బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–indispensability….


   ప్రపంచం లో ప్రతీవాడూ తను లేకపోతే ప్రపంచం ఏమైపోతుందో అనే అపోహలోనే ఉంటాడు. చిన్నప్పుడు, నెహ్రూ గారు లేకపోతే దేశం ఏమైపోతుందో అనే బాధపడేవారు. ఆయన దారిన ఆయన పోయారు, కానీ దేశానికేమైనా ఐపోయిందా? ఇంకోళ్ళొచ్చారు. వీళ్ళు పోతే మళ్ళీ ఇంకోళ్ళు. మహ అయితే ఓ నెలరోజులు అయ్యో అనుకుంటారు.వచ్చిన గొడవల్లా ఏమిటంటే, మీడియా – ఆరోజుల్లో పేపర్లూ, ఈ రోజుల్లో ఎలెక్ట్రానిక్ మీడియా, ప్రతీవాడికీ ఎక్కడలేని ప్రాముఖ్యం ఇచ్చేసి, వాళ్ళె లేకపోతే ఎలాగా, వాళ్ళింతటివాళ్ళూ, వాళ్ళంతటివాళ్ళూ అని ఓ పేద్ద ఇమేజ్ ఏర్పరిచేస్తారు. మనమూ నిజమే కాబోసనుకుంటాము.

   ఆ గొడవంతా వదిలేయండి, ఎవడో పోతాడు, ఇంకోడెవడో వస్తాడు, మనకి ఒరిగేదేమీ లేదు. వాళ్ళ గొడవెందుకు? నేను చెప్పేది, మనలాటి సామాన్యుల గురించి.ఏదో ఆఫీసులో పని చేస్తున్నాడనుకోండి, వాడు రిటైరయ్యే రోజున ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఓ భగవద్గీతా, ఓ గొడుగూ చేతిలో పెట్టేసి, నీఅంతటివాడు లేడు, నువ్వెళ్ళిపోయిన తరువాత మాకు దిక్కెవరూ
అసలు ఆ వచ్చేవాడు మీ అంత సిన్సియర్ గా పనిచేస్తాడో లేదో, we will miss you very badly…blah blah… అని ఏవేవో చెప్పేటప్పటికి, ఈ ప్రాణి నిజమే కాబోసనుకుంటాడు. ఎలాగూ రిటైరౌతున్నాడు కదా, ఓసారి ఉబ్బేస్తే, రామా కృష్ణా అనుకుంటూ కూర్చుంటాడు ఇంట్లో, అని వాళ్ళందరి ఉద్దేశమూనూ! కానీ ఈ పెద్ద మనిషి, ఆ స్పీచ్ లన్నీ సీరియస్ గా తీసేసికుని, కనిపించినవాడికి అడిగినా అడక్కపోయినా, ” నేను మొన్న ఇదివరకు పనిచేసిన ఆఫీసుకెళ్ళానండీ. అసలు రూపమే మారిపోయింది. ఒక్కళ్ళూ సీట్ లో ఉంటేనా? నా రోజుల్లో ఎంత క్రమశిక్షణా, ఎవ్వడూ సీట్లనుండి కదిలేవాడు కాదు… వగైరా వగైరా…”.అక్కడికేదో ఈయనున్నప్పుడు పన్లన్నీ టైముకే పూర్తవుతున్నట్లు పోజెట్టేస్తాడు. అమ్మయ్యా ఓ గొడవొదిలిందిరా బాబూ అనుకుని ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సోదంతా వింటున్నవాడు, ఇదివరకెప్పుడో ఆయన కింద పనిచేసేవాడు. దాంతో ఇక్కడ ఇరుక్కు పోయాడు. బయట పడాలంటే University of Freshology కి వెళ్ళి ఓ Sprite తాగాల్సిందే !!

   అసలు ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, పొద్దుటే పెపరు తెచ్చుకోడానికి వెళ్తూంటే, నేను ఉద్యోగంలో ఉండేటప్పుడు, నాతో పనిచేసిన ఓ క్లర్క్ కనిపించి, “1987 నుంచీ పని చేస్తున్న నన్ను ఇంకో సెక్షన్ కి ట్రాన్స్ఫర్ చేసేశారూ, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి,అంత సీనియర్స్ ని మార్చేయడంలో ఉండే నష్టమేమిటో etc..etc..” అని నన్ను హోరెత్తించేశాడు. మరీ పరగడుపునే Sprite తాగలేదనుకోండి, నా అదృష్టం కొద్దీ, డ్యూటీకి టైమైపోవడంతో తనే వెళ్ళిపోయాడు. బతికాను! నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు, చాలాసార్లు అతన్ని ట్రాన్స్ఫర్ చేయమని ప్రపోజల్స్ వచ్చినా,నేనుండే మూడేళ్ళకీ మళ్ళీ ఇంకో కొత్తవాడితో ఎలాగా అని నేనే మా బాస్ కి చెప్పి ట్రాన్స్ఫర్ ఆపేవాడిని. అంతేకానీ ఇతనులేకపోతే పనాగిపోతుందని కాదు. మరీ ఇవన్నీ చెప్పి తన మనస్సు పాడిచేయలేము కదా!

   అసలంతదాకా ఎందుకూ, ఇంట్లోనే ఇంటిపెద్ద పోతే పనులేమైనా ఆగిపోతాయా ఏమిటీ? ఓ నాలుగు రోజులు బాధపడి, పన్నెండో రోజుకి, ఆయన ఫుటోకి ఓ దండేసి, మహ అయితే ఓ అగరొత్తి గుచ్చుతారు! ముందు పదకొండు రోజులూ ఓ దీపంలాటిది పెడతారు. అదైనా ఆ పెద్దాయన భార్య ఇంకా బ్రతికుంటేనూ, ఆవిడ మనస్సు బాధపెట్టడం ఎందుకూ అని.ఆవిడ లేకపోతే,అసలు గొడవే ఉండదు. ఆ పదిరోజుల్లోనే, ఏ గయో వెళ్ళి చేసేవో చేసేస్తే, ఇంక ప్రతీ ఏడాదీ తద్దినాలు కూడా పెట్టుకోనఖ్ఖర్లేదుట! మరి ఆపెద్దాయన indispensability ఏ గంగలోకి వెళ్ళిందిట? నా ఉద్దేశ్యం, పోయినవాళ్ళందరినీ అగౌరవపరచాలనీ, ఉన్నవాళ్ళ సెంటిమెంట్లు హర్ట్ చేయాలనీ కాదు. ఈ indispensability అనే అపోహలో ఉన్నవారి గురించి. అలాగని మరీ ఫిలాసఫీ అనుకోకండి. నాకు ప్రవచనాలు వినడం వరకే సీమిత్!

    Be realistic!! మరి ప్రపంచంలో ప్రతీవాడూ ఎవడికి వాడు indispensable అనుకోడానికి ఇదేమైనా సతీసహగమనం రోజులా ఏమిటీ? భర్త పోగానే, భార్యకూడా చితెక్కే రోజులు కావు. ఎవడికి తెలుసూ, ఈ పెద్దమనిషి పోవడం వల్లే ఆవిడ సుఖపడుతోందేమో? తిండితినడం ఆపుతారా,పన్లకెళ్ళడం ఆపుతారా,చదువులాపుతారా, అన్నీ సలక్షణంగా జరుగుతూనే ఉంటాయి. ఈ indispensability అనే ఫీలింగు ఓ తాయిలం లాటిది. చిన్నపిల్లాడు ఏడిస్తే పెడతాము అలాగన్నమాట. అస్తమానూ ఏడుపుమొహం పెడితే చూడలేక, మన పై ఆఫీసరు మనచేత పని చేయించుకోడానికి పెట్టే తాయిలం. అంతే కానీ, ఆ విషయం మరీ మనస్సుకు పట్టించేసికుని, ఓ పేద్ద పోజెట్టేసికుంటే ఎలాగా?

   ప్రపంచంలో Most indispensable అనేవి ఉన్నాయా అంటే అవి ఆ పంచభూతాలూనూ- ఎందుకంటే వాటికి రిప్లేస్మెంటు లేదు కాబట్టి! అవే కనుక లేకపోతే, కథ కంచికీ, మనం భూతం గానూ!!…..

Advertisements

6 Responses

 1. True

  Like

 2. ఇండియన్ మినర్వా,

  థాంక్స్.

  Like

 3. నేనే లేక పోతే, నా అంత వాడే లేదు, అనుకుంటే అదో తుత్తి !

  Like

 4. మోహన్ గారూ,

  అదీ నిజమే !!

  Like

 5. 🙂 అవును. మొదట్లో నేనూ..అయ్యో నేను లేకపోతే ఈ ప్రాజెక్ట్ గతేంటి అని అనుకునేదాన్ని. సెలవ పెట్టటానికి కూడా సంకోచించేదాన్ని. తర్వాత తర్వాత అర్థమైంది. ఎక్కడ ఎవ్వరు లేకున్నా ప్రపంచం నడుస్తూనే ఉంటుందని. I really liked this post.

  Like

 6. కృష్ణప్రియా,
  ప్రపంచంలో ప్రతీవారి అపోహ ఇదే కదా. వారూ వీరూ అనే తేడాలేదు !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: