బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏదో హాయిగా కొంపలో కూర్చోక……


   మొన్న భాగ్యనగరం లో ఉండగా, మా మిస్టరీ షాపంగ్ వాళ్ళ దగ్గరనుంచి ఓ ఫోనూ… వాళ్ళకి అర్జెంటుగా ఏదైనా assignment ఇవ్వాలనుకున్నప్పుడల్లా నేను గుర్తుకొచ్చేస్తూంటాను! వాళ్ళకీ తెలుసూ, పనీ పాటా లేకుండా ఉంటున్నాననీ. పూణె లో ఉండాలే కానీ, ఎలాటి assignment కైనా రెడీ అని! నాక్కూడా కాలక్షేపం అవుతుంది. కానీ ఒక్కొక్కప్పుడు వాళ్ళిచ్చే audits నా ప్రాణం మీదకి తెస్తూంటాయి. కానీ నేనా వదిలేదీ?

    అదేదో త్రీ స్టార్ హొటల్లో ఒక రాత్రీ, రెండు పగళ్ళూ గడిపి, దాన్ని ఎవాల్యుఏట్ చేయాలిట! ఒక్కణ్ణీనా ఇద్దరూ వెళ్ళొచ్చా అని అడిగితే, ఠాఠ్ ఒక్కరే అన్నారు. ఇంకోళ్ళెవరినైనా తీసికెళ్తే, ఖర్చు నన్ను పెట్టుకోమన్నారు. మళ్ళీ ఇదోటా అనుకుని సరే అన్నాను. ఊళ్ళో, కూతుర్నీ, కొడుకునీ అందరిలోకీ ముఖ్యమైన ఇంటావిణ్ణీ పెట్టుకుని, మరీ ఒక్కణ్ణీ వెళ్తే బావుండదేమో అని ఒకేఒక్కసారి మనసులోనే అనేసికుని, పోన్లెద్దూ ఈ సరదాకూడా తీరిపోతుందీ అనుకుని వెళ్ళడానికే డిసైడయిపోయాను. ఇంక ఆ తరవాతనుంచి, మా ఇంటావిడ మొహంలోకి చూడ్డానికి ధైర్యం చాల్లేదనుకోండి, ఏదో మొదటీ సారిగా, అదేదో గిల్టీ గా ఉంటుందని, సరిపెట్టేసికున్నాను!

   భాగ్యనగరం లో కాచిగూడాలో మేముండడానికి ఇచ్చిన హొటల్ కూడా, త్రీ స్టారే అవడంతో, కనీసం ఏమేమి ఉంటాయో, ఎక్కడెక్కడుంటాయో వగైరాలన్నీ బట్టీ పట్టేశాను! అయినా ఎప్పుడైనా స్టార్ హొటళ్ళలో ఉన్న మొహమా ఏమిటీ? ఉన్న నాలుగైదు సార్లూ ఇంటావిడతోనే ఉండడం వల్లన, వీధిలో పడఖ్ఖర్లేకపోయింది! ఇప్పుడేమో ఒక్కణ్ణీ ఉండాలాయె. పోనీ మానేద్దామా వీలు కుదరలేదూ అని వాళ్ళకి ఫోను చేసేస్తే ఇంకోళ్ళని చూసుకుంటారూ అని ఓ flying thought వచ్చిందనుకోండి, ‘మమ‘ అనేసికుని ఓసారి, దీని సంగతీ చూసేస్తే పోలా అనేసికున్నాను.

    మరీ బస్సులోనూ, ఆటోలోనూ వెళ్తే బాగుండదేమో అనుకుని, ఓ radio cab కి ఫోను చేసి తెప్పించుకుని , అంతకుముందే, వాళ్ళు ఆ transport charges ఇస్తారో లేదో తెలిసికుని, ఓ బ్యాగ్గులో రెండు జతలేసికుని బయలుదేరాను! పల్నాటి యుధ్ధం లో బాలచంద్రుణ్ణి ముస్తాబు చేసి తిలకం దిద్దినట్టుగా, మా ఇంటావిడ హారతీ గట్రా ఇచ్చి, మధ్య మధ్యలో ఫోను చేస్తూంటానూ, రెండో రింగుకి ఫోను తీయలేదా, మీ సంగతి ఇంటికొచ్చిన తరువాత తేలుస్తానూ అని ఓ వార్నింగు కూడా ఇచ్చి, మొత్తానికి వదల్లేక..వదల్లేక వదిలిందండి ( అని నేననుకున్నాను...). అసలు నా ఉద్దేశ్యమెమిటంటే, మధ్య మధ్యలో భర్తలకి ఇలాటి అవకాశాలు ఇస్తూండాలని.

    ఇంక పన్నెణ్డింటికి అక్కడ చెక్ ఇన్ చేశాను.అక్కడ వాడిచ్చేవేమిటో ముందరే తెలిసికుని, ఆ ప్రకారం చేశాను. ఇంక రూమ్ములో కి వెళ్ళిన తరువాత ఓ సారి అంతా సర్వే చేసి, ఏదేమిటో ముందర టెస్టు చేసి అమ్మయ్యా ఓ పనైందిరా బాబూ అనుకున్నాను. భోజనమోటి చేయాలిగా, Restaurant కి వెళ్ళి ఏదో లంచ్ ప్లేట్ లాటిది తీసేసికుంటే ఓ గొడవొదిలిపోతుందికదా అనుకుంటే, అలాక్కాదుట. అదేదో a-la-carte-meal ట, అంటే ఏమిటో తెలిసి చావదు. పోనీ ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోదామా అంటే, కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయే, ప్రొద్దుట మా ఇంటావిడ బ్రేక్ ఫాస్టు కూడా మామూలుగా పెట్టింది, ఎలాగా హొటలుకి వెళ్తున్నారుగా, అక్కడే మెక్కండీ అంటూ… ఏమిటో లేచిన వేళేం బాగోలేదూ అనుకుంటూ, వాడిచ్చిన మెనూ కార్డులో, నాకు తెలిసిన veg biriyani ఆర్డరు చేశాను. మిగిలినవేటో, వాటిల్లో ఏం కలుపుతారో తెలియదాయె. ఆ తెచ్చేదేదో ఎంత తెస్తాడో అన్నీ అనుమానాలే. ఏదో మొత్తానికి వాడు తెచ్చింది తినేసి, రూమ్ముకి వెళ్ళిపోయాను.

    అప్పటివరకూ జరిగినదంతా headquarter కి ( మా ఇంటావిడకి)) ఫోనుచేసేసి, ఓ interim report పంపేశాను. ఇంతలో ఫోనూ, ఎవరూ మన బులుసు వారిదగ్గరనుంచి, రాజమండ్రీ కార్యక్రమం ఏమైందంటూ, ఆయనతో నా “కష్టాలు” చెప్పేసికుని కొంతసేపు కబుర్లాడేసికున్నాము. మళ్ళీ ఓ అరగంటకల్లా ఫోనూ, ఇంకెవరూ మా ఇంటావిడ! ఏమిటీ ఇందాకా ఫోను చేస్తే ఎంగేజొచ్చిందీ, ఎవరితోనూ కబుర్లూ? వెర్రివెర్రి వేషాలేశారంటే తెలుసుగా అంటూ… సంబడం.. అంత ధైర్యం కూడానా…

    సాయంత్రం ఓసారి హొటల్ అంతా వాహ్యాళికి వెళ్ళి, ఓ పది ఫొటోలు తీయాలిట. అది నా assignment లో భాగం లెండి. ఓ కెమేరా తీసికుని బయలుదేరాను. మళ్ళీ భయం, ఏ హొటల్ వాడో చూసి, ఏదో రికీ(recce) చేస్తున్నానేమో అనుకుని, ఏ పోలీసుల్నైనా పిలుస్తాడేమో అని… మళ్ళీ అదో అప్రదిష్టా... ముందర జిమ్ము ( Gym) తో మొదలెట్టి, పదిఫొటోలూ తీశాను. ఇంతలో net zone లో నా అదృష్టం కొద్దీ ఒకాయన కలిశారు. ఏదో కబుర్లు మొదలెడితే తెలిసింది, ఆయన తెలుగువారే అని. అమ్మయ్యా ఎవరో ఒకరు దొరికారురా బాబూ అనుకుని, ఆయన్ని ఓ రెండు గంటలు బోరుకొట్టేశాను!

    ఏదో కాలక్షేపం చేసి, మళ్ళీ రాత్రి భోజనం కూడా చేసేసి, ఈలోపులో నాలుగుసార్లు నేనూ, నాలుగుసార్లు మా ఇంటావిడా ఫోన్లు చేసేసికుని పడకేసేశాను ( ఒక్కణ్ణే లెండి!).
మర్నాడు పొద్దుటే లేచి, ఏదో స్నానం పానం చేద్దామనుకుంటే, వేణ్ణీల్లెక్కడినుంచొస్తాయో తెలియదాయె. ఫోనోటుందిగా, రిసెప్షన్ కి ఫోను చేశాను, దీంట్లో మొహమ్మాటమెందుకూ, వాడేమో అదేదో నాబ్ ని ఎడంచేతివైపు తిప్పితే వస్తాయంటాడు. అప్పటికే దానికున్న అరడజను నాబ్బులూ తిప్పి, బట్టలన్నీ తడిపేసికున్నాను! చూడు నాన్నా ఇక్కడ అరడజను నాబ్బులున్నాయి, దేన్ని ఎడంచేతివైపు తిప్పితే వేణ్ణీళ్ళొస్తాయో నాకైతే తెలియడం లేదూ, అదేదో నువ్వే చూపించి పుణ్యం కట్టుకో అని అడగ్గా, ఎవరినో పంపి ఆ గండం గడిపించాడు మొత్తానికి!

    బ్రేక్ ఫాస్ట్ తీసికుని, మళ్ళీ ఓ కాబ్ తెప్పించుకుని, మొత్తానికి క్షేమంగా ఇంటికొచ్చేశాను ! ఎందుకొచ్చిన గొడవలండి బాబూ ఇవి? హాయిగా మన వేపైతే, ఏదైనా ఊరు వెళ్ళినా, ఏ లాడ్జింగులోనో, అదీ కుదరకపోతే ఏ మడత మంచమో అద్దెకు తీసికుని లాగించేయొచ్చు! కానీ ఈ “మజా” రాదుగా….. I enjoyed my “freedom”.…..

7 Responses

 1. బారిష్టరు పార్వతీశం గారి లండను ప్రయాణం గుర్తుచేసుకున్నారా!

  Like

 2. బులుసు వారి కాల్ మీకు సాక్ష్యం అయిందా? ఏంచేస్తాం. అప్పుడప్పుడు నేను ఇలాగే చెప్పుకుంటాను. భార్యామణి అడిగితే ఫలానా వారితో మాట్లాడుతుంటే ఆలస్యం అయింది అని. … దహా

  Like

 3. 🙂 బాగుంది.

  Like

 4. అమ్మో …. పర్లేదు బాగా గడిపినట్టున్నారే….
  పిన్నిగారిని మెచ్చుకోవాలి ఎలా ఒప్పుకున్నారో…… ఠాఠ్… నాకు డబ్బులు కట్టి తీసుకెళ్ళాల్సిందే అనలేదు…. చూసారా మరి గొప్పతనం….

  Like

 5. @శర్మగారూ,

  నిజమేనండోయ్…

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మీ వ్యాఖ్య చూస్తూంటే, నన్నేదో ఇరుకులో పెట్టాలన్నట్టనిపిస్తోంది…..

  @కృష్ణప్రియా,

  థాంక్స్..

  @మాధవీ,

  వాళ్ళదగ్గరనుండి డబ్బులొచ్చేసరికి టైము పడుతుంది. అప్పుడు చూడొచ్చు…

  Like

 6. అంతేకానీ ముందు పెట్టుకొని తీసుకెళ్ళరు అంతే కదా….

  Like

 7. మాధవీ,
  ఏదో వెళ్ళిపోతోంది కదా! లేనిపోని గొడవలెందుకు తెస్తారూ….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: