బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టైంపాస్…


Kalmadi

   అప్పుడే రమారమి వారం పూర్తయిపోయింది, టపా వ్రాసి. ఏం లేదూ ఒఠ్ఠి బధ్ధకం. టాపిక్కుల్లేక కాదు. బయటకు వెళ్తే టాపిక్కు, పేపరు చూస్తే కావలిసినన్ని టాపిక్కులు, టి.వి అయితే అసలు అడగనే అఖ్ఖర్లేదు. ఏమిటో రాజీనామాలని హడావిడి చేసేశారు, ఏదో వారం అన్నారు, పక్షం అన్నారు ఏమిటేమిటో అన్నారు. నిజమే కాబోసూ, గొడవలన్నీ తగ్గి, ఏదో మనవైపుకి వెళ్ళొచ్చూ అనుకున్నాను. రైళ్ళూ,బస్సులూ ఏ గొడవా లేకుండా నడుస్తాయీ అని. తీరా చూస్తే ఏముందీ, తుస్సుమంది!
రాజీనామాలూ లేవూ, సింగినాదం లేదూ, నోరుమూసుక్కూర్చోమన్నారు. కారణం చెప్పరూ, హాయిగా ఎక్కడికో టూర్ మీదెళ్ళిపోయాడు, ఆ స్పీకర్ కాస్తా. ఆగస్టు 15 దాకా తిరిగి రాడట. ఈలోపులో ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కుంటున్నారు. ఛాన్స్ దొరికితే, తెల్లారేటప్పటికి టి.వి. స్టూడియోల్లో ప్రత్యక్షం చర్చా కార్యక్రమం అంటూ…

   మా కల్మాడీ గారికి జ్ఞాపక శక్తి తగ్గిపోయే ” రోగం” వచ్చిందిట! రోగం ఏమీ కాదూ? తిన్నన్నాళ్ళు కడుపునిండేలా మెక్కి, ఇప్పుడు ఏమీ గుర్తే లేవూ అండానికి సిగ్గూ శరమూ లేదు.పైన ఇచ్చినదానిమీద ఓ నొక్కు నొక్కండి, కల్మాడీ గారి ప్రస్తుత రోగం తెలుస్తుంది.
యడ్డీ గారైతే అడక్కండి, ఆ హెగ్డే మొత్తుకుంటున్నాడు, అందరూ కలిసి గనుల కుంబకోణం లో చేతికొచ్చినంత నొక్కేశారూ అని. తమ పార్టీయే మహా పతివ్రత అన్నట్లు మాట్లాడతారు,బి.జె.పి వాళ్ళు. మరి ఈ యడ్డీ ఎవడంట? ఇవన్నీ తిమింగలాలూ అవీనూ.ఇంక చిన్న చాపల సంగతికొస్తే…
వాడెవడో, రిటైర్డ్ ఆర్ టీ ఓ ట, ఎన్నెన్నో కోట్లు దొరికాయట! అప్పుడెప్పుడో, కిరణ్ కుమార్ క్యాబినెట్ ఏర్పరిచినప్పుడు, ఆయనెవడో మంత్రి, రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖ ఇచ్చారూ అని, అలిగి కూర్చున్నాడు. అప్పుడే వ్రాశాను- ఏ ఆర్.టి.ఓ ని అడిగినా చెప్తాడూ, ఆ శాఖ ఎంత క్యాష్ రిచ్చీ అని!
అసలు ఇవన్నీ చూస్తే బొఫార్స్ ఏ మూలకీ? అంతా చేస్తే అరవై కోట్లు లేదు. దానికే ఏమిటో హడావిడి చేసేశారు ! దాని ధర్మమా అని, వి.పి.సింగు ఓ హీరో అయిపోయారు!

   “మా” టి.వీ. లో ప్రతీ రోజూ పన్నెండింటికి మాఊరి వంట అని ఓ కార్యక్రమం వస్తూంటుంది. ఈవేళ చూశాను, మీకెందుకూ వంటా వార్పూ అనకండి, అదో సరదా, ఏమైనా బావుంటే, మా ఇంటావిడినడగొచ్చు, చేయమని. ఈవేళ్టి కార్యక్రమం లో ఓ పెద్దావిడ ఓ 75 ఏళ్ళుట, శ్రీమతి మద్దూరి లీలావతి గారు– ఆవిడ చేసి చూపించిన వంటకం కంటే, ఆవిడ చెప్పిన కబుర్లు రుచిగా ఉన్నాయి. పదమూడో ఏట పెళ్ళై వచ్చారుట.ఆ యాంకరమ్మాయి తో ఆడేసికున్నారు ! పూర్వకాలం వారు ఇప్పటికీ హాయిగా గిన్నెడు నెయ్యీ ఖాళీ చేస్తారు ,నెయ్యేసికుంటే మేధస్సు పెరుగుతుందిట!. ఎక్కడలేని సూకరాలూ ఇప్పటి వాళ్ళకే. ఏమిటో నెయ్యేసికుంటే వళ్ళొచ్చేస్తుందని, నేతి చుక్క వేసికోరు. మా ఇంట్లో, నేనూ, మా మననవళ్ళూ, మనవరాళ్ళూ తప్పించి ఎవ్వరూ నెయ్యి వేసికోరు. అదేమి చిత్రమో, ఇంట్లో వాళ్ళందరినీ చూసి, మా ఇంటావిడ కూడా మానేసింది!
అసలు నెయ్యి వేసికోకుండా అన్నం ఏమిటండీ, ఊహించుకోడానికే బాగో లేదు. ఉన్నన్నాళ్ళూ హాయిగా కావలిసినదేదో తినక, ఎందుకొచ్చిన గొడవా? బయటి తిళ్ళు మానేస్తే, ఏ ఒళ్ళూ రాదు. మనం వదల్లేము మరి! అయినా సుఖపడే యోగం లేనప్పుడు ఎవరెన్ని చెప్తే లాభం?

   ఆ పెద్దావిణ్ని, యాంకరమ్మాయి అడిగింది-తాతయ్యగారు శ్రీరామచంద్రుడా, శ్రీకృష్ణుడా అని. దానికావిడ చెప్పిన సమాధానం- రెండూనూ(ఇంట్లోనే) అని! ఇంట్లో అధికారం ఎవరిదీ అన్నదానికి సమాధానం,’ అక్కడ అధికారం ఎవరిదీ అని కాదూ, వాళ్ళడిగినవి ఇచ్చేస్తూ, కావలిసినొచ్చినప్పుడు లాక్కుంటూనూ ఉండాలి’ అప్పుడే బాగుండేది అని. ఏదో మన ఇంట్లో ఉండే వాళ్ళు మాట్లాడినట్లనిపించింది. అప్పుడప్పుడు ఇలాటి కార్యక్రమాలూ వస్తూంటాయన్నమాట !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: