బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అందుకే అన్నారు హాయిగా కొంపలో కూర్చోండీ అని….


    ఈ మధ్యన మాఇంటావిడకి అగస్థ్యతో బిజీ అయిపోవడంతో, ఆవిడ పేరున వస్తున్న మిస్టరీ షాపింగులు, నేనే కానిచ్చేస్తున్నాను.ఏంలేదూ, అగస్థ్య అని ఉత్తినే వంక, ఆవిణ్ణి తీసికెళ్తే బస్సుల్లో కుదరదాయె, ఆ ఏజన్సీ వాళ్ళేమో టి.ఏ. ఇవ్వరూ, మరీ ఆటోల్లో వెళ్ళిచేస్తే కిట్టుబాటవదు, ఏదో సరాదాగా ఉంటుందనీ, కాలక్షేపానికీ చేస్తున్నాకానీ, మరీ చేతి డబ్బులు వేసి చేయాలన్న “త్యాగబుధ్ధి” ఏమీ లేదు! నాకూ బాగానే ఉంటోంది, అస్తమానూ నాకే కాకుండా, ఇంట్లోవాళ్ళకీ తెస్తూంటాను. మొన్నెప్పుడో Rebok కి వెళ్తే, అక్కడ, మా పెద్ద మనవరాలికి బావుంటుందని అదేదో Wristband ట, ఇదివరకు ఎప్పుడైనా చూశానా ఏమిటీ, బావుంటుంది కదా అని కొన్నాను.ఆ మర్నాడు Adidas కి వెళ్ళవలసివచ్చింది. వాళ్ళిచ్చేదేమో ఏ అయిదువందలో, దాంట్లో ఇలాటి పెద్ద బ్రాండెడ్ కొట్లకి వెళ్తే ఏం వస్తుందీ, మహ అయితే Wristband లూ, Socks, Sweatband లూనూ! అసలు ఇలాటివి ఉంటాయనికూడా తెలిసిన మొహమంటారా నాది? ఏదో టి.వీ.ల్లో చూసినప్పుడు ఆహా..ఓహో .. అనుకోడం! ఈ రెండో కొట్లో కెళ్ళినప్పుడు, మా చిన్న మనవరాలికి ఓ టి-షర్ట్ కొని తెచ్చాను. వాళ్ళ తమ్ముడి పుట్టినరోజుకి, తనకీ ఓ గిఫ్ట్ దొరికేటపటికి ఎంత సంతోషించిందో వెర్రి తల్లి! వాళ్ళ అమ్మా నాన్నా కొంటారు ఏం కావలిసిస్తే అది, కానీ నానమ్మ తాతయ్యల దగ్గరనుంచి వచ్చే surprise gift లో ఉండే మజాయే వేరు!అలాగే సాయంత్రం అమ్మాయీ అల్లుడూ పిల్లలూ వచ్చినప్పుడు, మా పెద్దమనవరాలు తాన్యా చేతిలో, తెచ్చిన Wristband పెట్టేటప్పటికి, వాళ్ళమొహాల్లో కనిపించే ఆనందం , మనకు కలిగే సంతోషం, ఎన్ని లక్షలు పెడితే వస్తుందండీ?

   ఏమైనా మీ జేబులోంచి డబ్బులు ఖర్చుపెడుతున్నారా ఏమిటీ అని అడక్కండి. డబ్బెవరిదీ అని కాదు కొశ్చనిక్కడ, ముళ్ళపూడి వారి భాషలో చెప్పాలంటే ” కలాపోసణ..: అది కావాలి బాబూ! అందువలన ఏతావాతా చెప్పాలంటే, ఏదైనా చెయ్యాలీ అంటే ముందర మనసుండాలి, మిగిలినవి వాటంతట అవే వచ్చేస్తాయి. రిటైరయిపోయిన తరువాత మనకేమీ అంత ఆర్ధిక స్థోమత ఉండదు, పైగా ఈ పిల్లలకి వాళ్ళ అమ్మానాన్నల లాగ ‘కొండమీది కోతినైనా” తేగలమా ఏమిటీ? ఏదో మనకున్నదానిలో,ఏదో ఒకటిస్తూండడం. పూర్వపురోజుల్లో, మా కజిన్ అన్నయ్యగారొకరుండేవారు, వరసకి అన్నయ్యే కానీ, మా నాన్నగారికంటె పెద్దాయన. ఆయనకో అలవాటు, ఎప్పుడు వచ్చినా బస్ స్టాండులో దిగ్గానే, ఓ మిఠాయి కొమ్ముల పొట్లం తెచ్చేవారు. తామరాకులో ఆ మిఠాయి కొమ్ములు తింటూంటే వచ్చే ఆ తాదాత్మ్యం అసలు మర్చిపోగలమా? చిత్రం ఏమిటంటే, ఆయన ఆ అలవాటు, ఆయన పోయేదాకా వదల్లేదు, అప్పుడెప్పుడో, నాకు యాభై ఏళ్లొచ్చిన తరువాతకూడా, నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు, అలాగే అలాటి తామరాకులోనే కట్టిన మిఠాయి కొమ్ములు తెచ్చేటప్పటికి, మరి కన్నీళ్ళొచ్చాయంటే రావు మరీ? అలాటి తీపి జ్ఞాపకాలు ఎన్నైనా గుర్తుచేసికోవచ్చు. Thats what nostalgia is all about... అదే ఇప్పటి వాళ్ళుమిస్ అవుతున్నారనే బాధల్లా! ఈ రోజుల్లో జరిగేదేమిటీ అంటే, మనం ఏదైనా తీసికెళ్ళినప్పుడు ఆనందం ఉంటుంది, కానీ అది momentary ఏమో అనిపిస్తుంది. అప్పటి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి.

   ఈ సందర్భం లో ఈవేళ ఆవిడకొచ్చిన మిస్టరీ షాపింగుకి వెళ్ళాల్సొచ్చింది. చేయవలసిన రోజుకి ముంబై నుండి, ఫోను చేసి remind చేస్తూంటారులెండి. నేను లేని టైములో మళ్ళీ వాళ్ళు ఫోను చేస్తారేమో అని, ఆవిడ సెల్ నాతో తీసుకుపోయాను, ఎందుకైనా మంచిదీ అని. వెళ్ళినచోట పని పూర్తవగానే, బయలుదేరుతున్నానని ఫోను చేయడం ఓ అలవాటూ, ఏం లేదూ, కొంప చేరేటప్పటికి కుక్కరు పెట్టేస్తుందికదా అని, ” దేముడి మీద భక్తి కాదు, ప్రసాదాలమీద..” అన్నట్టుగా!As usual నా ఫోను లోంచి, ఒకటి నొక్కి( Speed dial) చేస్తే, రింగవుతుంది కానీ ఎత్తదే ! అసలు ఎలా తెలుస్తుందండీ ఆవిడకీ, ఆ సెల్లేమో నా జేబులో ఉన్నదాయే! ఏదో బయట వరెండాలో బట్టలారేస్తూ, వినిపించుండకపోవచ్చూ అనుకున్నానే కానీ, ఆవిడ సెల్ నాజేబులోనే ఉందని గుర్తురాలేదు! పైగా ఆవిడ ఫోను నా జేబులోనే ఉందికదా అని బస్సెక్కినతరువాత గుర్తొచ్చి చూస్తే, దాంట్లో ఓ missed call ఉంది. పోనీ ఎక్కణ్ణుంచో అని చూసుకోవచ్చా, అదీ లేదూ, తెయ్యిమంటూ నొక్కేయడం. పాపం అది మాత్రం ఏం చేస్తుందీ, నాదగ్గరనుండి వచ్చిన కాలే కదా, నా ఫోను రింగయింది.caller ID చూస్తే, మా ఇంటావిడదగ్గరనుండీ అని తెలిసింది. హల్లో.. హల్లో .. అంటే సమాధానం ఉండదే !! రెండు ఫోన్లూ దగ్గరే ఉంచుకుని, సమాధానం లేదే అని ఏడవడం ఓటా !!

    ఈ సోదంతా ఇంటికొచ్చి, మా ఇంటావిడతో చెప్తే అంటుందీ–” అందుకేనండి బాబూ అరవై ఏళ్ళొచ్చిన వాళ్ళందరికీ రిటైర్మెంటూ..” అని.

Advertisements

8 Responses

 1. అందుకేనండి బాబూ అరవై ఏళ్ళొచ్చిన వాళ్ళందరికీ రిటైర్మెంటూ – మహబాగా చెప్పారు.

  Like

 2. avunu nijam. super

  Like

 3. ఓ చిన్న కాడ్బరీ తీసుకెళ్ళినా పిల్లలు సంతోషపడిపోతారు . బాగా రాసారు .

  Like

 4. మిఠాయి పొట్లం తెచ్చివడం అనేది నాలో ఎన్నో జ్ఞపకాలు. మా అమ్మమ్మకు నలుగురూ అమ్మాయిలే. అందుకని మా పెద్దమ్మ కొడుకుని చిన్నప్పటి నుంచి పెంచిది. వాడు కాలేజిలో చేరేసరికి ఏడాది వయస్సున్న నన్ను తన దగ్గరికి తీసుకెళ్లింది. నాకు పదకొండేళ్లు వచ్చేవరకు అమ్మమ్మ దగ్గరే పెరిగా. నా పదకొండేళ్ల వయస్సులో మొదటిసారి మా అమ్మానాన్నల్ని గట్టిగా చాలాసేపు చూసే అవకాశం వచ్చింది. అదీ మా నాన్నకు హైదరాబాదుకు బదిలీ కావడం వల్ల.
  మార్కెట్టుకు పోయిన ప్రతిసారీ కోన్ లా చుట్టిన కాగితంలో మిఠాయి తెచ్చేది. ఆ అలవాటు నేను పెద్దవాణ్ణయి, మా అమ్మాయికి పదకొండేళ్లు వచ్చేదాకా, మా అమ్మమ్మ 103 ఏట కాలం చేసేదాకా సాగింది. హైదరాబాదు వచ్చేటప్పుడు కాగితం పొట్లంలో మిఠాయి తెచ్చేది. నేను అన్నం కూడా మానేసి ఆ మిఠాయి తింటుంటే మా ఆవిడా, కూతురు నవ్వేవాళ్లు. తాతమ్మ వస్తున్నదంటే నాన్న (నేను) అన్నం మానేసి మరీ ఎదురుచూస్తాడని ఎగతాళి చేసేవాళ్లు. ఏడేళ్ల క్రితం భవగదైక్యం చెందిన అమ్మమ్మ గుర్తుకు వచ్చింది ఈ కథనం చదవగానే.

  Like

 5. ఆఖరున పిన్నిగారన్న మాట చాలా బాగుంది………

  నిజమేనండీ అలాంటి చిన్న చిన్న సంతోషాలు లక్షలు ఖర్చు పెడితే మాత్రం వస్తాయా……?

  Like

 6. ఆయ్, మా లక్కు చూడండీ, కొంపలోనే కూర్చున్నా , రొజూ ‘న్యూ’ ‘జింగ్’ మిటాయి పొట్లం మాకు మీరు పొద్దుటే ఇవ్వడం! ఇది కూడా ‘ఆది’ దాసు డిచ్చిన ‘స్వీట్ బాండు’ కదండీ !

  చీర్స్
  జిలేబి.

  Like

 7. మిఠాయిపొట్లం గుర్తుచేసి బాధపెట్టినా చివరిలో చమక్కు బాగుంది.
  ఎంతైనా మా పిన్నిగారన్నదే కరెస్టూ.. 🙂

  Like

 8. @శ్యామలరావుగారూ,

  అలా అన్నది, మా ఇంటావిడండి బాబూ.. అప్పుడప్పుడు ఏదో కొద్ది తమాషాలు జరిగినా, మొత్తంమీద ఏదో ఒక వ్యాపకం పెట్టుకోడానికి ఎప్పుడూ సిధ్ధమే…

  @శర్మగారూ,

  మీరు దేనికి “సూపర్” అన్నారు? మీ చెల్లెలన్నదానికా…

  @మాలాకుమార్ గారూ,

  థాంక్స్..

  @పూర్ణప్రజ్ఞాభారతి గారూ,

  నేను వ్రాసిన “తామరాకులో మిఠాయి కొమ్ముల” పొట్లం గురించి చదివి, మీ మధురజ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు సంతోషం… నేను వ్రాసే టపాల ఉద్దేశ్యం కూడా అదే. ఏదో నాకు గుర్తొచ్చినవి వ్రాసినప్పుడు, మీలాగే ఎందరో తమతమ జ్ఞాపకాలు పంచుకున్నారు…

  @మాధవీ,

  ఔను తల్లీ, పిన్నిగారి మాటే బావుంటుంది…

  @జిలేబీ,

  వామ్మోయ్… థాంక్స్…

  @శ్రీనివాసా,

  ఎంతైనా ఓ జిల్లావాళ్ళూ, ఆవిడ చెప్పిందే బావుంటుంది…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: