బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఊరికే కూర్చోనీకుండా…..


   ఏదో నాదారిన నేను ఏదో కాలక్షేపానికి రోజుకోటో, అప్పుడప్పుడు వారానికోటో బ్లాగులు వ్రాసుకుంటున్నాను కదా, వదిలేయొచ్చుగా, ఉత్తినే “కెలకడం” ( మంచి గానే లెండి) ఎందుకూ?మొన్నెప్పుడో వ్రాసిన నా టపా మీద వ్యాఖ్య పెడుతూ, మన “ఒకేఒక్క శంకరుడు“.. ”
కాకినాడలో పుట్టి
కాకినాడలో పెరిగి
కాకినాడలో చదివి
కాకినాడ మీద ప్రేమని నరనరానా నింపుకున్న
అచ్చమైన కాకినాడ పౌరుడిని నేను.” అని వ్రాశేశాడు. ఇంక నేనేనా ఊరుకునేదీ? అసలే ‘కోతి” ఆ కోతికో కొబ్బరికాయ పంధాలో, నా ” కాకినాడ జ్ఞాపకాలూ” గుర్తొచ్చేశాయి. మీమీద పడుతున్నా, భరించండి..

నిన్నటివా మొన్నటివా 1954,55 లలోవి, అంటే 58 ఏళ్ళైనా గడచుండాలి.ఆ రోజుల్లో పుట్టినవాళ్ళైతే ఈపాటికి రిటైరు కూడా అయిపోయుండొచ్చు. మన మిగిలిన పాఠకులైతే ఈ ప్రపంచం లోకే వచ్చుండకపోవచ్చు. వీళ్ళనేమిటీ, వీళ్ళ జన్మలకి కారకులైన తల్లితండ్రులకి వీళ్ళని పుట్టించాలనే సంకల్పం కూడా కలిగుండకపోవచ్చు, అంత పాత జ్ఞాపకాలు మరి! కానీ వాటిని గుర్తు చేసికోడంలో ఉన్న ఆనందమే వేరు.

మాకు అమలాపురం లో పేద్ద పెద్ద ఆసుపత్రులు లేకపోవడం తో, ఎటువంటి ఆరోగ్య సమస్యైనా వస్తే, అటు కాకినాడ కానీ, మరీ సీరియస్సు అయితే విశాఖపట్నం కె.జి.ఎచ్, ఇవే గతి. కోటిపల్లి రేవు దాటడం,పడవ దిగి, ఓ రెండు ఫర్లాంగులు నడిచి బస్సు పట్టుకుని, దాక్షారం బస్ స్టాండు లో కొద్దిసేపు ఆగి, కాకినాడ చేరుకోవడమూనూ. గాంధీనగరం లో పోలీసు క్లబ్ అనోటుండేది, దానికి పక్కనే మా చుట్టాలుండేవారు. ఆయన శ్రీ కందా లక్ష్మినారాయణ గారు, ఆయనేమో నాకు పెదనాన్నగారు (maternal), ఈయనే మనరాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన శ్రీ మోహన్ కందా కి కూడా పెదనాన్నగారే ( paternal). మరీ name dropping అనుకోపోతే, ఇదండి మా చుట్టరికం. సందర్భం వచ్చింది కదా అని వ్రాశాను.

ఆ రోజుల్లో ఎక్కడికైనా వైద్యానికి వెళ్ళాల్సొస్తే, ఆ ఊళ్ళో చుట్టాలే కదా దిక్కూ, హోటళ్ళూ అవీ ఎక్కడుండేవీ, ఉన్నా వాటిలో ఉండే స్థోమతకూడా ఉండాలిగా. అయినా ఊళ్ళో అంత దగ్గరి చుట్టాలని పెట్టుకుని, బయటెక్కడో ఉండడానికి వాళ్ళూ ఒప్పుకునేవారు కాదూ( అని మనమే అనేసికుని వాళ్ళని మొహమ్మాట పెట్టేయడం!). ఆయన లోకల్ ఫండ్ ఆడిట్ లో పనిచేసేవారు. ఏదో ఒకటిలెండి, అవ్విధంబుగా వాళ్ళింట్లో నన్ను పెట్టి, వారం వారం మానాన్నగారు అమలాపురం నుండి వచ్చేవారు. ప్రతీ శనివారం సాయంత్రం, ఆయనకోసం ఎదురుచూడ్డం ఓ వింత అనుభూతీ, మధుర జ్ఞాపకం.

ఆ పోలీసు క్లబ్బుకి పక్కనే రైలు కట్టుండేది. అక్కడకి వెళ్ళి రైలు చూడ్డం, కలకత్తా మెయిల్ సామర్లకోటలో వేసిన ఇంజను కూత, ఇక్కడకి వినిపించడం, మర్చిపోతామా? అదేదో బిఎన్ ఆర్ ఇంజననేవారు. దాని షేప్పే వేరుగా ఉండేది. ఆ ఇంజన్లు కాకినాడ వచ్చే రైళ్ళకుండేవి కావు. ఇక్కడ మామూలు ఛుక్ ఛుక్ ఇంజన్లే, కుయ్యో కుయ్యో మనే కూతే !!సాయంత్రాలు ఆరింటికో ఆరున్నరకో అదేదో నైన్ డౌన్నో ఎదో అనేవారు. నర్సాపురం దాకా వెళ్ళేది.

ఇంక నాకు వైద్యం చేసే డాక్టరు గారు శ్రీ నూకల అమ్మన్నపంతులు గారు, టౌన్ హాల్ పక్కన ఉండేవారు. ఎనిమిదింటికల్లా నేను వెళ్ళి భయపడుతూ,భయపడుతూ గేటు తీసి, కారణం, వాళ్ళింట్లో రెండు కుక్కలుండేవి. దాంట్లో ఓ కుక్క పాపం నాలాటిదే నోరూ వాయీ లేదు, ఏదో అటూ ఇటూ తిరుగుతూండేది. కానీ ఆ రెండోది, వామ్మోయ్ ఎంతలా అరిచేదో. తీరిగ్గా ఆయనేమో తొమ్మిదింటికి మేడమీంచి కిందకు దిగేవారు. ఆరోజు ఇంజెక్షన్ తీసికుని వెళ్ళడం. ఇలా వారంలో మూడు సార్లు రావలసివచ్చేది. పాపం పిల్లాడు గాంధీనగరం నుండి, టౌన్ హాల్ దాకా నడవలేడూ, పోనీ రిక్షాలో వెళ్తాడులే అని, మా నాన్నగారు, మా చుట్టాలింట్లో కొంత డబ్బుంచేవారు. దాంట్లోంచి తీసి, నేను వెళ్ళల్సొచ్చినప్పుడు, ఓ ఆరణాలు రానూపోనూ రిక్షా ఖర్చుకి మా అక్కయ్యగారు ఇచ్చేవారు.

మానాన్నగారు వారం వారం వచ్చినప్పుడల్లా ఆయనతో ,జిల్లా బోర్డు ఆఫీసుకెళ్ళడం, అక్కణ్ణుంచి, మెయిన్ రోడ్ లో రావూస్ కేఫ్ ( కెఫే అంటారని ఇప్పుడు తెలిసిందనుకోండి!) కి వెళ్ళి టిఫిన్ పెట్టించడం, ఓ సినిమా క్రౌన్ థియేటర్ లో చూపించడం. పాపం పిల్లాడు వైద్యం చేయించుకుంటున్నాడు కదూ! ఇందులొ ఆ రావూస్ కేఫ్ ఒకటి నచ్చేసింది. ఆరోజుల్లో బ్రేక్ ఫాస్టులూ అవీ ఉండేవి కాదుకదా, మహ అయితే చద్దన్నం. అయినా ఆరోజుల్లో హొటళ్ళకెక్కడ వెళ్ళేడ్చామూ? నా రిక్షా ఖర్చులకోసం ఇచ్చిన ఆరణాల్లోంచీ, వెళ్ళేటప్పుడు నడిచేసి, మూడణాలతో ఆ కేఫ్ కి వెళ్ళి పూరీ కూరా తినడం! అసలు ఆ పొంగిన పూరీ, ఆ కూరా ఇప్పటికీ గుర్తొస్తే నోట్లో నీళ్ళూరుతాయి! తిరిగెళ్ళేటప్పుడు మాత్రం రిక్షాలోనే, లేకపోతే ఇంట్లోవాళ్ళు తిడతారేమో అని భయం.

ఇంకోసారి కాకినాడ జనరల్ హాస్పిటల్ లో గడిపిన పదిరోజులూ, ఇంటినుండి ఓ బుచ్చి టిఫ్ఫిన్ కారీయర్ లో తెచ్చే కూరా అన్నమూ, వాహ్ వాహ్… గాంధీనగరం పార్కుకి వెళ్ళడం, ఆ పక్కనే ఉండే శ్రీ చెన్నుభొట్ల భానుమూర్తి గారు కూడా మా చుట్టం లెండి. మా పెదన్నాన్నగారబ్బాయిని ఆయన దత్తత తీసికున్నారు. ఈయనేమో ప్రకృతివైద్య డాక్టరు గారూ, పచ్చి కూరగాయలూ, ఆకులూ అలమలూ, రసాలూ తప్ప ఇంకోటి ముట్టుకోనిచ్చేవారు కాదు !!

నన్ను మరీ underestimate చేసేయకండి. కొసమెరుపు ఏమిటంటే నేను కూడా “ చదువుకుంటున్నాని” పేద్ద ఇమేజ్ ఉన్న రోజుల్లో పాపం మా నాన్నగారు, ఎంతో ఆశతో నన్ను కూడా ఐఐటి ఎంట్రెన్స్ పరీక్షకి పంపారు. ఆ పరీక్ష కి కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో అడుగు మాత్రమే పెట్టే అదృష్టం కూడా కలిగింది! మార్కుల సంగతి మాత్రం అడగొద్దు!

సినిమా స్ట్రీట్, రామారావుపేట, మూడు లైట్ల జంక్షనూ, జగన్నాధపురం వంతెనా, క్రౌన్ థియేటరూ, అక్కడెక్కడో కుళాయి చెరువనోటుండేది ఎంత చెప్పినా ఆతావేతా ఓ ఆరు నెలల జ్ఞాపకాలు… శంకరా, రాస్తే రాశావు కానీ, ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసికుని అందరిమీదా రుద్దే అవకాశం కల్పించావు….

6 Responses

 1. ధన్యోస్మి గురువుగారూ. మీరు గాంధీనగర్ ప్రస్తావన తెచ్చి ఇల్లు గుర్తు చేశారు. మా ఇల్లు అక్కడే గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర.

  అయితే మీరు మా ఊరి ఇంజనీరింగ్ కాలేజీలో చదివారన్న మాట.

  “మెయిన్ రోడ్ లో రావూస్ కేఫ్”

  నాకు ఊహ తెలిసేటప్పటికి ఈ హోటల్ లేదండీ. మెయిన్ రోడ్ లో మసీద్ సెంటర్ దగ్గర ఉండేదా?

  “సినిమా స్ట్రీట్, రామారావుపేట, మూడు లైట్ల జంక్షనూ, జగన్నాధపురం వంతెనా, క్రౌన్ థియేటరూ, అక్కడెక్కడో కుళాయి చెరువనోటుండేది ”

  నేను ఆల్రెడీ సినిమా స్ట్రీట్ గురించి, కుళాయి చెరువు లో జరిగే ఫలపుష్ప ప్రదర్శన గురించి నా బ్లాగులో “కాకినాడ కబుర్లు” శీర్షికన రాసానండీ. ఒక్కో జ్ఞాపకం గురించీ రాసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి ఆ సీరీస్ లో నాలుగు టపాలు అయ్యాయి. నెక్స్ట్ గాంధీనగర్ పార్కు గురించే రాయబోతున్నా. వీలయితే ఓ సారి నాబ్లాగు (www.blogavadgeetha.blogspot.com) చూడండి.

  Like

 2. శంకరా,

  దీనివలన తేలిందేమిటయ్యా అంటే, నా పాత టపాలు చదవలేదని ! నేనేమిటి, ఇంజనీరింగేమిటి బాబూ . అలాటి దురభిప్రాయాలు పెట్టుకోకు నాయనా!! Anyway it was a pleasnt thought!! …

  Like

 3. హహహ గురువుగారూ కాకినాడ గురించి పోస్ట్ కావడం వలన ఆ ఎక్సైట్మెంట్ లో మీరు పరీక్ష రాయడానికి మాత్రమె ఆ కాలేజ్ కి వెళ్లారని చెప్పిన విషయం సరిగా చూడలేదండీ. :)).

  ఇంతకీ రావూస్ కేఫ్ మెయిన్ రోడ్ లో ఎక్కడ ఉండేదో చెప్పలేదు మీరు. సినిమా హాల్ స్ట్రీట్ లో కల్పనా థియేటర్ దగ్గర (మరి అప్పట్లో అది ఉందొ లేదో) ఉడిపి వీనస్ హోటల్ నాకు తెలిసిన పాత హోటళ్ళలో (ఇప్పటికీ ఉన్న వాటిలో) ఒకటి.

  Like

 4. చాలా బాగా వ్రాశారండీ…… మీ చిన్న నాటి కబుర్లు….
  అయితే ఇచ్చిన డబ్బు దాచుకుని నడుచుకుంటూ వెళ్ళి నచ్చినది కొనుక్కొని తినడం అనేది అందరి (చాలా మంది) జీవితాల్లో ఉందని మరొక్కసారి ఋజువైంది ……

  Like

 5. @మాధవీ,
  ధన్యవాదాలు.

  @శంకరా,

  కాకినాడ పేరొస్తే చాలు, ఎగిరిపోడమే….

  Like

 6. మీరేమైనా చెప్పండి,

  వాడలన్నింటిలో కాకినాడ మిన్న
  కాకి వంటి పక్షి ఇలను లేదు

  నన్నడిగితే… కాకినాడను దేశ శీతకాలపు రాజధాని చేయాలంటాను. 😀

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: