బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అవసరాలకి మాత్రమే గుర్తొస్తూంటారు…

   ఇదివరకటి రోజుల్లో చిన్న పిల్లలందరూ కలిసే ఆడుకునేవాళ్ళు. ఎవరి కాంపౌండులో ఖాళీ ఉంటే అక్కడ చేరేవారు. కానీ ఈ రోజుల్లో అలా కాదుగా, ఎవరి పిల్లలు వాళ్ళ ఇళ్ళకే పరిమితమైపోయారు. ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోడానికి ఓపికల్లేని రోజుల్లో ఇంకోళ్ళ పిల్లల బాధ్యత కూడా తీసికునే రిస్క్ ఎవడు తీసికుంటాడు? కానీ ఏ శలవలో వచ్చినప్పుడు అవసరం వస్తుందిగా.అలాటప్పుడు మాత్రం ఊళ్ళో పిల్లలంటే ఎక్కడలేని ప్రేమా అభిమానమూ పుట్టుకొచ్చేస్తాయి! అవసరం మనది కదా మరి! మన పిల్లలకి కూడా తెలుసు, ఇలాటి పరిస్థితుల్లో Mothers do not have a choice except to surrender! అదిగో దాన్నే cash చేసికుంటారు పిల్లలు. ఇక్కడ పిల్లల దేమీ తప్పుకాదు, పాపం వాళ్ళకి ఇంకా లౌక్యాలూ వగైరా వంటపట్టలేదు. ఓసారి దెబ్బలాడుకున్నా రెండో నిమిషం లో ఫ్రెండ్సైపోతారు. వచ్చిన గొడవల్లా ఈ పేరెంట్స్ తోనే.

   మన పిల్ల స్నేహం చేసే పిల్లపేరెంట్స్ ఎక్కడ పనిచేస్తున్నారూ, ఆ పిల్ల ఏ స్కూలుకి వెళ్తోందీ, వాళ్ళింట్లో ఏమేమి సరుకులున్నాయీ— వీటన్నిటినీ బేరీజు వేసి, ఫరవాలేదూ అనుకుంటే కానీ, ఆ పిల్లతో స్నేహం చేయనీయరు. అంతదాకా వస్తే, పార్కులకో, సినిమాకో తీసికెళ్ళడానికైనా సిధ్ధపడతారు కానీ, ఆ పిల్లతో కలిసి ఆడుకోడానికి మాత్రం ఒప్పుకోరు!
అన్ని రోజులూ మనవి కావుగా. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ అవసరమూ పడుతుంది. ఇదిగో అలాటప్పుడు గుర్తుకొచ్చేస్తూంటారు, ఇలాటివాళ్ళందరూనూ. అప్పటిదాకా ఆ పిల్లతో తమ పిల్ల కలవకుండా ఉండడానికి తాము చేసిన ప్రయత్నాలూ అవీ గుర్తుకు రావు. అవసరం ఎన్ని పన్లైనా చేయిస్తుంది! ఆ పక్క పిల్లమీద ఎక్కడలేని ప్రేమా చూపించేసి , వాళ్ళమ్మకి మస్కా కొట్టేసి, ” ఓసారి మీ పిల్లని మా ఇంటికి పంపించండీ, ఆడుకుంటుందీ… నేను ఓ అరగంటలో పని చూసుకుని వచ్చేస్తానూ…” అంటుందే కానీ, తమ పిల్లనుమాత్రం వాళ్ళింటికి పంపించదు. వాళ్ళింటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ “మిడిల్ క్లాస్ లేకి బుధ్ధులు” నేర్చుకుంటే, అమ్మో ! ఇక్కడ లేకి బుధ్ధులు ఎవరివో అడగఖ్ఖర్లేదనుకుంటా! దీన్నే అవసరానికి ఉపయోగించుకోడం అంటే !

    ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, నాకూ ఈమధ్యన అలాటి అనుభవం ఎదురయింది. అలాగని నేనెవరింటికీ ఆడుకోడానికి వెళ్ళాననీ, మా ఇంటికెవరో ఆడుకోడానికి వచ్చేరనీ కాదు. కనిపించినవాళ్ళందరినీ పలకరిస్తాను. ఓసారి పరిచయం అయిందంటే అసలు వదలను. నా దారిన నేను హల్లో అనేస్తాను. అవతలివాడు ఏదో నాకోసం ఆగి మాట్లాడాలని కాదుకానీ, ఓసారి హల్లో అనో, ఓ చిరునవ్వో పడేస్తే చాలుకదా. నాదారిన నేను, నడిచే వెళ్తూంటాను కారణాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోనఖ్ఖర్లేదు.సైకిలు రాదుకదా! చాలామంది, పలకరిస్తే ఏ బైక్కుమీదో, కారులోనో వెళ్తూన్నప్పుడు చెయ్యూపడమో, తలూపడమో ఏదో ఒకటి చేస్తారు. అలాగని అస్తమానూ చేయలేదని మనమూ ఏమీ అనుకోకూడదు. కనిపించినప్పుడల్లా చేయాలని రూలేమీ లేదుగా! కానీ ఎన్నో సంవత్సరాలు సర్వీసులో ఉన్నంతకాలమూ కలిసి పనిచేసిన వాళ్ళు, ఏదో మనం కనిపిస్తేనే పాపం, అనుకున్నట్టు ప్రవర్తిస్తే మాత్రం ఒళ్ళు మండుతుంది!

    ఈమధ్యన ఓరోజు నాదారిన నేను వెళ్తూంటే, అలాటి రకం మనిషోడు సడెన్ గా హల్లో ఫణిబాబూ అని పిలిచేసరికి నాకైతే, ఇదేమిటీ సూర్యుడు పశ్చిమాన్న కానీ ఉదయించాడా అనిపించింది. నేను మాత్రం తక్కువా ఏమిటీ? అక్కడికేదో నేను పెద్ద బిజీగా ఉన్నట్టు ఓసారి కర్సరీ హల్లో చెప్పేసి నాదారిన నేను వెళ్ళిపోయాను. నామీద అంత అభిమానం ఎందుకొచ్చిందా అని పరీక్షగా చూస్తే, అప్పుడు తెలిసింది అసలు కారణం– ఈ “పెద్దమనిషి” ఎప్పుడూ కార్లలోనూ, టూ వీలర్లమీదా వెళ్ళేవాడు, ఆ టైములో ఏదో చెప్పులో, షూసో బాగుచేయించుకోడానికి, ఓ రోడ్డు సైడులో ఉన్న రిపేరీ షాప్పులో నుంచున్నాడు. ఆ కొట్టువాడేమో, మా వాడిని వెయిట్ చేయమనుంటాడు. మా వాడికేమో అలా రోడ్డు పక్కననుంచుని, ఆ కొట్టువాడిచ్చిన చెప్పులు వేసికుని నుంచోడం నామోషీ అయుండొచ్చు. ఏదో కాలక్షేపం కావాలీ, దానితో సడెన్ గా నేను కనిపించేసరికి నామీదఎక్కడలేని ప్రేమా పొంగుకొచ్చేసి, నన్ను హల్లో అనేశాడు. ఇక్కడే ఒళ్ళుమండుకొచ్చేది, మన అవసరాలొచ్చేసరికి అందరూ గుర్తుకొచ్చేస్తారు. జనరల్ గా వాళ్ళే గంగలోనైనా దిగినా సరే !!!

    ఇదంతా ఎలా తెలిసిందీ అంటే, ఆ తరువాతో రోజున కనిపించి, సిగ్గూ శరమూ లేకుండా తనే చెప్పాడు–” అదేమిటీ ఆ రోజున ఏదో కాలక్షేపానికి పిలిస్తే, ఆక్కుండా వెళ్ళిపోయావేమిటీ..” అని! Life goes on…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…

    మా చిన్నప్పుడు ఏ పత్తి నో, పుగాకునో బైళ్ళల్లో(Bale) ప్యాక్ చేశారనేవారు.ఓహో అనుకునేవాళ్ళం. ఈ మధ్యన ఏ పేపరు చదివినా, టి.వి.లో ఏ న్యూసు చూసినా, మళ్ళీ ఈ బైళ్ళ (Bail) గొడవే. ఒకళ్ళకేమో Anticipatory Bail, మన బాలూ గారి కొడుకులాటివాళ్ళకి. ఏదో వెధవ పని చేయడం, అవతలివాళ్ళెలాగూ కంప్లైంటు చేస్తారని తెలుసు, తనే ముందుగా బైలు తెచ్చేసికుంటే ఓ గొడవొదిలిపోతుందనీ. కొంతమందికి మామూలుగా బెయిలు, అమర్ సింగులాటివాళ్ళకి. ఇంకొంతమందికి వాళ్ళమీదున్న అసంఖ్యాకమైన కేసుల్లో ఒకటో అరో కేసుల్లో బెయిలుట మన పొరుగునుండే యడ్డీగారి లాగ! ఇంతమందికొచ్చేస్తోందీ, మనకెందుకురాకూడదూ అని 2 G కేసులో జైల్లో ఉన్నవాళ్ళందరూ సామూహికంగా బెయిలు అడిగారు. ఓ గొడవొదిలిపోతుందని అందరి బెయిలూ తిరస్కరించేశారుట ఆ జడ్జీ గారు. పాపం కరుణానిధి గారి కూతురు, ఓ దసరా కానీ, దీపావళి కానీ తన కొడుకుతో గడపడానికి వీల్లేకుండా జైల్లోనే కాపరం చేస్తోంది. ఆవిడకి బెయిల్ దొరక్కపోయేసరికి వాళ్ళ నాన్న shock అయ్యారుట, సోనియా anguish అయ్యారుట, కన్మొయి తల్లైతే ఒకటే ఏడుపుట ! వహ్వా వహ్వా.. మరి ఆ డబ్బులన్నీ తిన్నప్పుడు ఏమయ్యాయిట ఈ ఫీలింగ్సూ, ఎమొషన్లూ ?

    నా చిన్నప్పటినుంచీ చూసే యాడ్ Zinda Tilismath. అదేమిటో ఆ పేరు నాకు చాలా ఇష్టం. నెట్ లో చూస్తే దానర్ధం, Living Magic అనుంది. ఆహా ఇప్పటికైనా తెలిసిందీ అని సంతోషించాను. అందులో Zinda సర్టిఫికేట్ ఒకటివ్వాలిగా మా పెన్షనర్ పక్షులు, ఈ కార్తీక మాసం లో మరి. సోమవారాలు ఉపవాసాలు చేయకపోయినా, శివాలయానికి వెళ్ళకపోయినా ఆ మహదేవుడు క్షమించేస్తాడేమో కానీ, బతికున్నామని చెప్పకపోతే, బ్యాంకులవాళ్ళు మాకు తిండెట్టరు. క్రిందటి రెండేళ్ళ అనుభవాల ధర్మమా అని, ఈసారి వెఢవ్వేషాలేయకుండా, ఒకటో తారీఖునే, అక్కడ మా ఫ్రెండోడున్నాడు కదా అని, మధ్యాన్నం మూడింటికి వెళ్ళి ఆ పనేదో పూర్తిచేసికొనొచ్చా. ఇంకో ఏడాదిదాకా గొడవలేదు. బతికుంటే అప్పుడు చూసుకోవచ్చు.

    ఏదో పేపరు చూస్తూంటే SBI వాళ్ళిచ్చిన ప్రకటన చూశాను. వాళ్ళ ఆఫీసర్లందరూ ఈనెల, 8,9 తారీఖుల్లో సమ్మె చేస్తారుట. కొన్ని ఊళ్ళల్లో 7,10 శలవలుట,6 ఆదివారంట, 5 శనివారం half day ట. అందువల్ల ఈవేళా రేపట్లలో బ్యాంకింగు వ్యవహారాలు పూర్తిచేసికోవాలట.ATM లలో డబ్బుంటే ఉండొచ్చుట, ఉండకపోయినా పోవచ్చుట. మరి ఈ పెన్షనర్ల కార్తీక మాస నోము(Zinda Tilismath) ఎప్పుడండీ చేసికోవడం? వీళ్ళకి ఏదో వారంరోజులు కలిసొస్తుందనే కానీ,కస్టమర్ల గోడు పట్టదు. పైగా ప్రతీ ఏడాదీ ఈ నెలలోనే ఏదో ఒక వంక పెట్టి, ఓసారి క్లాసు4, ఓసారి గుమాస్తాలూ, ఎవరూ కాకపోతే ఆఫీసర్లూ!

    ఆంధ్ర దేశంలో ఎక్కడ చూసినా యాత్రలూ, దీక్షలూనూ. రాజకీయనాయకుళ్ళకి పనేమీ లెనప్పుడు చేసేదిదొకటి. ఇంతదూరంలో ఉన్న మాలాటివాళ్ళకెలాగా కాలక్షేపం? పాపం ఆద్వానీ గారొకడున్నడుగా, అప్పుడెప్పుడో రథ యాత్ర చేశారు. వచ్చే ఎన్నికల సమయం లో జనాలు తనని మర్చిపోతారేమో అని, అదేదో “జనచైతన్య యాత్ర” మొదలెట్టారు. అదిగో ఆ యాత్ర ఇవేళ మా పూణె వచ్చింది. జనంలో చైతన్యం లేకపోవడమెమిటీ చిత్రం కాకపోతే?భూ కబ్జాలు చేస్తున్నారు, బలవంతపు చావులు ఛస్తున్నారు, బలవంతపు చందాలు వసూలు చేస్తున్నారు, రేప్పులూ హత్యలూ అయితే ఉండనే ఉన్నాయి. ఆమధ్యన అన్నా సాహెబ్ గారూ, అంతకు ముందు బాబా గారూ ఉపొషాలు చేశారు. కావలిసినంత చైతన్యం చూశాము.

    ఈవేళ బస్సులో వెళ్తూంటే, నా ముందర ఓ అబ్బాయి నుంచున్నాడు, ఫొటో చూడండి, ఆ బుజ్జి జడ ఎంత ముద్దొస్తోందో?అపర చాణక్య లా ఉన్నాడు! ఆగలేకపోయాను, వాళ్ళమ్మగారిని పెర్మిషన్ అడిగి ఓ ఫొటో తీసికున్నాను. నెను దిగే స్టాప్ వస్తే, ఆ అబ్బాయిని కూర్చోమని చెప్పడానికి తన వీప్మీద వేల్లాడతిసిన బ్యాగ్గు మీద తడితే, పలకడే. అప్పుడర్ధమయింది, పాపం తనకి తెలియాలిగా, బ్యాగ్గు మీద తడితే ఎలా? అప్పుడు నా అనుభవం ఓటి గుర్తొచ్చింది. మా అబ్బాయితో ఎప్పుడైనా బైక్కు మీద వెళ్ళవలిసొస్తే, హెల్మెట్ లేకుండా కూర్చోనీయడు. ఒకసారి ఓ హెల్మెట్ పెట్టుకుని పిలియన్ సీటు మీద సెటిల్ అయ్యాను. మధ్యలో నెత్తిమీద దురదెట్టింది. మనిషన్నాక దురదలూ అవీ పెట్టవా ఏమిటీ? దురదెట్టగానే ఏం చేస్తాం, గోక్కుంటాం. అదే నేను చేసిందీనూ, తేడా ఏమిటంటే నెత్తనుకుని హెల్మెట్టు మీద గోకాను !!! ఆ మాత్రం దానికే వాళ్ళమ్మ తోనూ, భార్యతోనూ, కూతురితోనూ చెప్పుకోవాలా….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— కాన్ఫిడెన్సూ , ఓవర్ కాన్ఫిడెన్సూ….

    ఈ టపాకి పెట్టిన శీర్షిక లో, రెండు పదాలకీ ఉన్నది వెంట్రుకవాసంత తేడా మాత్రమే. కానీ ఆ తేడా ఒక్కొక్కప్పుడు మన కొంపలు ముంచేస్తుంది, ఒక్కోప్పుడైతే ప్రాణాలమీదకే తెస్తుంది. అసలు జీవితం లో confidence, అదీ మనమీద మనకి లేకపోతే బండే ముందుకి నడవదు. ప్రతీ దానికీ, మనం ఈ పని చేయకలమా, మన తాహతుకి మించిందేమో అనుకుంటూ భయపడిపోతే, ఎక్కడ వాళ్ళక్కడే ఉండిపోతారు, పక్కవాడు మనల్ని దాటుకుపోతాడు! అందుచేత, ప్రతీ వాడిలోనూ ఈ confidence ఏదో నామమాత్రానికైనా ఉండాలి.
ఉండి ఉండి అది కాస్తా over confidence లోకి దింపిందంటే మాత్రం గోవిందో గోవిందా….

చదువుకునే రోజుల్లో చూడండి, పరీక్షల ముందర అవేవో ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇచ్చేవారు. ఇప్పుడున్నాయో లేదో నాకైతే తెలియదు. ఉండే ఉంటాయి లెండి. అయినా చదువూ సంధ్యా అంటూ ఇప్పుడు ఈ వయస్సులో తల బద్దలుకొట్టుకోవడం ఎందుకులెండి. అయినా ఏదో సందర్భం వచ్చింది కదా అని ఎరక్కపోయి దీంట్లోకి దిగాను. మొదలెట్టా కాబట్టి, ఈ గొడవేదో తేల్చేసికుంటే సుఖ పడతాను. ఏమిటంటున్నానూ.. ప్రిపరేషన్ హాలిడేస్ కదూ, ఆ టైములోనే పుస్తకాలు గుర్తొచ్చేవి నాకు. ఏది చూసినా అంతా తెలిసున్నట్టే అనిపించేది, తీరా మర్నాడు పరీక్ష పేపరు చూసేసరికి ఒక్కటీ ఛస్తే అర్ధమయ్యేది కాదు. దీనికి ముఖ్య కారణం over confidence ! ఎలా చదివావురా అని నాన్నగారు అడిగితే, ” చాలా బాగా చదివేశాను. ఈసారి మాత్రం క్లాసు ష్యూర్, మరేం లేదులెండి, అంతకుముందు మార్చ్ లో క్లాసు రాదని, ఆ రోజుల్లో అందరూ ఫాషను కోసం వాడే withdrawl అనే పదం వాడేసి, ఇంట్లో కూర్చున్నాను! withdrawl లేదూ పాడూ లేదూ, లెఖ్ఖల దగ్గరకొచ్చేసరికి, ఈ over confidence మాట దేముడెరుగు, అసలు ఆ confidence అనే మాటే కొండెక్కింది.

నామీదా, నామాటమీదా నాన్నగారు ఏదో రిజల్ట్స్ వచ్చేదాకా మాత్రం ఆ confidence ఉంచి, తరువాత రిజల్ట్స్ చూసిం తరువాత, వీణ్ణి పుటం వేసినా బాగుపడ్డూ అని, ఉద్యోగం వేయించేశారు. అదండీ my brush with confidence & overconfidence ! పోనీ అప్పటికైనా బుధ్ధి తెచ్చుకోవచ్చా, అబ్బే, తరువాత్తరువాత కూడా అప్పుడప్పుడు ఈ పదాలు రంగం లోకి వచ్చేస్తూంటాయి, Specially అప్పులు చేయడం విషయం లో! ఏదో పేద్ద ప్లాను/ ఫోర్కాస్టూ వేసేసికుని, మన ప్రభుత్వ బడ్జెట్లలోలాగ, ఏడాదికీ సరిపడా, జమా ఖర్చులు ఓ కాగితం మీద వ్రాసేసికోవడం, అదికూడా ఇంట్లో వ్రాస్తే ఇంటావిడకి తెలిసిపోతుంది. ఫాక్టరీకి వెళ్ళి తీరిక సమయాల్లో చేసే పనన్నమాట. దీని దుంప తెగా, ఎలా తిరగా మరగా చూసినా, అన్ని ఖర్చులూ పోనూ, ఎప్పుడూ మిగులే కనిపించేది ( కాగితం మీద మాత్రమే !). ఫరవాలేదూ, మనమూ ప్రయోజకుణ్ణౌతున్నామూ అనేసికుని, ఇంట్లోకేదైనా కొందామా పోనీ అనుకునేవాడిని. ఏదో ఓ కొట్లోకి వెళ్ళడం, ఆరోజుల్లో installments అనేవారులెండి, దాన్నే పేద్ద స్టైలిష్ గా EMI అంటున్నారిప్పుడు, ఏ రాయైతేనేమిటీ, వివరాలడిగేసి, కావలిసిన వస్తువేదో తెచ్చేయడం. తేవడం అంటే తెచ్చేశాము కానీ, నెల తిరిగే సరికి దాని వాయిదా ఎవడు కడతాడు , నేనే కదా, అక్కడకొచ్చేసరికి తెలిసేది. అందరికీ ఇచ్చేస్తే మిగిలేమిటీ, దానితో most humble కిరాణా కొట్టువాడిని లూప్ లైన్లో పెట్టేయడం. ఆ సరుకు కొన్నవాడికి వాయిదా ఇవ్వకపోతే, తెచ్చిన సరుక్కాస్తా తీసుకుని చక్కాపోతాడు. పైగా ఊరందరికీ తెలిస్తే అదో అప్రదిష్ట కూడానూ! ఇలా అప్పటిదాకా ఉన్న over confidence కాస్తా విశ్వరూపం దాల్చేసింది. శ్రీ వెంకటేశ్వరస్వామి అప్పుల్లాగ, రిటైరయ్యేవరకూ అదే రంధి!

రోడ్డు మీదెళ్తూన్నప్పుడు చూస్తూంటాము, కొందరు హీరోలు, బైక్కు మీదెళ్తూ రెండు చేతులూ వదిలేసి, తల దువ్వుకోడాలో, చొక్కా సద్దుకోడాలో లాటి వెధవ పన్లు చేస్తూంటారు, వాడికి ఈ over confidence పైత్యం వంట పట్టేసి, రోడ్లమీద చేయడం ఎవడిమీదో పెట్టేయడం. అలాగే బస్సుల్లో వెళ్ళేటప్పుడు చూస్తూంటాను, ఆ స్టీరింగు వదిలేసి, ఏ వెధవతోనో కబుర్లేసికోడం. అన్నిటిలోకీ, మనలో ఉన్న ” వెంట్రుకవాసంత” తేడా, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కనిపిస్తుంది. మన లెవెలేదో మనకి తెలియాలి, కార్లూ, బైక్కులూ జుయ్యిమని వేళ్తూంటే, మనకి నచ్చినా నచ్చకపోయినా ఆగడమే ఆరోగ్య లక్షణం. ఈమధ్యనెప్పుడో, మా ఇంటికెదురుగా ఉండే రోడ్డు క్రాస్ చేస్తూ, కార్లొస్తున్నాయి కదా అని ఆగి, ఎవడో సైకిలువాడొస్తూంటే, పేద్దగా పట్టించుకోకుండా, దాటుతూంటే, వాడికి కోపం వచ్చేసింది ! ఇప్పటిదాకా ఆగి, నన్ను చూసే ఎందుకు క్రాస్ చేశావూ, నాకు ఇన్సల్ట్ కాదా అంటాడు ! ఏం లేదులెండి, అతను నా ఫ్రెండే! అదికాదు నాన్నా, నేనంటూ నీ సైకిలు కింద పడితే నాకంటే నీకే ఎక్కువ దెబ్బలు తగులుతాయీ, అందుకోసం ధైర్యం చేసేశానూ అన్నాను.

చివరగా చెప్పొచ్చేదేమిటంటే, ప్రతీ వాడిలోనూ confidence అనేదైతే ఉండాలే. కానీ, ఎక్కడపడితే అక్కడ House loan, car loan, personal loan అంటూ చేసికుంటూపోవడం కాదు, రోజులన్నీ మనవి కావు. Its only a suggestion …. be confident, but definetely not overconfident.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పిల్లలతో పార్కులకి….

    చిన్న పిల్లల్ని పార్కులకు తీసికెళ్ళకపోతే కుదరదు. ఏదో వాళ్ళ అమ్మా నాన్నలుండాలి కానీ, తాతయ్యలకూ, నానమ్మా/ అమ్మమ్మ లకు మాత్రం ఈ ప్రక్రియ మాత్రం ఓ పేద్ద punishment లాగే కనిపిస్తుంది. శుభ్రంగా మనవల్నీ, మనవరాళ్ళనీ ఏదో పార్కుకి తీసికెళ్ళి ఆడించండంటే, ఇదేమిటీ ఈయన అదేదో పేద్ద punishment అంటాడూ అనుకోవచ్చు చాలా మంది. కానీ ఉన్న మాటేదో చెప్పుకోవాలి కదా! తల్లితండ్రులు అనుకుంటారూ, ఏదో ఖాళీ గా ఉన్నారూ, పిల్లల్ని దగ్గర చేర్చుకుంటే, వీళ్ళకీ ఆ పిల్లలకీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయీ, bonding ఇంకా strong అవుతుందీ, etc..etc… అవన్నీ పుస్తకాల్లోనూ, ఏ child psychologist డబ్బులు పుచ్చుకుని చెప్తే వినడానికో, మహ బాగా ఉంటుంది. అసలు brass tacks కి వచ్చేటప్పటికే గొడవంతానూ !

ఇదివరకటి రోజుల్లో అయితే, ఈ పార్కులూ గొడవా ఉండేవి కాదు. ఏ కాంపౌండులోనో, అరుగులమీదో ఆడుకునేవారు. ఆరోజుల్లో పార్కులనేవి, సాయంత్రం పూటల్లో, రేడియోల్లో వచ్చే వార్తలకోసమో, లేక ఏ గ్రామస్థుల కార్యక్రమంలో ” బావగారి కబుర్లు” వినడానికో వెళ్ళేవారు. ఇంటి చుట్టూరా చెట్లూ చేమలూ ఉండడం తో greenery కి ఏమీ లోటుండేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కాంక్రీటే అవడం తో, ఎక్కడో అరకొరగా ఉండే పార్కులే దిక్కు. పైగా ఆ పార్కులకెళ్ళడం, ఓ పేద్ద కార్యక్రమం. మనం ఉండే ఇంటికి దగ్గరలో ఉంటే ఓ గొడవా, ప్రతీ రోజూ తీసికెళ్ళమంటారు పిల్లలు. ఏదో హోం వర్కూ అవీ ఉండడం ధర్మమా అని ప్రతీ రోజూ తీసికెళ్ళ వలసిన అవసరం ఉండదు. కానీ శలవలొచ్చాయంటే తప్పదు కదా. ఈ పిల్లలకంటే శలవలు కానీ, అమ్మా నాన్నలకి ఉండవుగా. కొంపలో ఖాళీగా ఉండేవాళ్ళు ఈ తాతామ్మమ్మనానమ్మలు. కోడలో కూతురో ఆఫీసునుంచొచ్చేసరికి కాఫీయో చాయో, అదీకాకపోతే ఏ కుక్కరో పెట్టే వంకతో ఈ అమ్మమ్మా నానమ్మలు తప్పించేసికుంటారు. ఎంతైనా అదృష్టవంతుల్లెండి ! ఈ హడావిడిలో తాతయ్యలు ఇరుక్కుపోతారు. పిల్లల్ని తీసికెళ్ళడం వీళ్ళకీ బాగానే ఉంటుంది. కాదనను. కానీ అక్కడకి తీసికెళ్ళిన తరువాత పడే పాట్లు, “పగవాడిక్కూడా” వద్దు బాబోయ్ అనిపిస్తుంది.

మరీ ఎండగా ఉన్నప్పుడు తీసికెళ్ళలేమూ, అలాగని మరీ చీకటి పడ్డ తరువాతా కష్టమే. పిల్లల మాటెలా ఉన్నా, ఈ తీసికెళ్ళిన తాతయ్యకి, ఏ కళ్ళ రోగమో ఉంటే, మనవడో మనవరాలో గుర్తుపట్టలేక, ఇంకో పిల్లనో పిల్లాడినో చేయి పట్టుకుని తెచ్చేస్తే మళ్ళీ అదో గొడవా. పిల్లల్నెత్తుకుపోయేవాడనుకుని ఎవరైనా బడితపూజ కూడా చేయొచ్చు! దానితో ఏ అసురసంధ్యవేళో బయలుదేరి, ఆ పార్కులోనో ఎక్కడో, ఓ చేత్తో మనవణ్ణీ, ఇంకో చేత్తో మనవరాల్నీ పట్టుకుని వెళ్ళడం. ఆవుదూడ పలుపు తెంచికుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, ఇందులో కొద్దిగా పెద్దదయిన మనవరాలేమో, తాతయ్యా నా చెయ్యొదులూ అంటూంటుంది. తాతయ్య చెయ్యిపట్టుకోడం నామోషీ దానికీ! ఏ దెబ్బైనా తగిలిందంటే మళ్ళీ చీవాట్లూ ఇంట్లో. మరీ కొడుకూ,కోడలూ,కూతురూ అనడానికి మొహమ్మాటపడ్డా, ఆ లోటు ఇంటావిడ తీర్చేస్తుంది. అదేమిటండీ ఇంత వయస్సొచ్చింది, పిల్లల్ని జాగ్రత్తగా ఆమాత్రం చూళ్ళేరూ అని! ఎందుకొచ్చిన బ్రతుకురా అనిపించేస్తుంది!

అసురసంధ్యవేళలు చూసుకోడం మనం ఒక్కళ్ళే కాదుకదా, ప్రపంచంలో ఇలాటి “ప్రాణులు” ఇంకా ఉంటారు. ఈ తెగకి చెందిన ప్రతీ తాత పక్షీ అక్కడే కనిపిస్తారు. అక్కడ ఓ సిమెంటు బెంచీయో ఏదో వేస్తారు. అదేం ఖర్మమో ఒక్కటీ ఖాళీ ఉండదు. అయినా మనం పార్కుకొచ్చింది ఖాళీగా కూర్చోడానికా ఏమిటీ అని, ఓసారి ఆత్మశోధన చేసేసికుని (ఇంకేమీ చేయలేక!), చేతిలో ఉన్న మనవణ్ణొక్కడినీ ( అప్పటికే కొద్దిగా వయసున్న మనవరాలు తూనిగలా పారిపోవడం వల్ల) తీసికుని అక్కడుండే, ఏదొ స్వింగో. జారుడుబల్లో ఇంకో సింగినాదమో దేంట్లోనో ఓ దాంట్లో ఖాళీ ఉందేమో చూద్దామనుకుంటే, అన్నీ occupy అయిపోయుంటాయి. ఎవరిపిల్లలు వాళ్ళకి ముద్దేకదా. ఏదో చాలాసేపు వెయిట్ చేయగా …చేయగా… చేయగా ఎవడో ఒకడు మనమీద జాలిపడి ప్లేసిస్తాడు.

తీరా అక్కడకి తీసికెళ్తే ఈ మవడికేమో భయం, ఒక్కడూ కూర్చోడానికి. పోనీ వీడికి భయం కదా అని వాడి అక్కని పిలుద్దామంటే, దానికి నామోషీ, మరీ చిన్నపిల్లలతో ఆడ్డానికీ, అక్కడికేదో పుట్టడమే పెద్దదానిలా పుట్టినట్టుగా! పోనీ ఏదో ఒకదాంట్లో ఆడించేసి తీసుకుపోదామా అనుకుంటే, అంతదృష్టం కూడానా? ఇంకోటేదో చూపించి, అదెక్కుదామంటాడు.అక్కడా మళ్ళీ ఇదే గొడవా. మధ్యమధ్యలో ఆ మనవరాలివైపుకూడా ఓ కన్నేసుకునుండాలి, అదేమీ అఘాయిత్యం చేయకుండా. ఏదో అంతా బావుందీ అనుకునేటంతట్లో, అక్కడ బెంచీల మీద కూలబడ్డ తాతెవ్వడో, తనతో తెచ్చిన కూల్ డ్రింకు బాటిలో, మంచినీళ్ళ బాటిలో తన తో వచ్చిన మనవడికో మనవరాలికో ఇస్తాడు. తన డ్యూటీ ఏదో తను చేసికున్నా, ఈ బాటిలుందే మన ప్రాణం మీదకు తెస్తుంది. అప్పటిదాకా ఆడుకుంటున్నవాడు కాస్తా, తాతా దాహం అంటాడు. అయిపోయిందే మన పని! అక్కడెక్కడో దొరికే నీళ్ళివ్వకూడదూ, ఇచ్చేదాకా వీడేడుపాపడూ, పోనీ కొంపకెళ్ళిపోదామా అనుకుంటే , ఆ ఆడుకుంటున్న మనవరాలేమో తెమలదూ. Just five minutes.. అంటూనే ఉంటుంది. ఆ మాయదారి Just five minutes.. అయేటప్పటికి ఓ అరగంట పడుతుంది. ఈ లోపులో కొంపలంటుకుపోయినట్లు వీడి ఏడుపూ, పోనీ ఇంతసేపూ పార్కులో ఆడనిచ్చేనా, అయినా సరే ఆ మనవరాలికి అలకా, ఏదో మొత్తానికి కొంప చేరతాము. మూతిముడుచుక్కూర్చున్న మనవరాలితోనూ, ఏడుస్తున్న మనవడితోనూ. ఇంక ఇంట్లో ఏమై ఉంటుందో అడగాలా ?

మరి ఇదంతా పనిష్మెంటు కాకపోతే ఏమంటారమ్మా …..

%d bloggers like this: