బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు–సుబ్బారాయుడి షష్టి జ్ఞాపకాలు…


   డిశంబరు దగ్గరకొస్తోందంటే చాలు, మాకు అమలాపురం లో హడావిడే హడావిడి. స్కూలుకెళ్ళే దారిలో సుబ్బారాయుడి గుడుంది. పెద్దాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడూ అని అనేవారనుకోండి, కానీ పిల్లలందరికీ సుబ్బారాయుడే! ఆ గుడేమీ మరీ పెద్దది కాదు ఆ రోజుల్లో. ఈమధ్యన 50 ఏళ్ళ తరువాత చూసేసరికి, సదుపాయాలెన్నో చేశారు. ఆ రోజుల్లో, సుబ్బారాయుడి షష్టికి స్కూలు శలవు. అంతకుముందు ప్రతీ రోజూ స్కూలికి వెళ్ళేటప్పుడు, కొట్లవాళ్ళు, పందిళ్ళు వేస్తూ కనిపించేవారు. అబ్బో ఎన్నెన్ని కొట్లో! అటు స్కూలుదాకా, ఇటు చెరువు గట్టుదాకా కొట్లే కొట్లు.

ఇంక ఆలశ్యం అయితే, గుడిలో దర్శనానికి టైము పడుతుందని, తెల్లవారుఝామునే లేపేసేవారు. ఆ చలిలో నూతి దగ్గర నూతిలోంచి,చేదతో నీళ్ళు తోడుకుని ఓసారి నెత్తిమీద గుమ్మరించుకునేసరికి చలి కాస్తా మాయమైపోయేది. గుడికెళ్ళాలన్న ఉత్సాహమో, లేక తెల్లారకట్ల నూతిలో నీళ్ళు మరీ అంత చల్లగా ఉండకపోవడమో తెలియదు కానీ, ఏడవకుండా, పేచీ పెట్టకుండా స్నాన కార్యక్రమం పూర్తయేది. ప్రొద్దుటే నాన్నగారి చెయ్యి పట్టుకుని గుడి కి వెళ్ళడం. ఆ ఊర్లో స్కూలుకి హెడ్ మాస్టారు కావడం చేత, దర్శనం మరీ అంత ఆలశ్యం అయేది కాదు. ఆ గుడిలోపల మహ అయితే ఓ పదిహేను మంది పట్టేవారు. లోపల ఓ పుట్టా, దానిమీద శివ లింగమూ ఇప్పటికీ గుర్తె. అక్కడ మా అస్థాన పురోహితుడు శ్రీ తోపెల్లనరసింహం గారూ, శ్రీ వాడ్రేవు మహదేవుడు గారూ ప్రధాన అర్చకులు. ఏదో మొత్తానికి ఎక్కడా తప్పిపోకుండా, బయటకి వచ్చి, మళ్ళి ఓ దండం పెట్టుకుని, కొంపకి చేరడం. అప్పటికి తెలుగులో వార్తలు ( రేడియోలో) వస్తూండేవి.

అసలు హడావిడంతా ప్రొద్దుట పది దాటింతర్వాతే! కొనేందుకు డబ్బులివ్వకపోయినా, ఓ రౌండేసికోడానికి వెళ్ళి, అమ్మతో మధ్యాన్నం తీర్థానికి వెళ్ళినప్పుడు, ఏమేం కొనాలో తెలియొద్దూ? ఎక్కడ చూసినా పేద్ద పేద్ద గుట్టలు ఖజ్జూరం పళ్ళూ, పక్కనే మిఠాయి కొమ్ములూ, జీళ్ళూ– నోరూరేసేది! ఆటబొమ్మలూ, రంగుల రాట్నాలూ, అబ్బో ఏం జనమండి, ఏం హడావిడి, పెద్దాళ్ళకంటే వాళ్ళతో పిల్లలకే ఆనందం అంతానూ. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, ఏవో పూలూ,పడగలూ ఇచ్చుకునేవారు.

ఆ తరువాత తీర్థంలోకి వెళ్ళడం. తామరాకుల్లో కట్టి ఖర్జూరాలూ, మిఠాయి కొమ్ములూ, జీళ్ళూ, అందులో మళ్ళీ వెరైటీలు- కొమ్ములూ, గుండ్రంగా ఉండేవీనూ. ఓసారి రంగులరాట్నం లో తిరిగేయడమూ, అన్నిటికంటే చివరగా ఓ రంగుల కళ్ళజోడోటి కొనుక్కుని మరి అందరికీ తెలియొద్దూ తీర్థానికి వెళ్ళొచ్చామనీ! ఎంత సంతోషంగా ఉండేదో! ఇప్పుడా తీర్హాలున్నాయా, ఆ సంతోషాలున్నాయా! గుర్తుచేసికోడానికైనా ఇదివరకటి వాళ్ళకి ఇలాటి మధుర జ్ఞాపకాలున్నాయి!……

6 Responses

 1. మీతలపుల్లో ఎప్పుడూ అమలాపురం నిత్య నూతనంగా వుండాలని నా కోరిక

  Like

 2. ఇలాంటివి మీరు చెబితే మేము విని మా ముందు తరాల వారికి (విన్నా/వినకపొయినా) తెలియజేస్తాము……

  చక్కగా దృశ్యీకరించారు

  Like

 3. 🙂 పెద్ద సిటీల్లో లేవేమో కానీ, ఇప్పటికీ సుబ్బారాయడి షష్టి జరుగుతూనే ఉంది. కాస్త అటెండేన్స్ తగ్గిందేమో, ఇదివరకు కన్నా..

  Like

 4. మధురం, మధురం ఆ సమయం
  ఆ జీవిత మే ఆనంద మయం.
  ‘ఇప్పటి జీవితములో
  ఆనందమే మాయం’
  మోహన్

  Like

 5. అయ్యో! దీనినెలా చదవలేదబ్బా? చాలా బాగా వ్రాశారు! షష్ఠి ఉత్సవాలు మా ఊరిలో బాగా చేసినా నేను మాత్రం ప్రతీ సారీ ఈ ఉత్సవాలకి బిక్కవోలు వెళ్ళి వస్తూ ఉంటాను అక్కడ చాలా బాగా చేస్తారు. వేడి వేడిగా సాగుతూ ఉండే జీళ్ళ కోసం అన్నా తప్పకుండా ఈ ఉత్సవాలకి వెళ్ళాలి. చల్లారిపోతే రుచి బాగోదు, సాగదు కూడా. ఇలా ఊరించి ఊరించి గుర్తుచేస్తారెండుకండీ? హతవిధీ!

  Like

 6. @శర్మ గారూ,

  పుట్టిన ఊరు మర్చిపోడమనే ప్రశ్నే లేదు…

  @మాధవీ,

  థాంక్స్..

  @కృష్ణప్రియా,

  జరుగుతూనే ఉండొచ్చు. కానీ ఆ రోజుల్లోని రంగుటద్దాలూ, జీళ్ళూ, బెల్లం మిఠాయిల స్థానం లో కుర్ కురేలూ, రేబాన్ గ్లాసెస్సూ వచ్చుండొచ్చుగా ….

  @మోహన్ గారూ,

  నిజమండి…

  @రసజ్ఞా,

  నీమాట సరే. ఆనాటి సంగతులు గుర్తొస్తూంటే నాకూ నోరూరిపోతోంది….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: