బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–డేట్ ఆఫ్ బర్తులూ కన్యూజన్లూ….


    ఈ మధ్యన మన ఆర్మీ ఛీఫ్ జనరల్ సింగ్ గారి డేట్ ఆఫ్ బర్త్ మీద ఒక దుమారం లేచింది. వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, ఆయన మొదట్లో 1950 లో పుట్టానని, చెప్పారుట, సర్వీసు రికార్డుల్లో 1951 అన్నారుట. ఎవడో పనీ పాటు లేనివాడు ఈ గొడవంతా బయటపెట్టాడు. మొదట ఇచ్చిన తేదీ ప్రకారం ఆయన క్రిందటేడాదే రిటైరవాలనీ, అన్యాయంగా ఇంకో డేట్ ఇచ్చి, ఇంకో సంవత్సరం ఎక్కువ సర్వీసు చేస్తున్నారనిన్నూ ప్రస్తుత సమస్య. ఆయనకి ఎన్నేళ్ళూ అనేది మనకనవసరం. వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు, ఇందులో మనకి ఒరిగేదేమీ లేదు. ఆయన ఇంకా కొన్నాళ్ళున్నా, మనకి వచ్చే నష్టమూ లేదూ, వెళ్ళిపోతే వచ్చే లాభమూ లేదు. ఎలాగూ రిటైరయిన తరువాత ఎక్కడో గవర్నర్ గా వెళ్ళి,హాయిగా ఉంటాడు !

ఇప్పుడు నేను వ్రాసేది, మనలాటి ఆంఆద్మీల గురించి. 1960 ల ముందుగా పుట్టిన వారికి, అదీ మన ఆంధ్ర దేశం లో , పిల్లో పిల్లాడో పుట్టగానే, మున్సిపల్ ఆఫీసులకెళ్ళో పంచాయితీ ఆఫీసులకెళ్ళో registration వగైరాలుండేవి కావు.ఉన్నా, అలా సిన్సియర్ గా చేసిన దాఖలాలు లేవు! ప్రతీ వాడూ హాస్పిటళ్ళకెవడెళ్ళేవాడూ? ఏదో ప్రతీ పురిటికీ వచ్చే ఆస్థాన మంత్రసాని రావడం, పురుడు పోయడం, బొడ్డు కోయడం, తనకి వచ్చే బహుమతీ ఏదో తీసికుని వెళ్ళడమూనూ ! అయిదో ఏడొచ్చిన తరువాత బళ్ళో వేయడం, ఆడుతూ పాడుతూ పెద్ద స్కూల్లోకి వెళ్ళడం,అక్కడ ఫిఫ్త ఫారం లోకి వచ్చినప్పుడు, ఓ బుక్కుండేది-SSLC Book అని.అప్పుడు అవసరం అయేది, మన డేట్ ఆఫ్ బర్త్.పిల్లలకి ఉద్యోగంలో చేరినప్పుడు, ఎక్కువ సర్వీసుంటుందని,అప్పుడప్పుడు తక్కువెయ్యడమో, మళ్ళీ కాలేజీల్లో ప్రవేశం దొరకదేమోనని ఎక్కువెయ్యడమో జరిగేది. వీటివల్ల ఉపయోగాలూ ఉండేవి, నష్టాలూ ఉండేవి.

మరీ అంత చదువురాని తల్లితండ్రుల్ని, స్కూలు వాళ్ళు, మీ అబ్బాయి/అమ్మాయీ ఎప్పుడు పుట్టారూ అని అడిగితే, ” ఆయ్ గోదారికి పెద్ద వరదలొచ్చినప్పుడు పుట్టాడనో, లేకపోతే, ఏ గాలివానొచ్చినప్పుడో పుట్టాడనో’ చెప్పేవారు, అక్కడికేదో వరదల్లో కొట్టుకొచ్చిన శాల్తీ అన్నట్లు! ఇంక ఆ స్కూలు వాళ్ళే ఉజ్జాయింపుగా ఏదో ఒకతేదీ వేసేసి, వీడికి ఓ అస్థిత్వం కలిపించేవారు! కొద్దిగా మధ్యతరగతి వారిళ్ళల్లో, జాతకచక్రాలూ వగైరా వేయించే అలవాటుండేది కదా, అలాటి చోట్ల మాత్రం, ఇంట్లో వాళ్ళ దగ్గర తిథి, వార నక్షత్రాలతో సహా ఉండేవి.ఫలానా సంవత్సరం అని కూడా ఉండేది.

ఆరోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష కెళ్ళడానికి, ఈ రోజుల్లోలాగ 18 ఏళ్ళు నిండాలీ అనే రూలుండేది కాదు. అదేదో విద్యాశాఖాయన ఓ exemption certificate ఇచ్చేస్తే, మన దారిన మనం చదువూ సంధ్యా నిరాటంకంగా సాగించేయొచ్చు! ఈప్రకారమే నేను 14 ఏళ్ళకి ఎస్.ఎస్.ఎల్.సీ, 18 నిండకుండా పూణే లో ఉద్యోగానికీ వచ్చేశాను! ఏదో జ్ఞాపకం వచ్చిందేదో, ఫిబ్రవరీ 1945 అని వేయించేశారు, మా నాన్నగారు,అసలు డిసెంబరు 1944 అయితేనూ. రెణ్ణెల్ల తేడా అంతే! నాకొచ్చిన నష్టమేమిటయ్యా అంటే, 1962 లోనే చేరవలసిన ఉద్యోగానికి, ఇంకో రెణ్ణెల్లు 1963 ఫిబ్రవరి దాకా ఆగవలసి వచ్చింది. దానివలన ఏమైనా ఎడ్వాంటేజీలొచ్చాయా అంటే, వచ్చాయి మరి, 1962 బాచ్ వాళ్ళందరినీ, పూనా లో ఉంచకుండా,భండారా అని నాగ్పూర్ దగ్గరకి పంపేశారు. 1963 కాబట్టి, తరువాతి 20 ఏళ్ళూ పూనా లోనే ఉండే యోగమూ పట్టింది.దేనికైనా ఘటననేదొకడుండాలండి బాబూ.ఏది జరిగినా మన మంచికే అనుకుంటే పోలేదూ ?

1950 ల్లో ఆంధ్రదేశం లో పుట్టిన వారికి,అందరి విషయమూ నాకు తెలియదూ, నాకు తెలిసిన ఒకాయనకి, 1953 బదులుగా,1951 వేయడం వలన, ఆయన ఇంకో రెండేళ్ళు కాకుండా, ఈ సంవత్సరమే రిటైరవమన్నారు. ఏమిటి మాస్టారూ, మీగురించి పుస్తకాల్లో 1953 అని చదివానూ,వాలంటరీ రిటైర్మెంటా అని అడిగితే, కాదండీ, కాలేజీలో ఎడ్మిషన్ దొరకదని, మా నాన్నగారు ఓ రెండేళ్ళు తగ్గించి 1951 అని వేశారూ అన్నారు.

ఈ రోజుల్లో ఆ గొడవలే లేవు,పిల్లకో పిల్లాడికో కార్పొరేషన్ వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికెట్ తీసికోకపోతే, స్కూలూ లేదు,రేషన్ కార్డూ లేదూ, పాస్పోర్టూ లేదూ, కాలేజీ లేదూ, అల్టిమేట్ గా ఉద్యోగమూ లేదూ!మా అమ్మాయి 74 లో తణుకు లో పుట్టింది.ఏదో జాతకాలూ వగైరా రాయించడానికి తిథి,వారం నక్షత్రం ఉన్నాయి, కానీ ఆ బర్త్ సర్టిఫికేట్ గొడవ తెలియదు. అప్పుడు మా మామ గారికి వ్రాస్తే, తణుకు పంచాయితీ ఆఫీసు కి వెళ్ళి, వాళ్ళు తెలుగులో వ్రాసి ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్ పంపారు. ఆ తెలుగులో వ్రాసింది, ఇక్కడెవరికీ అర్ధం అవదూ, చివరకి, మా ఫాక్టరీ లో పనిచేస్తున్న ఓ తెలుగు ఆఫీసర్ గారిచేత ఎటెస్ట్ చేయించిన తరువాత నమ్మారు!

కానీ ఆ 1945, 1950 ల్లో పుట్టి, ఈ డేట్ ఆఫ్ బర్తుల గంద్రగోళంలో పడ్డ ప్రతీ వారికీ, ఓ రెండేళ్ళ ముందరే, ఉద్యోగాల్లోంచి రిటైరు చేసేసి,” వయోవృధ్ధులు” కింద మార్చేశారు. రిటైరయ్యారూ అంటే, మన ప్రాంతాల్లో, వారికి ఓ లేనిపోని పెద్దరికం ఇచ్చేసి, ఎక్కడలేనీ ఆంక్షలూ పెట్టేస్తారు.బయట ఓ మడతమంచం వేసికుని పడుక్కోడం,బయటకెళ్ళి కూరలు తేవడం, మనవల్నీ,మనవరాళ్ళనీ రిక్షాలో స్కూలుకి తీసికెళ్ళడం, ఎప్పుడైనా ఖర్మ కాలి భార్య దగ్గర కూర్చుంటే,అయ్యో,అమ్మో అంటూ బుగ్గలు నొక్కుకోడం, ప్రతీ వాడికీ లోకువే! పైగా ప్రతీవాడూ పలకరించేవాడే – ఏమిటి మాస్టారూ రిటైరయిన తరువాత కాలక్షేపం ఎలా అవుతోందీ- అంటూ. అసలు వాడికెందుకూ ఈయనకి ఎలా అయితేనేం, వెధవ్వేషాలానీ.

Advertisements

7 Responses

 1. ____________________________
  అసలు వాడికెందుకూ ఈయనకి ఎలా అయితేనేం, వెధవ్వేషాలానీ.
  ____________________________

  🙂 🙂 🙂

  Like

 2. మీరన్నది కరక్టండీ బాబుగారు! అదేమిటో కనిపించిన ప్రతి వాడూ నేను 57 ఏళ్ళకే (1998)లో రిటరైతే అప్పుడే రిటైరయ్యారు ఎలా తోస్తుంది అని ఈ రోజుకూ అడుగుతూనే వుంటారు. అప్పుడు కన్నా ఇప్పుడే నాకు తీరిక దొరకట్లేదు అని సమాధానం చెబుతుంటాను. ఏదో వ్యాపకం పెట్టుకున్న వాళ్ళకు
  ఎప్పుడూ తీరిక వుండదు. ఇది నిజం !

  Like

 3. నవంబర్ లో పుట్టిన నన్ను ఆర్నెల్లు ఎక్కువేసి, జూన్ అని చెప్పి బళ్ళో వేసేసారు. నేనేం ఉజ్జోగం వెలగబెట్టట్లేదు కాబట్టి మీరు చెప్పిన “ఆం ఆద్మీ” కష్టాలేం లేవు కానీ, “నీ పుట్టిన తేదీ చెప్పుము.” అని ప్రతి చిన్న విషయానికి ఈ అమెరికాలో అడుగుతూ ఉంటారు. రికార్డుల్లో ఉన్న తేదీ గబుక్కున గుర్తొచ్చి చావదాయె. తడుముకుంటే బొత్తిగా గుమ్మడికాయల దొంగల్లే ఉంటానేమో అని ఎప్పుడూ మా నాన్నారిని తలుచుకొని విసుక్కుంటూ ఉంటాను. :X

  Like

 4. వెధవ్వేషాల డైలాగ్ సూపర్. నాకూ నచ్చదండీ ఆ రొటీన్ పలకరింపు రిటైరైనవాళ్ళని. అయ్యో రిటైర్ అయ్యరా అన్నట్లు,జాలితో కూడిన పలకరింపు. వీళ్ళ మానాన వీళ్ళు ఉన్నా బాధే.మా అమ్మ ఆ మధ్య కంప్యూటర్ క్లాసులకి వెళ్ళ్తే అదో చోద్యం అయ్యింది మా చుట్టుపక్కల.

  50 లు అరవైలేమి ఖర్మ 70 లలో పుట్టిన నాదీ అదే సమస్య. రికార్డుల డేట్ ఓఫ్ బర్త్ ఠక్కున గురు రాదు. పదో తరగతిలో ఎక్కువ వేసేసారు.ఎలాగూ ప్రభుత్వోద్యోగం వెలగబెట్టేది లేదు కాబట్టి రిటైర్మెంట్ల గోల లేదు కానీ ఠక్కున గుర్తు రాదు ఆ అఫీషియల్ పుట్టినరోజు అవసరమైనప్పుడు .

  Like

 5. @గణేష్,

  థాంక్స్.

  @గురువుగారూ, ఎవరెలా అనుకుంటేనేం, మన దారిన మనముందాం !

  @కొత్తావకాయ,

  మరి అప్పుడు అలా చేయడం వల్లే కదా బడికెళ్ళారూ !!

  @ఋషీ,

  మీ అమ్మగారు చెప్పవలసింది- నా దారిన నేనుంటే, నీకేం పోయేకాలం వచ్చిందిరా అని చివాట్లేస్తే, వదిలిపోయేది రోగం! ఇంకెవ్వరూ మాట్లాడే ధైర్యం చేసేవారు కాదు !

  Like

 6. mer

  Like

 7. చైతన్యా,
  మీరు వ్రాసిన వ్యాఖ్య ఏమిటో అర్ధం అవలేదు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: