో పంపూ, పిల్లలనడిగి చేయించుకుంటానూ అని చెప్పేసి, అతని మెయిల్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా.అదేమో రాదూ.. ఇంక ఊరుకోలేక, అబ్బాయినడిగేశాను, ఈ పనేదో ముందరే చెయ్యొచ్చుగా, అబ్బే దేనికైనా టైము రావాలండి బాబూ, తనేమో ఏవేవో చేసేసి అరక్షణం లో, నా టపాలూ, హారాలూ, కూడళ్ళూ శుభ్రంగా లక్షణం గా తెలుగులో చూపించేసి నా మొహాన్న కొట్టేశాడు అంటే నిజంగా అలా అని కాదూ, చేతిలో పెట్టేశాడు ! ఇంతలో ఓ గంటలో రెహమాన్ దగ్గర నుంచి మెయిలూ వచ్చింది. ఈలోపులోనే అబ్బాయి ధర్మమా అని అప్పటికే తెలుగు enabled చేసేశాము.

   అందుకే అంటారు అడగందే అమ్మైనా పెట్టదూ అని. అబ్బాయిని అడిగాను టక్కున చేసిపెట్టేశాడు.ఈ పనేదో ముందరే చేస్తే ఇంత గొడవా ఉండేది కాదూ, ఇంటావిడ చేతిలో చివాట్లూ ఉండేవి కావూ. ఇంక జీవితంలో నామాట నమ్మదు especially ఈ కంప్యూటర్ వ్యవహారాల్లో !! కానీ ఇంత జరిగితేనే కానీ నాకూ తెలియలేదుగా, ఇటుపైన మాత్రం వెర్రివెర్రి వేషాలు వేయకుండా, ఏదైనా సమస్యొస్తే హాయిగా పిల్లలున్నారూ వాళ్ళని అడిగేస్తే పోలా? అన్నీ మనకే తెలుసుననుకుంటే తేలేదేమిటయ్యా అంటే you look like an idiot. అంటారు కానీ look like ఏమిటండీ నిజంగా మీరు idioట్టేనండీ అని మాత్రం అనకండి.

    చివరకి చెప్పేదేమిటంటే ఓ 10 రోజులు మిమ్మల్ని బోరు కొట్టను. దీంట్లో టపాలు వ్రాసేటంతటి ప్రావీణ్యం లేదు. ఏదో అందరెదురుగుండా మెయిల్స్ చెక్ చేసికోడం, పేద్ద పోజు పెట్టడం తప్ప !! See you in March first week… అప్పుడు కావలిసినన్ని కబుర్లు…

   P.S.
అప్పుడే ఏడాదెళ్ళిపోయింది మన ప్రియతమ ముళ్ళపూడి వెంకటరమణ గారు మనల్నందరినీ “అనాధ” లుగా మిగిల్చేసి...

%d bloggers like this: