గవర్నమెంటు ఉద్యోగంలో ఉన్నంతకాలం, మాకు ఆరోజుల్లో వచ్చే జీతాలతో, ఏదో అత్యావశ్యకమైన వస్తువులు తప్పించి, మరీ లగ్జరీ వస్తువులవైపు దృష్టి మళ్ళేది కాదు. అవే లగ్జరీ వస్తువులు ఈ రోజుల్లో నెసెసిటీస్ అయిపోయాయి, అది వేరే సంగతి.ఆరోజుల్లో, ఓ ఫ్రిజ్ కొనాలంటే, ఏ ఆల్వినో, గాద్రెజో,కెల్వినేటరో. అదికూడా 165 లీటర్లు. ఎవరింట్లోనైనా ఫ్రిజ్ ఉందీ అంటే, వాళ్లు ఓ క్లాసు పైన ఉండేవారు. ఫ్రిజ్ కొన్నారు కదా అని, దాన్నిండా ఏవేవో పెట్టేశారనుకోకండి, మా బాస్ ఒకాయనుండేవాడు, ఫాక్టరీ లో ఆఫీసరూ,మరీ సైకిలు మీదొస్తే బావుండదుకదా, అందుకోసమని, ఫాక్టరీ వాళ్ళిచ్చే లోన్ తో ఓ స్కూటరూ, అలాగే ఏదో తిప్పలు పడి ఓ ఫ్రిజ్జూ మొత్తానికి కొనేశాడు. ఫాక్టరీకి వెళ్ళి రావడానికి, ప్రభుత్వ వాహనం ఉండేది. ఎంత చెప్పినా, మనకి బ్రిటిష్ వాళ్ళిచ్చిన వారసత్వం ఏమిటయ్యా అంటే, ఇదిగో ఇలాటివే.గవర్నమెంటులో ఆఫీసర్లకీ, మిగిలినవాళ్ళకీ ప్రోటోకాల్ తేడాలూ, వాళ్ళకి ఎక్కువ ఫ్రింజ్ బెనిఫిట్లూ వగైరా వగైరా… ఇలా వ్రాసుకుంటూ పోతే, కొంతమందికి నచ్చకపోవచ్చు.అప్పుడెప్పుడో, విదేశాలకెళ్ళొచ్చిన వారిమీద, నాకు జెలసీ అన్నాడో ప్రబుధ్ధుడు, అలాగే, నేను క్లాస్ ఒన్ ఆఫిసరు కాలేదని జెలసీ అని అన్నా అనొచ్చు.ఎవరి అభిప్రాయం వారిది!ఎక్కడో మొదలెట్టి ఎక్కడకో వెళ్ళాను,ఎప్పటికప్పుడనుకుంటూంటాను, ఏ టాపిక్ మొదలెడితే దానిమీదే వ్రాయాలని, కానీ మధ్యమధ్యలో పిట్ట కథలొచ్చేస్తూంటాయి. Please bear with me.. ఫ్రిజ్జి గురించి కదా చెప్తున్నానూ, ఆయన ఫ్రిజ్ నిండా, ప్లాస్టిక్ కూరలూ, పళ్ళూ నింపేవాడు! నిజం, మేము కళ్ళారా చూశాము!
ఈ టపా కి పెట్టిన పేరు చదివారుగా, క్రమక్రమంగా ఎప్పటికో అప్పటికి, మనం అంటే ఎస్పెషల్లీ నాలాటివాళ్ళు,చదువూ సంధ్యా అంతగా అబ్బక, మన ప్రభుత్వ రూల్స్ ప్రకారం, ‘ఆఫీసరు’అవలేకపోయిన– అలాగని పేద్ద చదువులు చదవకపోయినా, ప్రివిలేజ్డ్ ‘క్లాసు’ లో ఉండడం వలన ఆఫీసర్లూ అయ్యారు, ‘కొంతమంది’ అదృష్టవంతులు! అది వారు చేసికున్న అదృష్టం.No complaints ! దీనితో ఏమయిందీ,మనకి అంత తాహతు లేదేమో అనుకుని, ఏదో ఉడిపీ హోటళ్ళకీ, మామూలు కిరాణా షాప్పులకీ సీమిత్ అయిపోయాము. ఈ కిరాణా షాప్పులెందుకయ్యా అంటే, అరువిచ్చేవాడు కాబట్టి. ఓ పద్దుపుస్తకంలో రాసేసికుని, కావలిసినవేవో తెచ్చుకునేవాళ్ళం. నెలాఖరుకి, కట్లు పోగా చెతికి వచ్చిన డబ్బులతో, కిరాణా వాడికీ, పాల వాడికీ ఇచ్చుకోవడం.ఇవి కాకుండా, పిల్లల స్కూళ్ళూ, బట్టలూ, పుస్తకాలూ , పండగలూ పబ్బాలూ, ఏ నెలకో రెండు నెలలకో ఓ సినిమా, ఇవండీ ప్రయారిటీస్! ఏదో నా అదృష్టం బాగుండి, పిల్లల స్కూలు చదువులు, మేము వరంగాం లో ఉన్న సమయంలో పూర్తయ్యాయి. అక్కడ అంత ఖర్చుండేది కాదు.అసలంటూఏమైనా ఉంటే కదా ఖర్చుపెట్టడానికీ?
ఇంకో అదృష్టమేమంటే, అప్పటికింకా ఈ ఆర్ధిక సంస్కరణలూ అవీ రాలేదు కాబట్టి, ఒక విధంగా బ్రతికి పోయాము!92-93 తరువాత మెల్లి మెల్లిగా, ప్రతీ రంగంలోనూ కాంపిటీషన్ మొదలయి, ప్రతీ వస్తువుకీ, ఓ అరడజను బ్రాండులు రావడం మొదలయింది.మొదట్లో ఈ వస్తువులన్నీ పెద్ద పేద్ద షాపుల్లో ( వాటినే ఇప్పుడు మాల్సో, సింగినాదమో అంటున్నారు!).ఏ మెట్రో నగరాలకి వెళ్ళినప్పుడో చూసే వాళ్ళం ఈ స్పెన్సర్లూ, అవీనూ.బెంగుళూరు వెళ్ళినప్పుడు ( మా అమ్మాయి మొదటి ఉద్యోగం) మొట్ట మొదటిసారి షాపర్స్ స్టాప్ చూసి, నోరెళ్ళబెట్టి చూస్తూ నుంచున్నాను! ఏ కిరాణా కొట్టులోనైనా ఓ వస్తువు ఖరీదు మరీ ఎక్కువ చెప్తే, ” అదేమిటోయ్, మరీ స్పెన్సర్ రేటు చెబుతున్నావూ?” అనేవారు.నా ఉద్దేశ్యమేమిటంటే, ఖరీదైన వస్తువుని స్పెన్సర్స్ రేటుతో పోల్చేవారు.
రిటైరయే టైముకి, పిల్లల పెళ్ళిళ్ళూ పూర్తయ్యాయి, ఓ కొంపా అముర్చుకున్నాము,ఏదో మరీ మధ్యతరగతి అనుకోకుండా, పిల్లల ఉద్యోగాల ధర్మమా అని, కొద్ది కొద్దిగా ఆ ” మధ్య తరగతి వలయం” లోంచి, అప్పుడప్పుడు బయట పడేవాళ్ళం. అదైనా పూర్తిగా కాదు, ఎప్పుడైనా పిల్లలు ఏ ఫైవ్ స్టార్ హొటల్ కైనా తీసికెళ్తే,” ఏదో మామూలు హొటల్ కి వెళ్తే సరిపోయేదిగా..” అంటూ నస పెట్టేవాడిని!కాలూ, చేయీ ఒకచోటుండదుగా నాకూ, క్రమక్రమంగా, నేనూ స్వయంగా, మిస్టరీ షాపింగుల ధర్మమా అని, గత రెండేళ్ళుగా, left,right,centre ప్రతీ మాల్ లోకీ వెళ్ళడం,ప్రతీ వాడితోనూ interact అవడం. దీనితో ఏమయిందీ అంటే, నామీద నాకో విశ్వాసం ఏర్పడింది.ఎక్కడైనా ఎవరితోనైనా డీల్ చేసే నమ్మకం వచ్చింది.
అక్కడికి, నేనేదో గ్రేట్ అయిపోయానని కాదు, ఇదో బ్రహ్మ విద్యేమీ కాదు. వీటికి ట్రైనింగులేమీ అఖ్ఖర్లేదు. Just self confidence.నాలాటివాడే హాండిల్ చేయకలిగినప్పుడు, నాకంటే, ఎక్కువ అనుభవమూ, వాక్పటిమా ఉన్నవాళ్లకి ఇది చాలా సులభం. ఒక్కసారి మన మధ్యతరగతి shell లోంచి బయటకు రావాలి అంతే!ప్రతీవారిలోనూ అంతర్లీనంగా ఈ గుణం ఉంది.బయటకు తీయాలి బస్! ఏదో సాదాసీదా బట్టలు వేసికున్నామూ, అలాటి ఫాషనబుల్ యేరియాల్లోకి వెళ్తే నవ్వుతారేమో, అక్కడ సేల్స్ చేసే అమ్మాయిలూ,అబ్బాయిలూ సూట్లలో ఉంటారూ అనుకోవద్దు. వాళ్ళు ఆ కొట్టు యజమానిస్తున్నాడు కాబట్టి వేసికుంటున్నారు, వాళ్ళు మనకంటే ఏమీ పొడిచేయలేదూ, అని ఒక్కసారనుకుని చూడండి. మీకే తెలుస్తుంది.
.
Filed under: Uncategorized |
తరం మారుతోంది.
స్వరం మారుతోంది.
అవసరం కూడా మారుతోంది.
LikeLike
బోనగిరీ,
అవును కదూ !!!!
LikeLike