బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–backups…


   మా చిన్నప్పుడు, ప్రతీ దానికీ, అది ఏ కారణం చేతైనా పాడైపోతే, ఇంకోటి రెడీ గా ఉండడానికోటుంచుకునే వాళ్ళం. ఆ రోజుల్లో ఈ కంప్యూటర్లూ గోలా ఉండేవి కాదుగా, అందుచేత, “రిజర్వ్” అనేవాళ్ళం. ఇప్పుడైతే అంతా స్టైలూ “బ్యాకప్” అనాలిట. దాంతో నేనూ శీర్షికకదే పేరెట్టేశాను. ఏరాయైతేనేమిటీ పళ్ళూడగొట్టుకోడానికీ? చదివేవాళ్ళకి అర్ధం అయితే చాలు. మళ్ళీ రిజర్వూ గట్రా అంటే, రిజర్వేషన్లమీద టపా అని అపోహ పడడానికి ఆస్కారం ఉంది.అదండి సంగతి…

   ఈ బ్యాకప్పులు, ప్రభుత్వాఫీసుల్లోచూస్తూంటాము. ఇప్పుడు అన్నీ కంప్యూటర్ల మీదే అయినా,దానికి ఓ బ్యాకప్పూ,మళ్ళీ అదెక్కడికైనా మాయం అయిపోతుందని, ఓ ఫొటో కాపీ, దానికో ఫైలూ,దీన్ని పెట్టడానికి ఓ ఫోల్డరూ, ఇవన్నీ దాచడానికి, ఓ రూమ్మూ, దాంట్లో మళ్ళీ ర్యాక్కులూ, ఇవన్నీ సద్దడానికి ఓ క్లెర్కూ, ఆర్డర్లీ,ఆ క్లెర్కు కూర్చోడానికి ఓ టేబిలూ, కుర్చీ , అబ్బో బ్యాకప్పంటే ఇంత హడావిడా అనుకోకండి. మన ప్రభుత్వాలు “వెల్ఫేర్ స్టేట్లు” కదా, ఉద్యోగావకాశాలూ, ఉపాధవకాశాలూ ఎన్ని చూడాలి? ఇన్నిన్ని ఉన్నా, ఏ స్కామ్మైనా బయట పడ్డప్పుడు, కావలిసిన ఫైలు ఛస్తే దొరకదు! ముంబైలో జరుగుతున్న “ఆదర్శ్ సొసైటీ” స్కాం చూస్తున్నారుగా, అదేదో ఫైలు దొరకలేదుట, ఏడాది నుండీ వెదుకుతున్నారు, ఓ కమెటీ వేశారు, మళ్ళీ వాళ్ళూ ఓ ఫైలూ,బ్యాకప్పూ, రూమ్మూ,ర్యాక్కులూ.. వగైరా వగైరా..

   చిత్రం ఏమిటంటే, చాలామట్టుకు ప్రభుత్వాఫీసుల్లో రెండేళ్ళకో, మూడేళ్ళకో ఆ రికార్డు రూమ్ములో short circuit ధర్మమా అని, ఓ అగ్నిప్రమాదం డెఫినెట్ గా జరుగుతూంటుంది. ఇంకో చిత్రం ఏమిటంటే, కంప్యూటర్లూ గట్రాకూడా కాలిపోతాయి. అదీ ” వెల్ఫేర్ స్టేట్” అంటే.ఇక్కడ మాకు ఓ రక్షణ శాఖ వాళ్ళకి జీతాలూ, పెన్షన్లూ ఇచ్చే ఓ ఆఫీసుంది, దాంట్లో గత నలభై ఏళ్ళుగా, ప్రతీ అయిదేళ్ళకీ ఓ అగ్నిప్రమాదం జరుగుతూనే ఉంటుంది !!

   ఆ గొడవంతా వదిలేయండి, నేను వ్రాసేది, ఇంట్లో చిన్న పిల్లలుంటారుకదా, వాళ్ళు ఏ స్కూలుకో వెళ్తూంటారుగా, మరీ కక్కూర్తిగా వాళ్ళు వేసికునే యూనిఫారాలు, రెండే జతలు కొనరుగా, పైగా ఈ రోజుల్లో, తల్లితండ్రులకి, పిల్లలమీద ఎక్కడలేని అభిమానాలూ, ప్రేమలూనూ.దీంతో ఓ నాలుగైదు జతల యూనిఫారాలూ, నాలుగైదు జతల షూలూ, నాలుగైదు జతల టిఫిన్ బాక్సులూ. ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే. ఇద్దరు పిల్లలుంటే ఇంటూ రెండు...అక్కడదాకా బాగానే ఉంది. రోజుకోటి చొప్పున వేసేసి, చివరకి ఆఖరి రోజుకి ఒక్కటే మిగులుతుంది. అన్ని బట్టలూ వారం చివరలో ఉతికేసి,ఇస్త్రీ చేసేసి, వచ్చే వారానికి రెడీ చేసేద్దామనుకుంటారు. పాపం ప్రతీ రోజూ ఉతకడానికీ ఆరేయడానికీ టైమెక్కడిదీ? పొద్దున్నే వెళ్తే రాత్రికే రావడమాయె.

   ఆఖర్రోజు జరిగేదేమిటీ అంటే, ప్రొద్దుటే పిల్లనో పిల్లాడినో లేపేసి, కాకి స్నానం చేయించేసి, చేతిలో ఓ బ్రేక్ ఫాస్ట్ కోసం ఏదో ఒకటి చేసేసి,పెట్టేసి ఓ కుర్చీలో కూలేస్తారు. ఆ నిద్ర మొహంతో తినడంతో, ఆ ప్లేటులో తినేదేదో తను వేసికుని రెడీ అయిన ఫ్రాక్ మీదో, షర్ట్ మీదో ఒలుకుతుంది. మరీ అలా పాడైపోయిన యూనిఫారంతో స్కూలుకి పంపలేరుగా,ఇంకోటి వేద్దామంటే, ఇస్త్రీ చేసి ఉండదూ,ఆదరాబాదరాగా , ఒకసారి వేసికుని ఉతకడం కోసం వదిలేసిన షర్టో, ఫ్రాక్కో ఇస్త్రీ చేసి, వేసేయడం. కాలిపోతోందో అని ఆ పిల్ల ఏడుపులూ, రాగాలూనూ. మరి అప్పటికప్పుదు ఇస్త్రీ చేసి వేస్తే కాలదేమిటీ మరి?

   అదేదో ఆదివారం దాకా ఉంచకుండా, రెండు రోజులకోసారి రెడీ చేసేసి ఉంచితే ఆఖరి నిముషం లో ఈ గొడవంతా ఉండేది కాదుగా. పైగా వర్షాకాలం కూడానూ. బ్యాకప్పులు ఉంచడంతోనే సరిపోదు, వాటిని సద్వినియోగం కూడా చేస్తూండాలి !!

Advertisements

6 Responses

 1. “చాలామట్టుకు ప్రభుత్వాఫీసుల్లో రెండేళ్ళకో, మూడేళ్ళకో ఆ రికార్డు రూమ్ములో short circuit ధర్మమా అని, ఓ అగ్నిప్రమాదం డెఫినెట్ గా జరుగుతూంటుంది.”

  హ హ హ. షరా మామూలుగానే పోస్ట్ అదరగొట్టేశారు మాష్టారూ.

  Like

 2. “చాలామట్టుకు ప్రభుత్వాఫీసుల్లో రెండేళ్ళకో, మూడేళ్ళకో ఆ రికార్డు రూమ్ములో short circuit ధర్మమా అని, ఓ అగ్నిప్రమాదం డెఫినెట్ గా జరుగుతూంటుంది.”

  హ హ హ. షరా మామూలుగానే పోస్ట్ అదరగొట్టేశారు మాష్టారూ.

  (ఎందుకైనా మంచిదని ముందు కామెంట్ కి బ్యాకప్ గా ఇదీ పోస్ట్ చేస్తున్నా 🙂 )

  Like

 3. వెనక బాధ పడకుండా , ముందుర్తి చర్య –బ్యాక్ అప్

  బాగా వ్రాసారు

  Like

 4. @శంకర్,

  నా “మందు” నామీదకే వదిలారు !! ధన్యవాదాలు.

  @మోహన్ గారూ,

  ధన్యవాదాలు.

  Like

 5. అసలీ బ్యాకప్ అనేది మా ఇండస్ట్రీ (సాఫ్వేర్ )నుండే వచ్చింది.
  ప్రాజెక్ట్ కి బ్యాకప్ అంటె మనం చేసే పనిలోనూ పాపంలోనూ.. వేరేవాడినీ ఇరికించడం.. అన్నమాట. ఎప్పుడైనా మనకు సెలవు కావాల్సొస్తే.. ఆ బ్యాకప్ప్ వాడిమెడలో ల్యాప్ టాపు హార్మోనియంలా వేసేసి.. వాయించుకోమనటానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇలా బ్యాకప్ కోసం వచ్చేవాళ్ళు.. ఎదో మనకు వాడిఆస్తి అంతా రాసిచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు… మనకేదో సేవ చేసేస్తున్నట్టు బిల్లప్పులిస్తారు. ఏదన్నా చెప్తునప్పుడు సగం సగం. విని.., ఆఁ… వాడే చూసుకుంటాడులే ఇది మనది కాదుగా అన్నట్టు వుంటారన్నమాట. మనం సెలవులోవున్నప్పుడు.. వాడు హార్మోనియం వాయించాల్సొచ్చినప్పుడు బ్యాకప్ విలువ ఏంటోతెలుస్తుంది. ఒక్కసారి.. మనం మొబైల్ స్విచ్చాఫ్ చేసామనుకోండి.. చెమటలు పట్టి బీ.పీ రేజయ్యి.. అసలు విలువ తెలుసుకుంటాడన్నమాట… ఇవన్నీ కార్పొరేట్ బతుకుచెడ్డలులేండి. 🙂

  మీ టపామాత్రం ఎప్పటిలాగే అదిరింది.

  Like

 6. శ్రీనివాసా,

  మారోజులైతే రిజర్వ్ అనే వ్రాసేవాడినిగా. మీ కుర్రకారు ధర్మమే నాయనా, నా భాష కూడా బాగుపడుతోంది !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: