బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   అబ్బాయీ,కోడలూ పిల్లలూ హైదరాబాద్ వెళ్ళడంతో నేను, మా అబ్బాయి నిర్వహిస్తున్న లైబ్రరీ ఆఫీసుకి వెళ్ళి కూర్చుంటున్నాను. ఆ ఆఫీసు ఓ కాంపౌండులో ఉంది, అక్కడే ఓ 75 ఫ్లాట్లూ, ఇళ్ళూ ఉన్నాయి. దానికి పార్కింగంటూ ఏమీ లేదు. మరీ దారికడ్డం రాకుండా, కార్లు పెట్టుకుంటూంటారు. ఈవేళ చూసిన దేమిటంటే, ఓ నలుగురు పిల్లలు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు, ఇంకక్కడా ఖాళీ లేకపోతే ఏం చేస్తారు, ఆ సొసైటీ రోడ్డుమీదే ఆడుతున్నారు. ఆడ్డం తప్పని కాదు, కానీ వాళ్ళ ప్రవర్తన చూస్తేనే ఒళ్ళు మండిపోయింది. వాళ్ళేమీ మరీ చిన్నపిల్లలూ కాదు, 15,16 ఏళ్ళుంటాయి.ప్రతీవాడూ బాల్ ని తన్నడం, అక్కడుండే ఏ కారుకైనా తగిల్తే చాలు, గోల్ ట! లక్షలు పోసి కార్లు కొనుక్కుని, అక్కడ పెట్టుకుంటారు. ఈ దరిద్రులు ఆడే పధ్ధతికి, ఏ కారు అద్దమైనా, ఇంకోటేదోనైనా పాడైపోతే ఎవడు బాధ్యులు దానికి? ఎవడికి వాడు నాకేం తెలియదనేవాడే . పోనీ అక్కడుండే వాచ్ మన్నైనా వీళ్ళని ఆపుతాడా అంటే, వాడి పత్తాయే లేదు.

   అలాగే క్రికెట్టోటి, ఏదో రబ్బరు బంతులతో ఆడితే సంగతి వేరు, కానీ మనవాళ్ళు అసలుసిసలు బాల్ తోనే ఆడుతారు. సొసైటీలో ఉండే ఫ్లాట్ల కిటికీలు ఎలా పోయినా సరే. అలాగే, మన ఖర్మకాలి ఆ దారిన వెళ్తే, ఇంక అంతే సంగతులు. ప్రతీవాడూ ఆలోచించేదేమిటయ్యా అంటే, తగలడ్డ సరుకు, ఓ కారనండి, ఓ స్కూటరనండి, లేక ఓ కిటికీ గ్లాసనండి, మనది కాకపోతే చాలు, ఇంకోడిదెవరిదైతే మనకేమిటీ? పిల్లల్ని ఆడుకోనీయద్దనడం లేదు. ఈ క్రికెట్లూ, హాకీలూ ఫుట్బాళ్ళూ ఏదో మైదానాల్లో ఆడుకోవాలి కానీ, ఇలా సొసైటీలలో ఆడనిస్తే ఎలా? పేరెంట్స్ కి ఆమాత్రం బాధ్యతనేది లేదా? వాళ్ళు ఆఫీసుల్నించొచ్చేసరికే ఎనిమిదీ,తొమ్మిదీ అవుతుంటే, ఈ గొడవలన్నీ చూసే ఓపికా తీరికా ఎక్కడది? అదేమిటండీ, ప్రతీదానికీ అలా కోప్పడితే ఎలా, పిల్లలన్న తరువాత ఆడుకోరా ఏమిటీ అనకండి. ఆడొచ్చు వద్దనరు, కానీ మనది కాదుకదా అని, ప్రతీదాన్నీ తగలేయడమే? పైగా మన కారో, స్కూటరో ఏ యాక్సిడెంటైనా అయితే డబ్బిస్తారేమో కానీ, ఇలా పిల్లలు పగలకొట్టిన కేసుల్లో మన చేతి ఆవదమే వదుల్తుంది. పైగా ఈ కార్లకి ఏ చిన్న రిపేరీ వచ్చినా వేలల్లోనే!ఇలాటప్పుడే అనిపిస్తూంటుంది, ఎంత హాయో కదా ఈ గొడవలేదూ మాకూ అని. వామ్మోయ్ కారనేది లేపోతే ఎలా, మన స్థాయేదో అందరికీ తెలియొద్దూ.సెకండ్ హాండైనా సరే ఓ కారోటి కొనేయాలి, ఉద్యోగం రాగానే.

   పోనీ ఏ పెద్దమనిషైనా వాళ్ళని ఆపడానికి ప్రయత్నించినా, అభాసుపాలౌతాడు, ఆ కారు/స్కూటర్ నీదా అన్నా అనొచ్చు. తన బుర్ర కి దెబ్బ తగిలించుకోకుండా ఉంటే చాలు! మా ఆఫీసుండే చోట ఇంకో గొడవుంది. అక్కడ విడిగా బిల్డింగున్నవాళ్ళ ఇళ్ళల్లో పేద్ద పేద్ద బోర్డులు, Beware of dogs అని. అంతవరకూ బాగానే ఉంది, వచ్చిన గొడవల్లా రాత్రి ఎనిమిదయ్యేసరికి వాటిన్ని బయట కాంపౌండులోకి వదిలేస్తారు. ఎవడైనా కొత్తవాణ్ణి చూస్తే చాలు మొరుగుతాయి. పగలు ఏ కూరలో కొనుక్కోడానికి గేటు తీసేయగానే, అవీ బయటకు వస్తాయి, వాటిని చూస్తే నాకు చచ్చేభయం, అలా కుక్కల్ని ఎందుకు బయటకు వదుల్తార్రా అని అడక్కూడదు. అడిగితే పైగా కోపాలోటీ.

    ఆఫీసుకెళ్ళి తిరిగొస్తూంటే బస్సుకోసం ఆగాను. అక్కడ ఓ అమ్మాయి ఎవరితోనో ఫోనులో మాట్లాడుతోంది, దాని సారాంశం ఏమిటయ్యా అంటే, తను చేసే ఏ జాబ్బూ నచ్చడం లేదుట, రెండు మూడు కాల్స్ చేసింది. అందరితోనూ ఈ విషయమే చెప్పింది. ఇంతలో ఎవరితోనో తెలుగులో కూడా మాట్లాడ్డంతో, తను ఫోను ఆపుచేయగానే, తెలుగమ్మాయివా అన్నాను. అర్రే అవునండీ, అన్నీ వినేశారా అంది! మరి అంత పెద్దగా మాట్లాడితే వినబడదా? అయినా నెను ఏదో తెలుగుమాట వినబడింది కదా అని పలకరించానూ, నీ గొడవంతా నాకెందుకూ అనగానే, ఫరవాలేదండీ అని ఆ అమ్మాయికూడా సిగ్గు పడిపోయింది. ఎక్కడుంటున్నారూ, మీ నాన్నగారెక్కడ పనిచేస్తున్నారూ అనగానే, మా నాన్న ఎం.ఎచ్. లో షెఫ్ఫండీ అంది. మొదట నాకర్ధం అవలేదు. కుక్కుని షెఫ్ఫనీ, డ్రైవరుని షాఫర్ అనీ అనడం ఓ స్టేటస్ సింబలూ ఈ రోజుల్లో! ఆ మధ్యన మా లైబ్రరీ గురించి అడుగుతూ, ఓ అబ్బాయి ఫోను చేశాడు, తెలుగు పేపర్లో చదివి. ఎక్కడ పనిచేస్తున్నావు బాబూ అని అడగ్గానే, ఏ మొహమ్మాటం లేకుండా ఫలానా హొటల్ లో కుక్కు గా పనిచేస్తున్నానూ అన్నాడు. అలాగని నాకు ఆ అబ్బాయిమీద గౌరవం ఏమీ తగ్గలేదే!పైగా ఎక్కువయింది, తను చేసే పనిమీద అతనికున్న గౌరవానికి.

   దీనివలన తెలిసిందేమయ్యా అంటే, పని చేస్తున్నవారు, వాళ్ళు చేసే పనేమిటో చెప్పుకోడానికి సిగ్గు పడరు, వచ్చిన గొడవల్లా వాళ్ళ సంబంధీకులకే!

    12,13 తేదీల్లో నేనూ మా ఇంటావిడా భాగ్యనగరం వస్తున్నామోచ్. అందువలన నా బ్లాగ్గులకి ఈ నాలుగురోజులూ ” విరామం” మాత్రమే. “విరమణ” కాదు బాబోయ్ ! ఏమిటో తెలుగు పేపర్లు చదివీ, న్యూసులు చూసీ నా భాష కూడా మారిపోతోంది !!


    ఈ ఫొటోలు నచ్చాయా? నేను తీసినవి కాదు బాబోయ్.. మా అమ్మాయి పంపగా, నాకు నచ్చగా మీతో పంచుకుంటున్నాను….

%d bloggers like this: