బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అవసరాలకి మాత్రమే గుర్తొస్తూంటారు…

   ఇదివరకటి రోజుల్లో చిన్న పిల్లలందరూ కలిసే ఆడుకునేవాళ్ళు. ఎవరి కాంపౌండులో ఖాళీ ఉంటే అక్కడ చేరేవారు. కానీ ఈ రోజుల్లో అలా కాదుగా, ఎవరి పిల్లలు వాళ్ళ ఇళ్ళకే పరిమితమైపోయారు. ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోడానికి ఓపికల్లేని రోజుల్లో ఇంకోళ్ళ పిల్లల బాధ్యత కూడా తీసికునే రిస్క్ ఎవడు తీసికుంటాడు? కానీ ఏ శలవలో వచ్చినప్పుడు అవసరం వస్తుందిగా.అలాటప్పుడు మాత్రం ఊళ్ళో పిల్లలంటే ఎక్కడలేని ప్రేమా అభిమానమూ పుట్టుకొచ్చేస్తాయి! అవసరం మనది కదా మరి! మన పిల్లలకి కూడా తెలుసు, ఇలాటి పరిస్థితుల్లో Mothers do not have a choice except to surrender! అదిగో దాన్నే cash చేసికుంటారు పిల్లలు. ఇక్కడ పిల్లల దేమీ తప్పుకాదు, పాపం వాళ్ళకి ఇంకా లౌక్యాలూ వగైరా వంటపట్టలేదు. ఓసారి దెబ్బలాడుకున్నా రెండో నిమిషం లో ఫ్రెండ్సైపోతారు. వచ్చిన గొడవల్లా ఈ పేరెంట్స్ తోనే.

   మన పిల్ల స్నేహం చేసే పిల్లపేరెంట్స్ ఎక్కడ పనిచేస్తున్నారూ, ఆ పిల్ల ఏ స్కూలుకి వెళ్తోందీ, వాళ్ళింట్లో ఏమేమి సరుకులున్నాయీ— వీటన్నిటినీ బేరీజు వేసి, ఫరవాలేదూ అనుకుంటే కానీ, ఆ పిల్లతో స్నేహం చేయనీయరు. అంతదాకా వస్తే, పార్కులకో, సినిమాకో తీసికెళ్ళడానికైనా సిధ్ధపడతారు కానీ, ఆ పిల్లతో కలిసి ఆడుకోడానికి మాత్రం ఒప్పుకోరు!
అన్ని రోజులూ మనవి కావుగా. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ అవసరమూ పడుతుంది. ఇదిగో అలాటప్పుడు గుర్తుకొచ్చేస్తూంటారు, ఇలాటివాళ్ళందరూనూ. అప్పటిదాకా ఆ పిల్లతో తమ పిల్ల కలవకుండా ఉండడానికి తాము చేసిన ప్రయత్నాలూ అవీ గుర్తుకు రావు. అవసరం ఎన్ని పన్లైనా చేయిస్తుంది! ఆ పక్క పిల్లమీద ఎక్కడలేని ప్రేమా చూపించేసి , వాళ్ళమ్మకి మస్కా కొట్టేసి, ” ఓసారి మీ పిల్లని మా ఇంటికి పంపించండీ, ఆడుకుంటుందీ… నేను ఓ అరగంటలో పని చూసుకుని వచ్చేస్తానూ…” అంటుందే కానీ, తమ పిల్లనుమాత్రం వాళ్ళింటికి పంపించదు. వాళ్ళింటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ “మిడిల్ క్లాస్ లేకి బుధ్ధులు” నేర్చుకుంటే, అమ్మో ! ఇక్కడ లేకి బుధ్ధులు ఎవరివో అడగఖ్ఖర్లేదనుకుంటా! దీన్నే అవసరానికి ఉపయోగించుకోడం అంటే !

    ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, నాకూ ఈమధ్యన అలాటి అనుభవం ఎదురయింది. అలాగని నేనెవరింటికీ ఆడుకోడానికి వెళ్ళాననీ, మా ఇంటికెవరో ఆడుకోడానికి వచ్చేరనీ కాదు. కనిపించినవాళ్ళందరినీ పలకరిస్తాను. ఓసారి పరిచయం అయిందంటే అసలు వదలను. నా దారిన నేను హల్లో అనేస్తాను. అవతలివాడు ఏదో నాకోసం ఆగి మాట్లాడాలని కాదుకానీ, ఓసారి హల్లో అనో, ఓ చిరునవ్వో పడేస్తే చాలుకదా. నాదారిన నేను, నడిచే వెళ్తూంటాను కారణాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోనఖ్ఖర్లేదు.సైకిలు రాదుకదా! చాలామంది, పలకరిస్తే ఏ బైక్కుమీదో, కారులోనో వెళ్తూన్నప్పుడు చెయ్యూపడమో, తలూపడమో ఏదో ఒకటి చేస్తారు. అలాగని అస్తమానూ చేయలేదని మనమూ ఏమీ అనుకోకూడదు. కనిపించినప్పుడల్లా చేయాలని రూలేమీ లేదుగా! కానీ ఎన్నో సంవత్సరాలు సర్వీసులో ఉన్నంతకాలమూ కలిసి పనిచేసిన వాళ్ళు, ఏదో మనం కనిపిస్తేనే పాపం, అనుకున్నట్టు ప్రవర్తిస్తే మాత్రం ఒళ్ళు మండుతుంది!

    ఈమధ్యన ఓరోజు నాదారిన నేను వెళ్తూంటే, అలాటి రకం మనిషోడు సడెన్ గా హల్లో ఫణిబాబూ అని పిలిచేసరికి నాకైతే, ఇదేమిటీ సూర్యుడు పశ్చిమాన్న కానీ ఉదయించాడా అనిపించింది. నేను మాత్రం తక్కువా ఏమిటీ? అక్కడికేదో నేను పెద్ద బిజీగా ఉన్నట్టు ఓసారి కర్సరీ హల్లో చెప్పేసి నాదారిన నేను వెళ్ళిపోయాను. నామీద అంత అభిమానం ఎందుకొచ్చిందా అని పరీక్షగా చూస్తే, అప్పుడు తెలిసింది అసలు కారణం– ఈ “పెద్దమనిషి” ఎప్పుడూ కార్లలోనూ, టూ వీలర్లమీదా వెళ్ళేవాడు, ఆ టైములో ఏదో చెప్పులో, షూసో బాగుచేయించుకోడానికి, ఓ రోడ్డు సైడులో ఉన్న రిపేరీ షాప్పులో నుంచున్నాడు. ఆ కొట్టువాడేమో, మా వాడిని వెయిట్ చేయమనుంటాడు. మా వాడికేమో అలా రోడ్డు పక్కననుంచుని, ఆ కొట్టువాడిచ్చిన చెప్పులు వేసికుని నుంచోడం నామోషీ అయుండొచ్చు. ఏదో కాలక్షేపం కావాలీ, దానితో సడెన్ గా నేను కనిపించేసరికి నామీదఎక్కడలేని ప్రేమా పొంగుకొచ్చేసి, నన్ను హల్లో అనేశాడు. ఇక్కడే ఒళ్ళుమండుకొచ్చేది, మన అవసరాలొచ్చేసరికి అందరూ గుర్తుకొచ్చేస్తారు. జనరల్ గా వాళ్ళే గంగలోనైనా దిగినా సరే !!!

    ఇదంతా ఎలా తెలిసిందీ అంటే, ఆ తరువాతో రోజున కనిపించి, సిగ్గూ శరమూ లేకుండా తనే చెప్పాడు–” అదేమిటీ ఆ రోజున ఏదో కాలక్షేపానికి పిలిస్తే, ఆక్కుండా వెళ్ళిపోయావేమిటీ..” అని! Life goes on…..

%d bloggers like this: