బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఇలాటి స్నేహితులుంటే,నాకేటి లోటు?……


    అప్పుడెప్పుడో పుస్తకం.నెట్ లో సుధామ గారు వ్రాసిన పుచ్చాపూర్ణానందం గారి ఆవకాయ-అమరత్వం పుస్తకం మీది రివ్యూ చదివి, ఈ పుస్తకం చదవకపోతే, మనం అసలు పుస్తకాలు చదవడం ఎందుకూ అనుకున్నాను. మే నెలలో బాపట్ల వెళ్తూ, దారిలో ఓ రెండు రోజులు భాగ్యనగరంలో, పుస్తకాలు కొనే భాగ్యం కలిగింది. నవొదయా కి వెళ్ళి, రావు గారిని, అయ్యా పుచ్చా పూర్ణానందం గారి పుస్తకాలేమైనా ఉన్నాయా అని అడిగితే, ఆయన పేరే వినలేదన్నారు! చటుక్కున కోపం వచ్చేసి, సుజాత గారికి ఫోను చేసి, ఆవిణ్ణి కోప్పడేశాను! అక్కడ నాకు లోకువగా దొరికిందావిడేగా మరి! వెర్రి ఇల్లాలు, ఇదివరకోసారి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి “కృష్ణా తీరం” కావాలంటే, ఆవిడే తన దగ్గరున్న ఓ కాపీ ఇచ్చారు, ఎప్పుడూ నేను క్రితం ఆగస్టులో “తెలుగుభాషా దినోత్సవానికి” 29 న కలిసినప్పుడు. అప్పుడే ఏడాదైపోయింది. ఇంక కావలిసిన పుస్తకాలు అడగొచ్చని, ఓసారి పెర్మిషన్ ఇచ్చేసిన తరువాత వదుల్తానా మరి? ఆ సందర్భం లోనే, ఆవిణ్ణి కోప్పడడం! ‘ మీరు ముందర బాపట్ల వెళ్ళి రండి, తిరిగి వచ్చేటప్పటికి, ఆ పుస్తకమేనా సంపాదిస్తానూ, కాని పక్షంలో ఎక్కడ దొరుకుతుందో తెలిసికుంటానూ అని ఓ భరోసా ఇచ్చారు.

    తిరుగుప్రయాణం లో, రెహ్మాను చే తీసికెళ్ళబడగా, సుజాత గారి ఆతిథ్యం పొందానుగా. అక్కడకి వెళ్ళగానే, మొట్టమొదటి పలకరింపు, “మన వేణు ధర్మమా అని, మీక్కావలిసిన పుస్తకం ఎక్కడ దొరుకుతుందో మొత్తానికి తెలిసికున్నామూ” అని. ఇంతలో వేణు, ఎవరికో ఫోను చేసి, నన్ను మాట్లాడమని, ఆ ఫోనుకాస్తా నా చేతిలో పెట్టాడు. అటువైపు మాట్లాడుతున్న వారు, విజయవాడ లో ఉండే శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు. నా పరిచయం చేసికుని, అయ్యా ఫలానా పుస్తకం గురించి వెదుకుతున్నానూ, మీరేమైనా సహాయం చేయకలరా అని అడిగితే, దానికేం భాగ్యం,నా దగ్గర ఒక కాపీ ఉంది, Xerox చేయించి పంపుతానూ, ఎడ్రస్ ఇవ్వండీ అన్నారు. నేనెవరో ఆయనకు తెలీదు, మొదటి పరిచయం లోనే, తన దగ్గర ఉన్న పుస్తకాన్ని పంపుతామనడం ఆయన సహృదయత.

    పూణె తిరిగి వచ్చిన తరువాత, ఓ పదిరోజులాగి ఆయనకి ఫోను చేశాను. ఏదో పని వత్తిడిలో ఉండి, ఇంకా కాపీ చేయించలేదూ అన్నారు. మరీ స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాగ, ఆయన వెనక్కాల పడలేనుగా, పైగా మరీ ఇన్నిసార్లు అడిగితే, పంపనూ అంటే, నాకు పుస్తకం దొరికేదెలాగ? పోన్లే, చదివే యోగం ఉంటే, అదే దొరుకుతుందిలే అని అప్పటికి వదిలేశాను. అప్పుడు గుర్తొచ్చింది, విజయవాడలో మా మేనకోడలు ఉందని.అవసరం వచ్చేటప్పటికి ఇలాటివి గుర్తొస్తూంటాయి. మేము రాజమండ్రీ కాపరం లో ఉన్నప్పుడు, పిల్లలతో మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది, తనకి పుస్తకాలు చదవడం చాలా ఇష్టమూ అని. అమ్మయ్యా, నాలాటిది ఒకర్తి దొరికిందీ అనుకుని, తనకి ఫోను చేశాను. బ్యాగ్రౌండంతా చెప్పి, ” నీకో ఫోను నెంబరిస్తానూ, ఆయన దగ్గరకు వెళ్ళి, అడిగితే ఓ పుస్తకం ఇస్తారూ, Xerox చేయించి నాకు పంపు తల్లీ” అని చెప్పాను. తను మర్నాడే, తీరిక చేసికుని, ఆయన దగ్గరకు వెళ్ళిందిట. ఈ విషయమంతా, ఓ నాలుగు రోజుల తరువాత ఫోను చేసి ” మావయ్యా, ఎంత అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేశావూ, విజయవాడలో ఇంతకాలం నుండీ ఉంటున్నా, నాకు తెలియదు, ఆయన్ని గురించి, కలిసి చాలా సేపు మాట్లాడాను.నీకివ్వమని, ఇంకో నాలుగు పుస్తకాలు కూడా ఇచ్చారూ” అని చెప్పింది.

    ఈవేళ ఆ పుస్తకాలు వచ్చాయి. ఆ నాలుగు పుస్తకాలూ క్రింద ఇచ్చిన ఫొటో లోవి. ఇంక పనేం ఉందీ? అన్నీ చదివేసి, త్వరలో మా గ్రంధాలయం లో పెట్టేసి, మిగిలినవారిచే చదివించేయడమే !

    ఇప్పుడు చెప్పండి, – రెండేళ్ళ క్రితం “నవ్య” దీపావళి సంచిక దొరక్క అడగ్గానే పంపిన అరుణ పప్పు, “ఇంకోతికొమ్మచ్చి” పంపిన మా గురువు గారు శ్రీ అప్పారావు గారు, క్రిష్ణా తీరం ఇచ్చి పుణ్యం కట్టుకున్న సుజాత, అడక్కుండానే అభిమానంతో “బాపు బొమ్మల కొలువు, ముక్కోతికొమ్మచ్చి” పంపిన శంకర్, పుచ్చా వారి పుస్తకం నాకు లభించేటట్లుగా శ్రీ పన్నాల వారిని పరిచయం చేసిన వేణు, ఎంతో పెద్దమనస్సుతో నాకు కావలిసిన పుస్తకమే కాకుండా, ఇంకో మూడు అచ్చోణీల్లాటి పుస్తకాలు ఇచ్చిన శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారూ, వీటన్నిటినీ జాగ్రత్తగా ప్యాక్కు చేసిన నా మేనకోడలు చి.బాల, అన్నిటిలోకీ ముఖ్యం వాటిని కొరియర్ చేసిన ఆమె భర్త చి.పార్ధసారథి— లాటి స్నేహితులుండగా నాకేటి లోటండీ …..

12 Responses

 1. భలే, భలే! పుస్తకం కంటే సంతోషపెట్టే వస్తువు ఇంకొకటి ఉండదుగాక ఉండదు. Happy for you.

  Like

 2. నిజమే..చాలా లక్కీ మీరు. మీ బ్లాగ్ చదువుతున్న మేము కూడా!

  Like

 3. annayam idi. chadavadam kudarakapotunte maku miru bukkulaku bukkulu bukkettunnaaru..

  Like

 4. బాబ్బాబు ఆ సుజాత గారిది, మీ మేనకోడలి టెలిఫోన్ నంబర్స్ నాకు పంపుతారా విత్ ఇంట్రడక్టరీ లెటర్స్. థాంక్యూ ఇన్ అడ్వాన్స్.

  Like

 5. బాబాయి గారూ మీరు మరీనండీ!ఇందులో నేను తీసుకున్న శ్రమేమీ లేదండీ! అంతా వేణు గారి చలవే!

  కాకపోతే కృష్ణా తీరం మాత్రం నా వద్ద ఉన్న ఒకే కాపీ మీకు ఇచ్చాను.
  మరి అడిగిందెవరు? అందుకే!

  మళ్ళీ నేను ఎలాగైనా సంపాదించుకోలననే ధైర్యం ఉంది.

  మీరు వెనకేసుకున్న నాలుగు రాళ్ళలో (స్నేహితురాళ్ళలో) నేనూ ఉన్నందుకు సంతోషం!

  బులుసు గారూ, ఆ సుజాతని నేనే లెండి! మనకెలాగూ బజ్జర్లనే పేరొచ్చేసిందిగా, మనం బజ్జులో మాట్లాడుకుందాం! మీకు ఇంట్రడక్టరీ లెటరేమిటీ…చోద్యం కాకపోతే?

  Like

 6. @కొత్తావకాయ,

  థాంక్స్.

  @కృష్ణప్రియా,
  మీరందరూ కాదు లక్కీ. నేను లక్కీ. రెండున్నరేళ్ళల్లో ఇంతమంది స్నేహితులని సంపాదించుకోవడం. మామూలుగా ఉద్యోగం నుండి రిటైరవగానే, ఏమిటో ఎందుకూ ఈ జీవితం అనుకోకుండా, నన్ను భరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.

  @krsna,
  ఏం చేయనూ? నాకు మిత్రులందరూ షడ్రసోపేతంగా విందు చేసేస్తూంటే, అందరితోనూ పంచుకోవద్దూ ? ఆ మధ్యన “కొత్తవకాయ” తను తయారుచేసిన దోశ నాక్కూడా “పంపించారు”
  ఇదికూడా అలాగే మరి !

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మీకు introductory letters నేనా ఇచ్చేది? ఎవరు దొరకలేదా స్వామీ, ఏలూరు లో రాగ్ చేయడానికీ ?

  @సుజాతా,

  ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి. ఆరోజు మీకు ఫోను చేసుండకపోతే, ఇలాటి గిఫ్టులు దొరికేవా ?
  “पन्ने पन्नॅ पे लि़खा है पड्नॅवाला का नां “— ఇది నా స్వంత కవిత్వం ….

  Like

 7. చెణుకు తినిపించారు మొత్తానికి, కొత్తావకాయకి కూడా! ఈ పుస్తకాల ముందు నా e-దోసె ఏపాటిది చెప్పండి. కృష్ణుడి ముందు కుచేలుడిలా కుచించుకుపోయా నేనయితే. 🙂

  Like

 8. కొత్తావకాయ,

  ఏమిటోనమ్మా, ఇంటి పేరు ధర్మమా అని, ఈ “మోహం” (చణుకులు అన్నావే అవి!) నుండి తప్పించుకోలేకపోతున్నాను. అదో రిఫ్లెక్స్ యాక్షన్ అయిపోయాయి. ఏమనుకోకు !
  అందరూ స్పోర్టివ్ గా తీసికోరు. థాంక్స్.

  Like

 9. భలే భలే…పుస్తకాలు పంపిస్తే ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు.
  నాక్కూడా సుజాత గారు పుస్తకాలు పంపించారు. నాకున్న రాళ్ళలో మేలు రాయి ఆవిడ.

  ఇంతకి ఆహా…ఓహో, మీసాల సొగసులు రాసినది కూడా పూర్ణానందం గారేనా?

  Like

 10. సౌమ్యా,

  “మీసాల సొగసులు” వ్రాసింది శ్రీ పూర్ణానందం గారే. ” ఆహా..ఓహో ” యాభై ఒక్కమంది వ్రాసిన అఛ్ఛోణీ లాటి హాస్య కథల సంకలనం. ఇంకో పుస్తకం ” పలుకే బంగారం” శ్రీ పూర్ణానందం గారి కుమారుడు శ్రీ భార్గవ రామోజీ ఆకాశవాణి విజయవాడ లో ప్రసారమైన 15 హాస్య (కథ) ప్రసంగాలు. తండ్రిని మించిన తనయుడాయన. ఒక్కో కథా చదువుతూ, మా ఇంటావిడ చేసిన వరలక్ష్మీ ప్రసాదాలు తింటూంటే అబ్బ ! చెప్పలేను ఆ ఆనందం !

  Like

  • అవునా, బావుంది. ఈ పుస్తకాలు నాకు ఎక్కడా దొరకలేదనుకోండి అప్పుడు నేను పూనే వచ్చి పట్టుకెళ్ళిపోతా…ఆ ఆ కంగారు పడకండి. ఫొటోకాపీ తీసుకుని మళ్ళీ మీకిచ్చేస్తా, పుస్తకాల విలువ నాకు తెలుసు! 🙂

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: