బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేశం లోని ఉపాధ్యాయులందరికీ వందనాలు…


    ఉపాధ్యాయ దినోత్సవం అంటూ విడిగా వ్రాసేదేమిటిలెండి? పుట్టినప్పటినుండీ నా జీవితం అంతా ఈ ఉపాధ్యాయులతోనే గడిచిందీ, ఇంకా గడుస్తూంది కూడా ! మా ఇంటావిడ కూడా ఒకప్పుడు, అత్తిలిలో టీచర్ గా పనిచేసిందిట. ఈ విషయం ముందుగా తెలిసుంటే ఎంత బాగుండేదో కదా!! ప్రతీ రోజూ క్లాసులైనా తప్పేవీ ! ఏమిటో అనుకుంటాము కానీ, ఘటనండి బాబూ! బ్రహ్మ వ్రాసింది తప్పించుకోడమే? చిత్రం ఏమిటంటే, ఇంతమంది టీచర్ల మధ్యలో ఉంటూ కూడా, పొట్టకోస్తే అక్షరం ముక్క వంటబట్టలేదు! అదీ నా గొప్పతనం !

    Leave aside jokes, ఉపాధ్యాయులంటే నాకు అమితమైన గౌరవం, కారణం మరేమీ లేదు చదివిందేమీ పేద్ద పెద్ద చదువులేమీ కావు, ఉన్నవాళ్ళా, ఓ యాభైమంది, అందరి పేర్లూ గుర్తులేవుకానీ, చాలామంది జీవితాంతం గుర్తుండిపోతారు. కారణం వారు చెప్పేపధ్ధతీ, పాపం వాళ్ళప్రయత్నాలేవో వారు చేశారు, ఎంతోకొంత నా బుర్రలోకెక్కిద్దామని. వాళ్ళననేం ప్రయోజనం?

   మొట్టమొదట అంటే సరస్వతీనమస్థుబ్యం చెప్పించి, అమలాపురం భూపయ్యగ్రహారం లో ఓ పాకబడుండేది, అక్కడ మాస్టారు శ్రీ వీర్రాఘవులు గారు- మీసాల మాస్టారనేవాళ్ళం. చేతిలో బెత్తం, పేద్దపెద్ద మీసాలతో ఉండేవారు. ఎప్పుడూ బెత్తం ఉపయోగించిన గుర్తులేదు. అవసరంలేకనో, లేక ఉపయోగంలేదనో అని మాత్రం అడక్కండి.ఆ తరువాత, 1951-52 లలో మానేపల్లి లో శ్రీరాములు మాస్టారని ఉండేవారు. ఎప్పుడు చూసినా లెఖ్ఖలో లెఖ్ఖలనే వారు, దాంతో లెఖ్ఖలంటే అదేదో భయం వచ్చేసి వాటి జోలికెళ్ళలేదు!

   ఎంతైనా ఇంటినిండా టీచర్లే అవడంతో, దానికి సాయం నాన్నగారూ, పెదనాన్నగారూ, అన్నయ్యా టీచర్లే అవడంతో, ఎలాగోలాగ హైస్కూల్లోవేయించేశారు. ఏదో హెడ్మాస్టారి కొడుకును కదా అని, ప్రతీ క్లాసూ పాసైపోతూ ఎస్.ఎస్.ఎల్ సీ దాకా వచ్చేశాను. ఈ ప్రయాణంలో మాకు డ్రాయింగు నేర్పే శ్రీ గంటి భాస్కర్రావుగారూ, శ్రీ చావలి సత్యన్నారాయణగారూ(ఇంగ్లీషు),శ్రీ తణికెళ్ళ సుబ్బారావుగారూ( క్రాఫ్ట్), శ్రీ పి.కృష్ణమూర్తిగారూ (డ్రిల్లు),మండపేటలో చదివినప్పుడు శ్రీ చీమలకొండ పార్వతీశ్వర శాస్త్రిగారూ, శ్రీ బ్రహ్మన్న శాస్త్రిగారూ, శ్రీ దర్భా గణేశ శాస్త్రిగారూ, శ్రీ ప్రయాగ రవణమూర్తిగారూ, వీళ్ళందరివద్దా చదువుకుని మొత్తానికి కాలేజీకి వచ్చాను. పాస్ అవడానికి ధోకా ఎప్పుడూ ఉండేదికాదనుకోండి, హెడ్మాస్టారి కొడుకు ఫెయిల్ అయితే, నాకేం, వాళ్ళకే అప్రదిష్ట!

   ఇంక కాలేజీకి వచ్చిన తరువాత, మా ప్రిన్సిపాల్ శ్రీ పెద్దాడ రామచంద్రరావుగారు, శ్రీ జి.పి.రమేశం గారూ, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారూ, శ్రీ జి.వి.ఎస్ రామారావుగారూ, శ్రీ చిదంబరంగారూ, శ్రీ రామకోటేశ్వర్రావుగారూ,శ్రీ ఆర్.ఆర్.కే గారూ, మా అక్కయ్యగారు కందా భాస్కరం గారూ, శ్రీ గొల్లకోట వెంకటరత్నంగారూ, శ్రీ పారుపూడి వెంకట్రావుగారూ,Last but not least శ్రీ GKM గారూ.

    ఆరోజుల్లో పాఠాలు చెప్పే గురువుల ఇంటీపేర్లేమిటో తెలిసికునేటంత ధైర్యం ఎక్కడుండేదీ? పైన కొన్ని చోట్ల ఇచ్చిన ఇంటిపేర్లు, ఏదో ఇంట్లో పెద్దాళ్ళు చెప్పుకునే కబుర్లద్వారా తెలిసి గుర్తున్నవి. మాకు ఇంగ్లీషు చెప్పే మాస్టారు శ్రీ GKM గారిని నా చివరి శ్వాస వరకూ గుర్తెట్టుకోదగ్గ పేరు.ఏదో నాలుగు ఇంగ్లీషు ముక్కలు వంటపట్టాయీ అంటే అంతా ఆయన చలవే! అరటిపండు వలిచి నోట్లో పెట్టేంత సులభంగా చెప్పేవారు. ఓస్ ఇంగ్లీషంటే ఇంతేనా అనేట్లుగా. ఇప్పుడంటే కాన్వెంట్లూ, సందుకో స్పోకెనింగ్లీషు కొట్టూ వచ్చేయి కానీ, ఆ రోజుల్లో ఇవేమీ ఉండేవి కావుగా, పైగా మా అమలాపురం ఆరోజుల్లో ఓ ద్వీపం, ఎక్కడికెళ్ళాలన్నా గోదావరి దాటాల్సొచ్చేది. ఇప్పుడంటే బ్రిడ్జీలూ అవీ వచ్చాయి, ఇంటర్నెట్టులూ గోలానూ! కానీ ఆరోజుల్లో నేర్చుకున్న ఇంగ్లీషు ధర్మమే, ఇప్పటికీ, నలుగురితో మాట్లాడ కలిగే ధైర్యం ఇచ్చింది. అదంతా మా శ్రీ GKM గారి ధర్మమే.

   జీవితంలో అంతగా మర్చిపోలేని శ్రీ GKM గారి ఇంటిపేరు ఎప్పుడూ తెలిసికునే ప్రయత్నం కానీ, ధైర్యం కానీ చేయలేదు. దానితో జరిగిన నష్టం ఏమిటయ్యా అంటే, శ్రీ GKM గారిగురించి తెలిసికోడానికి 50 ఏళ్ళు పట్టింది! ఎప్పటిమాటండీ, 1959-60 ల్లో మా అమలాపురం కాలేజీలో ఏ ఒక్క క్లాసూ మిస్ అవకుండా ఎటండయిన రోజులే తక్కువ, వాటిలో శ్రీ GKM గారి క్లాసోటి.

   రెండుమూడు వారాల క్రితం “నవ్య” వారపత్రికలో, డాక్తరు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఓ వ్యాసం వ్రాశారు. అందులో గత 50 సంవత్సరాలనుండీ, లండన్ లో ఉంటూన్న తెలుగుతేజం డాక్టరు గూటాల కృష్ణమూర్తి గారి గురించి. ఆయన వివరాలు ప్రస్తావిస్తూ శ్రీ కృష్ణమూర్తిగారు అమలాపురం కాలేజీలో పనిచేసిన విషయంకూడా వ్రాశారు. ఆయనఫొటో కూడా పెట్టడంతో, మబ్బులన్నీ తొలగిపోయి, నా ఆరాధ్య మాస్టారు శ్రీ GKM గారి గురించి తెలిసింది. ఇంక ఆగడం నా తరం కాలేదు. ఎలాగోలాగ, మా మాస్టారి పోస్టల్ ఎడ్రస్ సంపాదించేయాలీ, ఆయనకి ఓ ఉత్తరం వ్రాసేయాలీ, ఎలాగ ఎలాగ ఎలాగ… నెట్ అంతా వెదికేశాను. ఆయన ఎడ్రస్ తప్ప మిగిలినవన్నీ తెలిశాయి. గురువుగారి గురించి ఇదివరకే చాలా చదివాను, కానీ ఆయనే నా గురువుగారూ అని అప్పుడు నాకేం తెలుసూ? ఇప్పుడు తెలిసీ ఏమీ చేయలేని అసహాయత, ఏదో ఓ ఉత్తరం ద్వారా, నా tributes ఆయనకు చెబదామని, అదీ 50 ఏళ్ళ తరువాత!

   క్రిందటివారం అంతర్జాలం లో “పొద్దు” చదువుతూంటే ( నేను కాదు మా ఇంటావిడ) అందులో శ్రీరమణ గారు శ్రీ ఆరుద్ర గారిమీద వ్రాసిన వ్యాసంలో, గూటాల కృష్ణమూర్తి గారి ప్రస్తావన వచ్చింది. మా ఇంటావిడ, ” ఏవండోయ్, మీ మాస్టారిగురించి శ్రీరమణ గారు వ్రాశారూ,ఆయన ఎడ్రస్ ఆయనకేమైనా తెలుసునేమో కనుక్కోండీ” అంది. ఇదిగో ఇలాటప్పుడే ఇంటావిళ్ళ వాల్యూ తెలిసొస్తుంది–JUST IN TIME ! సెల్ తీసికుని శ్రీరమణగారికి ఫోను చేసేశాను. సార్ నేను ఫలానా , మిమ్మల్ని నాలుగేళ్ళ క్రితం, హైదరాబాద్ లో కలిసి, మూడుగంటలపాటు బోరు కొట్టేశానూ, నాకో ఉపకారం కావాలీ, గూటాల కృష్ణమూర్తిగారి పోస్టల్ ఎడ్రస్ కావాలీ, విషయం ఇదీ ని చెప్పాను.దానికి ఆయనా సంతోషించి, ఇంట్లో ఉందీ, రాత్రి ఫోను చేయండీ అని చెప్పారు. నేనా ఇలాటి అవకాశం వదిలేదీ? రాత్రిఫోను చేస్తే, శ్రీరమణ గారు ఎడ్రస్ ఇస్తూ, ఓ పావుగంట ఆయనతో మాట్లాడనిచ్చారు. ఫోను కట్ చేయొచ్చూ, లేకపోతే నేనడిగినది తెలియదూ అనొచ్చు. కానీ నిండుకుండలు తొణకవంటారే అలాగ, శ్రీరమణగారి ధర్మమా అని డాక్టరు గూటాల కృష్ణమూర్తి ( My favourite teacher, Sri GKM) గారికి ఓ ఉత్తరం ( ఓ అరఠావు నిండుగా) తెలుగులో వ్రాసి పోస్ట్ చేసేశాను.ఇంగ్లీషు మాస్టారికి తెలుగులోనా అని అనుకోకండి, మా మాస్టారికి తెలుగంటే చాలా అభిమానం . ఈ విషయం ఎప్పుడో శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రిగారి “ఇల్లాలి ముచ్చట్లు” లో చదివాను.

    ఇదండీ విషయం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మా మంచి మాస్టారి గురించి గుర్తుచేసికోడం కంటే ఆనందం ఇంకోటుండదు — Long live all Teachers.

Advertisements

8 Responses

 1. భమిడిపాటి వారంటె బంగారం తో సమానమని అర్ధము కదా. నిజంగా మీరు బంగారమే. మీరు తలుచుకున్న గురువులలో కొంతమందిని నేనెరిగివుండటం వారిని నేనుకూడా ఈ రోజు స్మరించడం ఆనందం కలగ చేసే విషయాలు.మీరు తలుచుకున్న వారిలో నేనెరిగిన చీమలకొండ పార్వతీశ్వర శాస్త్రి గారు బ్రహ్మన్న శాస్త్రి గారు కాలం చేసారు. నేను పార్వతీశ్వర శాస్త్రి గారి ఇంటి పక్క ఇంటిలో వుండే వాడిని. అబ్బో ఏబది సంవత్సరల క్రితం నేను మండపేట లో వున్న విషయాలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  Like

 2. మీ పోస్టుకి జవాబు రాసి పడుకున్నాను. నిద్ర పట్టలేదు. చిన్నప్పటి ఆలోచనలలోకి జారిపోయాను.మీరు నన్ను బాగా కదిలించారు. ఎభయిల్లో మాపల్లె గూటాల లో అయిదవతరగతి వరకే చదువు వుండేది. తరవాత చదువుకోవలంటె అటు పోలవరం కాని ఇటు వేగేశ్వరపురం కాని వెళ్ళవలసి వచ్చేది. ఏబది సంవత్సరం లో మావూరిలో హైస్కూలు పెట్టేరు, ఒక కండిషనుతో. స్కూలు కు బిల్డింగు వూరివారు కట్టుకోవాలి. సరే నన్నారు మా వాళ్ళు. మా అదృష్టం కొద్దీ దేవర భొట్ల రామా రావు గారిని హెడ్ మాస్టరుగా వేసారు. ఆయన చాల కష్టపడి స్కూలు కి భవనం కట్టించేరు. ఒక్కొకరు ఒక గది కట్టించడంకి ఆ రోజులలో ఆరు వేలు చందా ఇచ్చారు, మావురిలో కొందరు… స్థలం నాలుగు ఎకరాలు మా అయ్యగారు శ్రీమాన్ మాడభూషి వేంకటరంగ అణహరాచారిగారు ఇచ్చారు. అప్పటికే వారి జమిందారి చాప చిరిగి చదరంత అయినట్లు అయినది. ఆయనకు ముగ్గురు మగ నలుగురు ఆడ సంతానంగా గుర్తు. మా స్కూలు భవనం మేము శ్రమదానం తో నిర్మించుకున్నాము. ఓక పిరియడులో ఒక్కొక తరగతి వారు శ్రమ దానం చేసేవారు. ఒక్కక సంవత్సరానికి ఒక్కొక తరగతి పెంచుకుంటూ వెళ్ళేరు. ఆ స్కూలులో మా అన్నగార్లు ముగ్గురు నేను చదువుకున్నాము.మాకు శ్రీ జోస్యుల వేంకట లక్ష్మి నరశింహమ్ గారు ఇంగ్లీషు చెప్పేవారు. శ్రీ చెరుకుపల్లి హనుమత్కవిరాట్ లక్ష్మణ శాస్త్రిగారి ఇంటివద్ద చదువుకునేవారము. ఆయన అల్జీబ్రా చెప్పేవారు. జాన్ మాస్టారు సోషల్ చేప్పేవారు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం గురించి చెప్పి తరువాతి కాలం లో నాకు హిస్టరీ మీద ప్రగాఢమైన ఇష్టాన్ని కలగ చేసారు. నాకెందుకు వుపయోగ పడక పోయినా తరువాత కాలంలో హిస్టరి చాల చదివేను. దాని మూలంగా కూడా ఇంగ్లిషు పై పట్టు సాధించానేమో! మావూరు వెళితే స్కూలుకి వెళ్ళకుండా ఉండలేను. తరవాతి కాలంలో పూర్వ విద్యార్ధుల సమాఖ్య ఏర్పాటు చేయాలని తలచాను కాని చేయ లేక పోయాను. మాగురువులందరిని మరొకమారు తలుచుకున్నందుకు ఆనందంగా వుంది.తొలిగురువు తల్లికి వందనం. తండ్రికి వందనం. గురువులందరికి వారేలోకం లో వున్నా అందరికి వందనములు. ఈ అవకాశం కలగచేసిన మీకు ధన్యవాదాలు. ఇప్పుడే మీ జవాబు చదివాను. వివరంగా రేపు రాస్తాను. శలవు.

  Like

 3. అయ్యా ! మీరు ధన్యులు .

  Like

 4. mail sent to ur email address is returned undelivered. The g mail giving information that the mail address is not recognized. Pl check.
  SARMA

  Like

 5. Sarma garu,

  There was no problem with my mail ID bphanibabu@gmail.com or

  harephala@gmail.com. I checked both.

  Like

 6. @శర్మగారూ,

  మీరు వ్రాసిన నాలుగు సుదీర్ఘ ఉత్తరాలూ అందాయి. మీతో పరిచయం నా అదృష్టంగా భావిస్తున్నాను. జవాబు త్వరలో వ్రాస్తాను. ఉత్తరాలే కాకుండా, 45 నిమిషాలు మీతో మాట్లాడడం చాలా సంతోషమయింది.

  @సుజాతా,

  థాంక్స్.డాక్టరు గూటాల కృష్ణమూర్తిగారి దగ్గర చదువుకోడం నా పూర్వజన్మసుకృతం !

  Like

 7. చాలా బావుందండి గురుస్మరణ.

  Like

 8. కొత్తపాళీ గారూ,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: