ఈవేళ ప్రొద్దుట అదేదో చానెల్, TV 9 అనుకుంటా, ఓ కార్యక్రమం వస్తోంది. దాంట్లో ఈమధ్యన నార్వే లో , భారతీయ సంతతికి చెందిన, ఇద్దరు చిన్నపిల్లల సంరక్షణా భారం గురించి, జరిగిన సంఘటన గురించి, ఓ కార్యక్రమం చూపించారు. వీళ్ళ కార్యక్రమం చూసినవారనుకుంటారూ, ఏదో మన దేశంలోనే, చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయన్నట్టూ, వాటిని అందరూ యతాతథంగా పాలిస్తున్నట్టూ, ఓ పేద్ద ఇమేజ్ తయారుచేసేశారు. మన ఆచారవ్యవహారాలూ, సంప్రదాయాలూ, అలవాట్లూ చూసుకుంటే, నార్వే ప్రభుత్వం వారు చేస్తున్నది వింతగా కనిపించొచ్చు. కానీ, అసలు వాళ్ళకి పిల్లలంటే ప్రేమే లేనట్టూ, అక్కడకి మనకే ఎంతో ప్రేమా, అభిమానమూ ఉన్నట్టూ చెప్పడం భావ్యం అంటారా? ఈవేళ్టి Indian Express లో వచ్చిన వార్తేమిటి మరి? అంటే మన పిల్లలైతే బెల్లం, ఇంకోరి పిల్లలైతే అల్లమూనా? అంతకంటే నార్వే ప్రభుత్వం వారే బెటర్ కదా, తమదేశస్థులా, బయటివారా అని కూడా చూసుకోకుండా, ఎవరైనా పిల్లలు పిల్లలే అని వారి సంరక్షణా భారం తీసికుంటున్నారు కదా. అదీ తప్పేనా మన మీడియా దృష్టిలో?
అవునూ, వాళ్ళ చట్టాలు వాళ్ళకుంటాయి. అది అర్ధం చేసికోవాలే తప్ప, ఏదో మనం వాళ్ళని ఉధ్ధరించేద్దామని అనుకోడం బుధ్ధితక్కువ. ముందుగా, ఈ మీడియావాళ్ళు, దేశంలో జరిగే అన్యాయాలగురించి high light చేయమనండి. తరువాత బయటి వాళ్ళసంగతి చూడొచ్చు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రమా మరీనూ? ఏదో ఒకటి రెండు చానెళ్ళు తప్పించి, ప్రతీ తెలుగు న్యూస్ చానెలూ, ప్రతీ రోజూ ఏదో ఒక విషయం తీసికోడం, దానిమీద “తమ” అభిప్రాయాలు, చూసేవాళ్ళమీద రుద్దడం. ఏదో ఆ ETV2 వాళ్ళు, మరీ ప్రతీ విషయాన్నీ, అతిగా sensationalise చేయరు, వాళ్ళ “నాయుడి” గారి గురించి మాట్టాడనంతవరకూ. అవునూ, ఆయనకి వీళ్లతో ఎన్నెన్ని లావాదేవీలో మరి. ఆమాత్రం సపోర్ట్ ఇవ్వడం మరి సమంజసమే. అలాగే ETV లో కూడా, కార్యక్రమాలు బాగానే ఉంటాయి. “పాడుతా తీయగా” మొదలెట్టింది వాళ్ళేగా. మరి ఆ కార్యక్రమానికీ, దాన్ని కాపీ చేస్తూ మొదలెట్టిన so called సంగీతకార్యక్రమాలకీ, వేషభాషల్లో తేడా లేదంటారా? అలాగే ETV2 లో ప్రసారమయ్యే వార్తలనండి,ప్రత్యేక కార్యక్రమాలు ” మార్గదర్శి” “తీర్థయాత్ర”, ” ఇదీ సంగతి” లాటివిబాగానే ఉంటాయి.
ఇంక మిగిలిన వాళ్ళు ఏదో న్యూస్ చానెల్ అనడం, దాంట్లో అణాకాణీ వాణ్ణేవళ్ళనో పిలవడం, వాళ్ళతో ” చర్చా” కార్యక్రమాలు పెట్టడం. నిన్నో మొన్నో చూశాను ఎవరో ముగ్గుర్ని పిలిచారు, అందులో ఒకాయన ఓ మతం వారుట, ఇంకోరు ఓ పురోహితుళ్ళా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళమీద ఒకళ్ళు అరుచుకోడం తప్ప, సాధించిందేమీ లేదు.
ఒక పరిస్థితిలో ఆ ప్యాంటూ,షర్టూ వేసికున్నాయన పక్కనే కూర్చున్న ఆ పురోహితుడి మీద చెయ్యి చేసికుంటాడేమో అని భయం వేసింది! ఇదంతా జరుగుతూంటే, ఆ యాంకరమ్మ కులాసాగా, నిర్వికారంగా నవ్వుతోంది. అసలే విజయవాడలోనూ, అమలాపురం లోనూ విగ్రహాల ధ్వంసం మీద కొట్టుకు ఛస్తున్నారు. ఆ టైములో ఇలాటి కార్యక్రమాలు అవసరమంటారా? మరి దీన్నే sensationalism అంటారు.
ఇంకో చానెల్ లో నిండా రాత్రి పదిన్నరైనా అవదు, తెలుగుసినిమాల్లోని titillating scenes అన్నీ ఓ హారం కింద గుచ్చి మరీ చూపిస్తారు. ఏ అర్ధరాత్రో వేసికోవచ్చుగా, అబ్బే TRP లు తగ్గిపోవూ? పైగా ఈ కార్యక్రమాల్లో బ్రేక్ లు కూడా ఉండవు. దీనికి యాంకరింగ్ ఓ అమ్మాయి చేస్తుంది. ఆవిడకి embarassing అనిపించదా? పైగా వీటన్నిటికీ ” సామాజిక చైతన్యం” అని అంటూంటారు. It is just disgusting. అక్కడికేదో నేను prudish అనుకోకండి. ఇలాటివన్నీ చూపించుకోడానికి ఓ చానెల్ మొదలెట్టుకోమనండి డబ్బులు మూలుగుతూంటే. అంతే కానీ news channel అని పేరెట్టి, ఇలాటి blue films చూపించఖ్ఖర్లేదు. ఏదో ఆ Press Council Chairman కట్జూ ఏదో అంటే, ఆయనమీద ఎగిరేశారు, freedom of speech, freedom of media… అంటూ, మెడమీద తలున్న మన జర్నలిస్టులు.. ఇలాటివాళ్ళందరికీ బయట దేశాల్లోని చట్టాలుండాలి.
ఇప్పటికైనా అర్ధం అవుతుందనుకుంటా మనవాళ్ళకి, నార్వేలో పిల్లల విషయంలో చట్టాలు ఎలా ఉంటాయో, ఎందుకుంటాయో. ముందుగా మన ఇల్లు చక్కబెట్టుకున్న తరువాత, బయటి వారి సంగతి మాట్లాడదాం…
Filed under: Uncategorized |
మాస్టారూ…
ఈటీవీ2లో ఇదీ సంగతి కార్యక్రమం రూపొందించే బృందానికి సుమారు రెండున్నరేళ్ళ నుంచి నాలుగైదు నెలల క్రితం వరకూ నేనే నాయకత్వం వహించానండీ. మీ లాంటి పెద్దల నోట మా కార్యక్రమానికి… “పర్వాలేదు” అన్న మాట రావడం ఆనందకరం.
రాజకీయ పాక్షికత వంటి వాటి విషయంలో యాజమాన్యం చెప్పినట్టు చేయడం తప్పదు… ఎక్కడయినా, మీకు తెలియనిది ఏముంది? కానీ కేవలం టీఆర్పీల కోసం పరిధులు దాటడం పొరపాటునయినా కూడదని మాకు నిర్దుష్టమయిన ఆదేశాలున్నాయి.
ఓ చిన్న, తాజా ఉదాహరణ చెబుతాను. 2011 డిసెంబరు 31 అర్ధరాత్రి వేడుకల గురించిన కొన్ని దృశ్యాలు జనవరి 1 పొద్దున్న వేస్తున్నాం. విశాఖపట్నంలో ఒక పంచతారల పూటకూళ్ళ ఇంటి వారి ( డాల్ఫిన్ కాదు లెండి ) ప్రత్యేక కార్యక్రమంలో…. నడి వయసు జంటలు తమ పిల్లల ముందు సామూహికంగా మందు కొడుతూ ముద్దులు పెట్టుకుంటూ గెంతులు వేశారు. మొదట ఆ ఐటం వదిలేశాను. ఆ తర్వాత… హైదరాబాద్లో… పార్టీలో తప్పతాగిన మహిళలు ఇంటికి పోతూ రోడ్ మీద యాక్సిడెంట్ చేశారు. దానితో నాలోని దురద రాక్షసుడు నిద్ర లేచాడు. మద్యపానం ఆపమని మనం ఎవరికీ చెప్పలేం… ఇష్టమున్న వాళ్ళని ముద్దులు పెట్టుకునే వ్యక్తిగత స్వేచ్చనీ కాదనలేం… కానీ అలాంటి పనుల వల్ల ప్రభావాలు ఇలా ఉంటాయని సజెస్టివ్గా చెప్పవచ్చు కదా. అందుకే… ఆ రెండు వార్తలూ ఒకదాని తర్వాత ఒకటి పెట్టాను. నిజానికి నా జూనియర్లు “ఆ వార్తలు వేస్తే కష్టమేమో సార్” అని చెప్పారు కూడా. బాధ్యత నాదీ అని వారిపై ఒత్తిడి చేసి మరీ ఒకే ఒక బులెటిన్లో ఆ రెండు వార్తలూ వేయించాను.
ఆ నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి కాల్ వచ్చేసింది… ఎందుకా వార్తలు వేశావూ… అని. ముందు మా ఇమ్మీడియట్ బాస్, తర్వాత మా మేనేజర్… ఇద్దరూ నన్ను ఒకమోస్తరుగా కడిగి పాడేశారు. నా వివరణ నేను ఇచ్చినా… వారు సంతృప్తి చెందలేదు. ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడమని చిన్నపాటి క్లాసు పీకారు. ( వాళ్ళకి అప్పటికే మా చైర్మన్ నుంచి అక్షింతలు పడ్డాయట. )
ఇలాంటి విషయాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్చ మా చానల్లో ప్రస్తుతానికి పరిధులకు లోబడే ఉంటొంది… అని చెప్పడానికే నా ఈ సొద.
ఫణీంద్ర
LikeLike
ఫణిబాబుగారూ,
ఈ కోవలోకి చెందేవి ఇంకో రకమైనవి కూడా ఉన్నాయి. న్యూస్ పేపర్లలో యాక్సిడెంట్లు, హత్యలు, నేరాలకు సంబంధించిన వార్తలు. ఆ రక్తసిక్తమైన శవాల ఫోటోలను క్లోజప్ లో వేస్తారు. ఒక్కోసారి ఇంకా ఘోరంగా నేలమీద పడ్డ రక్తపు మరకల్ని ప్రత్యేకంగా వేరే ఫోటోతీసి మరీ ప్రచురిస్తారు. దీనివలన ఏమాత్రమైనా ప్రయోజనం ఉంటుందా? అలాంటివి రోజుకి పదిసార్లు వార్తాపత్రికల్లోనూ, టీవీల్లోను చూసి చూసి పిల్లల్లో సెన్సిటివిటీ పూర్తిగా దెబ్బతింటుందని ఈ మహానుభావుల బుఱ్ఱలకు తట్టదా? దీనికి సెన్సారింగ్ అన్నది ఉండదా? ఈ ప్రశ్న నాకు నిజంగా తెలియకనే అడుగుతున్నాను. పైన వ్యాఖ్యించిన ఈ-టీవీ ఫణీంద్రగారు ఏమైనా జవాబు చెప్పగలరేమో చూద్దాం.
భవదీయుడు
వర్మ
LikeLike
వర్మ గారూ…
మా వరకూ మేం ఈటీవీ-2లో… యాక్సిడెంట్ల దృశ్యాలను బ్లాక్ అండ్ వైట్లోకి మార్చి వేస్తున్నాం. వీలయినంత వరకూ క్లోజప్ షాట్లు వాడకుండా వదిలేస్తుంటాం. ఎంత ప్రయత్నించినా అప్పుడప్పుడూ పొరపాట్లు దొర్లుతూ ఉంటాయనుకోండి. అవి పూర్తిగా మానవ తప్పిదాలే. చిత్రం కంటే దృశ్యం మరింత బీభత్సం కదా. కాబట్టి అలాంటి దృశ్యాలను పరిహరించడానికి గరిష్ట ప్రయత్నం చేస్తున్నామని చెప్పగలను.
ఫణీంద్ర
LikeLike
@ఫణీంద్రా,
మీరు ఇచ్చిన వివరణ, చాలా అపోహలని తొలగించింది. మీరు చెప్పినట్టు కొన్ని పరిధులకి లోబడే చేయగలరు. నిజమే. ఈవేళ ఓ కార్యక్రమం చూశాను ఓ చానెల్ లో- అక్కడెక్కడో అశ్లీల రికార్డింగ్ డాన్సులు జరిగాయిట, టివి లో అదేదో మహిళా సంఘం ప్రతినిధీ, ఇంకో లాయరూ ఏమిటేమిటో జ్ఞానబోధలు చేసేస్తున్నారు! మన సినిమాల్లోనూ, ఎవార్డుల ఫంక్షన్లలోనూ, ఎంటర్టైన్మెంటు ముసుగులో చేసే గెంతులు గురించి మాట్టాడే ధైర్యం ఉందా వీళ్ళకి? Why these double standards and hypocrisy ?
@అబ్బులూ,
మీరడిగిన సందేహానికి ఫణింద్ర సమాధానం చూశారు కదా .. ఊరికే మనం మొత్తుకోడమే కానీ, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఉత్తి కంఠసోష…
LikeLike