బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బాపూరమణా.. జగదానంద….


    మన ప్రాంతాలకి ఇంత దూరం లో ఉన్నామూ, బాపురమణల అద్భుతసృష్టిని చూడగలమో లేక, ఏ పైరేటెడ్ సి.డి లోనో, లేక మన చానెళ్ళవాళ్ళు చూపించినప్పుడో చూడాల్సొస్తుందేమో అని బాధపడిపోయాము. కానీ, బాలకృష్ణ సినిమా అనో లేక నిర్మాత గారి విశాలహృదయం వల్లనో, మేము కూడా శ్రీరామరాజ్యం చూసే పుణ్యం కట్టుకున్నాము మొత్తానికి ! పుణ్యం అని ఎందుకన్నానంటే, ఆ సినిమా చూస్తున్నంతసేపూ అదీ పది నిముషాలు తక్కువ మూడు గంటలూ, బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డిలూ, సింహాలూ వగైరా కానీ, నయనతార ఇదివరకు చేసిన గైరేషన్లూ, డ్రిల్లులూ వగైరాలేవీ గుర్తుకు రాలేదు ! అదీ బాపూగారి సత్తా !

    కథ అందరికీ తెలిసిందే. కానీ అదే కథ “లవకుశ” గా మనలో చాలామంది ఇదివరలో చూశాం, అప్పుడప్పుడు టి.వీ.ల్లోనూ చూశారు. ఇందులో గొప్పేం ఉందీ పేద్ద అనుకునేవారు కూడా ఉంటారు. కానీ ఒక్క విషయం చెప్పండి ప్రతీరోజూ భక్తి టి.వి.లో గరికపాటి వారు మహాభారతానికి సామాజిక వ్యాఖ్య అనే పేరుతో చెప్తున్నారు, అదే మహాభారతాన్ని ఎస్.వి,బి,సి లో శ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారూ చెప్తున్నారు. మరి ఈ రెండింటికీ సహస్రాలు తేడాలేదూ? ఎవరి దృష్టికోణం వారిదీ. అలాగే బ్రహ్మశ్రీ చాగంటి వారు ఏం చెప్పినా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టే అనిపిస్తుంది. అందరికీ, అందులో నాలాటి అర్భకులకి కూడా, అర్ధం అయేటట్టు చెప్పడంలోనే ఉంది అసలు సిసలు గొప్పతనం అంతా! ఇదిగో ఈవేళ చూసిన శ్రీరామరాజ్యం కూడా అలాటిదే మరి.

    అవడం వాల్మీకి సృష్టి అయినా, దానికి ప్రతిసృష్టి చేసిన స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణగారిదే ఈ ఖ్యాతంతా. అసలు బాపూ గారు దర్శకత్వం చేస్తారంటేనే చాలు, రమణగారి కలం అలా హాయిగా హాయిగా గోదావరి లా సాగుతుందేమో!

    తాను స్క్రీన్ ప్లే వ్రాసిన అద్భుత కావ్యాన్ని తాను తెర మీద చూసుకునే అదృష్టం శ్రీ ముళ్ళపూడి గారికి లేకపోవడం మన దురదృష్టం. ఒక్కో డయలాగ్గూ ముళ్ళపూడివారి ట్రేడ్ మార్కే! మేము క్రిందటేడాది శ్రీ ముళ్ళపూడి వారిని కలిసినప్పుడు ఆయన శ్రీరామరాజ్యం స్క్రీన్ ప్లే వ్రాయడంలో ఉన్నారు. ఆయన వరండాలో కుర్చీలో కూర్చుని వ్రాసిన కాగితాల చిత్తుప్రతిని చూసే అదృష్టం మాకు కలిగింది. చిత్తుప్రతి అని ఎందుకన్నానంటే, ఆ కాగితం మీద వ్రాసినదేదో చదువుదామని ప్రయత్నిస్తూంటే ఆయనే మమ్మల్ని ఆపేసి అన్నారూ–” నా వ్రాత బాపూ గారికీ, నా భార్య శ్రీదేవికీ తప్ప ఎవరికీ అర్ధం అవదండీ. పాపం వాళ్ళే ఏదో తిప్పలు పడి ఫెయిర్ కాపీ చేస్తూంటారు…” . వ్రాత అర్ధం అవకపోవచ్చు సార్, మీభావాలూ, మీదృష్టికోణమూ ఇంత సుళువుగా ఉంటాయని అనుకోలేదు!

    అసలు ఘనత అంతా ఎక్కడుందంటే, ఏ పాత్రధారికీ నాలుగైదు డయలాగ్గులకంటే ఎక్కువ ఈయకపోవడం. ప్రతీవారూ తమతమ హావభావలతోనే తాము చెప్పే మాటలు చెప్పడం.మామూలుగా శ్రీ బాపూగారు పబ్లిక్కులో మాట్లాడరంటారు. ఈ సినిమాలో పాత్రధారులని కూడా నోరెత్తనీయలేదు!Hats off.. అసలు టైటిల్సు మొదలెట్టినప్పటినుంచీ, పేర్లే చదవాలో, లేక పక్కనే ఉన్న శ్రీ బాపూ గారి కుంచె నుంచి వచ్చిన అద్భుత చిత్రాలు చూడాలో అర్ధం అవలేదు.

    ఏ సీన్ చూసినా, దానిలో పాత్రధారులకంటే, చుట్టూ ఉన్న అలంకరణలకే ముఖ్యపాత్ర ఇచ్చారు. బహుశా అదో కారణం అయుండొచ్చు, పాత్రధారులు ఎలా ఉన్నారూ అనే విషయం మీదకి దృష్టి వెళ్ళదు. అసలు ఆ భారీ భారీ సెట్లు చూస్తూంటేనే కడుపు నిండిపోయింది. పైగా ఒక్కో డయలాగ్గూ అఛ్ఛోణీల్లాటివి. ఏదో పౌరాణిక సినిమా చూస్తున్నట్లనిపించదు. వాల్మీకి పాత్రకి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు తప్ప ఇంకోరు న్యాయం చేసుండరు. ఆ పాత్రలో ఆయన నటన చూస్తూంటే, ఇదేమిటీ ఈయన ఎప్పుడు చూసినా దేముణ్ణి నమ్మనూ అంటూంటారూ, అలాటి వ్యక్తి పాత్రలో అంతగా లీనం అయేటట్టు నటించకలిగారంటే ఆ ఘనత అంతా శ్రీ బాపూ గారిదేగా మరి.

    ఇంక సంగీతానికి వస్తే, ఇన్నాళ్ళూ శ్రీరామరాజ్యం పాటలు విని విని ఒకలా చెప్పాలంటే బోరుకొట్టేసింది పోనిస్తూ ఇదంతా పాప్యులారిటీ కోసమే అనిపించేది. కానీ సినిమాలో అవే పాటలు వింటూంటే అర్ధం అయింది, ఒక్కో పాట వెనుకా ఇళయరాజా చేసిన కృషేమిటో !ప్రతీ పాటా, ఆ పాటకి చేసిన చిత్రీకరణా చెప్పడం కష్టం చూసి తరించాల్సిందే!

    ఈ సినిమా commercial success కాకపోతే, అది తెలుగువారు చేసికున్న దురదృష్టం అనుకోవాలి. ఈ సినిమా చూడలేకపోయినా, మీరు పెట్టిపుట్టలేదూ అనుకోవాలి. పోనీ ఈ సినిమా commercial success అయితే మళ్ళీ ఇంకో నష్టం కూడా ఉందండోయ్, ఇంక ప్రతీవాడూ ఓ పౌరాణికం తీయడం మొదలెట్టేస్తాడు. ప్రతీవారూ బాపూరమణ లవలేరుగా! రెండేళ్ళ క్రితం పాండురంగడు చూశాం, ఆ రాఘవేందర్రావుకి exposure మీదున్న శ్రధ్ధ మిగిలినవాటిమీదుండదు. ఏదీ కుదరకపోతే ఏ రంభ చేతో, మేనక చేతో, ఊర్వసి చేతో ఓ ఐటం సాంగు చేయించినా చేయించగలడు! పోనీ బాపూగారో ధైర్యం చేసి ఏ సాయిబాబాగారిలాటి నిర్మాతో అడిగారని ఏ పౌరాణికమో తీద్దామా అంటే ముళ్ళపూడి వారు లేరాయే. అందుకనే నా సలహా ఏమిటంటే హాయిగా కుటుంబం అంతా కలిసి ఈ అద్భుతమైన శ్రీరామరాజ్యం చూసేయండి.

    ఓ చిత్రమైన సంగతి చెప్పనా, ఈవేళ సినిమాచూడ్డనికి థియేటరుకి వెళ్ళేటప్పుడు, మా లైబ్రరీ లో సభ్యత్వం తీసికోడానికి ఏ తెలుగువారికైనా చెప్పడానికి మంచి అవకాశం ఉంటుందీ అనే ఉద్దేశ్యంతో, పరిచయాలు చేసికుంటూంటాను. ఆయనెవరో కనిపిస్తే పలకరించాను, తెలుగువారా మీరూ అని. ఆయన మరాఠీ భాషవారు. ఈ రోజుల్లో వస్తూన్న సినిమాలు చూడ్డం ఇష్టం లేక, ఎవరో చెప్పగా విని ఈ సినిమా చూడ్డానికి వచ్చారు.

    ఆంధ్రదేశం లో ఉండికూడా మీరు చూడకపోతే అది మీదురదృష్టం అనుకోవాలి....

9 Responses

 1. ఫణిబాబుగారూ ! ఎంత అదృష్టవంతులండీ మీరు ! ఎక్కడో పూనాలో వుండి శ్రీరామరాజ్యం చూశారు. ఆ రాముడు కరుణిస్తే రేపు సాయంత్రం సినిమా
  చూడబోతున్నాం . మా అబ్బాయి బొంబాయినుంచి వచ్చాడు. కళ్ళకు కట్టినట్లు మీరు చెప్పిన అందాలరామరాజ్యం వివరాలు చాలా బాగున్నాయ్ ! అన్నట్టు ఈ నెల 26న బయలు దేరి మేము మా వాడితో ముంబాయి చస్తున్నాం. ఓ రోజు మీ పూనా పైకి దండెత్తుతున్నాం !కాచుకోండి.

  Like

 2. గురువు గారూ నేనూ ఇప్పుడే ఈ సినిమా చూసి వస్తున్నా. నిజంగా ఇది “బాపురే” అనిపించిన “రమణీయ” దృశ్య కావ్యమే. ప్రతి ఫ్రేమూ, ప్రతి అక్షరంలో బాపూ రమణల మార్కు ప్రస్ఫుటం. మీరు చెప్పినట్టు ఈ సినిమా కమర్షియల్ హిట్ అవకపోతే అది తెలుగు వారి దురదృష్టమే.

  ” తాను స్క్రీన్ ప్లే వ్రాసిన అద్భుత కావ్యాన్ని తాను తెర మీద చూసుకునే అదృష్టం శ్రీ ముళ్ళపూడి గారికి లేకపోవడం మన దురదృష్టం”

  ఇప్పుడు ఆయన సాక్షాత్తూ ఆ రాములోరి సన్నిధిలోనే ఉండగా ఇంక ఆయనకి ఈ కథలతో పనేంటి లెండి.

  Like

 3. I am lucky to make it to the first day first show of the last magnum opus of the great duo Sri Bapu and Sri Ramana.
  The entire audience is held spell bound.
  Mohan

  Like

 4. AYYAA… UTTARA RAMAYANAM VAALMIKAM KAADU. PARAVASAMLO GATI TAPPINATTUNNARU.

  BALAKRISHNA, NAYANATARALA MEEDA NUNCHI DRISHTI TAPPINCHADANIKE ANTA ADBHUTAMGA SETS VESAREMO. 🙂

  RAGHAVENDRA RAODI EXPOSURE KADEMO, EXPOSING EMO.. 🙂

  Like

 5. @గురువుగారూ,

  మీరాకకోసం ఎదురు చూస్తూ ఉంటాము…

  @శంకర్,
  మొన్న భాగ్యనగరం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకోలేకపోవడం బాగాలేదు! ఇంక శ్రీరామరాజ్యం గురించి మన ఇద్దరి అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయి. నాకు తెలుసుగా!!

  @మోహన్ గారూ,

  చెత్త సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో, శ్రీరామరాజ్యం చూసిన తరువాత, మన సినిమారంగం లో మంచి చిత్రాలు తీయాలనే అభిలాషంటూ ఉండాలేకానీ, అద్భుతంగా తీయొచ్చని నిరూపించారు శ్రీ బాపు.

  @విజయా,

  అక్షరసత్యం ..

  @ఫణీంద్ర గారూ,

  ఆ ఉత్సాహంలో కొన్ని తప్పులు దొర్లుండొచ్చు. వాటిని “అన్ దేఖీ ” చేసేయాలి !! నా వయస్సుకి ఆమాత్రం హ్యాండీ కాప్ ఇవ్వలేరా ….

  Like

 6. @అలాటి వ్యక్తి పాత్రలో అంతగా లీనం అయేటట్టు నటించకలిగారంటే ఆ ఘనత అంతా శ్రీ బాపూ గారిదేగా మరి.

  హ హ , బాపు రమణ గార్ల మీద మీకున్న అభిమానం తెలిసి , ఆ అతిశయోక్తి ని అర్ధం చేసికొన్నాము 🙂

  అర్జ౦ట్ గా అక్కినేని పరమ భక్తుని గా బీభత్సం గా నటించేసిన సినిమాల లిస్టు అందుకే ఇవ్వడం లేదు

  Like

 7. మౌళి,

  ఈ సినిమా బాగుండడానికి కారణం శ్రీ బాపూ గారే.

  Like

 8. Hello, terribly professional high level blog! many thanks for sharing. Because of fine writing, and I learned a ton, and I am glad to work out such a lovely thing. Sorry for my dangerous English. ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: