బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–just give a thought…


    ఏ టపా అయినా మొదట్లోనే ..” మా చిన్నప్పుడు…” అని మొదలెడితే, చదివేవాళ్ళనుకుంటారు- “బాబోయ్ మళ్ళీ మొదలెట్టాడురా బాబూ ఈయన జ్ఞానబోధలు..” అని. కానీ ఏ విషయమైనా ఇంకోదానితో పోల్చినప్పుడే కదా తెలిసేది లోటుపాట్లు. అందువలన, మరీ చిరాకు పడకుండా ఓసారి చదివేయండి. మీరే చెప్తారు- నిజమేనండీ.. అని. అందుకోసమే కదా పేపర్లవాళ్ళు చేసే సర్వేలూ అవీనూ. మనకి అంత స్థోమత లేదుకాబట్టి, ఎప్పుడో జరిగిన విషయాలు ఈనాటి వాటితో పోల్చడం అన్న మాట. ఏదో వ్రాసే ఓపికుంది కాబట్టి టపాల్లో పెట్టడం.

    ఇదివరకటి రోజుల్లో, పుస్తకాలు చదవడం ఎందుకు అలవాటయ్యేదీ అని ఒకసారి ఆలోచిస్తే, మీకే తెలుస్తుంది. అప్పుడు ఈ రోజుల్లోఉన్నన్ని మాధ్యమాలుండేవి కావు అనేదో కారణం. ఇంట్లో ఏదున్నా లేకపోయినా ఓ న్యూస్ పేపరోటి తెప్పించేవారు. ప్రతీ రోజూ అది చదవడం ఓ నియమం లా ఉండేది. సినిమా ఖబుర్లేనా తెలుస్తాయని, తప్పకుండా చదివేవారు.నేను చెప్పేది చిన్న పిల్లల గురించి ప్రస్తుతం. వయస్సొచ్చే కొద్దీ కిళ్ళీ కొట్లలో పది పైసలకీ, ఇరవై పైసలకీ అద్దెకు తెచ్చి, ఏ క్లాసు పుస్తకంలోనో దాచుకుని మరీ చదివేవారు. ఏదో ఒకటీ పుస్తకపఠనం అనేదానికి hook అయిపోయేవారు. పెద్దయ్యేకొద్దీ అదో వ్యసనంలా మారిపోయేది. వయస్సుతో వచ్చిన జ్ఞానం అనండి, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పగా అయితేనేమిటనండి, తెలుగు,ఇంగ్లీషు సాహిత్యాల్లో చాలా మంది చాలా పుస్తకాలు చదివారు. ఊరికే చదివేసూరుకోడం కాదు, అప్పుడు చదివిన పుస్తకాలు జీవితాంతం గుర్తుంటాయి. అది ఓ టెంపోరావు, కొమ్మూరి సాంబశివరావు, ఆరుద్ర వ్రాసిన డిటెక్టివ్ పుస్తకాలే కావొచ్చు, అలాటివి గుర్తుచేసికున్నప్పుడు వచ్చే ఆనందం ఎంత బావుంటుందీ?

    ఇంక ఈ రోజుల్లో అయితే, అసలు పేపర్ తెప్పించడమే ఓ నేరం అనే వాళ్ళనీ చూశాను. పైగా తెలుగు పేపరైతే అడక్కండి. ఇదివరకటి రోజుల్లా కాదుగా ఇప్పుడూ, అన్ని పేపర్లూ దేశం లోని చాలాచోట్ల దొరుకుతున్నాయి. అయినా తెలుగు పత్రిక తెప్పించుకోడం నామోషీగా భావించేవారినీ చూశాను. మా ఇంట్లో Times ఒకటే చదువుతామండీ, అక్కడికేదో Newyork Times, London Times లెవెల్లో చెప్తారు. పోనీ తెలుగు చదవడం రాదా అంటే అదీ లేదూ, ఇంగ్లీషు పేపరే తెప్పిస్తే అదో స్టేటస్ సింబలూ! పోనీ ఆ తెప్పించే పేపరేనా చదివే తీరికుంటుందా, అంటే అదీ లేదూ. వచ్చిన పేపరు వచ్చినట్టుగానే మడతైనా నలక్కుండా రద్దీ లోకి వెళ్ళిపోతుంది. అదీ కాకపోతే, ఏ బీరువాల్లోనో వేసికోడానికి ఉపయోగిస్తుంది. పేపరు చదవడం ఎంత వ్యసనం లాటిదంటే, చిన్నప్పుడు ఏ కొట్లోనైనా పొట్లాలు తెస్తే, సరుకు తీసేసిన తరువాత, ఆ పొట్లం పేపరు సాపు చేసి మరీ చదివెవారిని కూడా చూశాము.

    ఈరోజుల్లో ఎవరిని చూసినా బిజీ బిజీ.. ఎవరికీ టైముండదు. పిల్లలేమో వాళ్ళకి attention ఇవ్వడం లేదని గోలా. ఏదో ఒకటి చేసి, వాళ్ళని ఊరుకోపెట్టడం ఎలా మరి. అదిగో అక్కడే వచ్చేశాయి మన టి.వీ.లూ, సెల్ ఫోన్లూ, ఐపాడ్లూ అంతర్జాలాలూనూ. ఎంత చెప్పినా, మనం దేనికి అలవాటు చేస్తే దానికే addict అవుతారు పిల్లలు. ఏ పుస్తకమో,పేపరో చదవడం అలవాటు చేస్తే, మళ్ళీ అదేదో అర్ధం అవలేదని తల్లితండ్రుల్ని హోరెత్తించేస్తారు. వీళ్ళకా టైమే లేదు. So, ఓ రిమోట్ చేతికిచ్చేసి టి.వీ.ఎదురుగుండా కుదేస్తే సరిపోతుంది. ఆ పిల్లాడికి శలవొచ్చిందంటే, అక్కడే నిద్రా తిండీ అన్నీనూ. వాడి తప్పు మాత్రం ఏముందీ, అందులో చూపించినదే ప్రపంచం అనుకుంటాడు. ఆ కార్టూన్లు తప్పించి ఇంకో చానెల్ కి తిప్పడూ, తిప్పనీయడూ.

    So,bottomline is addiction . ఈమధ్యన ఈ ఊళ్ళోనే ఓ తెలుగు వారింటికి వెళ్తే, ఆవిడ చెప్పారు, నేను ఏదో మంచి సినిమా వచ్చినప్పుడు తప్ప టి.వీ చూడనూ అని. అంతే కాదు వారి అబ్బాయికి కర్ణాటక సంగీతం కూడా నేర్పిస్తున్నారుట.Hats off !! ప్రపంచంలో ఆంధ్రదేశానికి బయట ఇలాటివారుకూడా ఉన్నందుకు ఎంతో సంతోషమయింది.God bless you.

    ఈమధ్యన మా అబ్బాయికి ఓ మెయిలొచ్చింది. చదివే ఉంటారు “పుత్రోత్సాహం” అని. ఇక్కడ పూణే లో ఉన్న స్కూలు పిల్లలు వ్రాసిన కథలు, యతాతథంగా ప్రచురించి, ఓ పుస్తకం రిలీజ్ చేశాడు మా అబ్బాయి. ఆ విషయం నా బ్లాగులో చదివి,బంగళూరు నుండి, ఒకాయన, నాకు వెంటనే ఆ పుస్తకం పంపించండీ అని మెయిలు వ్రాశారు. నాకైతే ఎంత సంతోషమనిపించిందో. చెప్పొచ్చేదేమిటంటే, ఆ రిమోట్లు మానేసి, పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే, పిల్లలకీ వారి సృజనాత్మక శక్తి ఏమిటో తెలుస్తుంది. ఈవేళ ఓ చిన్న కథతో మొదలెట్టిన వారు భవిష్యత్తులో ఓ ఆర్ కే నారాయణ్, ఓ రస్కిన్ బాండ్, ఓ ముల్క్ రాజ్ ఆనంద్ గా అవొచ్చేమో. పోనీ ఏదో కారణాలవలన అవలేదూ అనుకుందాము, పెద్దయిన తరువాత, తను చిన్నప్పుడు వ్రాసిన ఓ కథ చూసుకుని, మారొచ్చేమో! దేనికైనా మనం కూడా ఓ platform ఏర్పరచాలి కదా! అసలు అలాటిదేదీ ఏర్పరచకుండా, మన సౌకర్యం కోసం పిల్లలకి రిమోట్లూ, సెల్లులూ కాకుండా, ఓ పుస్తకం చదవడం అలవాటు చేస్తే దాన్నే పట్టుకుని వేళ్ళాడతారు.

   బయటి దేశాల్లో మనవారు తెలుగుకి ఇవ్వవలసిన ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. వచ్చిన గొడవల్లా దేశంలోని వారితోనే. మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు, కంప్యూటరులో తెలుగు వ్రాయడం నేర్చుకున్న కొత్తలో అన్నమాట కొత్త పెళ్ళికొడుకు పొద్దెరగడూ అన్నట్టు, తెలిసిన వాళ్ళందరికీ తెలుగులోనే మెయిల్స్ పంపుతూంటే ఒకావిడన్నారులెండి ” ఇంతా చేసి ..తెలుగులోనా వ్రాస్తున్నారూ..” అని అక్కడికేదో మేము చేయరాని పనేదో చేసినట్టు!

Advertisements

2 Responses

 1. > చిన్నప్పుడు ఏ కొట్లోనైనా పొట్లాలు తెస్తే, సరుకు తీసేసిన తరువాత, ఆ పొట్లం పేపరు సాపు చేసి మరీ చదివెవారిని కూడా చూశాము…..

  మీరు నన్నెక్కడ చూసారోనని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆనందంగా కూడా ఉంది!

  ఒకసారి యిలా యింట్లోవాళ్ళు పొట్లం విప్పి కాగితం పడేసేవరకూ ఆగే ఓపిక లేక, రోడ్డు మీద మంచి వెలుగేదో పడుతోంది కదా అని పొట్లం మీది కాగితంలో యేమి రాసుందో చదవటం మొదలు పెట్టానో లేదో..

  నన్ను చెవి పట్టుకుని యింట్లో దిగబెట్టి, నా ఘనకార్యం బ్రహ్మాండంగా వర్ణించి మరీ వెళ్ళాడా లారీ డ్రైవర్..

  తరవాత యేంజరిగి ఉంటుందో మీరంతా ఊహించగలరు.

  నా అపురూపమైన బాల్యాన్ని నాకు గుర్తు చేసినందుకు చాలా కృతజ్ఞతలు.

  ఓ నా బాల్యమా , నా ప్రియాతిప్రియమైన బాల్యమా, నా తిరిగిరాని బాల్యమా – నువ్వెక్కడ!

  Like

 2. శ్యామల రావు గారూ,

  చిన్నతనంలోని ” మధుర” క్షణాలు గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరనేమిటీ, ఆరోజుల్లో ప్రతీవారూ అలా చేసినవారే !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: