బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఉత్తర “రామాయణం”…పిడకలవేట కి కొసమెరుపు…


   ఏ జన్మలో ఏం పాపం/అదృష్టం చేసికున్నానో, తెలుగు సినిమాలన్నీ, నా జీవితంలోకి నడిచొచ్చేసి, నాతో ఆడేసికుంటున్నాయి! మొదటి భాగం లో జగపతిబాబు నటించిన :బంగారు బాబు”, వచ్చేసి, రెండు మూడు రోజులు నా ప్రాణం తీశాడు. ఏదో నా కష్టాలన్నీ, మీ అందరితోనూ పంచుకుందామనుకుని ఓ టపా వ్రాస్తే, నా “శ్రేయోభిలాషులు” అనుకున్న మీ అందరికీ, నవ్వులాటైపోయింది నా బ్రతుకు! ప్రతీవారూ, అక్కడికేదో నేను ఏదో “గ్రంధం” నడిపినట్లు, ఆ “బలహీన క్షణాలకి” సానుభూతి చూపించేవారే. ఆ సానుభూతి వెల్లువ చదివేసి, మా ఇంటావిడ కూడా ఓ టపా వ్రాసేసింది! పైగా అనేవన్నీ అనేసి, మరీ బాగుండదని, చివరలో ” అని అంటాననుకున్నారా” అనోటీ !

   ఏమిటో చిత్ర విచిత్రాలు జరిగిపోతున్నాయి. హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతున్న జీవితంలోకి “కష్టాలు’ వచ్చేశాయి.పోనీ ఏదైనా “ఎమ్నీసియా” యా అంటే, అదీ లేదు.గత ఏణ్ణర్ధం నుంచీ, నా చిన్నప్పటి విషయాలు కూడా వ్రాశానాయె. తెలిసీ, ఏ “పాపం” చేసిన గుర్తూ లేదు. ఏమిటో అంతా గందరగోళంగా అయిపోయింది. మా ఇంటావిడ, నా మెయిల్ కూడా చూడడం మొదలెట్టేసింది!

   రెండు రోజులక్రితం ,ప్రతీ రోజూ ఎలాగూ తలస్నానం చేస్తున్నానూ, పోనీ ఆరోజు, నెత్తిమీదున్న నాలుగు వెంట్రుకలకీ షాంపూ పట్టిద్దామనుకుని, బాత్రూం లో ఏవో రెండు, బాటిల్స్ ఉంటే, షాంపూ అనుకుని నెత్తికి పట్టించేశాను. ఎంతకీ నురగ రాదేమా అని చూస్తే తీరా అది ” లైజాల్” అని తేలింది! గబగబా నెత్తిమీద నీళ్ళోసుకుని, ఎలాగోలాగ క్లీన్ చేసికున్నాను! బయటకి వచ్చి, పూజా పునస్కారం చేసికుంటూంటే, మా ఇంటావిడంటుందీ, ఇంకా ఫ్లోర్ తడిగుడ్డతో తుడవనేలేదూ, ఈ లైజాల్ వాసన ఎక్కడినుంచొస్తోందీ అంటుంది! క్లీనింగ్ అంటే చేసికున్నాను కానీ, రోజంతా ఆ దిక్కుమాలిన లైజాల్ వాసనే! ఎవరైనా, ఏదో డి ఓడ్రెంట్ రాసుకుంటారు. నాది లైజాల్ బతుకైపోయింది! ప్రతీరోజూ, నన్ను చూడగానే చంకెక్కేసే, మా అగస్థ్య కూడా, నన్ను దగ్గరకి రానీయలేదు!

   దేనికైనా ఓ టైము రావాలంటారు! చివరాఖరికి రాత్రి 10.30 కి ఆ మూహూర్తం వచ్చినట్లుంది! మళ్ళీ ఇంకో తెలుగు సినిమా– “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు”. ఇదేం ఖర్మమో, తెలుగు సినిమాలన్నీ నాతో ఆటాడేసికుంటున్నాయి! సెల్ ఫోను ట్రింగ్..ట్రింగ్.. ఫోను తీద్దామంటే ఓ భయం వచ్చేసింది! చూస్తే మళ్ళీ ఆ 13 డిజిట్ల నెంబరు! వోర్నాయనోయ్, మళ్ళీ ఏం తంటా వస్తుందో అని ఫోను తీశాను. ఈసారి మరీ వెంటనే కట్ అయిపోకుండా, వాయిస్ వినిపించింది! ఆ ఫోను పట్టుకుని బాల్కనీ లోకి వెళ్ళాను. ఆ మాట్లాడేదో, మా ఇంటావిడ చెవిన కూడా పడడం ఎందుకూ అని.

   ఎవరో మగ వాయిస్సే. అమ్మయ్య అనుకున్నాను. ఆ పెడిగ్రీల వ్యవహారం ఏదో తేలుతుందిలే అనుకుంటూ. సంభాషణంతా ఇంగ్లీషులోనేలెండి– ఎక్కడనుంచి మాట్లాడుతున్నావు బాబూ అంటే “నేపాల్” అన్నాడు. అదిగో అప్పుడన్నమాట, పైన చెప్పిన సినిమా సీన్ లోకి వచ్చేసింది! హల్లో డాడీ హౌ ఆర్ యూ? (ఈ డాడీ గోలేమిట్రా బాబూ). నాయనా, నీకూ నాకూ పరిచయం ఎప్పుడు నాయనా అంటే, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదూ, ( మళ్ళీ ఇదోటా), ఫొటో మాత్రమే చూశాను అన్నాడు. (ఓరినాయనో). ఏ ట్రంకు పెట్టిలోనైనా చూశాడేమో అనుకుని, అనుమానం తీర్చుకుందామని, ఎక్కడా అన్నాను. “ఫేస్ బుక్” లో అన్నాడు. వార్నీ అక్కడా అనుకుని, ఒక్కసారి ఊపిరి పీల్చుకుని, విడిచాను. మరి అంతకుముందు నాలుగు రోజులూ ఎగశ్వాసా, దిగశ్వాసానూ!!

   మీ ఫొటో మా డాడీ ఫొటో లాగుంది, అందుకోసమని డాడీ అన్నానూ అన్నాడు. పోన్లేనాయనా, నా బ్రతుకు బాగుచేశావూ అనుకుని, ఏం చేస్తున్నావూ అంటే, ఇంజనీరింగు చదువుతున్నానూ అన్నాడు. ఓ అయిదు నిముషాలు మాట్లాడి, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి, ఫోను పెట్టేశాను.
ప్రస్తుతానికి “గండం” గడిచినట్లే. మరీ, ఎప్పుడో ఇంకోడెవడో వచ్చి, నారాయణ దత్ తివారీకి చేసినట్లు డి.ఎన్.ఏ. టెస్టులూ అంటూ అడిగేదాకా !!

Advertisements

8 Responses

 1. మీ లైజాల్ ప్రహసనం బాగుంది. నాకూ అదే చిక్కు వస్తుంటుంది. బత్రూమ్లోకి కల్లజోడు పెట్టుకొని పోలేముకదా! బాటసారి లో హీరో నాగేశ్వర్రావులా తీస్తే
  కనిపించి చావదుకదా! నే వయసులో వున్నప్పుడు తలకి బ్రిల్కీమ్ రాసేవాడ్ని. కనీసం అది రాస్తే జుట్టైనా అనిగి వుంటుందని. మా మాధురికి అప్పుడు
  ఆరేళ్ళుంటాయి! వేళ్ళుకాదండి వయసు ! తెల్లగా వుండే బ్రిల్ క్రీమ్ ను కోల్డ్ క్రీమో ,ఫేస్ క్రీమో అనుకొని ముఖానికి రాసేసుకుంది. మీ కధనం చదవగానే
  ఆ సంఘటన గుర్తొచ్చింది. నవ్వోచ్చింది!

  Like

 2. మొత్తానికి గండం గడిచింది
  అమ్మగారిని మళ్ళీ మరో టపా రాయమనాలి.
  కానీ మీరు ఈ లైజాల్ తరహా భుజాలు తడుముకునే పనులు చేస్తే మీరే గుమ్మడికాయల దొంగ అనేరు జనాలంతా!
  ఇక అంత ప్రశాంతమనమాట!
  హమ్మయ్య…

  Like

 3. “తెలిసీ, ఏ “పాపం” చేసిన గుర్తూ లేదు. “

  ఈ లైనును అండల్ లైన్ చేసుకోండి యువరానర్… అంటే ఈయన తెలిసి ఏదీచేయలేదని ఒప్పుకున్నారు.. కానీ మరో కోణంలో చూస్తె.. తెలియకుండా ఎన్ని చేసారోనని అనుమానాలు కలుగక మానవు.
  కేసు పూర్వాపరాలు పరిశీలించి.. ఒక నాలుగైదు వాయుదాలు నడిపించి.. మీరే దీనికి న్యాయం చేయాలని కోర్టువారిని కోరుతున్నాను. 🙂

  Like

 4. కేసుకు లైజాల్ పూసి… కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఫేస్బుక్క్ లో ఒక చిన్న బస్ట్ ఫొటో చూడగానే అతనికి నాన్నా అని ఎలా అనాలనిపించింది.. అంకుల్ అంటే చాలదా!, అతనికి ఫోన్ నెంబరు ఎలా దొరికింది.. ఒకవేళ దొరికినా.. ఫోన్ చేసి మరీ అంత దూరం నుండి.. డాడ్ అని అనగలిగే చనువు అతనికి ఎక్కడిది? ఇవన్నీ అలోచిస్తే.. డి.ఎన్ ఏ టెస్టులు.. సి.బి.ఐ ఎంక్వైరీలు ఈ కేసులో అవసరమని నేను భావిస్తున్నాను…

  మా పశ్చింగోదారి క్లైంట్ కి న్యాయం జరగాలని ఆశిస్తున్నాను. 🙂

  Like

 5. రాజకీయ నాయకుడి లాగా మాట్లాడుతున్నారు మీరు. చేసిందంతా చేసేసి, నాకేం తెలియదు కావాలంటే CBI తో పరిశోధించండి, ఎంక్వయిరీ కమిటీ వెయ్యండి అంటూ.

  లిజోల్ కి షాంపూ కి తేడా తెలియని అమాయకుడి నని ఎవరిని నమ్మిస్తారు. మేమేం చెవిలో కాలీ ఫ్లవర్ పెట్టుకోలేదు. మీరు బేషరతు గా, చేసిన తప్పు ఒప్పుకొనేదాకా మీ ఇంటిముందు ఆజన్మ భోజన దీక్షకి కూచుంటున్నాను. రేపటి నుంచి.

  Like

 6. యువరానర్ నా క్లైంట్ ఫణి బాబు గారు నిర్దోషని ఆయన మీద అన్యాయంగా ఆరోపణలు మోపబడుతున్నాయని విన్నవించుకుంటున్నాను. ఇక ఆయనపై మోపబడిన అభియోగం ప్రకారం సదరు వ్యక్తి నేపాల్ కు చెందిన వాడని నిరూపితమైంది. కాబట్టి ఇది బంగ్లాదేశ్, నేపాల్ ల ద్వారా ISI నిర్వహిస్తున్న కార్యకలాపాలలో భాగమేనని తేలిపోతోంది. ఈ విషయం తక్షణం ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్ళి నా క్లైంట్ ని నిర్దోషిగా ప్రకటించాలని కోరుకుంటున్నాను.

  “లిజోల్ కి షాంపూ కి తేడా తెలియని అమాయకుడి నని ఎవరిని నమ్మిస్తారు.”
  బులుసు గారి ఈ వాదన నిరాధారమని అలా తేడా తెలియక అపోహ పడే అవకాశం ఉందని మనవిచేస్తూ అందుకు ఆధారాలుగా అప్పారావు గారి స్టేట్ మెంట్ పరిశీలించమని కోరుకుంటున్నాను యువరానర్.

  Like

 7. పోన్లెండి.. సుఖాంతం!

  @ Shankar S, LOL

  Like

 8. @గురువుగారూ,

  నా టపాకి స్పందించినందుకు ధన్యవాదాలు.

  @రెహమానూ,
  ప్రస్తుతానికి ప్రశాంతమే ! మళ్ళీ ఇంకోడెవడో ఎస్.ఎం.ఎస్. పంపేదాకా !!

  @శ్రీనివాసా,

  నీలాటి వకీళ్ళని పెట్టుకుంటే మా ఇంటావిడ పని అయినట్లే !!

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మన దేశంలో “దీక్షలు” ఎంత జనరంజకంగా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము. ఇంక మీవంతు !!

  @శంకర్,

  “ఎంతమంచివాడవో” అని పాట ఎత్తుకోనా ?

  @కృష్ణప్రియా,
  సుఖాంతం అనే భావిస్తున్నాను ప్రస్తుతానికి !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: