బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– గుర్తుకొచ్చాయంటే రావు మరీ…..


   దీపావళి పండగొచ్చిందీ, వెళ్ళింది కూడానూ. శలవలకి అమ్మాయీ,అల్లుడూ, పిల్లలతో హాలిడేకి యు.కె. వెళ్ళారు. ప్రతీ దీపావళికీ వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళేవారు. రాజమండ్రీ కాపరంలో అయితే, ఏకంగా అక్కడికే వచ్చి దీపావళి చేసికున్నారు. ఏదో మాకు తోచిందేదో చేతిలో పెట్టి ఆశీర్వదించడం. ఏదో నాలుగు సిల్వర్ కాయిన్లు నలుగురికీ ఇవ్వడం, చిన్న పిల్లలకి డబ్బుతో సరిపెట్టేయడం. రిటైరయినప్పటినుండీ ఇదే తంతు.ఈసారి అయితే మెయిల్స్ లోనూ, ఫేస్ బుక్ లోనూ, ఫోనుద్వారానూ గ్రీటింగ్స్ !!

ఇక్కడ అబ్బాయీ,కోడలూ, నవ్యా, అగస్థ్య ఉన్నారుగా, మాఇంటికి వెళ్ళాము, దీపావళి గడపడానికి. ఇక్కడ మేముండే ఇంట్లో , మా ఇంటావిడ తనకు తోచిందేదో ( కజ్జికాయలు) తయారుచేసి, పూజచేసికుని అక్కడకి వెళ్ళాము. ఏమిటో ఈ రోజుల్లో జరిగే దీపావళి సంబరాలు చూస్తూంటే, invariable గా ఇదివరకటి దీపావళి సంబరాలు గుర్తొచ్చేస్తాయి ! ఎప్పుడు చూసినా ఈయనకేమీ పనిలేదూ, తన చిన్నప్పుడు ఎలా చేసికునేవారో, ఇప్పుడెలా చేసికుంటున్నారో అని చెప్పడం తప్ప, అని అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాను, ఆ జ్ఞాపకాలు తెచ్చుకోడం తప్ప చేసేదేమీ లేదు. ఇప్పటివాళ్ళు ఏమేమి మిస్సవౌతున్నారో మీ ఇంట్లో ఉండే పెద్దాళ్ళని అడగండి తెలుస్తుంది!

ఆ రోజుల్లో దీపావళి వస్తోందంటేనే, పది పదిహెను రోజులముందునుంచీ హడావిడి ప్రారంభం అయ్యేది. మతాబులూ, చిచ్చుబుడ్లూ, సిసింద్రీలూ ఇళ్ళల్లో తయారుచేసికోడమే కానీ, బజారుకెళ్ళి కొన్నదెవరు? సూరేకారం, బీడూ , గంధకమూ లాటివన్నీ అమ్మనడిగి, ఓ పాత చేట తీసికుని, దాంట్లో ఎండబెట్టడం, ఇంట్లో ఉన్న న్యూసు పేపర్లతో, మతాబులకి గొట్టాలు చేసికోడం, సిసింద్రీలకైతే ఈ న్యూస్ పేపరు ఉపయోగించదు, కొద్దిగా దళసరిగా ఉండాలి కాగితం. వీటన్నిటినీ చుట్టి అంటించడానికి లైపిండోటీ. సిసింద్రీలు ఇళ్ళల్లో అందరూ తయారుచేసికోవడం వచ్చెది కాదు, దానితో ఎక్కడెక్కడ ఎవరెవరు అమ్ముతున్నారో తెలిసికుని, ముందుగానే ఆర్డరివ్వడం. అవికూడా వందా, రెండొందలూ కాదు, ఏకంగా వెయ్యి !

బజారుకెళ్ళి తెచ్చేదేమిటయ్యా అంటే, తాటాకు టపాకాయలు ( మామూలువీ, ఎలట్రీవీ నూ), ఓ తుపాకీ దాంట్లోకి కాప్పులూ, విష్ణుచక్రాలూ, కాకరపువ్వొత్తులూ, ఇంకొంచం డబ్బులు దొరికితే, ఓ పాము బిళ్ళల ప్యాకెట్టూ, మెగ్నీషియమ్ తీగా. నాన్నలతో మార్కెట్ కి వెళ్ళామా, అంతే సంగతులు అదొద్దూ,ఇదొద్దూ అనడమే! అప్పుడు ఎందుకు అలా అనేవారో, పెళ్ళై పిల్లల్ని కన్న తరువాత తెలిసిందనుకోండి. ఓ సంచీ నిండా తెచ్చుకుని,ఎండ పెట్టుకోడం.

ఇంక దీపావళికి ముందురోజు దిపాలు పెట్టుకోడానికి ప్రమిదలు, నూనె రెడీ. దీపావళి రోజుకి గోంగూర కాడలూ, నునె లో ముంచి వత్తులు చేసికోడానికి ఓ కొత్త సైను గుడ్డా.దీపావళి సాయంత్రం, దిబ్బూ దిబ్బూ దీపావళి అంటూ వాటిని నేలకెసి కొట్టి ఆర్పేయడం, కాళ్ళు కడుక్కుని, అమ్మ పెట్టే తాయిలం తినేసి, ఓ తిప్పుడుపొట్లం పుచ్చుకుని దాన్ని తిప్పుకుంటూ ఓ గంట గడిపి, తరువాతే బాణాసంచాకల్చుకోడం. ఇళ్ళల్లో తయారుచేశారేమో, చిచ్చుబుడ్లూ,మతాబులూ, నిల్చి మరీ కాలేవి.

అసలు తయారుచేయడానికి ఉపయోగించే, గంధకం (sulphur) వాసన ఎంత ఘాటుగా ఉండేదండీ? మనింట్లో కూడా దీపావళి చేసికున్నామూ అని, కార్తిక పౌర్ణమి దాకా తెలిసేది! నిన్న మా మనవరాలూ, మనవడూ దీపావళి బాణాసంచా కాల్చిన తరువాత, అస్సలు వాసనే లేదూ. ఉన్నదల్లా స్మోక్ మాత్రమే. I certainly missed that nostalgic pungent odour of sulphur ! ఎంతంతో డబ్బెట్టి కొన్నవైనా సరిగ్గా కాలేయా అంటే అదీ లేదూ, మధ్యలో తుస్సుమనడం. మళ్ళీ వెలిగించడం.

అన్నిటిలోకీ ముఖ్యంగా అనిపించిందేమిటంటే, ఇదివరకటి రోజుల్లో, ఇంటి చుట్టూరా ఓ పెద్ద కాంపౌండు వాలూ, దాని పొడుగునా దీపాలూ, బాణాసంచా కాల్చుకోడానికి అరుగులూ, వాటిమీద నుంచుని కాల్చడాలూ. మరి ఇప్పుడో, ఇంట్లో దీపం పెట్టడానికి, ఉన్న ఎపార్ట్మెంటుకున్న నాలుగు కిటికీలు మాత్రమే. గుమ్మంలో పెట్టడమనే కాన్సెప్టే లేదు. కారణం మనకీ, పక్కనుండే ఫ్లాట్టు వాడికీ మధ్యలో ఖాళీ ఉంటేనా? పోనీ ఏ బాల్కనీలోకో వెళ్ళి కాల్పిద్దామా అంటే, రవ్వలు కిందవాడి బాల్కనీ లో పడ్డాయని వాడు దెబ్బలాటకొస్తే, అదో గొడవా. ఇంక మిగిలిందేమిటయ్యా అంటే ప్రతీ సొసైటీలోని సెల్లార్లు ! మళ్ళీ అక్కడ కూడా గొడవే. మన బాణాసంచా జాగ్రత్తగా ఓచోట పెట్టామనుకుంటాము, కానీ ఎవడో వెసిన క్రాకర్ వాటిమీద పడితే ఇంక అంతే సంగతులు , అర నిముషంలో ఊ..ఫ్… చివరకి మా పిల్లలు టెర్రేస్ మీదకెళ్ళి కాల్చుకొచ్చారు!

కొద్దిగా చదువూ సంధ్యా వచ్చిన తరువాత, పత్రికలు కొనడం. దీపావళి వస్తోందంటే చాలు ప్రతీ పత్రికా యువ, జ్యోతి, ఆంధ్రజ్యోతి, ప్రభ పేద్ద పేద్ద దీపావళి ప్రత్యేక సంచికలు వేసేవారు. వాటిమీద వడ్డాదిపాపయ్యగారూ, బాపూగారూ వేసిన అద్భుత చిత్రాలు,కొన్నిటికి సువాసనలు కూడా వచ్చేవి కునేగా మరికొళుందు అనే సెంటు పూసేవారు! ఇప్పుడా పత్రికలూ లేవూ, ప్రత్యెక సంచికలూ లేవూ.
ఇంకో విషయం ఏమిటంటే, ప్రస్తుత కాలంలో దీపావళి సామాన్లు కొండానికి వెళ్ళాలంటేనే భయం ! ఎక్కడ ఏ తీవ్రవాది బ్లాస్టులు చేస్తాడో, మర్నాడు పేపర్లలో మన పేర్లూ, ఫుటోలూ పేపర్లకెక్కుతాయో ( అదికూడా మన బాడీని ఐడెంటిఫై చేస్తేనే) అని! ఇంత built in insecurity తో, అమ్మయా దీపావళి అయిందయ్యా బాబూ అనుకోవడమే కానీ, మళ్ళీ మళ్ళీ దీపావళి అని పాటలెవరు పాడుకుంటున్నారు ?
ఇన్నిన్ని మధుర జ్ఞాపకాలు మర్చిపోమంటే మర్చిపోగలమా మరి ?

16 Responses

  1. yes మాష్టారూ మనం బాల్యాన్ని ఎంజాయ్ చేసినంత గా ఈ కాలం పిల్లలు చేయలేక పోతున్నారు. దురదృష్టకరం.

    ఒక రోజు ఆలస్యం గా దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ.

    Like

  2. నిన్న న‌వ్య దీపావ‌ళి ప్ర‌త్యేక సంచిక కొంటే, దానితోబాటే ఒక క‌వ‌రులో మెడిమిక్స్ శాంపిల్ సోపొక‌టి, ఏదో కంపెనీది హెయిర్ డై ఒక‌టి, మ‌రేదో కంపెనీ షాంపూ సేషేలు రెండు ఇచ్చారు. పుస్త‌కం తెరిస్తే మెడిమిక్స్ స‌బ్బు వాస‌న వ‌స్తోంది. దానిని ఆఘ్రాణిస్తుంటే చిన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌భ వీక్లీలో పండ‌గ‌ల‌కు రాసే మ‌రికొళుందు సెంటు వాస‌న గురించి గుర్తొచ్చింది. ఇవాళ మీరు దాని గురించి రాశారు. మంచి జ్ఞాప‌కం బాబాయిగారూ.

    Like

  3. మన పిల్లలూ మిస్ అయ్యారు. వాళ్ళపిల్లలూ మిస్ అవుతున్నారనే బాధ మరి. ఏంచేస్తాం? నిస్సహాయులం

    Like

  4. chala baga chepparu mastar

    Like

  5. > దీపావళి రోజుకి గోంగూర కాడలూ
    ఇంతకూ ఆ గోంగూర కాడలు దేనికి వాడతారు?

    Like

  6. అవునండీ…. మా చిన్నప్పుడు కూడా దీపావళి అంటే మూడు రోజుల ముందు నుంచే హడావిడి ఉండేది…..

    తాయారు చేసుకోకపోయినా కొన్నవి ఎండ బెట్టడం…. సాయంత్రం అవ్వగానే దీపాలు అమ్మ వెలిగించి ఇస్తే తీసుకెళ్ళి బయట పెట్టడం……. భలే సరదాగా ఉండేది….

    మరి ఇప్పుడో మీరన్నా నయం… కాసిని టపాసులు కాల్చుకున్నారు….. ఇక్కడ అంత అదృష్టం లేదుగా…… చేరో కాకరపువ్వత్తి గుట్టుగా పాటియో లో కాల్చాము…

    మీ బ్లాగుని ఇలా వాడుకుంటున్నందుకు క్షమించాలి….

    బులుసువారు కనబడ్డారు కాబట్టి చెప్తున్నాను….

    మొన్న మీ ఇంటర్వ్యు చదివానండీ ( అదేలెండి జిలేబీ వారిది )

    ఆ తరువాతే నేను ఇదివరకు ఇక్కడ ఇచ్చిన కామెంట్లు చదువుతుంటే చూసాను నా కామెంటుకు మీ ప్రత్యుత్తరం…..

    నా పేరు మాధవి అండీ…. మరి ఏం రోగం అంత మంచి పేరుని అలా పెట్టుకోవడం అని తిట్టమాకండి…..
    కొత్తలో బ్లాగు తెరిచినప్పుడు అలా పెట్టాను… అందరూ చదవడం మొదలెట్టాక మార్చడం కుదర్లేదు…….

    నేను ఈ మధ్య ఒక తెలుగు గోడు రాసాను వీలుంటే చదవండి….. అది చదివాకైనా నేను స్టైలు కోసం ఆ పేరు పెట్టుకోలేదని నమ్ముతారు (అనుకుంటున్నాను)

    లింకు : http://yoursmaddy.blogspot.com/2011/10/blog-post.html

    Like

  7. బాబయ్య ,
    నీ బ్లాగ్ లో స్పందించిన maddy గారి బ్లాగ్ – ‘తెలుగు భాష ని మరచి పోతున్నామా’ – చూసి ఇది రాస్తున్నాను .
    ఆంగ్ల పదాలు వేరే భాషల వారి కన్నా తెలుగు వారు ఎక్కువ గా వాడతారు. ఉదాహరణికి హిందీ వారు , కొద్ది ప్రయత్నం తోనే ఆంగ్ల పదాలు వాడకుండా వారి భావాలను వారి భాష లో చెప్పుకుంటారు. ఇతర భాషల వారు మాట్లాడుతూ ఉంటె కూడా, అన్ని ఆంగ్ల పదాలు వినిపించవు . ఇక ఫ్రెంచ్, స్పానిష్ వారు సరే సరి. దీనికి కారణాలు చాల ఉండచ్చు.
    నా అభిప్రాయాలు ( మాత్రమే – ఒప్పుకోని వారు క్షమించండి )
    ౧) ముందు నుంచే మన భాష లో చాల వరకు సంస్కృత పదాలే ఉన్నాయి . సంస్కృతం, పురాతన వాడుక లేని భాష అయ్యి , తెలుగు ఎదుగుదల గ్రాంధికం గా అయీందికాని ….
    colloquial ( దీని తెలుగు పదం గుర్తుకు రావట్లేదు ) గా అవ్వలేదేమో?

    ౨) కొత్తగా వచ్చిన ” technical terms” ఆంగ్లం లో అనడడం తప్పు లేదు – పైగా, గరికపాటి వారు అన్నట్లు అలా వాడడం, ఒక రకంగా గౌరవం చూపడం.
    ౩) ఒక విధంగా, ఆంగ్ల పదాలు వాడడం గొప్ప, మన భాష మీద గౌరవం . గర్వం లేక పోవడం అనికూడా అనిపిస్తుంది.
    ౪) ఇంకొకటి, బడుద్ధాయి తనము – ఇది నాకు వర్తిస్తుంది – నేను 6 తరగతి దాకానే తెలుగు చదువుకున్నాను. దాంతో , నాకు సులువుగా తెలుగు పదాలు స్ఫూర్తి కి రావు – అందుకని ఆంగ్ల పదాలు వాడేసి అప్పటికి తప్పించు కోవడం.
    ఈ మధ్య నే ” డిష్” పెట్టించుకుంటే మాడ్రన్ మహాలక్ష్మి అనే ‘షో ‘ లో ఒక భాగం – 1 -2 నిముషాలకి పూర్తి గాతెలుగు మాట్లాడాలి ! నాకు చాలా నచ్చింది , కానీ ఆ తరువాతంతా ఆనవసరమైన ఆంగ్ల పదాలే 😦
    కాని మా బాబయ్య లాగ సులువుగా అందంగా రాసి , మాట్లాడితే , అలాగే నవ్వించే స్పందనలతో, తెలుగు భాష కి వెయ్యేళ్ళ ఆయుషె
    మీ అందరి జవాబు బాణాలకు ఎదురు చూస్తూ ?!

    జిమెయిల్ తెలుగు లో రాసే సరికి అంకెలు కూడా తెలుగు లో వచెసాయి!

    Like

  8. @సుబ్రహ్మణ్యం గారూ,

    దీపావళి శలవల్లో ఎప్పుడైనా చెప్పొచ్చుగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు Maddy ఒక వ్రాశారు. చదవండి. అప్పుడెప్పుడో అందరూ “ఇలియానా” ల్లా కనబడుతున్నారని, వైద్యం చేయించుకుంటే, అదేమిటో మరీ అనావృష్టైపోయిందనుకుంటాను. పాపం ఏదొ ఫాషనుగా ఉంటుందని అలా పెట్టుకుంటే మీరేమో, ” మాస్టారూ…” అని సంబోధించి, flop show చేసేటప్పటికి, ఇంక ఊరుకోలేక, ఇలా బయట పెట్టేసికున్నారు…..

    @తేజశ్వీ,

    ఏదొ గుర్తుకొచ్చి వ్రాశాను. కానీ యాదృఛ్ఛికంగా మీకూ ” నవ్య” దీపావళి సంచికతో పాటు, అవి రావడం బావుంది. ఇదివరకటి రోజుల్లో కునేగా మరికొళుందు సువాసనే వచ్చేది! మరి ఇప్పుడో ఓ సబ్బు బిళ్ళకూడా వస్తోంది! ఎక్కడికక్కడే సంతృప్తి పడాలి !!

    @వెంకటప్పారావు గారూ,

    ధన్యవాదాలు.

    @పానీ పురీ,

    నిజం చెప్పాలంటే నాకూ తెలియదు. కానీ ఈ మధ్యన శ్రి చాగంటి వారు చెప్పిందేమిటంటే, ఆరోజు సాయంత్రం, ఇంట్లోని మొగ పిల్లలు మాత్రమే, గోంగుర కాడలకి వత్తులు వెలిగించి, దక్షిణం వైపు కి ఎత్తి చూపిస్తే, మన పూర్వజులకి వందనం చేసినట్టూ, అలాగే తను అన్ని సాంప్రదాయాలూ తూచా తప్పకుండా అనుసరిస్తానని నివేదించినట్టూ ట.

    @Maddy,

    ఈమధ్యన టపాసులెవరు కాలుస్తున్నారు ? మావాళ్ళుకూడా కాకరపూవొత్తులే ! కింద వ్యాఖ్య పెట్టిన అమ్మాయికి నేను అఛ్ఛంగా బాబయ్యనే ! మా అన్నయ్యగారి అమ్మాయి తను.

    @అరుణతల్లీ,
    అయ్యబాబోయ్, నేను వ్రాసే తెలుగే నచ్చిందా తల్లీ ? నువ్వు వ్రాసిన వ్యాఖ్య ఆవిడ టపాలోనే పెడితే బావుండేది కదా. పోనీలే ఇక్కడ చదువుతారు !

    Like

  9. అవునండీ బాబాయ్ గారూ..
    చాలా మిస్ అవుతున్నాం.. మా చిన్నప్పుడు అయితే.. దసరా సెలవుల్లో మొదలుపెట్టేవాళ్ళం సిసింద్రీ గొట్టాలు చుట్టడం.. తాటాకు టపాకాయలకోసం తాటాకులు ఎండబెట్టడం కట్టడం. కాస్త పెద్దవాళ్ళైతే.. తారాజువ్వలకి పేకలతో గొట్టాలు తయారు చేసేవారు.. భలే సరదాగా వుండేది.
    నాకిప్పటికీ గుర్తే.. బొగ్గుపొడి.. సూరేకారం.. గంధకం.. ఇవి మూడూ కలిపి సిసింద్రీ మందు మేమే తయారుచేసేవాళ్ళం. తారాజువ్వలకి అయితే.. 7-3-1 పాళ్ళు కలిపేవారు సిసింద్రీలకైతే.. 7-3-1/2 పాళ్ళు కలిపేవారు.. అలా తయారుచేసుకున్న సిసింద్రీలను వెలిగించటానికి.. ఒక అడుగు పొడవున్న డొక్కనారతాడు (కొబ్బరి పీచుతో నేచిన తాడు) తో వెలిగించటం.. ఊర్లో కుర్రాళ్ళంతా గ్రూపులుగా చేరి బయలదేరటం. ఒరే తాటాకిళ్ళురా అలా పోయి కాల్చుకోండి అని ప్రతీ ఇంటిముందు తిడుతూ మమ్మల్ని తరిమేస్తే అలా వెళ్ళి వెళ్ళి. పొలాల్లో ఒకడిమీదకు ఒకళ్ళు విసురుకుంటూ కాల్చుకుని వచ్చే సరికి తెల్లవారేది.
    ఏంటో ఆరోజులు మళ్ళీ రావు. 😦

    Like

  10. మేము తాటి గులకల తో పూల పట్టాలు అని వాటిని చేసి తిప్పేవాళ్ళమండీ. పూర్తిగా సహజమైనవి.

    Like

  11. మీ దీపావళి జ్ఞాపకాలు బావున్నాయండి.ఒక్క దీపావళి అనే కాదు అన్నిపండగలు ఏదో అయిందని అనిపించేస్తున్నాం …నా చిన్నతనం గుర్తుకు వచ్చింది మీ పోస్ట్ చదవగానే

    Like

  12. మీరు ఇలియానా ను వదలరా? ఏంచేస్తాం, మీకు అడ్డంగా దొరికిపోయాను. ఖండఖండాలుగా ఖండిచేస్తున్నారు. మళ్ళీ మీరు దొరక్కపోతారా ఎక్కడో ఒక చోట ?

    మనం ఇలా అస్త్రాలు వేసుకుంటుంటే ఎక్కడో ఎవరో ప్రియం గా నవ్వుకుంటున్నారు. కృష్ణార్పణం.

    Like

  13. బులుసుగారూ!
    ఉరుము ఉరిమి మంగలం మీద పడిందిట.

    Like

  14. బాబుగారూ!

    మరోసారి “కునేగా మరికొళుందు” పరిమళం ఆస్వాదించినట్లయింది! చాలా సంతోషం.

    అన్నట్టు ఈ నెలలో యెప్పుడో మీ రాజమండ్రీ ప్రయాణం వుంటుందా?

    Like

  15. అయ్యో… నేనూ నవ్య కొన్నా షాపు వాడు గిఫ్టులు ఇవ్వనే లేదు.. నా దీపావళి తుస్సుమందన్న మాట.

    మా నాన్న గారు చిచ్చుబుడ్లూ, మతాబులూ ఇప్పటికీ కూరుతూనే ఉన్నారు. రాజమండ్రిలో సీమకుర్తి సూర్యం కొట్లో మందు కొని, మతాబు గొట్టాల్లోనూ చిచ్చు బుడ్డి గుల్లల్లోనూ కూరడమే తెలుసు నాకు.

    ఫణీంద్ర

    Like

  16. @శ్రీనివాసా,
    అదేమిటీ మరీ సిసింద్రీ పాళ్ళు అలా చెప్పేశావూ? మా రోజుల్లో అది కోకాకోలా లాగ Very closely guarded secret !!!

    @వెన్నెలగోదావరి,

    మీ చిన్నతనం గుర్తుతెచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

    @సుబ్రహ్మణ్యం గారూ,

    అదే మరి! చూద్దాం లెండి, నేనెప్పుడు మీ చేతిలో పడతానో ?

    @కృష్ణశ్రీ గారూ,

    ఈ నెల 13 నుండి 20 వ తారీఖు దాకా కార్యక్రమం. Base Camp రాజమండ్రీ.

    @ఫణీంద్రా,

    అడగాలి బాబూ! అడక్కపోతే అమ్మైనా పెట్టదు! ఈమధ్యన TATA SKY వాళ్ళ యాడ్డు చూడ్డం లేదా?

    Like

Leave a comment