బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–C A T Judgement for pre 2006 Central Pensioners….

    ఈవేళ పేపర్లలో చూసే ఉంటారు– 2006 ముందర రిటైరయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఓ శుభవార్త వచ్చింది. judgement అయితే వచ్చింది. కానీ మన ప్రభుత్వం వారు ఎంతదాకా స్పందిస్తారో చూడాలి. వాళ్ళకి 2G, CWG స్కామ్ముల్లో ఎవరెవరో తిన్నదానికంటే కూడా, పెన్షనర్స్ కి వచ్చేది తక్కువే. కానీ మనం రాజకీయనాయకులమా ఏమిటీ? బొట్టెట్టి తాంబూలం దక్షిణా చేతిలో పెట్టడానికి? చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో?

    బ్లాగులు చదివేవారిలో చాలా మందికి ఈ న్యూస్ మీద అంత ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ మీ ఇళ్ళల్లో ఉండే పెద్దల చెవినోమాటు వేయండి, సంతోషిస్తారు పాపం. judgement మొత్తం ఇక్కడ చదవండి….

   ఎవరెవరికెంతంతొస్తుందో కూడా అదే సైటు లో ఇచ్చారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఇదివరకటి రోజుల్లో, పెద్దవాళ్ళేదైనా చెప్తే వినేవారు. కారణాలు ఎన్నో ఉండేవి. మన ఐక్యూ అంతెక్కువకాదేమో అని ,పోన్లెద్దూ ఏదో పెద్దాయన చెప్తున్నాడూ, ఓసారి తలూపేస్తే పోలా, తరువాత మనం ఏం చేశామో చూడొచ్చాడా ఏమిటీ అనో.కారణం ఏదైనా, ఆ పెద్దాళ్ళూ సంతోషించేవారు. ఆహా ఓహో మన పిల్లలు ఎంత పితృవాక్యా పరిపాలకులో అనీ. ఎవరూ వీధిన పడవలసిన అవసరం ఉండేది కాదు. అయినా ఈ పిల్లలు మాత్రం ( వాళ్ళూ వీళ్ళూ అని లేదు, ప్రపంచం లో “పిల్లల” స్థితిలో ఉన్న ప్రతీవారూనూ) తక్కువ తిన్నారా ఏమిటీ? పని అవాలనుంటే, చచ్చినట్టు పెద్దాళ్ళ మాట వినడమే. దాన్ని కొందరు అబ్బా మా పిల్లలకి మేమంటే ఎంతప్రేమో అని మురిసిపోతూండేవారు. వెధవ్వేషాలేస్తే, తిండానికి తిండీ, కట్టుకోడానికి బట్టా ఎవడిస్తాడు మరీ? దానితో Mutually agreed policy తో లాగించేసేవారు. పోన్లెద్దూ వింటున్నాడులే అని ఆ పెద్దాళ్ళూ, ఏదో మన పబ్బం గడిచిపోతోందిలే అని పిల్లలూ కాలక్షేపం చేసేవారు. ఇదంతా ఆనాటి పరిస్థితి. ఊరికే ఈరోజుల్లో ఉన్న పరిస్థితులు, ఎంత “దిగజారి” పోయేయో చెప్పుకోడానికి, ఓ benchmark లా ఉపయోగించుకోడానికి తప్ప ఎందుకూ ఉపయోగించదు. అలా అంటే మాత్రం ప్రతీవారికీ కోపం వచ్చేస్తుంది. మీసంగతి మాకు తెలియదూ, మేం మాత్రం మా తల్లితండ్రులు చెప్పిన మాటెప్పుడూ వినేవాళ్ళం, వాళ్ళు చెప్పిందే వేదం etc..etc.. అని ఓ ప్రవచనం చెప్పేస్తారు. కానీ దానివెనక ఉండే అసలు కారణం చెప్తే మాత్రం ఛస్తే ఒప్పుకోరు! మళ్ళీ దానిక్కూడా ఓ పేరెట్టారు మన పెద్దాళ్ళు ” ఉన్నమాటంటే ఉలుకెక్కువా..” అని. Thats the bottom line !!

   ఎవణ్ణి చూడండి, వాడు చేసే పనులన్నీ రైటూ, తనుమాత్రమే ప్రపంచంలో ఓ పధ్ధతిలో చేస్తాడు, అవతలివాళ్ళందరూ ఓ పధ్ధతా పాడా, అనే అపోహలోనే ఉంటారు. పైగా వీళ్ళు వినేవీ, వాళ్ళ చెవులకి వినసొంపుగా ఉండేవీ ఏమిటంటే, వాళ్ళు చేసేవన్నిటికీ ఓ సర్టిఫికెట్ తెచ్చుకోడం. ఎవడో ఖర్మకాలి, అదికాదూ, నువ్వు ప్రతీదాన్నీ నీ కోణం లోంచే ఆలోచిస్తావూ, అవతలివాళ్ళ అభిప్రాయం ఏమిటో వినవూ అని అన్నామా అయిందే మన పని! హాత్తెరీ నేనిన్ని చేశాను, నేనన్ని చేశానూ, ఎన్నెన్ని ” త్యాగాలు” చేశానూ, ఫలానా రోజున జేబులో డబ్బుల్లేకపోయినా సరే, అప్పుచేసి మరీ నువ్వడిగిన వస్తువు కొన్లేదా, అదేదో రొజున ఫలానాది చేయలేదా, అంటూ వాళ్ళు చేసిన so called త్యాగాలన్నీ చెప్తారు, “బొమ్మరిల్లు” సినిమాలోలాగ. పోనీ ఆ సినిమాలో ప్రకాశ్ రాజ్ లాగ మారతారా అంటే, అబ్బే అది సినిమా, కానీ ఇది జీవితం అంటూ Dont mix up issues.. అని ఓ జ్ఞానబోధోటీ !

   మనకి తట్టదు, పోనీ ఇంకోళ్ళేవరైనా చెప్తే ఒప్పుకోము, అలాగని ఏ సినిమా కథలోదైనా కోట్ చేస్తే Dont mix up issues… మరింకెలా చచ్చేదీ ఇలాటి ప్రాణులతో? తను చేసేదే కరెష్టూ,అవతలివాడికి అసలు ఓ అభిప్రాయమనేదే ఉండకూడదు, అధమపక్షం ఉన్నా, దాన్ని ఎప్పుడూ చెప్పుకోకూడదు, లోపల్లోపలే కుళ్ళి కుళ్ళి చావాలి. అసలు కొంతమంది ఇలా ఎందుకు తయారవుతారో అని ఆలోచిస్తే కారణం అదే తెలుస్తుంది. చిన్నప్పటినుంచీ వాళ్ళు ఆడిందాటా, పాడింది పాటా గా జరగనీయడం తో వచ్చిన తిప్పలన్నీనూ! అందుకోసమే, నూటికి తొంబైతొమ్మిది మందికి, తల్లితండ్రులు చిన్నప్పటినుంచీ చెప్తూంటారు, ఫలానాది చెయ్యొచ్చూ, ఫలానాది చేయకూడదూ అని.చెయ్యొద్దన్నప్పుడు భలే కోపం వచ్చేస్తుంది.కానీ అవన్నీ part of growing up… అలా చెప్పినా వినని వాళ్ళే, తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళనే దురభిప్రాయంతో, వాళ్ళ జీవితాలూ, పక్కనుండేవాళ్ళ జీవితాలూ నరకప్రాయం చేస్తూంటారు.

    ఈవేళ ఈయనకేమొచ్చిందీ, అందరికీ తెలుసున్నవాటిగురించి ఇలా బోరుకొట్టేస్తున్నాడూ అనుకుంటున్నారు కదూ. ఏం చేయను, సోమ మంగళ బుధవారాల్లో ఎస్.వి.బి.సి చానెల్ లో మల్లాది వారి ప్రవచనాలూ, సోమవారం నుంచి శుక్రవారం దాకా బ్రహ్మశ్రీ చాగంటి వారివి ” మా” టి.వీ లోనూ, దానికి సాయం గత రెండురోజులూ హైదరాబాద్ లో తెలుగు లలితకళాతోరణం నుంచి వింటున్న చాగంటి వారి ప్రవచనాల ధర్మమూనూ ఈ టపా! జీవిత సత్యాలు అరటిపండొలిచి పెట్టినట్టు ఎంత బాగా చెప్తారండీ?

    పైన చెప్పినవన్నీ అందరికీ తెలుసు, కానీ అవే విషయాలు ఇంకోరు చెప్తే ఇంకా బాగుంటాయి. కానీ వినే ఓపికెవళ్ళకీ రోజుల్లో? ప్రతీదీ నాకే తెలుసూ, నువ్వుచెప్పొచ్చేదేమిటీ అనే కానీ, పుస్తకాల్లో చదివేది కాదూ, జీవితంలో ఒకసారి అనుభవిస్తేనే తెలుస్తుందీ అంటే ఒప్పుకోరు ఈరోజుల్లో. చదువుకునేటప్పుడు సైన్సు లో ప్రాక్టికల్స్ ఎందుకు పెడతారూ మనకి అర్ధం అవాలనే కదా, అలాగే మెడిసిన్ లో శవాలెందుకు కోయిస్తారు, మరీ పుస్తకాల్లో చదివిన నాలెడ్జ్ తో ప్రాక్టీసు పెడితే, ఎవడి ప్రాణం తీస్తాడో అనే కదా.

%d bloggers like this: