బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పనీ పాటా లెకపోతే….

    ఖాళీగా ఉండడమూ, కాళ్ళూ చేతులూ స్వాధీనంలో ఉండడంవలన ఐతే ఏమిటి, బయటివారితో మాట్లాడడం ఇష్టపడడంవలనైతే ఏమిటి, మా పిల్లలకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి వీలుకుదరనప్పుడూ, ఆ పన్లు నేను చేయడానికి వాలంటీర్ చేస్తూంటాను. నాకూ కాలక్షేపం అవుతుంది. వాళ్ళ పనీ అవుతూంటుంది.

    ఈరోజుల్లో వీలుదొరికినప్పుడల్లా “బరువు” చూసుకోడం అందరికీ ఓ అబ్సెషన్ అయింది. నాకు తెలియదూ, ఇళ్ళల్లో వెయింగ్ మెషీన్లెందుకండీ? హాయిగా ఓ రూపాయేస్తే రైల్వే స్టేషన్లలోనూ, బస్ స్టాండ్లలోనూ చూసుకోవచ్చుగా, అబ్బే మన వెయిట్ ఎంతుండాలో, మనం ఎంత తగ్గించుకోవాలో, ఆ తగ్గించుకోడానికి ఏమేమి చేయాలో, అదేదో ట్రెడ్ మిల్లులూ వగైరా వగైరాలు ఉపయోగించుకోడం, ఇవే ఏ ఇంట్లో చూసినానూ.. ఆ సందర్భం లో పిల్లలు ఓ వెయింగ్ మెషీన్ కొని, పైగా అదేమో బాత్రూం వెయింగ్ మెషీన్ ట. అంటే స్నానం చేసినతరువాతో, చేసే ముందరో ఓసారి చూసుకోడానికి! ఎవరిష్టం వాళ్ళదీ, మన కెందుకూ?

    ఆ మెషీన్ కొన్న రెండు నెలలకల్లా తప్పు రీడింగులు చూపించడం మొదలెట్టింది. అయినా చిత్రం కాకపోతే, వెయిట్ మరీ పావుగంటలోనే మారిపోతుందా ఏమిటీ? నాలుగు రోజులు అలా చూపించి ..చూపించి..చూపించి… పని చేయడం మానేసింది. మర్నాడు అదెక్కడైతే కొన్నారో ఆ కొట్టుకే వెళ్ళి చూపించారు. ఇంకా గారెంటీయో, వారెంటీయో ఉందిగా మరి. ఈ రెండింటికీ తేడా ఏమిటో నాకు ఛస్తే తెలియదు. ఏదో విండానికి stylish గా ఉన్నాయి కదా అని నాకూ నచ్చుతూంటాయి. కొన్న రసీదుంటేనే ఆ గారెంటీ/వారెంటీ క్లాజులు వాలిడ్ ట!

    మామూలుగా ఇళ్ళల్లో ఇద్దరు పిల్లలుంటే, ఏ కాగితమూ అవసరానికి కనిపించదు. కానీ వాళ్ళ అదృష్టమేమిటో, ఆ రసీదు కూడా దొరికింది!
దాన్నీ ( ఆ రసీదునీ), మెషీన్నునీ పట్టుకుని ఓ అర్ధ లీటర్ పెట్రోల్ ఖర్చుపెట్టి, ఆ కొట్టువాడి మొహాన్నేసి కొట్టారు. ఆ మెడికల్ షాప్పు వాడి బాధ్యత అమ్మడం వరకే, దాని రిపెరీలు వాడికేం తెలుస్తాయి? దాన్ని తయారు చేసిన కంపెనీకి పంపి చూపిస్తామూ అన్నారు. దాంతో గత నాలుగు నెలలూ బరువు చూసుకుని, టెన్షన్లు తెచ్చుకోడం తప్పింది! అలాగని మరీ 1500 పెట్టి కొన్న మెషీను వదులుకోలేముగా. ఆ డబ్బంతా ఎవడు తిన్నట్టూ? అబ్బాయైతే, అగస్థ్యని క్రెచ్ లో దింపడానికి వెళ్ళినప్పుడల్లా, ఓసారి అడగడం, ఏమయ్యిందీ అంటూ. ఇదిగో వచ్చేస్తోందీ, అదిగో వచ్చేస్తోందీ అంటారే కానీ, రిపేరయ్యి ఎప్పుడు వస్తుందో చెప్పడే. ఇలా మూడు నెలలు అయిన తరువాత మొత్తానికి ఓ నెల క్రితం చెప్పేశాడు, దాన్ని రిపేరీ చేయడం కుదరడం లేదూ, కొత్తదే ఇస్తాము అని.అమ్మయ్యా వ్యవహారం ఓ కొలుక్కొచ్చిందని సంతోషించారు, నేను కాదు, మా కొడుకూ,కోడలూనూ! అయినా అప్పుడే ఎక్కడయ్యిందీ, ఆ కొట్టువాడికి తీరికుండాలి, కంపెనీ వాడికి తీరికుండాలి, పిల్లలకి తీరికుండాలి, ఎంత హడావిడీ, ఎంత కథా కమామీషూ జరగాలి..అన్నీ అంత త్వర త్వరగా జరిగిపోతే, నా దాకా ఎక్కడొస్తుందీ ఈ వ్యవహారం అంతా? ఏదో “మొండి” బకాయిల్లాటివే నా దృష్టికొచ్చేవి. అయినా నాలుగు నెల్లలనుంచీ వింటున్నానూ, కానీ అస్తమానూ అడిగినా బాగోదు కదా, మాకే లేని తొందర మీకెందుకూ అంటే, లేనిపోని గొడవోటి! చూద్దాం లే అవసరం వస్తే అడక్కెక్కడకి పోతారు, అనుకుని వదిలేశాను.

    మొత్తానికి ఆ ముహూర్తం కాస్తా రానే వచ్చింది! ” మామయ్య గారూ, మీకు వీలు దొరికినప్పుడు, ఓసారి వెళ్ళి ఆ వెయింగ్ మెషీన్ సంగతి చూసిరాకలరా…” అని అన్నే అంది! ఆ మాత్రం ఆథరైజేషన్ చాలు నాకు. జైజైనాయకా అంటూ వెళ్ళాను. ఆ రసీదు చూపించి, కొత్తదిస్తానన్నావుట, ఎక్కడుందీ అన్నాను. అయినా నా పెద్దరికమూ చూపించుకుందామని, జూలై లో కొన్నది, ఆగస్టు కల్లా పాడైపోతే ఎలాగా? అన్నాను. వాడంటాడూ దాంట్లోకి నీళ్ళెళ్ళాయి దానితో పాడైపోయిందీ అని. దొరికావురా బాబూ అనుకుని, ఆ వెయింగ్ మెషీన్ పేరేమిటో తెలుసా బాబూ అని అడిగితే, ” Baathroom weighing machine” అన్నాడు. మరి దాంట్లో నీళ్ళు కాక పంచామృతాలు వెళ్తాయా నాన్నా అన్నాను. నీళ్ళెళ్ళకుండా, మరీ వాష్ బేసిన్ మీద పెట్టి, బరువు చూసుకోలేరు కదా, అస్తమానూ ఆ గట్టెక్కడం కూడా కష్టం. క్వాలిటీ మంచిది కాదూ అని ఒప్పేసికో, అంతేకానీ కాకమ్మ కథలు చెప్పకూ, కొత్తది ఎప్పుడిస్తావూ అనగానే, ఓ గంట తరువాత రమ్మన్నాడు. చూడు బాబూ, రెండు నెలల నుంచి ఏదో ఒక మాట చెప్పి పిల్లల్ని తిప్పుతున్నావు, సాయంత్రానికల్లా ఇంటికి పంపలేదో, రేప్పొద్దుటే తెల్లారేసరికి నీ కొట్టుముందర కూర్చుంటాను, నాకా పనీ పాటా లేదు. వచ్చేపోయే వాళ్ళందరిదగ్గరా మొదలెడతాను, నీ కొట్లో సరుకు నాణ్యత ఉండదూ అని. నీ ఇష్టం…

    నా మిస్టరీ షాపింగుల అనుభవం ధర్మమా అని కొట్ల వాళ్ళతో అవి ఎంత పెద్దవి అయినా, దబాయించడం ఓటొచ్చింది.… ఇదీ బాగానే ఉంది. పిల్లలకి మొహమ్మాటం, అవతలివాడేమనుకుంటాడో అని. అలాగని ప్రతీవాడినీ వదిలేస్తే ఎలా మరీ….

%d bloggers like this: