బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం..


    గత రెండురోజులూ ఇన్వర్టర్ డ్యూటీ ,అదేనండి మా మనవడూ, మనవరాలితో ఉండడం, అక్కడ డెస్క్ టాప్ లేకపోవడం, కోడలూ,అబ్బాయిల లాప్ టాప్ మీదేమో, నాకు టైపు చేయడం రాకపోవడం ధర్మమా అని, సైలెంటుగా ఉండిపోవలిసివచ్చింది. అయితేనేం కావలిసినంత కాలక్షేపం. దానికేం లోటులేదు. నా మిస్టరీ షాపింగు పరంపరలో, ఇంకో ఏజన్సీ ( నాలుగోది!) వాళ్ళు ఫోను చేస్తే, ఇదిగో ఇప్పుడే యాత్రా.కాం వాళ్ళది చేసొచ్చాను. మన ఖర్చేమీలెదు, ఓ 700 ఇస్తామన్నారు! ఊరికే పిలిచి ఎవడిస్తాడు మన మొహాలకి? ఆమధ్యనొకాయన మా రిటైర్డ్ పక్షే లెండి, అస్తమానూ ఊరంతా తిరుగుతూంటావూ, ఏమిటి లాభం వీటివల్ల అన్నాడు. మాస్టారూ, మిమ్మల్నడిగితే, నెలకీ ఎసైన్ మెంటుకి 700-1000 చొప్పున ఇస్తూ, నేను కొన్నదేదో నేనే ఉంచుకుంటే ఊరుకుంటావా, అన్నాను. నాకు అవి నచ్చాయీ, చేస్తున్నానూ, ఎవడినీ దోచేసుకోడంలెదు కదా, నీకేమైనా నష్టమా, అన్నాను. అలా అనడం ఆ పెద్దమనిషికి నచ్చలేదనుకోండి, అది వేరే విషయం. నాకోటి అర్ధం అవదు- ఎవరి గొడవా పట్టించుకోకుండా నా దారిన నేనేదో ఎంజాయ్ చేస్తూంటే, అసలు వీళ్ళకెందుకూ అంట! అప్పటికీ, నాకు తెలిసినవారందరికీ చెప్తూంటాను, బ్లాగుల్లోకూడా వివరాలు పెట్టాను, ఎవరికిష్టం అయితే వాళ్ళు చేసికుంటారు.అంతే !

   రిటైరయినవాళ్ళ మొహం చూసేదెవడండీ? ఏదో ఎవరో మనమీద నమ్మకం ఉంచి, ఓ పని చెప్పారూ, మనకి ఓపికుందీ చేస్తున్నాము, మనకీ కాలక్షేపం, వాళ్ళకీ పనైపోతోంది. win win situation! నగరాల్లో ఉండే మన బ్లాగు చదువరులఏమైనా ఇంటరెస్టుంటే చెప్పండి, మీ మెయిల్ ఐడి పంపితే, నేనే వాళ్ళకి రిఫర్ చేస్తాను. ఇందులో నాకొచ్చేదేమీ లేదండోయ్, జస్ట్ ఆ ఏజన్సీ వాళ్ళకి ఇంకొంతమంది ఇవాల్యుఏటర్లు దొరుకుతారు, మీకూ కాలక్షేపం.

   మొన్న శనివారం వెళ్ళి, కొడుకూ, మనవడూ మనవరాలూ ముగ్గురిదీ ఆధార్ చేయించేశాము. కోడలు మిగిలింది. శుక్రవారం అమ్మాయీ, మనవరాలూ, మనవడూ రాత్రి వచ్చి భోంచేసి, ఓ నాలుగ్గంటలు గడిపి వెళ్ళారు. విడిగా ఉన్నప్పుడు ఇదే మరి సదుపాయం! మా ఇంటికి రావలిసివస్తే, అక్కడ, కొడుకూ,కోడలూ, మనవడూ మనవరాలూనూ, మరి ఇంతమందుంటే, మాతో క్వాలిటీ టైము గడిపేదెట్లా?ఇక్కడైతే ఫుల్ ఎటెన్షన్ ! మాకూ బావుంటుంది, అమ్మమ్మ తాతయ్యలతో గడపడం వాళ్ళకీ బావుంటుంది. అవును కదూ?

    మొన్న మా ఇంటికెదురుగా ఉండే గణపతి గుడికి వెళ్ళాను. అప్పటికింకా గణేశ్ విసర్జన అవలేదు, భజనలూ, పాటలూ పేద్ద సౌండుతో వినిపిస్తున్నాయి. లోపల దండం పెట్టుకుంటూంటే, బయటెవరిదో హడావిడి వినిపించింది. ఒకావిడ, ఆ పాటలు పెట్టేవాడితో గొడవ పడుతోంది– మా పిల్లాడి పరీక్షలూ, ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద సౌండుతో పాటలు పెట్టేస్తుంటే చదువులు సాగడం లేదూ అని. ఈవిడదారిన ఈవిడా, వాడిదారిన వాడూ ఒకళ్ళమీదొకళ్ళు అరుచుకుంటున్నారు. ఈ విషయంలో ఏదొ కొద్దిగా ఆవిడకి చెప్దామూ అనిపించి,- ఈవేళొక్కరోజే కదా, రేపెలాగూ గణపతి నిమజ్జనం జరిగిపోతుందీ ఏదో ఒక్కరోజోపిక పడితే గొడవుండదుగా అన్నాను.అలా కాదంకుల్, పదిరోజులనుండీ ఇదే గొడవా తెల్లారిందగ్గరనుంచీ, అర్ధరాత్రిదాకా ఒకటే రొద, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదూ అని.

   చూడు తల్లీ, మనకి వీళ్లతో చెప్పే చనువుందికాబట్టి, ఈమాత్రమైనా వింటున్నారూ, ప్రతీ చౌక్ దగ్గరా ఏడాదిలోనూ, ఏదో వంకబెట్టి, ఏదో ఒక వర్ధంతో, జయంతో పేరుచెప్పి ఊరేగింపులూ, గులాళ్ళూ డాల్బీ సౌండుతో పాటలూ పెట్టి ఇరవైనాలుగ్గంటలూ హింసించే, ఆ ఏరియా సోకాల్డ్ యూత్ లీడర్లకి చెప్పి చూడు. తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ దృష్టిలో మార్క్ అయ్యావా, ఇంక మీకు పీస్ ఫుల్ గా బ్రతకడం కష్టం అయిపోతుంది. ఆ చుట్టుపక్కలుండే మనలాటి వాళ్ళు అంత సహనంగా ఉంటున్నారూ అంటే, అదేదో ఇష్టమయ్యీ కాదు, ఆ జయంతి/ వర్ధంతి చేయించుకుంటున్న దేశనాయకులమీద అభిమానమూ కాదు. ఈ గల్లీ ఛోటా నాయకుల తో గొడవ పడే ధైర్యం లేక.!

   ఊరుకి చివర్లో కావలిసినన్ని ఎపార్టుమెంట్లు , పైగా అతి తక్కువ ధరకే వస్తాయి. అయినా ఊరి మధ్యలో ఒకటికి నాలిగింతలు ఖరీదెక్కువైనా, కొంపలు కొనుక్కుంటున్నాము, కారణం అన్నిటికీ దగ్గరగా ఉంటుందని, స్కూలు బస్సొస్తుందనీ, ఆటోలు దొరుకుతాయనీ,మనవైపునుంచి ఎవరైనా వస్తే, స్టేషనుకి మరీ దూరం కాదనీ,ఆఖరికి ప్రాణం మీదకొస్తే హాస్పిటల్ కి వెళ్ళొచ్చనీ, మన ప్రాణం పోతే, ఓ నలుగురైనా రావడానికి దగ్గరగా ఉంటుందనీ. మరి ఇన్ని సదుపాయాలూ, సౌకర్యాలూ ఉన్నప్పుడు, ఏదో ఏడాది లోనూ ఇలాటి సౌండు పొల్యూషన్లున్నప్పుడు, భరించాలి మరి. మేమిదివరకుండే ఇంటికి దగ్గరలో ఓ చర్చుండేది, శనాదివారాలొచ్చాయంటే చాలు ప్రార్ధనలతో హోరెత్తించేసేవారు. అలాగే మసీదులూనూ, తెల్లారేటప్పటికి నమాజు మైక్కుల్లో చెప్తారు. రంజాను నెలైతే ఇంకానూ. These are all occupational hazards. అన్నిటినీ భరించాలికానీ, ఊరికే దెబ్బలాడితే రోజులెళతాయా ?

5 Responses

  1. ఏమండి
    మీరు రెండు రోజులు కనపడకపోతే ఇదే అనుకున్నాను. మొన్న శనివారం పెద్దబ్బాయి కోడలు వచ్చారు. పెద్దబ్బాయి కొడుకు ఎం.సి.ఎ చదువుతున్నాడు. వాడికి ఖాళీ లేక రాలేదు. చిన్నబ్బాయి కోడలు మనవరాలు ఇంటావిడకలిసి రెండురోజులూ గడిపేసేము. ఇంటావిడకి శ్రమ పెరిగింది. నిన్న సాయంత్రం పెద్దబ్బాయి కోడలు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు పడితేకాని సుఖం అనేది తెలియదుకదా.

    Like

  2. బాబాయ్, నిమజ్జనం అని రాస్తే బాగుండేది, విసర్జన అంటే అదోలా ఉంది

    Like

  3. మీ మిస్టరీ షాపింగ్ లో నేను సైతం రిజిస్టర్ చేశాను ఇప్పుడే. ఏలూరు కి మిస్టరీ షాపింగ్ లేదు. విజయవాడ కి పెట్టాను. మీరు చెప్పినట్టు సరదాగా ఉంటే చూద్దాం. లేకపోతే ఇంతే సంగతులు.

    Like

  4. బాబాయ్ గారూ ఇక్కడ (మహారాష్ట్రాలో) మరీనండీ బాబూ.. ఆ డిజిటల్ సౌండు బాక్సులు పెట్టకపోతే వాడికి స్టెప్పువేయటం రాదో ఏంటో.. పెద్ద పెద్ద బాక్సులు.. వాటిలోంచి వచ్చే మ్యూజిక్కు వింటే గుండెలదిరేలావుంటాయి. ఏంటో వెర్రానందం అర్దంకాదు. బీట్ ఉండాలి కానీ హార్ట్ బీట్ ఆగిపోయేలా.. చెవుల్లో నరాలు తెగిపోయేలా వుండాలా!

    @dnc
    మహారాష్ట్రాలో గణేష్ విసర్జన్ అంటారు అందుకే ఆయనలా వాడినట్టున్నారు. మొదట్లో నాకూ అదే అర్ధంకాలేదు.. విసర్జన్ అంటే డిస్పోజ్ చేయటం అన్న అర్ధం వచ్చింది కదా, అలా ఎందుకన్నారా అని. నేను నిమర్జన్ అంటే కొత్తగా చూసారు మా కొలీగ్స్ అది వేరే విషయంలేండి.. అంతేలేండి ఎవడిగోలవాడిది ఈ మౌకుసెట్టుల్లాగే.. 🙂

    Like

  5. @శర్మగారూ,

    భగవంతుడి దయవలన ఈ విషయంలో మాత్రం మేము అదృష్టవంతులమే. పిల్లలిద్దరూ , మేమూ ఒకే ఊళ్ళో ఉండడం వలన ఎప్పుడు కావలిసిస్తే అప్పుడే కలుసుకోవచ్చు.

    @dnc,
    మీ అభీష్టం ప్రకారం మార్చాను. కానీ మహరాష్ట్ర లో విసర్జన్ అనే అంటారు.

    @సుబ్రహ్మణ్యం గారూ,

    మీరు మిస్టరీ షాపింగులో రిజిస్టర్ చేసికున్నందుకు సంతోషం. కానీ ఇంకో ఊరికి ( విజయవాడ) కి వెళ్ళి చేయడం, మరీ కిట్టుబాటవదండి మాస్టారూ! ఏదో ఉండే ఊళ్ళో అయితే ఫరవాలేదు. వాళ్లు ప్రయాణం ఖర్చులివ్వరు.

    @శ్రీనివాసా,

    ఆ విషయంలో మహరాష్ట్ర కొద్దిగా “అతి” గా చేస్తారు, నిజమే.

    Like

Leave a comment