బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–We miss you dear….


   ఈవేళ ప్రొద్దుట, చాలా రోజుల తరువాత పోస్టాఫీసు కి వెళ్ళాను. ఏమిటో దగ్గర చుట్టాన్ని చాలా రోజుల తరువాత కలిసిన ఆనందం కలిగింది. ఇప్పుడంటే ఎక్కడ చూసినా ఈ మెయిళ్ళు, ఎస్.ఎం.ఎస్ లూ, సెల్లల్లో చొళ్ళు కబుర్లూ కానీ, 90 ల దాకా మనకి ఈ పోస్టల్ డిపార్ట్మెంటే కదా గతి! చిన్నప్పటి జ్ఞాపకాలు కోకొల్లలు. ప్రపంచం లో ఆప్త బంధువెవడైనా ఉన్నాడా అంటే, మనకి ఉత్తరాలిచ్చే పోస్ట్ మాన్నే ! ఆరోజులే వేరు.ఊళ్ళో ఉండే పోస్టాఫీసు కి వెళ్ళిరావడమంటే
అదో అనుభూతీ! మామూలుగా, సంవత్సరాల తరబడి,వీధికి ఒకే పోస్ట్ మానుండేవాడు. దానితో ఏమయ్యేదీ, మనల్ని కిటికీలోంచి,చూశాడా, బయటకి వచ్చేసి, “అబ్బాయి గారూ..” అంటూ, మన ఉత్తరాలేవో చేతిలో పెట్టేసేవాడు.బయట వరండాలో వెయిట్ చేయాలే కానీ, ఛస్తే లోపలకి అడుగెట్టనిచ్చేవారు కాదు.

   మాకు దగ్గరలో, కాలేజీ ఉండేదిగా, అక్కడ ఓ పోస్టాఫీసుండేది. పేరి బుల్లబ్బాయి గారని ఒకరుండేవారు. పోస్టాఫీసుకి ఒకటే రూమ్ముండేది. శలవలొచ్చినప్పుడల్లా, అక్కడకి వెళ్ళి కూర్చునేవాడిని.ఆయన చేసే పనులు చూడ్డానికి బలే ఉండేవి. ఎవరైనా మనీఆర్డరు పంపడానికి, వచ్చేరనుకోండి, డబ్బులు తీసికుని, ఆ మనీ ఆర్డరు మీద, ఓ కలం పుచ్చుకుని, ఎర్ర సిరాలో ముంచి, ఓ పేద్ద అంకె వేసేవారు.తరువాత, ఓ రసీదు పుస్తకం తీసికుని దాని లో ఓ రెండు మామూలుగానూ, ఒకటి తిరగేసీ, కార్బన్ పేపర్లెట్టి పేరూ చిరునామా వ్రాసేవారు. అలా తిరగేసి కార్బన్ పేపరు ఎందుకు పెట్టేవారో తెలియదు.అలాగే రిజిస్టరీలూ, ఎవరో వచ్చి స్టాంపులు అడగ్గానే డ్రాయరు సొరుగులోంచి ఓ పుస్తకం తీయడం, అందులోంచి స్టాంపులు తీయడం. ఇంక పోస్టాఫీసులో వేసే స్టాంపు, దాని ప్యాడ్డూ నల్ల….గా ఉండేవి.అదంతా బలే తమాషాగా ఉండేది.

   ఇంక మనకి వచ్చిన కవర్లమీద అంటించిన స్టాంపులు కలెక్టు చేయడం ఓ సరదా!ఒక్కొక్కప్పుడు, ఒక్కో స్టాంపు మీద పోస్టల్ వాళ్ళ ముద్ర పడలేదనుకోండి, దాన్ని జాగ్రత్తగా చింపి దాచడం, మనం ఎప్పుడైనా ఉపయోగించుకోచ్చని!గవర్నమెంటాఫీసుల్లో, సర్వీసు స్టాంపులనుండేవి.అవి ఆఫీసులకి మాత్రమే పరిమితం.మనకొచ్చిన ఉత్తరాల్ని, ఓ స్టీలు తీగకు గుచ్చడం,అసలు జీవితంలో మర్చిపోగలమా? అసలా ఉత్తరాల్లో ఉండే ప్రేమా అభిమానం, మళ్ళీ రమ్మంటే ఎక్కడ వస్తుందీ? శుభలేఖలైతే అన్ని కార్నర్స్ లోనూ పసుపు రాయడం, ఏ అశుభ వార్తో అయితే నల్ల రంగు పూయడం, పైగా ఇలాటి ఉత్తరాలు చదివేసి చింపేయాలిట.తరువాత్తరువాత గవర్నమెంటాఫీసుల్లోనూ ఈ సర్వీసు స్టాంపులు మానేసి, ఏదో ఫ్రాంకింగు మెషీన్ అని మొదలెట్టారు.

   నేను ఓ రెండు మూడు సంవత్సరాల క్రితం, సరదాగా, శ్రీ రాహుల్ బజాజ్ గారికీ, నందన్ నిలేకనీ గారికీ, ఇన్లాండ్ లెటర్ లో వ్రాశాను. మెయిల్ పంపొచ్చు, కానీ ఇందులో ఉండే ఆనందం, సంతోషం ఆ ఈమెయిల్లలో వస్తుందా? అదే సంగతి వ్రాశాను. ఇద్దరూ జవాబిచ్చారు!ప్రస్తుత విషయానికొస్తే, ఈవేళ పోస్టాఫీసుకి వెళ్ళినప్పుడు, ఓ ఇన్లాండ్ లెటరూ (2.50), ఓ పోస్ట్ కార్డూ ( 50 పైసలు) ఇమ్మన్నాను. అక్కడి స్టాఫ్ నవ్వి, పిల్లలకి చూపించడం కోసమా సర్ అన్నాడు! నిజమే కదా, అసలు ఎవరైనా ఈ రోజుల్లో ఉత్తరాలు వ్రాస్తున్నారంటారా? నా ఉద్దేశ్యం నగరాల్లో. అలాగని గ్రామాల్లో ఏదో వ్రాసేస్తున్నారని కాదు, అక్కడా టెలిఫోన్లూ, సెల్ఫోన్లూ, ఇంటర్నెట్టులూ! వీటిలో అసలు “ప్రాణం” అనేదుంటుందా?

    1972 లో మా ఇంటావిడ, పెళ్ళై వచ్చిన కొత్తలో, వాళ్ళ అత్తగారికి, అంటే మా అమ్మగారికి ఓ ఉత్తరం వ్రాసి, ఎడ్రస్ వ్రాసి పోస్ట్ చేయమని నాకిచ్చింది. అప్పటినుండీ దానికి ఎడ్రసూ వ్రాయలేదూ, పోస్టూ చేయలేదు! అదే పైన పెట్టిన ఫుటో! ఆరోజుల్లో కోడళ్ళు అత్తగార్లకి ఉత్తరాలు వ్రాసేవారు. ఈ రోజుల్లో ఫోన్లు చేయడానికే టైముండడం లేదూ అది వేరే విషయం!1972 లో ఇన్లాండ్ లెటర్ 15 పైసలు+ 5 పైసలు బంగ్లా దేశ్ నుంచొచ్చిన కాందిశీకుల కోసం. మరి ఇప్పుడో ?
అయినా ఈ ఇన్లాండ్ లెటర్లు ఇదివరకే బావుండేవి. ఓ నిలువు మడత పెట్టడం, దాన్ని అడ్డంగా మడిచి, ఓ ఫ్లాప్ అంటించడం. ఇప్పుడో ఫస్ట్ ఫోల్డంటాడు, సెకండ్ ఫోల్డంటాడు. సరీగ్గా తెరవకపోతే, అది కాస్తా మూడు ముక్కలవుతుంది!
ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా సరే, ఆరోజుల్లో ఉండే ఉత్తరాలకున్న అందం, ఆ స్పర్శ, మళ్ళీ రమ్మంటే వస్తుందా? We miss you dear !!

Advertisements

4 Responses

 1. ఒక్కొక్కప్పుడు, ఒక్కో స్టాంపు మీద పోస్టల్ వాళ్ళ ముద్ర పడలేదనుకోండి, దాన్ని జాగ్రత్తగా చింపి దాచడం, మనం ఎప్పుడైనా ఉపయోగించుకోచ్చని!

  🙂 ఇప్పటికీ నేను అదే చేస్తున్నాను. పోస్టు ద్వారా లావాదేవీలు తక్కువైపోయినా పనికి వస్తుందని ముద్రపడని స్టాంపులు తీసి ఉంచుతున్నాను. మిగతా విషయాల సంగతేమో కాని ఈ విషయంలో మటుకు ఇలా కక్కుర్తి పడుతూనే ఉంటాను.

  Like

 2. మురళీ మోహన్ గారూ,

  చెప్పుకోరు కానీ, చాలా మంది ( “ఇట్లు మీ విధేయుడు” తో సహా) చేసేది ఇదే !

  Like

 3. Excellent Blog !!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: