బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టీతింగ్ ప్రోబ్లంస్….

   అసలు పళ్ళే లేవు కదా మళ్ళీ ఈ “టీతింగ్” గోలేమిటీ అనుకుంటున్నారా? ఏం చెయ్యను? ఈ వారాంతం లో నేనూ, మా ఇంటావిడా ఓసారి అన్నవరం, తణుకు, రాజమండ్రీ వెళ్ళొద్దామనుకుంటున్నాము. ఆ ట్రిప్పు విశేషాలు, కారణాలూ వచ్చే వారం లో !!

    అమ్మా నాన్నా వారం రోజులపాటు ఇంట్లో కంప్యూటర్ కి దూరంగా ఉంటారూ. ఎప్పుడైనా వాడాలన్నా, ఏ సైబర్ కెఫేకో వెళ్ళాలీ, పాపం అంత శ్రమెందుకూ అనుకున్నట్టున్నారో ఏమో, ఓ 3G Tab తెచ్చి, మమ్మల్నిద్దరినీ ఉపయోగించుకోమని ఇచ్చి వెళ్ళారు. అక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఇలాటివన్నీ నేనెప్పుడైనా చూశానా పెట్టానా? ఏదో పిల్లలు ఉపయోగిస్తున్నప్పుడు చూడ్డమే కానీ, వాళ్ళు దగ్గరలో లేనప్పుడు, దాంట్లో ఎప్పుడైనా ఫోను వచ్చినా, ఎలా తీసికోవాలో కూడా తెలియని వాడిని. ఏమ్ నొక్కితే ఏమౌతూందో అని భయమే ఎప్పుడూ. మాకెందుకండీ ఈ కొత్త Toys/Tools? ఏదో వీధిన పడకుండా, నా మామూలు బేసిక్ ఫోనుతో లాగించేస్తున్నాను కదా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, నా దారిన నేను కాలక్షేపం చేసేస్తున్నా కదా, మళ్ళీ మధ్యలో ఈ గొడవెందుకూ? అదేదో 3G Sim వేయించుకోమన్నారు. ఈవేళ ప్రొద్దుటే వెళ్ళి ఆ పనేదో కానిచ్చుకొచ్చాను.

    కొంపకి తిరిగొచ్చి మొదలూ నా టీతింగ్ ట్రబుల్స్. ఏదో మామూలు ఫోన్లైతే పరవాలేదు కానీ, ఇదేదో టచ్ స్క్రీన్ ట. దీనిల్లుబంగారం గానూ, అటూ ఇటూ పారిపోతుందే. ఏం నొక్కితే ఏమౌతుందో అని భయమే. మొత్తానికి ఏదో తిప్పలు పడి ఫొను చేయడం వరకూ మాత్రం నేర్చుకున్నాను. రేపటికదేదో నెట్ యాక్టివేట్ చేస్తాడుట, నేను నెట్ కూడా బ్రౌజ్ చేసికోవచ్చుట. మామూలుగా, లాప్ టాప్ లో టైపు చేయడమే నాకో “యజ్ఞం” లాగుంటుంది. ఇప్పుడేమో చేతిలో పట్టుకుని చూసుకోవాలిట. ఏమిటో అంతా అయోమయం గా ఉంది. ఇక్కడకేదొ సరిపోదన్నట్టు అదేదో బ్లూ టూత్ కూడా తీసికోవాలిట!

   నాలాటివాడికి ఏదో టేబుల్ మీద పెట్టుకుని, సంసారపక్షంగా టైపు చేసికునే డెస్క్ టాప్పులుండాలి కానీ, మరీ ఇలాటివన్నీ ఇచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలాగండి బాబూ? దీనితో అయిందనుకుంటున్నారేమో, అబ్బాయి ఈ మధ్యన ఆఫీసు కోసం కొత్త ప్రింటర్/స్కానర్ తీసికోడంతో, కిందటేడు కొన్నది ఎలాగూ వాడ్డం లేదు కదా, నాకూ ఉపయోగిస్తుందని తెచ్చి, మేముండే ఫ్లాట్ లో పెట్టి, దాన్ని ఫంక్షనల్ చేశాడు.ఏదో అదీ ఇదీ కెలికి మొత్తానికి నేర్చేసుకున్నాను లెండి.అసలు కంప్యూటరులో నేర్చుకోడమే ఓ గొప్ప విశేషం అనుకుంటూంటే, పిల్లలు మమ్మల్ని మరీ “hi-fi” చేసేస్తున్నారు!

    ఈమధ్యన మన బ్లాగరు ఫ్రండు రహమానుద్దీన్ చాలామందికి పరిచయం అయ్యాడుగా, అతని ద్వారా పరిచయం అయి, ఈ ఊళ్ళోనే ఉంటున్న ఇంకో అబ్బాయి ఫజల్ నాయక్ అన్న అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. నా ట్రెడిషన్ ప్రకారం మూడు గంటలపైగానే కబుర్లు చెప్పుకున్నాము.నాగోల విని విని పాపం బోరుకొట్టేసుంటుంది అతనికి.

    గత నాలుగు రోజులూ మహ బిజీ అయిపోయాము. అక్కడ మా ఇంట్లో, అబ్బాయి అదేదో పెస్ట్ కంట్రోల్ చేయించాడు. దానితో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టడం, దానికి సాయం కొట్టిన మందు వాసనా, దానితో అబ్బాయీ,కోడలూ, నవ్య, అగస్థ్య మేముండే ఇంటికే వచ్చేశారు. దానికి సాయం అగస్థ్యకి అదేదో వాక్సినెషనోటి చేయించడం తో తనకి పాపం నొప్పీ, జ్వరమూనూ. ఏదో పెద్దవాణ్ణనని నన్నొదిలేశారు కానీ, మిగిలిన ముగ్గురికీ ఈ రెండు రోజులూ నిద్ర లేదు. అదేదో శివరాత్రినాడైతే జాగరణ పుణ్యమేనా దక్కేది !
అదండీ విషయం…

%d bloggers like this: