బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “కొత్త” తో వచ్చే కష్టాలు…


   అనవాయితీగా ఉండేదానికి ఎప్పుడైనా మార్పు లాటిది వస్తే అంతా గందరగోళమే! ” పాత” స్థానంలో “కొత్త” వచ్చినప్పుడు, వచ్చే ఈతిబాధల గురించి ఈ టపా. చాలామందికి ఇలాటి అనుభవాలు ఎదురయ్యే ఉండొచ్చు.

   పసిపిల్లల్ని చూడండి, ఇంట్లో వాళ్ళదగ్గర “ఎత్తు” అలవాటైపోయి, ఎప్పుడేనా ఇంటికి కొత్త వారొచ్చినప్పుడు, ససేమిరా వారిదగ్గరకు వెళ్ళరు. కొంపమునిగి పోయినట్టు ఏడుపోటీ! చూసేవాళ్ళనుకుంటారూ, ఆ వచ్చినావిడో, వచ్చినాయనో గిల్లేడా ఏమిటీ అని! అప్పటికీ పాపం ఆ కొత్తాయన భార్య అంటూనే ఉంటుంది, అదేమిటండీ, పసిపిల్లలు మీదగ్గరకి తొందరగానే వస్తూంటారూ, ఇదేమిటీ ఈ పిల్ల/పిల్లాడు ఇంతలా ఏడ్చేస్తున్నాడూ, ఏమైనా చేశారా ఏమిటీ అని! ఔనుకదూ, ఇదేమిటీ ఇలా వీధినపెట్టేశాడూ అని, ఆ పిల్లనో/పిల్లాడినీ ఇంట్లోవాళ్ళకి ఇచ్చేసి ఓ కుర్చీలో కూలబడతాడు. పాపం ఆ ఇంట్లోవాళ్ళే ఈయన ఫీలింగ్స్ హర్ట్ అయ్యేయేమోనని, మావాడికి “కొత్త” అండీ. లేకపోతే అసలు ఏడుపనేదే తెలియదు వాడికీ అని ఓ సంజాయిషీ ఇచ్చి ఆ ప్రకరణానికి తెర దింపుతారు.

    అలాగే ఆఫీసుల్లో పనిచేసేవారిని చూస్తూంటాం. ఇదివరకటి రోజుల్లో ఈ attendance recorders ఉండేవి కావు. కానీ వచ్చీరాగానే ఓ రిజిస్టర్ లో సంతకాలు పెట్టవలసొచ్చేది. కానీ ఈ attendance recorders వచ్చిన తరువాత జనాలు, గేటులో ఉండే వీటిలో రికార్డ్ చేసేసి, వాడితోనూ,వీడితోనూ బాతాఖానీ వేసికుని, మెల్లిగా చాయ్ టైముకి రావడం. ఓ సారి మొహం చూపించేసి, మళ్ళీ ఎక్కడకో మాయం అయిపోవడం, అక్కడికేదో పెద్ద పనున్నట్టు. ఆ ఆఫీసు హెడ్డు మాత్రం ఎన్నాళు సహిస్తాడూ ఈ దాష్టీకం? ఆఫీసులోకి ఎన్నింటికి వస్తున్నాడూ అనేది, ఓ రిజిస్టర్ లో వ్రాసి ఓ సంతకం పెట్టమంటాడు. ఇంక వీళ్ళ ఆటలకి కట్టు కదా! ఇలాటి “కొత్త” పధ్ధతులు వచ్చినప్పుడు పాపం ఎవరికైనా కష్టమే కదా!

   ప్రతీరోజూ షూస్ వేసికోడం అంటే ఎవరికైనా శ్రమే కదా. ఏదో ఉద్యోగంలో ఉన్నంతకాలం అయితే విధాయకం. రిటైరయిన తరువాత చేతినిండా కావలిసినంత టైమూ. ఊళ్ళోఉండే స్నేహితుల్నీ, చుట్టాల్నీ నెలకోసారైనా కలిస్తే, వాళ్ళని చూసినట్టూ ఉంటుందీ, పైగా రేపెప్పుడో ఈ లోకం నుండి వెళ్ళిపోతే, ఆ నలుగురైనా చూడ్డానికి వస్తారూ అని. ఉద్యోగంలో ఉన్నంత కాలం వీళ్ళెవరో, ఎక్కడుంటున్నారో, ఉన్నారో ఊడేరో కూడా తెలిసికోడానికి ప్రయత్నించలేదు. అది వేరే విషయం, వదిలేయండి. అలాగే గుళ్ళూ గోపురాల దర్శనాలు కూడా ఎక్కువౌతాయి. కాళ్ళకి షూస్ వేసికుని ఎక్కడెక్కడకు వెళ్తారూ, పైగా ఓసారి తీసిన తరువాత, మళ్ళీ ఆ తాళ్ళు ( లేసులు) వేసికోవాలంటే, ఒంటి కాలు మీద నుంచొని, భరత నాట్యం, కథకళి చేయాలి ఒక్కొక్కప్పుడు. అలాగే గుడి బయట షూస్ వదిలేస్తే, బయటకి వచ్చేటప్పటికి ఉంటాయో లేదో అని ఓ భయం. ఇలా కాదని, ఓ చెప్పుల జతోటి తీసికుంటారు. నూటికి తొంభై పాళ్ళు ఈ ” కొత్త” చెప్పులు “కరవ” కుండా వదలవు. ఆ పుండేదో మానేదాకా, వాటిమీద band aid లూ అవీ వేసికోడం. ఎవరైనా అడిగినా అడక్కపోయినా, ఈ” మాసికలు” చూస్తే తెలిసిపోతుంది, మాస్టారు ” కొత్త” చెప్పులు కొనుక్కున్నారోచ్ అని !

   ఇంక మనవైపు కాలవల్లో నీరు బ్రౌన్ గా ఉందంటే చాలు, గోదారికి ” కొత్త” నీరొచ్చినట్టుందిరోయ్ అనే మాట వినిపిస్తుంది. అలాగే మనం ఎక్కడైనా “కొత్త” ఊరికి ఏ బదిలీ మీదో వెళ్ళేమంటే, అన్నీ కష్టాలే. ఓ కొంప దొరకదు, మాట్లాడాలంటే ఓ మనిషి దొరకడు. కిరాణా కొట్లలో అరువివ్వరు, పాలవాడికం వాడుకూడా డబ్బులు ముందరే ఇవ్వమంటాడు, ఇలాటివన్నీ ఈ రోజుల్లో ఎక్కళ్ళెండి అనకండి. ఇప్పటి తరం వారికి ఇవన్నీ వింతగా అనిపించొచ్చు, మీ ఇంట్లో ఉండే పెద్దవారిని అడిగితే తెలుస్తుంది. మీకు మాత్రం “కొత్త” ఊళ్ళో, స్కూలుకీ, కాలేజీకీ వెళ్ళినప్పుడు, మిమ్మల్నేమైనా :హారతులు” ఇచ్చి ఆహ్వానించారా ఏమిటీ? “కొత్త” వాతావరణం లో ఇమడ్డానికి మీకూ టైము పట్టే ఉంటుందిగా. మర్చిపోయుంటారు!

   మన Traffic Police వాళ్ళకి ఉండుండి ఐడియాలొచ్చేస్తూంటాయి. ఎవరో ఏ కమీషనరో సాయంత్రం పూట కారులో వెళ్ళినప్పుడు, ఏ ట్రాఫిక్కు జాం లోనో ఇరుక్కుపోయుంటాడు. అంతే మర్నాడు ఆఫీసుకెళ్ళీ వెళ్ళగానే ఓ ఆర్డర్ పాస్ చేయించేస్తాడు. ఈ అర్ధరాత్రి నుంచీ ఫలానా రోడ్డు One Way అయిపోయిందోచ్ అని. మర్నాడు అలవాటు ప్రకారం ఆ రోడ్డుమీద ఝూం అని వచ్చిన బైక్కు వాడికో, కారు వాడికో, ఆ రోడ్డు చివర్లో ఓ కాన్స్టేబుల్, ఆ వాహనం ఆపి, ఓ చలాన్ చేతిలో పెడతాడు. ఇదంతా ఏమిటీ, రాత్రికిరాత్రి మారిపోయిన, “కొత్త” రూట్ ధర్మం!

   అసలు ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈమధ్యన, నేను ఓ టపా వ్రాశాను, దాంట్లో గొప్పగా నేను “కొత్త” గా కొనుక్కున్న “టోపీ” తో ఓ ఫొటో కూడా పెట్టాను. ఊరికే బ్లాగుల్లో పెడితే సరిపోతుందా ఏమిటీ? అందరికీ తెలియాలి కదా. ఎప్పుడూ, అదేదో క్యాప్ పెట్టుకుని తిరిగే మానవుడు, ఇలా “కొత్త” గా క్యాప్పు పెట్టుకుంటే గుర్తించడం ఎలా? ఎవరికి తెలిసినా, తెలియకపోయినా కుక్కలకి మాత్రం తెలియకపోతే అంతా గందరగోళమే! అదేం ఖర్మమో, భుజానికి ఓ సంచీ, నెత్తిమీద ఈ టోపీ పెట్టుకుని వెళ్ళేటప్పటికి, అదీ “కొత్త ” చోటులో, ఇంక అడగొద్దు. నిన్న ఏదో మిస్టరీ షాపింగుకి వెళ్తూ, కొద్దిగా స్టైల్ చూపిద్దామూ అనుకుని, ఈ ” కొత్త” వేషం లో బయలుదేరాను. ఆ ఆఫీసుండే రోడ్దు మీదకు వెళ్ళానో లేదో, అక్కడే ఉన్న ఓ పేద్ద కుక్క, నన్ను చూసి పాపం ఎవరనుకుందో ఏమిటో, భౌ భౌ మని గుండెలదిరేలా, నా వెనక్కాల పడింది. దీన్ని చూసి ఆ వీధిలో ఉన్న మిగిలిన కుక్కలూ! అక్కడున్న అంతమందిలోనూ ఒక్కడంటే ఒక్కడు నా rescue కి రాలేదు! ఆఖరికి నెత్తిమీద టోపీ తీసేసేదాకా అవి నన్నొదల్లేదు!

   ఇందులో నేర్చుకున్న నీతి ఏమిటంటే ఏదో బస్సుల్లోనూ, బిల్డింగుల్లోనూ కానీ, ఇలా రోడ్లమీద “కొత్త” వేషాలు వేసి ప్రాణం మీదకు తెచ్చికోకూడదూ అని….

Advertisements

9 Responses

 1. కొత్త గుర్రం…..కొత్త…..లొంగదీసుకోడానికి సమయ పడుతుందన్నాడు శాస్త్రకారుడు.!!!

  Like

  • @kastephale గారు

   గురువు గారూ ఆ శాస్త్ర కారుడు చెప్పిన విషయమేదో పూర్తిగా చెప్పచ్చుకదా ఆ రెండో “కొత్త” ఏంటో అర్థం కాక చస్తున్నా. ఏంటో ఈ పెద్దోళ్ళు ఏదీ పూర్తిగా చెప్పరు కదా!! 🙂

   Like

 2. బాబోయ్! రెండోది చెబితే నా వీపు విమానం మోతే!!!

  Like

 3. aa rendodi jeevana bhagaswami kadaa. shankar garuu, nijamgaa teliyakane adigara? LOL.

  Like

 4. రెండోది చెప్పకపోయునా.. గుర్రం బదులుగా గాడిదను వాడివుంటే.. మాకే అర్ధం అయ్యిపొయోదేమో.. :), అయ్యబాబోయ్.. ఎక్కడ విమానంమోతొస్తుంది.. సారీ నేనిక్కడేం మాట్లాడలేదు.. చూడలేదు. :):)

  బాబాయ్ గారూ మీరు మాత్రం సూపరూ.. కొత్త మీద కొత్తగా భలే రాసారు.

  Like

 5. మీరు టొపితో ఉన్న ఫోటో ఎంతో బాగుంది,
  ఆ కుక్కలకేమి పోయే కాలం వచ్చిందో,
  దొర బాబులా ఉన్న మీ వెంట అలా వెంట పడ్డాయి!
  ఇంట్లో దిష్టి తీయమని చెప్పండి.
  టోపీ వేసుకోవడం maaneyavaddu

  Like

 6. అయ్యో అలా జరిగిందా…..టోపీ నిజంగా బాగుంది…
  వాటికి మీరు కొత్తగా కనబడినా కనబడకపోఇనా మాకు ఈ ‘కొత్త ‘ తో ఆ కొత్త టోపీ తో కొత్త సంవత్సరాన్ని అందించారు…
  మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు…
  కాస్త ఆలస్యంగా…

  Like

 7. @శర్మగారూ,

  అదేదో… అని కొద్దిగా అనేసి ఊరుకున్నారు. దాన్ని కాస్తా పూర్తిచేసేస్తే మీ సొమ్మేంపోయిందీ… మా “ఒకే ఒక్క శంకరుడు” ఊరికే తహతహలాడిపోతున్నాడాయె…

  @వేణూ శ్రీకాంత్,

  ధన్యవాదాలు..

  @శంకరా,

  నీ తరపున అడిగేశాను కదా. శర్మగారు ఏమిటో పబ్లిక్కు గా చెప్పడానికి మొహమ్మాట పడుతున్నారనుకుంటా…

  @శ్రీనివాసా,

  థాంక్స్..

  @మోహన్ గారూ,

  ఏం చెయ్యను చెప్పండి? అయినా నా జాగ్రత్తలేవో తీసికుంటున్నాను లెండి. కుక్కేదైనా కనిపిస్తే చాలు, టోపీ తీసేసి దానికో శాల్యూట్ చేసేస్తున్నాను… కుక్కల్నేమైనా అంటే చాలామంది ఫీలింగ్స్ హర్టవుతాయి మళ్ళీ అదో గొడవా …

  @మాధవీ,

  థాంక్స్.. అందుకేగా మా ఇంటావిడ నా లుక్ అంతా మార్చేసింది, “కొత్త” సంవత్సరంలో…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: