బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   వామ్మోయ్ అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి! ఏమిటేమిటో ప్లానులు వేసేసి ఓ పది రకాల టిక్కెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసేశాను. అయినా అలా చేయడం నాకెప్పుడూ అచ్చి రాలేదనుకోండి. ఈసారి కూడా ఇదివరకటిలాగే అన్నిటినీ క్యాన్సిల్ చేసేసి, భాగ్యనగరం లో రెండంటే రెండే రోజులు గడపడానికి నిశ్చయించేసికున్నాము. ఎందుకు క్యాన్సిల్ చేయవలసొచ్చిందో ఈ శనివారం వ్రాసే టపాలో వ్రాస్తాను.

    ఈ వారం రోజులూ నన్నేదో మిస్సయిపోయారనుకోవడం లేదు, కానీ అలా అనుకుంటే అదో ‘తుత్తీ’ ! మా అబ్బాయి భార్య ( కోడలనేస్తే సరిపోదూ!), అమ్మగారి చెల్లెలి కూతురు పెళ్ళికోసం అక్కడకి వెళ్ళాము. ప్రొద్దుటే ఆరున్నరకల్లా అబ్బాయీ, మా వియ్యంకుడు గారూ నాంపల్లి స్టేషనుకొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసికున్నారు. తిన్నగా కాచిగూడా లో ఉన్న వైష్ణోయ్ హొటల్లో దింపారు. పెళ్ళి హడావిడి కదా, వాళ్ళింట్లో హడావిడిగా ఉంటుందని, మమ్మల్ని అక్కడ దింపారు. ఇదో ఎడ్వాంటేజీ వియ్యాలారికి ! ఏది ఏమైతేనేం మాకూ సదుపాయంగానే ఉంది.

    తొమ్మిదిన్నరకి మా వియ్యంకుడూ, వియ్యపరాలు గారితో కలిసి, స్నాతకం జరిగే చోటకి వెళ్ళాము. ఆ కార్యక్రమం పూర్తిచేసికుని తిరిగి హొటల్ కి వచ్చేశాము. ఈ లోపులో మేము అక్కడ ఉండగానే, మన బ్లాగు మిత్రులు ( ఎవరి పేరు వింటేనే నాకు కాళ్ళూ చేతులూ వణుకుతాయో, మా ఇంటావిడైతే సంతోషిస్తుందో!) శ్రీ కోడిహళ్ళి మురళీ మోహన్ గారి దగ్గరనుంచి ఫోనూ– ఫణిబాబు గారూ, మీరు మా ఊళ్ళో ఉన్నట్టు తెలిసిందీ, మనం ఎక్కడ ఎలా కలుసుకోవడం- అంటూ ! నాకైతే ఈ భాగ్యనగరం లో ఏమీ తెలియదు, అలాగని చెప్పినా బాగోదూ, ఆ టైములో ఎవరితోనో కబుర్లు చెప్తున్నా అలవాటే కదా నాకూ, ఆయన చేతిలో ఫోను పెట్టేసి, బాబ్బాబు ఇక్కడకి రావడానికి డైరెక్షన్లు చెప్పండీ అనగానే, పాపం ఆయనకూడా, పోన్లేద్దూ ఈయన గొడవొదుల్తుందీ అనుకున్నారేమో ( అప్పటికే రెండు గంటలనుండి ఆయన్ని బోరు కొట్టేస్తున్నాను!), ఠక్కున చెప్పేశారు. మురళీ మోహన్ గారన్నారూ, ఈ ఏరియా మాకు దగ్గరే, సాయంత్రం వచ్చి కలుస్తానూ అని చెప్పారు.అక్కడకి సాయంత్రం కార్యక్రమం ఫిక్స్ చేశాను. పెళ్ళి ఎలాగూ ఉంది, ఎవరో ఒకరు దొరక్కపోతారా ఏమిటీ!

    మేము హొటల్ నుంచి వచ్చేటప్పటికే శ్రీ మురళీమోహన్ గారు మాకోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో క్రిందటేడాది “తెలుగు బాట” కార్యక్రమం లో చూడ్డమే ఆయన్ని, ఎలా ఉంటారో మర్చిపోయాను, కానీ నన్నేమీ వీధిలో పెట్టకుండా, ఆయనే మేము కారు దిగ్గానే పలకరించేశారు! ఇదే మరి వియ్యాలారంటే, కారుల్లో షికార్లూ హోటళ్ళలో ఉండడాలూనూ!ఏదో ఒకటి రెండు రోజులు కాబట్టి సరిపోయింది కానీ, ఇంకో రెండురోజులుంటే తెలిసొచ్చేది!

    మా ఇంటావిడెంత సంతోషించిందో !! మురళీ మోహన్ గారిచ్చే తురపు ముక్కలో పజిళ్ళ్ద ద్వారా వీరిద్దరి అనుబంధమూ చాలానే ఉందిలెండి. దానితో చాలా భాగం వాళ్ళిద్దరే కబుర్లు చెప్పుకున్నారు. మొత్తానికి మా ఇంటావిడైతే చాలా చాలా హ్యాపీ. ఇంతలో మా పిల్లలొచ్చారు, వాళ్ళకి కూడా పరిచయం చేసి, ఆ పెళ్ళి పందిరిలోనే ఓ పక్కకెళ్ళి కాఫీ త్రాగాము.

    మురళీ మోహన్ గారూ, అంత శ్రమ తీసికుని మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.
ఇంకో సంగతి మర్చేపోయానండోయ్, వెళ్తూ వెళ్తూ సంచీలోంచి తీసి నాలుగు పుస్తకాలు కూడా బహూకరించారు. You really made our day.

    ఇంకా చాలా చాలా కబుర్లున్నాయి, ప్రయాణంలో అనుభవాలూ, హొటల్లో అనుభవాలూ వగైరా.. మరీ అన్నీ ఒకేసారి వ్రాసేస్తే చదవడం బోరు కొట్టేస్తుంది. అవన్నీ పక్కన పెట్టి, రేపు ఓ ఆసక్తికరమైన నా అనుభవం గురించి వ్రాస్తాను.. రేపు పన్నెండు గంటలాటకి ” శ్రీరామరాజ్యం” టిక్కెట్లు బుక్ చేశాను..

%d bloggers like this: