బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   కిందటి టపాలో ప్రస్తావించాను కదా, మొన్న 15 న నా పుట్టిన రోజని, దానితో పాపం ఆ టపా చదివినవారు, మొహమ్మాటానికి శుభాకాంక్షలు చెప్పవలసివచ్చింది! పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నా పుట్టింరోజో అని కొంపెక్కి అరుస్తూంటే, పోనిద్దూ పెద్దాయనా సంతోషిస్తాడూ, అయినా ఇంకా ఎంతకాలం? మనమేమైనా సెలిబ్రెటీసా ఏమిటీ, అందరికీ గుర్తుండడానికి, ఫలానా రోజు పుట్టింరోజూ అని. చెప్పుకుంటేనే కదా తెలిసేదీ! పైగా, ఎంతమందిbest wishes చెప్తే అంత ఆయుద్దాయం పెరుగుతుందేమో అని ఓ ఆశా ! ఎంతచెప్పినా మానవమాత్రులం కదా!! ఏదో ఇంకా బతికుండి ఎవళ్ళనో ఉధ్ధరించాలని కాదు కానీ, బతికున్నన్నాళ్ళైనా నలుగురి నోట్లోనూ పడితే అదో తుత్తీ!! ఏమిటో ఎవడి గోల వాడిదీ!

   ఆ టపాలో వ్రాశానుగా, పూణె ఆంధ్రసంఘం వారు, అప్పుడప్పుడు చేసే మంచికార్యక్రమాల్లో ఒకటైన ప్రవచనం , ( బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే) ఏర్పాటు చేశారు. శుక్రవారం, శనివారం వెళ్ళాము. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆదివారం నాడు ప్రొద్దుటా, సాయంత్రము కూడా ఏర్పాటు చేశారు. చెప్పానుగా, ప్రవచనాలు పూర్తయిన తరువాత, ఇచ్చిన “ప్రసాదాలు” అద్భుతంగా ఉన్నాయి. మా పూణె లో కూడా ఇంతరుచికరంగా చేయగలరని ఇప్పటివరకూ తెలియదు. క్రిందటేడాది కూడా ఇచ్చారనుకోండి, కానీ ఎవరో అన్నారూ, మనవైపునుంచి ఎవరో వచ్చి తయారు చేశారూ అని విన్నాను. ఓహో కాబోసూ అని ఊరుకున్నాను.అందుకే పూర్తిగా తెలియకుండా ఏమిటేమిటో అనేసికోకూడదు! ఈసారికూడా, మళ్ళీ కిందటేడాది లాగే “రుచీ”, ఇంక ఈ విషయం వదలకూడదనుకుని, మా ఆంధ్రసంఘం సెక్రటరీ గారిని ( మా అమలాపురం ఆయనే లెండి, అందుకే ఆ చనువు!) అడిగేశాను.ఆయన చెప్పారూ, ఇక్కడే పూణే లోనే ఉన్నారండి అని చెప్పి, ఆ కేటరర్స్ ఫోను నెంబరూ వగైరా ఇచ్చారు.

   ఇంకో రోజు ప్రసాదాల రుచి ఆస్వాదించొచ్చుకదా అని, శనివారం రాత్రి కొంపకి చేరుకున్నాము. పొద్దుటే, ఫోనూ, ” ఫణిబాబు గారూ, కార్యక్రమాలు క్యాన్సిలయ్యాయీ, శ్రీ షణ్ముఖ శర్మగారి సోదరుడు అకస్మాత్తుగా దివంగతులైనందున, శ్రీ శర్మగారు ఉదయం ఫ్లైట్ లో విశాఖపట్టణం వెళ్ళిపోయారూ” అని. అందుకే అంటారు, దేనికైనా యోగం ఉండాలీ అని. అసలు ఆప్రవచనాలమీద భక్తుండాలి కానీ, ప్రసాదాల మీదుంటే ఇదిగో ఇలాగే ఉంటాయి!

   మా ఇంటావిడ విషయమే తీసికోండి, స్వంత ఇల్లు ఉండాలీ అని ఆ భగవంతుణ్ణి ప్రార్ధించిందే తప్ప, అందులో ఉండే అదృష్టం కూడా ప్రసాదించూ అని అడగలేదు. ఉండడానికి ఇప్పటికినాలుగు ఇళ్ళకి రిజిస్టారాఫీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాము, కానీ ఉండేదెక్కడా, ఓ అద్దె కొంపలో!అలాగని ఇక్కడేదో మేము కష్టపడిపోతున్నామని కాదు, అయ్యో తనకున్న బుల్లి కోరిక తీరలేదే అన్న బాధ! నాకైతే అలాటి సెంటిమెంట్లేమీ లేవు చెప్పాలంటే, మనకెక్కడ రాసిపెట్టుంటే అక్కడే ఉంటాము అన్నది నా ఫిలాసఫీ! మనమేమైనా వెళ్ళేటప్పుడు కట్టుకుపోతామా ఏమిటీ,పిల్లలతోనూ, స్నేహితులతోనూ సంబంధబాంధవ్యాలు ఉంటే చాలు, మిగిలినవన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు.అవి ఎలాగూ ఉన్నాయి, వాటికేమీ లోటు లేదు.Thats all.ఏమంటారు?

    ఆదివారం ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం, పొద్దుటొకచోట ప్రవచనం, సాయంత్రం ఇంకోచోటా పెట్టుకున్నాము కదా, దానితో మా అబ్బాయీ కోడలూ మమ్మల్ని మాదారిన వదిలేశారు! కానీ కారణాంతరాలవలన, ఆ కార్యక్రమాలు క్యాన్సిలైపోయాయి. పైగా ఆ slots ఫిల్ చేయడం ఎలా? మా ఇంటావిడేమో, మేముండే ఇంట్లో, రెండురోజుల పని అలాగే ఉండిపోయిందీ అని చెప్పి అక్కడకి వెళ్ళిపోయింది. ఇంక నేను మిగిలాను, అలాగని ఏ సినిమాకో వెళ్ళిపోతే బావుండదుకదా, సరే అని మా అబ్బాయినడిగాను, ఏం చేద్దాం నాయనా అని. అప్పుడు నేనడగ్గానే నా కోరిక తీర్చడానికి సహాయ పడిన ( To meet my favourite Sri RKLaxman) మా అబ్బాయి ఫ్రెండు వస్తున్నాడూ, అతన్ని కలుసుకుందామా అన్నాడు. తప్పకుండా కలిసి పెర్సనల్ గా థాంక్స్ చెప్పుకోవాలీ అనుకుని, సరే అన్నాను. మా కోడలి చేతివంటే తినేసి, Pune Camp లో ఒక రెస్టారెంటుకి వెళ్ళాము.1.30 కి వెళ్ళామండి, మూడు గంటలపాటు అతనితో కబుర్లే కబుర్లు! ఆ అబ్బాయి ( అబ్బాయని ఎందుకంటున్నానంటే, అతనిదీ మావాడి వయస్సే) విషయానికొస్తే, చెప్పడం ప్రారంభిస్తే అసలు అంతే ఉండదు.

    అతనికీ నాలాగే ఆటోగ్రాఫుల పిచ్చీ! నా వీలునిబట్టి ఏదో ఉత్తరాలు వ్రాసి సంపాదించాను. ఇతనిదేమో ఇంకో పధ్ధతీ. ఏ celebrity ని కలుసుకున్నా సరే, వారితో ఓ ఫొటో తీయించుకోడమూ, వెంటనే ఆ ఫొటో మీద వారి ఆటోగ్రాఫ్ తీసేసికోడమూనూ! అతని కలెక్షన్ చూస్తూంటే కళ్ళు తిరిగిపోయాయి! ఒకళ్ళని కాదు, Film Stars, Cricketers, Singers, Scientists, Business People అలా ఎందరెందరితోనో, కొంతమందికి అదో passion ! అంతే.ఈమధ్యన జరిగిన Formula 1 Champion, Sebastian Vettel తో సహా ఉన్నాయి! కొంతమందికి ఏమిటీ ఈ పిచ్చీ అనిపిస్తుంది, కానీ అందులో ఉండే మజా అందరికీ తెలియదుగా! అవన్నీ చూపించాడు.పైగా వెళ్తూ వెళ్తూ ఓ మాట కూడా చెప్పి వెళ్ళాడు– అంకుల్, మీకు ఎవరినైనా కలియాలనిపిస్తే హరీష్ ( మా అబ్బాయి) కి చెప్పండీ, ఎరేంజ్ చేస్తానూ అని!– ఇంతకంటే ఏం కావాలి?

    RAC Quota లో నాకు, అతనితో గడిపిన ఆ మూడు గంటలూ అద్భుతం! RAC Quota అని ఎందుకన్నానంటే, మా ఒరిజినల్ కార్యక్రమం క్యాన్సిల్ అవబట్టే కదా, ఈ అవకాశం వచ్చిందీ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: