బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “పనీ పాటూ లేక”కి …కొసమెరుపు….

    క్రిందటి సారి ఓ టపా వ్రాశాను, చదివే ఉంటారు. నేను ఆ మెడికల్ షాపు వాడితో మాట్లాడి, ఆ విషయం అబ్బాయితో చెప్పి మేముండే ఇంటికొచ్చేశాను. అబ్బో మా ఇంటాయన ఎంత ప్రయోజకుడో, పిల్లలకి ఈ వయస్సులో కూడా, తనకు తోచిందేదో సహాయ పడుతూంటాడూ, అని ఓ సెభాసీ సంపాదించేశాను. ఇలాటివి ఎప్పుడో రేర్ గానే జరుగుతూంటాయిలెండి! అయినా ఇవన్నీ ఏదో సెభాసీలకోసమా ఏమిటీ? తిన్నదరక్క ఏదో కాలక్షేపం.

    మర్నాటి ప్రొద్దుటే ఫోను చేసి అడిగాను, బాబూ ఆ కొట్టువాడు మన వెయింగ్ మెషీన్ రిప్లేస్ చేశాడా అని. దానికి మా అబ్బాయన్నాడూ, డాడీ అతను ఫోను చేసి, మనం కొన్న మోడల్ లేదుటా, ఇంకోటేదో పంపుతానూ, దానికి అదనంగా పే చేయాలిట అన్నాడు.మళ్ళీ ఇదేం గొడవా అనుకుని,సరే నేనే చూస్తాలే అని అప్పటికి వదిలేశాను. అందుకోసమే, నా టపాలో వ్యాఖ్యలు పెట్టిన నా శ్రేయోభిలాషులకి జవాబు కూడా ఇవ్వలేదు! ఏం ఇవ్వనూ, నా పని “ఫ్లాప్ షో” అయిందనా! మరీ గొప్పలకి పోయి, పని పూర్తయిందీ అని అబధ్ధం కూడా చెప్పలేనూ. అలాగని వదిలేయలేనూ, ఏమిటో ఇదేనండీ, పనీ పాటా లేకపోతే, ఈ విషయం ఓ పేద్ద ప్రిస్టేజీ ఇస్యూ అయిపోయింది. పోన్లెద్దూ వదిలేయ్ డాడీ, అవసరం అయితే డబ్బిచ్చేసి కొత్తది తెచ్చేసికుందామూ అని అబ్బాయీ, మళ్ళీ ఏం వెడతారూ, చూద్దాం మళ్ళీ ఫొను చేస్తానన్నాడు కదా అని కోడలూ, కానీ మా ఇంటావిడకి తెలుసు, ఈయన దాన్ని అలా వదిలేసే రకం కాదూ, ఎంతైనా నలభై ఏళ్ళనుండి కాపరం చేస్తోంది కదా!

   మొత్తానికి ఈవేళ ముహూర్తం కుదిరింది. తాడో పేడో తేల్చేసికుందామని, ఆ కొట్టు యజమానితో ఏమేం మాట్లాడాలో మరీ ప్రాక్టీసు చేసికుని, మరీ మన రాజకీయ నాయకుల్లా ప్రిపేర్డ్ స్పీచ్ చదవలేముగా, ఏమేమిటో ఊహించేసికున్నాను. ఆరోజు కలిసిన కుర్రాడిని ముందుగా దబాయించాలీ, సాయంత్రానికల్లా ఇంటికి పంపిస్తానన్న వాడివి, నాలుగు రోజులు గడచినా, ఇంకా ఎందుకు పంపలేదూ, మాకు ఇంకో పనీ పాటా లేదా.. అప్పుడు సడెన్ గా గుర్తొచ్చింది, అరే ఆరోజు నాకు పనీ పాటా లేదన్నానూ, మళ్ళీ ఆ డయలాగ్గు తో వాడునాకు రిటార్ట్ ఇస్తే… వామ్మోయ్, పోన్లెద్దూ ఆ డయలాగ్గు వాడకపోతేనే బావుంటుందీ అనుకుని, ఇంకోటేదో అంతే పవర్ ఫుల్ డయలాగ్గోటి ప్రాక్తీసు చేశాను! ఎంతైనా నా పెద్దరికం నిలుపుకోవద్దూ, పైగా ఈ వ్యవహారం ఏదో తేల్చుకుని మరీ వస్తాను అని ఇంట్లో చెప్పానాయే!

    పైగా ఆ కొట్టుకి వెళ్ళడానికి బస్సు కోసం చూస్తూంటే ఒకాయనతో పరిచయం అయింది. ఆయనతో కబుర్లు చెబుతూంటే, అడిగారు, ఏమిటీ ఏమైనా కొనడానికి వెళ్తున్నారా అంటూ, కాదూ, అని నా మిషన్ గురించి ఓ లెక్చరిచ్చి, ఈరోజుల్లో పిల్లలు ప్రతీ విషయాన్నీ ఎంత ఈజీగా తీసికుంటారో, మనలాంటి వాళ్ళున్నారు కాబట్టి సరిపోయింది కానీ, ఈ కొట్లవాళ్ళు ఎలా చీట్ చేస్తారో బ్లా..బ్లా… బోరు కొట్టేశాను! ఆయన కూడా నాలాటి “పక్షే” అయుంటాడు, అవునూ మీరు చెప్పింది అక్షరాలా నిజం, మా ఇంట్లోనూ మా పిల్లలతోటీ అలాగే, ఒక్క విషయం లో శ్రధ్ధ తీసికోరూ వగైరా ..వగైరా… ఛాన్సొస్తే చాలు వినేవాళ్ళుండాలే కానీ, పిల్లలమీదా, సో కాల్డ్ ఇప్పటి జనరేషన్ మీదా ఒకళ్ళతో ఒకళ్ళు లెక్చర్లిచ్చేసికోడమే!! ఖర్చు లేని పనీ ! !!!! ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ కూడబెట్టుకుని, మళ్ళీ కొట్లో చెప్పల్సిన డయలాగ్గులు గుర్తు చేసికుని, తీరా కొట్లోకి వెళ్తే అంతా తుస్సు మంది!……

   కౌంటర్ లో ఆ కొట్టు యజమానే ఉన్నాడు. నన్ను చూడగానే ” నమస్కార్ అంకుల్..” అన్నాడు. అస్సలు మనం లొంగకూడదూ అని మనస్సులో అనెసికుని హల్లో ఎలా ఉన్నారూ అనేసి ఊరుకున్నాను.కారణం అతన్ని ఎప్పుడో ఉద్యోగంలో ఉన్నప్పుడు 15ఏళ్ళ క్రితం చూశాను. మా క్వార్టర్స్ కి దగ్గరలోనే వాళ్ళ కొట్లోంచే సరుకులు తీసికునేవాడిని. అతని మొహం ఎలా ఉంటుందో చెప్పాలంటే “మర్చిపోయాను”. కానీ అదేం ఖర్మమో నన్ను ఓసారి చూసినవాళ్ళకి, నా మొహం ఎప్పుడూ గుర్తే!అలాగని అదేదో పేద్ద సెలిబ్రెటీ మొహం అనుకోకండి. మామూలు మొహాలకి భిన్నంగా, పళ్ళు లేకుండా, బోసి నోరుని పేద్ద మీసాలతో కవరు చేస్తూ, మనకి పళ్ళు లేవని ఊళ్ళో వాళ్ళందరికీ తెలియడం ఎందుకూ!పైగా చామన చాయో, నలుపో కాకుండా, తెల్లగా ఉండడం వల్లనైతేనేమిటి, పోలీసుల దగ్గరనుంచీ అందరూ గుర్తెట్టుకుంటారు. చూశారా నా మొహం ఎంత ఫేమస్ అయిపోయిందో!! అర్రే మనం అందరిలాగా ఎందుకులేమూ, అని అప్పుడెప్పుడో ఫీలై పోయేవాడిని!అదేదో కెచ్ అప్ యాడ్ లో Its different… అని.అవన్నీ ఇదివరకటి సంగతులనుకోండి. ఇప్పుడు అలాటిదేమీ లేదు, నా మొహం ఎవరికైనా నచ్చిందా, మాట్లాడతారు, లేదా వదిలేస్తారు నో ఇస్యూ…

    అరే ఏమిటిలా వచ్చారూ అంటే, ఏమిటీ మా పిల్లల్ని థంగ్ ( ఇబ్బంది) పెడుతున్నావుటేమిటీ అని రసీదు చూపించగానే, ఒహో అదా, మరి దాంట్లోకి నీళ్ళెళ్ళాయీ, ఇది డిజిటల్ కదా, ఎనలాగ్గుదైతే పరవాలేదూ వగైరా వగైరా వాటిమీద ఓ జ్ఞాన బోధ చేసి, దానికి నా జవాబు కూడా శ్రధ్ధగా విని, ఓ కొత్త సీల్డ్ ప్యాక్ ఓపెన్ చేసి, దాన్ని టెస్టు కూడా చేసి, ఓ చాయ్ తెప్పించి, ఇంటికి పంపాడు! అదండీ సంగతి!

   అందుకనే చెప్తూంటాను పిల్లలకి మీకు ఇలాటి మొండి కేసులొచ్చినప్పుడు నా చెవినేస్తూండండి, నా ప్రయత్నమేదో నేనూ చేస్తూంటాను అని. ఇంటికొచ్చిన తరువాత మా కోడలన్న మాటేమిటంటే మామయ్య గారూ మీ Strike Rate 100% ఇప్పటికి. ఇలాటివే ఇదివరక్కూడా ఓ నాలుగైదు కేసులు వాళ్ళకి వీలవనివి పూర్తి చేశానులెండి! పనేమీ లేకపోయినా అప్పుడప్పుడు ఇలాటివి చేస్తూంటే నాకూ ఓ కాలక్షేపం…..

%d bloggers like this: