బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏమీ చేయలేని helplessness….

Kids

   ఏమిటో ఇదివరకు రోజుకో టపా పెట్టగలిగేవాడిని. ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏదో నామీద అభిమానం ( అలాగని నేనే అనుకుంటే గొడవే లేదుగా!) వలనో, లేకపోతే ఈయన ఎలాగా మనల్ని వదలడూ అనుకునో, కారణం ఏదైతేనేంలెండి చదివేవారు. ఈమధ్యన వారం లో రెండేసి,మూడేసి రోజులు మనవణ్ణి చూడ్డం కోసం వెళ్ళవలసొచ్చేసరికి, ఈ రొటీన్ కొద్దిగా క్రమం తప్పుతోంది. నాకేమో, అబ్బాయి లాప్ టాప్ మీద టైపుచెయ్యడం రాదాయే, ఆఫీసులో ఉండే డెస్క్ టాప్ ఎప్పుడూ ఖాళీయే ఉండదూ. పోనీ ఏ రాత్రో వెళ్ళి చేద్దామా అనుకుంటే, ఆ సొసైటీలో ఉండేవాళ్ళు కుక్కల్ని వదిలేస్తారూ, నాకేమో భయమాయే, ఏతావేతా చెప్పొచ్చేదేమిటంటే, వీటి ప్రభావం నాటపాలమీద పడుతోంది.

   రేపు మా పూణె మహానగరపాలికా ( మ్యున్సిపల్ కార్పొరేషన్ కి అచ్చ మరాఠీ అనువాదం!) వారు అయిదేళ్ళకోసారి జరిపే ఎన్నికలుట. అదంతా ఓ కామెడీ, మామూలుగా ఎలెక్షన్ల బూత్తులు ఏ స్కూల్లోనో, ఆఫీసులోనో పెడుతూంటారు. అదేం రోగమో, ఈసారి మా అగస్థ్య వెళ్ళే Day Care Centre లో పెట్టారు. దానితో రెండు రోజులు శలవూ. అదేం చిత్రమో, ఎవడైనా Day Care Centre లలో పెడతారా? అసలు అక్కడకి పిల్లల్ని పంపేదెవరూ, భార్యా భర్తలు ఇద్దరూ పనిచేస్తూ, ఇళ్ళల్లో చూడ్డానికి ఎవ్వరూ లేరనే కదా. అలాటిది ఈ రెండురోజులూ, ఆఫీసుల్లో కాళ్ళావేళ్ళా పడి శలవు తీసికోవాల్సిందేగా? ఖర్మం కాలి ఆఫీసుల్లో శలవలు దొరక్కపోతే ఏం చేస్తారుట? ఈ రాజకీయ పార్టీల నాయకులు, పిల్లల సంరక్షణాభారం నెత్తిమీద పెట్టుకుంటారా? ఇక్కడే పోలింగ్ బూత్తు పెట్టడంలో ulterior motive నాక్కనిపించిందల్లా, ఈ Day Care Centre మా పూణె గార్డియన్ మినిస్టర్, మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కొంపకి దగ్గరలో ఉండడం ఒక్కటే ! పైగా కార్పొరేషన్ లో వాళ్ళదే రూలింగ్ పార్టీ. హాయిగా ఓటింగ్ కావలిసినట్టుగా మేనేజ్ చేసికోవచ్చు! ఈ రాజకీయ నాయకులు ఛాన్సొస్తే చాలు, ఎలాటి ” నీచాని” కైనా దిగుతారు. అసలు Day Care Centre లలో పోలింగులు పెట్టడమేమిటండి బాబూ, అడిగేవాడు లేకపోతే సరీ. పేరెంట్స్ కేమో భయమాయే ఏమడిగితే ఏం కోపాలు వస్తాయో, తమ పిల్లల్ని “కష్ట” పెట్టేస్తారేమో అని. ఈ విషయాలన్నీ పోనీ నాలాటివాడెవడైనా అందరి దృష్టికీ తెద్దామని, పేపర్లకి వ్రాస్తే అసలు వాళ్ళు నా లెటర్ ని ప్రచురించేలేదు. వాళ్ళ భయాలు వాళ్ళవి, కానీ ప్రతీవాడూ freedom of expression గురించి లెక్చర్లిచ్చేవాళ్ళే! God save the Country!

   ఈ మధ్యన ఏ ఇంట్లో చూసినా, పిల్లలకీ, పెద్దలకీ ఎప్పుడు చూసినా దగ్గులూ రొంపలూ. పిల్లలకి సీజన్ ని బట్టి ఇలాటివి వస్తూనే ఉంటాయి, దీనికింత రాధ్ధాంతమెందుకూ అనొచ్చు చాలా మంది ప్రస్తుతకాల తల్లితండ్రులు. ఏదో సీజన్ మారినప్పుడు వస్తూంటే అనుకోవచ్చు, కానీ సంవత్సరం పొడుగూనా వస్తూంటే ఏదో కారణం తెలిసికొని, దానికి ఏదో నివారాణోపాయాలు తెలిసికునే ప్రయత్నం ఏదో చేస్తే బాగుంటుందేమో అని, మాలాటి ” చాదస్థపు” పెద్దాళ్ళు మొత్తుకుంటూంటారు. కానీ ఇవన్నీ వినే ఓపికా టైమూ ఎక్కడున్నాయి ఈ రోజుల్లో? ఏదో మరీ ప్రాణం మీదకు రావడం లేదులే అనుకోడం, లేకపోతే వారానికోసారి ఫామిలీ డాక్టరు దగ్గరకి పరిగెత్తడం. ఆయనేమో వ్రాసిన మందులే రాసేసి, ఫీజు పుచ్చేసికోడం. పోనీ అది తినకూ, ఇది తినకూ, ఇలా తినూ,అలా తినూ అని చెప్పొచ్చుగా, అబ్బే తన పేషెంట్లు మరీ ” ఆరోగ్యకరమైన” పధ్ధతులు పాటించేస్తే, ఈ డాక్టర్ల మొహం ఎవడు చూస్తాడు? దానితో ఏమౌతోందీ అంటే, ఆయన చెప్పా చెప్పడూ, ఈ తల్లితండ్రులేమో తమ పధ్ధతులూ మార్చుకోరు. ఏదో వెళ్ళిపోతోందికదా అనే పాలిసీ.

   పైగా ఉన్న పధ్ధతులు మార్చడం అంటే మాటల్లో పనా ఏమిటీ? ముందుగా వాళ్ళు మారాలి, తరువాతేగా పిల్లల్ని మార్చేదీ? అసలు మనకే, ఇంట్లో కుర్కురేలూ, హిప్పోలూ, ఇంకో సింగనాదాలూ లేకపోతే తోచదే, పిల్లలమాట దేముడెరుగు, ముందర మన సంగతేమిటి ” ఏమిటోనండీ అలవాటైపోయిందీ, అవన్నీ లేకపోతే, ఏమిటో ఎలాగో అనిపిస్తుంది..” అంటూ సాగదీసుకుంటూ చెప్పేవారే. ఇంక పిల్లలు కూడా, snacks అంటే ఇవే కాబోలూ అనుకుంటారు. ఇంటినిండా ఎక్కడ చూసినా ఇవే. అంతదాకా ఎందుకూ, నిన్న సాయంత్రం వీధిలోకి వెళ్ళి నుంచోడం అలవాటు,ఎవరైనా పాత స్నెహితులు కనిపిస్తారేమో అని. ఒకాయన కనిపించాడు, నాకంటే ముందరే రిటైరయిన వారు, అటూ ఇటూ చూస్తూ, ఏదో “తప్పు” పని చేస్తున్నవాడిలా, తనని ఎవరైనా గమనిస్తున్నారేమొ అని భయ పడుతూ, ” పానీ పూరీ”, అదేమిటో ఇంకోటీ లెఫ్ట్ రైట్ సెంటర్ లాగించేస్తున్నాడు. ఖర్మ కాలి నా కళ్ళల్లోనే పడ్డాడు. ఇదేమిటి బాసూ, ఆ మధ్యనేదో బైపాస్సో ఇంకోపాస్సో చేయించుకున్నానన్నావు, మరీ ఇదేమిటీ ఇలా రోడ్డున పడిపోయావూ అంటే, ” ఏమ్ చెయ్యమంటావు భాయ్, ఇంట్లోనేమో తిండానికి ఏమీ ఇవ్వరూ, అదేదో కొలెస్ట్రాల్ అంటూ, వాళ్ళ దారిన వాళ్ళు పిల్లలతో సహా ఏమిటేమిటో తింటూంటారు. నా దగ్గరకొచ్చేటప్పడికే ఈ మెడికల్ ప్రికాషన్లూ. ఏం చెయ్యనూ, ఈవెనింగ్ వాక్ పేరెట్టి బయటకొచ్చేసి ఇలా కక్కూర్తి పడుతూంటాను..”. అదండి సంగతీ.. పైన ఒక pdf పెట్టాను kids అని, ఓసారి నొక్కి చూడండి, ముంబైలో సర్వేలో తేలిందేమిటో చదవండి. ముంబై అనేమిటి, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అందరికీ తెలుసు, కానీ ఏమీ చేయలేని helplessness.. చల్తాహై, చల్తే రెహ్తా హై

%d bloggers like this: