బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అంత మరీ అన్యాయం కాదు…

   ఈ మధ్యన ఓ ప్రకటనొచ్చింది, CGHS కార్డులున్న పెన్షనర్లకి ప్లాస్టిక్ కార్డులు జారీ చేస్తున్నారని. ఏదో ఒక ఊళ్ళో రిజిస్టర్ చేసికున్నవారికి దేశం లో ఏ CGHS హాస్పిటల్ లోనైనా సదుపాయం ఉండేటట్టుగా ఇప్పుడు అంతా online చేశారు. ఇదివరకైతే అంతా గందరగోళం గా ఉండేది. ఉదాహరణకి నేను పూణె లో రిజిస్టరు చేసికుంటే, వైద్యానికీ, మందులకీ పూణె ఏ రావాల్సివచ్చేది. ఖర్మం కాలి ఏ భాగ్యనగరంలోనైనా మంచం పడితే, భాగ్యనగరంలో ఉన్న CGHS ఆఫీసుకెళ్ళి వాళ్ళదగ్గర సర్టిఫికేట్ తీసికోవాల్సివచ్చేది. ఏదో అదృష్టం కొద్దీ,భగవంతుడి దయ వలన, కార్డంటే, రిటైరయిన రెండేళ్ళకి 18000 కట్టి తీసికున్నాను కానీ, దాన్ని ఉపయోగించవలసిన అవసరం ఎప్పుడూ రాలేదు ! కానీ రోజులన్నీ మనవి కాదుకదా, ఎప్పుడేం అవసరమొస్తుందో, పోనీ ఆ ప్లాస్టిక్ కార్డేదో తీసికుంటే బాగుంటుంది కదా. పాత కార్డు సరెండర్ చేసేస్తే, ఈ ప్లాస్టిక్ కార్డిస్తారుట.

    అక్కడొచ్చింది అసలు గొడవంతా, “ఆయనే ఉంటే….” అన్నట్టుగా, అవసరానికి ముఖ్యమైన డాక్యుమెంట్లు కనిపించి చావవుగా. ఏదో తీరువుగా, ఒబ్బిడిగా అన్ని డాక్యుమెంట్లూ ఓ చోట పెట్టండి మహప్రభో అని ఇంటావిడ ఎన్నిసార్లు మొత్తుకున్నా, ” ఆ ఒక్కటీ అడగొద్దు..” అన్నట్టు, మామూలుగానే ఎక్కడో పెట్టడం, మర్చిపోడమూనూ. రెండిళ్ళూ వెదికా, కనిపించదే. రెండీల్లూ అంటే అపార్ధం చేసికోకండే, నేనూ ఇంటావిడా ఉండే సింగిల్ బెడ్రూం ఫ్లాట్టూ, మా స్వంత ఫ్లాట్టూ అన్నమాట. ఆ కార్డుకోసం వెదికి వెదికి శ్రమపడే కంటే, వాళ్ళని బతిమాలి కొత్త కార్డు తీసికోడం సులభమేమో అని ఓ ఐడియా వచ్చేసింది. ఎవరినో అడిగితే, పెనాల్టీ కడితే కొత్తదిస్తారూ అన్నారు.

   సరే అని వాళ్ళ ఆఫీసుకి వెళ్తే, మొదటి ప్రశ్న-పాత కార్డు xerox ఉందా అని. పోనీ అదీ లేకపోతే నెంబరేనా చెప్పూ అని. “దరిద్రుడి నెత్తిమీద వడగళ్ళ వాన ” లా మనదగ్గర ఆ రెండూ లేవు. గోవిందో గోవిందా . ఏదో ఇదివరకు కార్డు పుచ్చుకున్న కొత్తలో, మా CGHS Dispensary కి వెళ్ళి, ఓ రూళ్ళ పుస్తకంలో, రిజిస్టరు చేయించుకుని , వాళ్ళచేత ఓ stamp వేయించుకోడం ఒకటే, నేను చేసిన మంచిపని. ఆ పుస్తకమూ, నా ఐడి కార్డూ అక్కడున్న అతని చేతిలో పెట్టేసి ” నీవే దిక్కు మహప్రభో..” అని సరెండరైపోయాను. పాపంఏమనుకున్నాడో ఏమో, “సరే చూస్తానూ, వెయిట్ చెయ్యీ..” అన్నాడు. సరే అనుకుని బయట బెంచీ మీద సెటిలయ్యాను. ఓ పదినిముషాల్లో బయటకు వచ్చి, ఓ నెంబరు చెప్పి, ఇది పోయినట్టు పోలీస్ స్టేషన్ లో కంప్లైంటిచ్చి, ఆ FIR కాపీ పట్టుకు రా, కొత్తదిస్తామూ. అని చెప్పి పంపించేశాడు.

   ఎప్పుడైనా పోలీస్టేషన్లకెళ్ళిన మొహమా నాదీ, అప్పుడెప్పుడో passport వ్యవహారం లో pvr అందలేదని, కమీషనర్ ఆఫీసుకెళ్ళా కానీ, ఈ పోలీసుస్టేషన్లలో ఏమడుగుతారో, ఏం చెప్పాలో, ఏం చెబితే ఏం తప్పో.. అన్నీ సందేహాలే.. పైగా చేసేదా వెధవ పని, నా కార్డు పోయిందా అంటే నిజంగా పోలేదు. ఇంట్లో ఎక్కడో పెట్టా గుర్తుకు రావడం లేదూ, ఈ FIR కాపీ ఏదో ఇస్తే కానీ, కొత్త కార్డు రాదూ, ఏం గొడవరా బాబూ, ఎరక్కపోయి మొదలెట్టాను, పాత కార్డుకోసం వెదకడమే cheap and best అనికూడా అనేసికున్నాను. ఇలా కాదని, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు మా డీలర్ ఒకతన్ని పట్టుకున్నాను. బాబ్బాబు ఎలాగోలాగ ఈ పని చేసిపెట్టూ, వచ్చే జన్మలో నీ కడుపున పుడతానూ… వగైరాలు చెప్పి, అతన్ని తీసికెళ్ళాను.

   దానికి ఎంతో కొంత ఖర్చవుతుందీ, పోలీసు స్టేషన్లో పోయింది మన వస్తువైనా సరే తృణమో పణమో లేకుండా పనవదూ అన్నాడు. ఏం చేస్తానూ, చచ్చినట్టు ఒప్పుకున్నాను. అక్కడకి వెళ్ళిన తరువాత ఈ మధ్యన చూస్తున్న ” సింగం” సినిమాల్లాటివన్నీ, కళ్ళముందర తిరగడం మొదలెట్టాయి.అక్కడో ఇనస్పెక్టరుంటాడూ, అతను కాళ్ళు టేబుల్ మీద పెడతాడూ, మనమేమో, నీళ్ళు నములుతూ, వాళ్ళెదురుగుండా, చేతులు నలుపుకుంటూ, ” ఆయ్ నాదండీ, కార్డండీ ఎవడో కొట్టేశాడండి ఓ రిపోర్టిద్దామనొచ్చానండి….” etc..etc.. దానికి ఆ ఇన్స్పెక్టరు “ నువ్వు పోయిందీ అంటే మేం నమ్మాలా? ఎక్కడ, ఏ టైములో,ఏం చేస్తూంటే అసలు పోయిందీ.. ఎవడో కొట్టేశాడని ఋజువేమిటీ, అసలు నువ్వెందుకెళ్ళావూ అక్కడకీ, ఇంత వయస్సొచ్చిన తరువాత ఒక్కణ్ణీ బయటకెళ్ళడానికి మీ ఇంట్లోవాళ్ళసలెలా ఒప్పుకున్నారూ…” వామ్మోయ్ ఎన్నెన్ని ప్రశ్నలో. వాటిలో దేనికీ సమాధానంచెప్పే పరిస్థితిలో లేను. అందుకే కదా, ఫ్రెండుని తీసికెళ్ళిందీ. చిత్రం ఏమిటంటే, నేను ఊహించినంత అన్యాయం కాదు, వెళ్ళీవెళ్ళగానే, మా ఇద్దరికీ కూర్చోడానికి కుర్చీలిచ్చారు. మంచినీళ్ళు కూడా తెప్పించారు. ప్రశ్నలన్నీ మాత్రం ఇవే !!

    పేద్ద గొప్పగా ఓ కాగితం మీద నాలుగు ముక్కలు వ్రాసి తీసికెళ్ళాను. ఠాఠ్ ఇంగ్లీషులో కాదూ, మరాఠీలో వ్రాసిమ్మన్నారు. ఏదో భాషంటే అర్ధం అవుతుంది కానీ, ఎప్లికేషన్ వ్రాసే ప్రావీణ్యం లేదాయె. పాపం నాతో వచ్చినతనే ఓ కాగితం మీద మరాఠీలో నేను చెప్పిన ” నిజాలు” వ్రాసిచ్చాడు, నాకు ఓ సంతకంతో సరిపోయింది. ఈ వివరాలన్నీ ఇంకో పోలీసు అదేదో ఫారం మీద, కార్బన్ కాపీ తీసి ఓ స్టాంపేసి, మా చేతుల్లో పెట్టాడు.ఇప్పుడు, ఈ వ్యవహారానికంతా ఎంతవుతుందీ అని అడగాలేమూ, అడిగితే మళ్ళీ ఏం గొడవో, హాఠ్ మమ్మల్నలా అడుగుతావా అని ఏ లాకప్పులోనో పడేస్తే, వామ్మోయ్… అయినా ధైర్యం చేసేసి, మా ఫ్రెండడిగేశాడు. దానికి ఆ పోలీసు మాకిచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు- ” ఇక్కడ మేముండేదెందుకుట? పబ్లిక్ కి సహాయం చేద్దామనే కదా. ఈ మాత్రం దానికి, ఎంతవుతుందీ అనడం, మమ్మల్ని insult చేసినట్టే…” అని మరాఠీలోనే అనుకోండి, చెప్పడం తో అనిపించింది, ఊరికే సినిమాల్లో చూసీ, ఏ దరిద్రుడో చెప్పిందీ విని, మనం ఊరికే అభిప్రాయాలు ఏర్పరుచుకో కూడదు. మన అనుభవం ఏమిటీ అన్నదే ముఖ్యం. అలాగని నేను కానీ, మా ఫ్రెండు కానీ వాళ్ళకి తెలియదు. ఎవరి ద్వారానూ వెళ్ళలేదు.

   మొత్తానికి ఈ కాగితాలూ, ఓ ఫొటో తీసికెళ్ళి, పది రూపాయలు మాత్రమే జుర్మానా కట్టి ఈవేళ నా కార్డు సంపాదించాను. మామూలుగా గవర్నమెంటాఫీసుల్లో, చేతులు తడిపితేనే కానీ పనులవ్వవూ, అదీ రిటైరయిన వారి సంగతైతే అడక్కండీ, ఎవ్వడూ మన మొహం చూడ్డూ, తిరిగి తిరిగి చెప్పులరిగిపోతాయీ blah..blah.. లాటివి విని విని, కాబోసేమో అనుకంటాము.

   కానీ అనుభవం మీద తెలిసిందేమిటంటే, మన way of approach మీద ఆధారపడి ఉంటుంది. మనం వెధవ్వేషాలేసి, పోజులు కొడితే చెయ్యాలనుకున్నవాళ్ళు కూడా చెయ్యరు… ఏమో బాబూ నాకైతే అనిపించింది.. “ మరీ అంత అన్యాయం కాదూ..” అని.

%d bloggers like this: