బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పుత్రోత్సాహం….

DNA

    నిన్న రోజంతా బిజీబిజీ గా గడిచిపోయింది. మేము భాగ్యనగరం నుంచి, ఇంకా పైకి రాజమండ్రీ దాకా వెళ్దామని టిక్కెట్లు రిజర్వు చేసేశానని చెప్పానుగా. అలాగే కనుక వెళ్ళి ఉంటే, నిన్న మా అబ్బాయీ, కోడలూ సంయుక్తంగా నిర్వహించిన ఓ మంచి కార్యక్రమాన్ని మిస్ అయి ఉండేవాడిని. తను ఇక్కడ ఓ ఆన్ లైన్ గ్రంధాలయం నిర్వహిస్తున్నాడని ఇదివరకు వ్రాశానుగా, పేరు tenderleaves అయినా, మెల్లిమెల్లిగా మారుతున్నాయి!!

   పుస్తకాలకి సభ్యత్వం బాగానే జరుగుతోంది అయినా, మా వాడికి ఇంకా ఏదో చేయాలని తపనా. ఓ నెల రోజుల క్రితం ఇక్కడ ఉండే 14 స్కూళ్ళకి వెళ్ళి, అక్కడ చదువుకునే పిల్లల
నుంచి, వాళ్ళు స్వయంగా వ్రాసిన కథల పోటీ ఒకటి పెట్టాడు. ఆ పోటీకి వచ్చిన కథలెన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు! అక్షరాలా 2000. వాటన్నిటినీ, అబ్బాయీ, కోడలూ రాత్రింబవళ్ళు చదివి, వాటిలో ఓ వంద కథల్ని షార్ట్ లిస్ట్ చేశారు. మళ్ళీ వాటిలో, ఓ 60 కథల్ని సెలెక్ట్ చేశారు. కథల్ని సెలెక్ట్ చేయడం తో సరిపోదుగా, వాటిని ఓ పుస్తకం లా తేవాలని ఓ ఆలోచనొచ్చింది. ఓ ప్రింటర్ ని పట్టుకుని ఆ కథలని The Diary of a Puneri Kid అని ఓ పేరోటి పెట్టి ప్రింట్ చేయించాడు. ఇందులో విశేషమెమిటంటే, 60 కథలనీ, యతాతథంగా , అంటే ఎడిటింగూ అదీ లేకుండా, యదాతథంగా స్కాన్ చేసేశారు. పక్కనే ఆ కథ వ్రాసినవారి పేరూ,ఫొటో వేయించారు.

    ఇంక చూడండి హడావిడి, నిన్న ఆ పుస్తక వితరణా, దానితో పాటు స్కూలు పిల్లలకి ఓ క్విజ్జు పోటీ ఆర్గనైజు చేశారు. నిన్నంతా అదే హడావిడి. పిల్లలూ, వాళ్ళ తల్లితండ్రులూ, కొంతమంది గ్రాండ్ పేరెంట్సూ, టీచర్లూ అబ్బో సందడే సందడి! తమ పిల్లల అదీ 5 నుంఛి 12 సంవత్సరాల వయస్సు వారు వ్రాసిన కథలు పుస్తక రూపంలో చూసుకునేసరికి, ఒక్కోళ్ళ ఆనందం చూడాలేకానీ, చెప్పలేను!

    ఎవరికి వారే, అర్రే మావాడు ఇంత బాగా రాస్తాడని తెలియనేతెలియదూ, అని ఒకళ్ళు, ఈమధ్యన ఎప్పుడు చూసినా ఏదో వ్రాస్తూనే కనిపించాడూ, ఇదన్నమాట అని ఇంకొకరూ, ఎవరికి వారే ఇంత సంతోషం, ఆనందం ఇచ్చినందుకు మా అబ్బాయి ని పొగుడుతూంటే, అంతకన్నా ఆనందం ఎక్కడుంటుందీ?

    ఇంక క్విజ్జు పోటీకి మొత్తం 70 ఎంట్రీలు వచ్చాయి. ముందుగా ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభించి, చివరి ఆరు టీమ్ములనీ వేదిక మీదకి పిలిచి, ఆరు రౌండ్ల క్విజ్ నిర్వహించారు. నెగ్గిన వాళ్ళకి ప్రైజులూ, పుస్తకంలో ప్రచురణకి సెలెక్ట్ అయిన్ అరవైమందికీ మా లైబ్రరీ ఆరునెలల సభత్వమూ ఇచ్చాడు. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ,అదీ మా అబ్బాయి, కోడలూ రాత్రింబవళ్ళు శ్రమ పడి చేస్తూంటే, నేనా మిస్ అయేది? కానీ మా ఇంటావిడ ఫొటోలు చూసే ఆనందించవలసివచ్చింది. ఇంట్లో చి.అగస్థ్యని పెట్టుకుని ఉండిపోయింది.DNA అన్న దానిమీద నొక్కితే, ఆ పేపరులో ఈ కార్యక్రమం గురించి ఏం వ్రాశారో చదవ్వొచ్చు.

   రాజమండ్రీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఇలాటి కార్యక్రమం అస్తమానూ రమ్మంటే వస్తుందా మరి?

%d bloggers like this: