బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అందుకే అంటారు..


   ఎప్పుడూ మనం ఒక రచయితని గురించి,ఆయన వ్రాసిన ఏదో ఒక పుస్తకాన్ని చదివేసో, వినో ఓ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు. నాకున్న దురలవాట్లలో అదీ ఒకటి లెండి. జీవితంలో ఎప్పుడూ అలాటి పని చేయకూడదనీ, ఓపికుంటే,చేతికొచ్చిన ప్రతీ పుస్తకమూ చదవాలని నిశ్చయించేసికున్నాను. అయినా మనకీ ఓ ఇష్టాఇష్టాలు కూడా ఉంటూంటాయి కదా.ఏదో ఓ genre మీద, చినప్పటినుండీ, ఒక ఇష్టం అనేది, ఏర్పరుచుకుని, అలాటివే చదువుతూంటాము. ఈ సందర్భం లో నాకు చాలా ఇష్టమైనవి, హాస్య/ తేలికపాటి (light) రచనలే. దానితోటి ఏమయిందీ అంటే, ఓ ముళ్ళపూడి వారివో, ఓ భరాగో గారివో,మొదట్లో వసుంధర గారివో తప్ప ఇంకేమీ చదివేవాడిని కాదు. వ్యాకరణం, ఛందస్సూ,సాహిత్యం, కవితలూ అనేవి నాకున్న కొద్దిపాటి ఐ.క్యూ. కి పట్టేవి కావు.

మా ఇంటావిడ, నాకు ఏక్ దం ఆపోజిట్.తన కి ఈస్థటిక్ సెన్స్ ఎక్కువా అని ఎప్పుడో చెప్పాను. చేతికొచ్చిన ప్రతీ తెలుగు పుస్తకమూ, చదివి, కాచి వడబొసేస్తుంది. అందుకే కాబోలు, ఆ పజిల్సూ,ప్రహేళికలూ అవీనూ.ఎప్పటెప్పటివో పాత పుస్తకాల్లోవి కూడా చేస్తూంటుంది. ఈ మధ్యన, ‘నవ్య’ వార పత్రికలో ఒక వ్యాసం శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి గురించి ఒక వ్యాసం చదివాను.అందులో రచయిత డా. ఆర్.అనంతపద్మనాభ రావుగారు, శ్రీ దువ్వూరివారి ‘the other side’ వ్రాశారు. నాకైతే నచ్చేసింది. అరే, శ్రీ దువ్వూరి వారు వ్యాకరణ శాస్త్రంలో ఉద్దండులూ, ‘రమణీయ వ్యాఖ్యానం’ అనే పుస్తకం వ్రాశారని విన్నాను కానీ, ఆయనలో ఇంత హాస్యం దాగి ఉందా అనుకుని, తొందరలో ఈ పుస్తకం, మా టెండర్ లీవ్స్ కి తెప్పించేయాలీ అనుకున్నంత సేపు పట్టలేదు-మా ఇంటావిడ ‘ఇప్పుడేమీ అర్జెంటుగా తెప్పించుకోనఖ్ఖర్లేదు. మన లైబ్రరీ లో ఇప్పటికే ఉందీ, అనడం తోనే, తెచ్చేసికుని చదవడం మొదలెట్టాను…..

శ్రీ దువ్వూరివారు, తన స్వీయ చరిత్రని వ్యావహారిక భాషలోనా, లేక ఆయనకి అలవాటైన గ్రాంధిక భాషలోనా వ్రాయడం అనే విషయమై ఆలోచించగా , “వెనకటికెవరో ఒకాయన బిచ్చగాడిని పొమ్మనటానికి, ” ఓయీ బిచ్చగాడా! తందులంబులిచ్చు వారిచ్చట నెవ్వరుం గానరారు,ఎచ్చటకేని చెచ్చర విచ్చేయుము” అనేవారుట.ఈ పధ్ధతి చాదస్తాన్నీ వికారాన్నీ సూచిస్తుందే కానీ, గ్రాంధిక భాషానురక్తిని సూచించదు.స్థానాస్థాన వివేచన అంతటా అవసరం.దేని చోటు దానికివ్వాలి.

వారి నాన్నగారి గురించి వ్రాస్తూ..“ఊళ్ళో అందరితోనూ ఎంత కలిసికట్టు తనం ఉండేదో ఇంట్లో అంత ముభావం. ఇంట్లో నవ్వు కనబడేదే కాదు.పోనీ మామీద ప్రేమ లేదనుకుందామా అంటే అమితమైన ప్రేమ.లోపల ఉన్నది వాత్సల్యం,పైకి కనబడేది తాటస్థ్యం”

తాళ్ళూరులో ఉన్నప్పుడు గొవిందమ్మ అనే ఒకావిడ ఉండేవారు. ఆవిడ గురించి చెబుతూ,ఆవిడ పధ్ధతుల్ని వర్ణించే విధానం చదవాలి గానీ, వ్రాస్తే అర్ధం అవదు. ఒక మచ్చు తునక–” ఇంట్లొని గదుల్లో గోడలకు బల్లరమర్చి ఇత్తడివి, కంచువీ పాత్రలూ,అంటే గిన్నెలూ,పళ్ళేలూ, చెంబులూ,గ్లాసులూ, ఒక రకం కాదు,దుకాణాల్లో ఉండే రకాలన్నీ తెప్పించి బల్లలమీద అందంగా పేర్చి ఉంచేది.ఓ బొమ్మలకొలువులా ఉండేది.ఐశ్వర్యం ఉండగానే సరికాదు, వస్తువులు కొనగానే సరి కాదు,ఏది ఎక్కడ ఉంచాలీ అనే చూపూ శ్రధ్ధా ఉండాలి.ఉన్నంత వరకూ సద్దుకునే దృష్టుంటే చాలు.దరిద్రుని ఇల్లైనా దర్శనీయంగా ఉంటుంది.అది లేకపోతే, ఐశ్వర్యవంతుని ఇల్లైనా అసహ్యంగా ఉంటుంది

తమ ఇంటిపేరు ఎలా వచ్చిందో వ్రాస్తూ..“మా ఇంటిపేరు ‘దువ్వూరి’ వారు. దువ్వూరు అనేది గ్రామ నామం. ఊరు శబ్దం ఔప విభక్తికం కావున, ‘ఇ’ కారం చేర్చి దువ్వూరి వారయ్యారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలూ,పెద్దలూ ఒకచోట చేరారంటే, కాలక్షేపానికి ‘అంతాక్షరీ’ అని పాడుకుంటూంటారు. ఆయన చదువుకునే రోజుల్లో ‘ కట్టు శ్లోకాలు’ అనే వారుట, ఆ శ్లోకాలు ఎలా నేర్చుకునేవారో వివరిస్తూ-కట్టు శ్లోకాలంటే- ఒకరు ఒక శ్లోకం మొదట చదువుతారు.దాని కొసను ఏ అక్షరం వస్తుందో అది మొదటి అక్షరంగా రెండవ శ్లోకం … అలా అన్న మాట.శబ్దాలూ,సమాసాలూ,వ్యాఖ్యాన విశేషాలూ,అమరం ఏకరువూ,వ్యుత్పత్తుల పరీక్షా, వగైరా..

అన్నిటిలోకీ మచ్చు తునక, శ్రీ దువ్వూరి వారు తమ భార్య గురించి వ్రాస్తూ వ్రాసిన మాటలు…”‘ఆపాటి చదువు రాకుండా ఉంటుందా అనుకున్నాను. కానీ ఆవిడకి ‘అ’ మొదలు ‘క్ష’ వరకూ అక్షరాలూ,ఒకటి మొదలు నూరు వరకూ తడుముకోకుండా అంకెలూ,జనవరి మొదలు డిశంబరు దాకా నెలలూ తెలియకుండానే 70 ఏళ్ళ సంసార చక్రం దొర్లించానంటే,విన్నవాళ్ళు ఆశ్చర్య పడతారు’ కానీ జాలిమాత్రం పడొద్దు. నేను సద్దుకోలేక చిక్కుపడితే కదా మీరు జాలి పడాలి….అక్షరాలు రాని లోపం అడుగడుగునా కనబడకపోలెదు కానీ,మనస్సు సరిపెట్టుకుంటే, తీరని లోపం ఏదీ ఉండదు.”

పైన ఉదహరించినవి కొన్ని ఆణిముత్యాలలాటివి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో వివరణలు,అభిప్రాయాలూ ప్రతీ పేజీలోనూ కనిపిస్తాయి. ఆత్మకథ అంటే ఎలా ఉండాలో వ్రాసి చూపించారు శ్రీ దువ్వూరి వారు. ఇంక చదివేసి ‘ఒహో ఇలాగుంటుందా..’ అనుకోవడం మన వంతు.

Advertisements

4 Responses

 1. దువ్వూరి వారి ఆత్మకథ తో పాటుగా సినబ్బ కథలూ మొదలైన పుస్తకాలు కొన్ని తిరుపతి వెళ్ళినపుడు తెచ్చుకొని చదివి ఆనందించాను. అప్పటినుండి దువ్వూరివారి రమణీయం – తెలుగు వ్యాకరణ పుస్తకం సంపాదించి చదవాలని ఓ కోరిక. ఎప్పటికి తీరుతుందో ఏమిటో.

  Like

 2. నరసింహరావుగారూ,

  నా టపాకి స్పందించినందుకు ధన్యవాదాలు.

  Like

 3. అయ్యా శ్రీ దువ్వూరి వారి ఆత్మ కథ, రమణీయం ఎక్కడ లభిస్తాయో మీ దగ్గర గల పుస్తకంలో ఏమైనా ఉన్నదేమో కాస్త చూసి చెప్పగలరా? ధన్యవాదాలు.

  Like

 4. సుబ్బారావు గారూ,

  కాచిగూడా లోని నవోదయా లో తప్పకుండా దొరుకుతాయి. లేకపోయినా తెప్పించి పెడతారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: