బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…

    మా చిన్నప్పుడు ఏ పత్తి నో, పుగాకునో బైళ్ళల్లో(Bale) ప్యాక్ చేశారనేవారు.ఓహో అనుకునేవాళ్ళం. ఈ మధ్యన ఏ పేపరు చదివినా, టి.వి.లో ఏ న్యూసు చూసినా, మళ్ళీ ఈ బైళ్ళ (Bail) గొడవే. ఒకళ్ళకేమో Anticipatory Bail, మన బాలూ గారి కొడుకులాటివాళ్ళకి. ఏదో వెధవ పని చేయడం, అవతలివాళ్ళెలాగూ కంప్లైంటు చేస్తారని తెలుసు, తనే ముందుగా బైలు తెచ్చేసికుంటే ఓ గొడవొదిలిపోతుందనీ. కొంతమందికి మామూలుగా బెయిలు, అమర్ సింగులాటివాళ్ళకి. ఇంకొంతమందికి వాళ్ళమీదున్న అసంఖ్యాకమైన కేసుల్లో ఒకటో అరో కేసుల్లో బెయిలుట మన పొరుగునుండే యడ్డీగారి లాగ! ఇంతమందికొచ్చేస్తోందీ, మనకెందుకురాకూడదూ అని 2 G కేసులో జైల్లో ఉన్నవాళ్ళందరూ సామూహికంగా బెయిలు అడిగారు. ఓ గొడవొదిలిపోతుందని అందరి బెయిలూ తిరస్కరించేశారుట ఆ జడ్జీ గారు. పాపం కరుణానిధి గారి కూతురు, ఓ దసరా కానీ, దీపావళి కానీ తన కొడుకుతో గడపడానికి వీల్లేకుండా జైల్లోనే కాపరం చేస్తోంది. ఆవిడకి బెయిల్ దొరక్కపోయేసరికి వాళ్ళ నాన్న shock అయ్యారుట, సోనియా anguish అయ్యారుట, కన్మొయి తల్లైతే ఒకటే ఏడుపుట ! వహ్వా వహ్వా.. మరి ఆ డబ్బులన్నీ తిన్నప్పుడు ఏమయ్యాయిట ఈ ఫీలింగ్సూ, ఎమొషన్లూ ?

    నా చిన్నప్పటినుంచీ చూసే యాడ్ Zinda Tilismath. అదేమిటో ఆ పేరు నాకు చాలా ఇష్టం. నెట్ లో చూస్తే దానర్ధం, Living Magic అనుంది. ఆహా ఇప్పటికైనా తెలిసిందీ అని సంతోషించాను. అందులో Zinda సర్టిఫికేట్ ఒకటివ్వాలిగా మా పెన్షనర్ పక్షులు, ఈ కార్తీక మాసం లో మరి. సోమవారాలు ఉపవాసాలు చేయకపోయినా, శివాలయానికి వెళ్ళకపోయినా ఆ మహదేవుడు క్షమించేస్తాడేమో కానీ, బతికున్నామని చెప్పకపోతే, బ్యాంకులవాళ్ళు మాకు తిండెట్టరు. క్రిందటి రెండేళ్ళ అనుభవాల ధర్మమా అని, ఈసారి వెఢవ్వేషాలేయకుండా, ఒకటో తారీఖునే, అక్కడ మా ఫ్రెండోడున్నాడు కదా అని, మధ్యాన్నం మూడింటికి వెళ్ళి ఆ పనేదో పూర్తిచేసికొనొచ్చా. ఇంకో ఏడాదిదాకా గొడవలేదు. బతికుంటే అప్పుడు చూసుకోవచ్చు.

    ఏదో పేపరు చూస్తూంటే SBI వాళ్ళిచ్చిన ప్రకటన చూశాను. వాళ్ళ ఆఫీసర్లందరూ ఈనెల, 8,9 తారీఖుల్లో సమ్మె చేస్తారుట. కొన్ని ఊళ్ళల్లో 7,10 శలవలుట,6 ఆదివారంట, 5 శనివారం half day ట. అందువల్ల ఈవేళా రేపట్లలో బ్యాంకింగు వ్యవహారాలు పూర్తిచేసికోవాలట.ATM లలో డబ్బుంటే ఉండొచ్చుట, ఉండకపోయినా పోవచ్చుట. మరి ఈ పెన్షనర్ల కార్తీక మాస నోము(Zinda Tilismath) ఎప్పుడండీ చేసికోవడం? వీళ్ళకి ఏదో వారంరోజులు కలిసొస్తుందనే కానీ,కస్టమర్ల గోడు పట్టదు. పైగా ప్రతీ ఏడాదీ ఈ నెలలోనే ఏదో ఒక వంక పెట్టి, ఓసారి క్లాసు4, ఓసారి గుమాస్తాలూ, ఎవరూ కాకపోతే ఆఫీసర్లూ!

    ఆంధ్ర దేశంలో ఎక్కడ చూసినా యాత్రలూ, దీక్షలూనూ. రాజకీయనాయకుళ్ళకి పనేమీ లెనప్పుడు చేసేదిదొకటి. ఇంతదూరంలో ఉన్న మాలాటివాళ్ళకెలాగా కాలక్షేపం? పాపం ఆద్వానీ గారొకడున్నడుగా, అప్పుడెప్పుడో రథ యాత్ర చేశారు. వచ్చే ఎన్నికల సమయం లో జనాలు తనని మర్చిపోతారేమో అని, అదేదో “జనచైతన్య యాత్ర” మొదలెట్టారు. అదిగో ఆ యాత్ర ఇవేళ మా పూణె వచ్చింది. జనంలో చైతన్యం లేకపోవడమెమిటీ చిత్రం కాకపోతే?భూ కబ్జాలు చేస్తున్నారు, బలవంతపు చావులు ఛస్తున్నారు, బలవంతపు చందాలు వసూలు చేస్తున్నారు, రేప్పులూ హత్యలూ అయితే ఉండనే ఉన్నాయి. ఆమధ్యన అన్నా సాహెబ్ గారూ, అంతకు ముందు బాబా గారూ ఉపొషాలు చేశారు. కావలిసినంత చైతన్యం చూశాము.

    ఈవేళ బస్సులో వెళ్తూంటే, నా ముందర ఓ అబ్బాయి నుంచున్నాడు, ఫొటో చూడండి, ఆ బుజ్జి జడ ఎంత ముద్దొస్తోందో?అపర చాణక్య లా ఉన్నాడు! ఆగలేకపోయాను, వాళ్ళమ్మగారిని పెర్మిషన్ అడిగి ఓ ఫొటో తీసికున్నాను. నెను దిగే స్టాప్ వస్తే, ఆ అబ్బాయిని కూర్చోమని చెప్పడానికి తన వీప్మీద వేల్లాడతిసిన బ్యాగ్గు మీద తడితే, పలకడే. అప్పుడర్ధమయింది, పాపం తనకి తెలియాలిగా, బ్యాగ్గు మీద తడితే ఎలా? అప్పుడు నా అనుభవం ఓటి గుర్తొచ్చింది. మా అబ్బాయితో ఎప్పుడైనా బైక్కు మీద వెళ్ళవలిసొస్తే, హెల్మెట్ లేకుండా కూర్చోనీయడు. ఒకసారి ఓ హెల్మెట్ పెట్టుకుని పిలియన్ సీటు మీద సెటిల్ అయ్యాను. మధ్యలో నెత్తిమీద దురదెట్టింది. మనిషన్నాక దురదలూ అవీ పెట్టవా ఏమిటీ? దురదెట్టగానే ఏం చేస్తాం, గోక్కుంటాం. అదే నేను చేసిందీనూ, తేడా ఏమిటంటే నెత్తనుకుని హెల్మెట్టు మీద గోకాను !!! ఆ మాత్రం దానికే వాళ్ళమ్మ తోనూ, భార్యతోనూ, కూతురితోనూ చెప్పుకోవాలా….

%d bloggers like this: