బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— కాన్ఫిడెన్సూ , ఓవర్ కాన్ఫిడెన్సూ….

    ఈ టపాకి పెట్టిన శీర్షిక లో, రెండు పదాలకీ ఉన్నది వెంట్రుకవాసంత తేడా మాత్రమే. కానీ ఆ తేడా ఒక్కొక్కప్పుడు మన కొంపలు ముంచేస్తుంది, ఒక్కోప్పుడైతే ప్రాణాలమీదకే తెస్తుంది. అసలు జీవితం లో confidence, అదీ మనమీద మనకి లేకపోతే బండే ముందుకి నడవదు. ప్రతీ దానికీ, మనం ఈ పని చేయకలమా, మన తాహతుకి మించిందేమో అనుకుంటూ భయపడిపోతే, ఎక్కడ వాళ్ళక్కడే ఉండిపోతారు, పక్కవాడు మనల్ని దాటుకుపోతాడు! అందుచేత, ప్రతీ వాడిలోనూ ఈ confidence ఏదో నామమాత్రానికైనా ఉండాలి.
ఉండి ఉండి అది కాస్తా over confidence లోకి దింపిందంటే మాత్రం గోవిందో గోవిందా….

చదువుకునే రోజుల్లో చూడండి, పరీక్షల ముందర అవేవో ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇచ్చేవారు. ఇప్పుడున్నాయో లేదో నాకైతే తెలియదు. ఉండే ఉంటాయి లెండి. అయినా చదువూ సంధ్యా అంటూ ఇప్పుడు ఈ వయస్సులో తల బద్దలుకొట్టుకోవడం ఎందుకులెండి. అయినా ఏదో సందర్భం వచ్చింది కదా అని ఎరక్కపోయి దీంట్లోకి దిగాను. మొదలెట్టా కాబట్టి, ఈ గొడవేదో తేల్చేసికుంటే సుఖ పడతాను. ఏమిటంటున్నానూ.. ప్రిపరేషన్ హాలిడేస్ కదూ, ఆ టైములోనే పుస్తకాలు గుర్తొచ్చేవి నాకు. ఏది చూసినా అంతా తెలిసున్నట్టే అనిపించేది, తీరా మర్నాడు పరీక్ష పేపరు చూసేసరికి ఒక్కటీ ఛస్తే అర్ధమయ్యేది కాదు. దీనికి ముఖ్య కారణం over confidence ! ఎలా చదివావురా అని నాన్నగారు అడిగితే, ” చాలా బాగా చదివేశాను. ఈసారి మాత్రం క్లాసు ష్యూర్, మరేం లేదులెండి, అంతకుముందు మార్చ్ లో క్లాసు రాదని, ఆ రోజుల్లో అందరూ ఫాషను కోసం వాడే withdrawl అనే పదం వాడేసి, ఇంట్లో కూర్చున్నాను! withdrawl లేదూ పాడూ లేదూ, లెఖ్ఖల దగ్గరకొచ్చేసరికి, ఈ over confidence మాట దేముడెరుగు, అసలు ఆ confidence అనే మాటే కొండెక్కింది.

నామీదా, నామాటమీదా నాన్నగారు ఏదో రిజల్ట్స్ వచ్చేదాకా మాత్రం ఆ confidence ఉంచి, తరువాత రిజల్ట్స్ చూసిం తరువాత, వీణ్ణి పుటం వేసినా బాగుపడ్డూ అని, ఉద్యోగం వేయించేశారు. అదండీ my brush with confidence & overconfidence ! పోనీ అప్పటికైనా బుధ్ధి తెచ్చుకోవచ్చా, అబ్బే, తరువాత్తరువాత కూడా అప్పుడప్పుడు ఈ పదాలు రంగం లోకి వచ్చేస్తూంటాయి, Specially అప్పులు చేయడం విషయం లో! ఏదో పేద్ద ప్లాను/ ఫోర్కాస్టూ వేసేసికుని, మన ప్రభుత్వ బడ్జెట్లలోలాగ, ఏడాదికీ సరిపడా, జమా ఖర్చులు ఓ కాగితం మీద వ్రాసేసికోవడం, అదికూడా ఇంట్లో వ్రాస్తే ఇంటావిడకి తెలిసిపోతుంది. ఫాక్టరీకి వెళ్ళి తీరిక సమయాల్లో చేసే పనన్నమాట. దీని దుంప తెగా, ఎలా తిరగా మరగా చూసినా, అన్ని ఖర్చులూ పోనూ, ఎప్పుడూ మిగులే కనిపించేది ( కాగితం మీద మాత్రమే !). ఫరవాలేదూ, మనమూ ప్రయోజకుణ్ణౌతున్నామూ అనేసికుని, ఇంట్లోకేదైనా కొందామా పోనీ అనుకునేవాడిని. ఏదో ఓ కొట్లోకి వెళ్ళడం, ఆరోజుల్లో installments అనేవారులెండి, దాన్నే పేద్ద స్టైలిష్ గా EMI అంటున్నారిప్పుడు, ఏ రాయైతేనేమిటీ, వివరాలడిగేసి, కావలిసిన వస్తువేదో తెచ్చేయడం. తేవడం అంటే తెచ్చేశాము కానీ, నెల తిరిగే సరికి దాని వాయిదా ఎవడు కడతాడు , నేనే కదా, అక్కడకొచ్చేసరికి తెలిసేది. అందరికీ ఇచ్చేస్తే మిగిలేమిటీ, దానితో most humble కిరాణా కొట్టువాడిని లూప్ లైన్లో పెట్టేయడం. ఆ సరుకు కొన్నవాడికి వాయిదా ఇవ్వకపోతే, తెచ్చిన సరుక్కాస్తా తీసుకుని చక్కాపోతాడు. పైగా ఊరందరికీ తెలిస్తే అదో అప్రదిష్ట కూడానూ! ఇలా అప్పటిదాకా ఉన్న over confidence కాస్తా విశ్వరూపం దాల్చేసింది. శ్రీ వెంకటేశ్వరస్వామి అప్పుల్లాగ, రిటైరయ్యేవరకూ అదే రంధి!

రోడ్డు మీదెళ్తూన్నప్పుడు చూస్తూంటాము, కొందరు హీరోలు, బైక్కు మీదెళ్తూ రెండు చేతులూ వదిలేసి, తల దువ్వుకోడాలో, చొక్కా సద్దుకోడాలో లాటి వెధవ పన్లు చేస్తూంటారు, వాడికి ఈ over confidence పైత్యం వంట పట్టేసి, రోడ్లమీద చేయడం ఎవడిమీదో పెట్టేయడం. అలాగే బస్సుల్లో వెళ్ళేటప్పుడు చూస్తూంటాను, ఆ స్టీరింగు వదిలేసి, ఏ వెధవతోనో కబుర్లేసికోడం. అన్నిటిలోకీ, మనలో ఉన్న ” వెంట్రుకవాసంత” తేడా, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కనిపిస్తుంది. మన లెవెలేదో మనకి తెలియాలి, కార్లూ, బైక్కులూ జుయ్యిమని వేళ్తూంటే, మనకి నచ్చినా నచ్చకపోయినా ఆగడమే ఆరోగ్య లక్షణం. ఈమధ్యనెప్పుడో, మా ఇంటికెదురుగా ఉండే రోడ్డు క్రాస్ చేస్తూ, కార్లొస్తున్నాయి కదా అని ఆగి, ఎవడో సైకిలువాడొస్తూంటే, పేద్దగా పట్టించుకోకుండా, దాటుతూంటే, వాడికి కోపం వచ్చేసింది ! ఇప్పటిదాకా ఆగి, నన్ను చూసే ఎందుకు క్రాస్ చేశావూ, నాకు ఇన్సల్ట్ కాదా అంటాడు ! ఏం లేదులెండి, అతను నా ఫ్రెండే! అదికాదు నాన్నా, నేనంటూ నీ సైకిలు కింద పడితే నాకంటే నీకే ఎక్కువ దెబ్బలు తగులుతాయీ, అందుకోసం ధైర్యం చేసేశానూ అన్నాను.

చివరగా చెప్పొచ్చేదేమిటంటే, ప్రతీ వాడిలోనూ confidence అనేదైతే ఉండాలే. కానీ, ఎక్కడపడితే అక్కడ House loan, car loan, personal loan అంటూ చేసికుంటూపోవడం కాదు, రోజులన్నీ మనవి కావు. Its only a suggestion …. be confident, but definetely not overconfident.

%d bloggers like this: