బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అబ్బ..ఇంకా టైముందికదా…


   ఇదివరకటి రోజుల్లో,ప్రతీ పనీ ఓ ప్లాన్ చేసికుని చేసేవారు, ఒక్క పిల్లల్ని పుట్టించడం తప్పించి ! దానికి ఓ ప్లానూ వ్యవహారం ఉండేవి కావు! ఇంట్లో ఎంతమందుంటే అంత ఆనందం, సంతోషమూనూ! అలాగని ఆ పిల్లలు ఏదో గాలివాటానికి పెరిగినవాళ్ళు కాదు.పిల్లలంటూ ఉండాలే కానీ, ఓసారి వచ్చిన తరువాత, ఓ పధ్ధతి లోనే పెరిగారు.ఈమాట మాత్రం ఎవరూ కాదనలేరనుకుంటాను.

   ఇప్పుడు వ్రాసేది,ఈ రోజుల్లో చూస్తున్న last minute rush గురించి.ఎవరు చూసినా, పోనిస్తూ ఇంకా టైముందిగా అనేవాడే.ఉదాహరణకి, స్కూలుకెళ్ళే పిల్లల పుస్తకాలకీ, షూస్ కీ, స్కూళ్ళు తెరవడానికి, ఓ పది పదిహేను రోజుల ముందునుంచీ, కొనడానికి ప్లాన్ చేసికుంటే వచ్చిన నష్టమేమిటో, నాకైతే అర్ధం అవదు.సోమవారం స్కూళ్ళు తెరుస్తారంటే, ఆ ముందరి శనివారమే టైము దొరుకుతుంది, ప్రతీ వాడికీనూ.దాంతో ఏమౌతుందీ, అందరూ ఒక్కసారే ఊరిమీదకి పడేటప్పటికి, ఆ మాల్స్ లోనూ, పుస్తకాలూ, యూనిఫారాలూ, షూసూ కొనుక్కునే చోట ఓ పేద్ద రష్షూ! పార్కింగ్ కి ప్లేస్ దొరకదు. పైగా హైదరాబాద్ లాటి చోట్ల ఆదివారాలు కొట్లకి శలవుకూడానూ. ఇక్కడ (పూణె) లో, ఇంకా ఆ పరిస్థితి రాలేదనుకోండి, సోమవారాలు శలవు కొట్లకి.

   ఓ పదిహేను రోజుల ముందు ప్లాన్ చేసికుని కొనుక్కోవచ్చు కదా,షూస్సూ, యూనిఫారాల సైజులూ ఈ పదిహేను రోజుల్లోనూ ఏమీ తక్కువా ఎక్కువా అయిపోవు.ఇదేమైనా కాంప్లాన్ వాడి యాడ్డా ఏమిటీ? జస్ట్ జరుగుబాటు అంతే!అక్కడికి, ముందునుంచీ ప్లాన్ చేసికునేవాళ్ళు, తెలివితక్కువ దద్దమ్మలూ,పాత చింతకాయ పచ్చళ్ళ గాళ్ళూ, పల్లెటూరి బైతులూనూ, వీళ్ళేమో చాలా స్మార్టూ! ఆ స్కూలు తెరిచే ముందు శనాదివారాలు, ఏ ధర్నా మూలంగానో కొట్లు తెరవకపోతే ఉంటుంది, వీళ్ళ సంగతి! తూర్పుకి తిరిగి దండం పెట్టడమే!

   అలాగే ప్రయాణాల విషయంలోనూ అంతే, ఏదో ఫలానా టైముకి ఫలానా చోటకి ఏదో కార్యక్రమానికి వెళ్ళాలీ అని ముందుగా తెలిసినా సరే, ఆన్ లైన్ లో టిక్కెట్లు రిజర్వ్ చేసికోడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ. ఈ రోజుల్లో, ఓక్లిక్కు ద్వారా ఏ టిక్కెట్టైనా మూడు నెలలముందరే చేసికునే సదుపాయం ఉండనే ఉంది, అయినా సరే, చివరి నిముషందాకా ఆగడం, ఏ తత్కాల్ కో ప్రయత్నించడం, లేదా, ఏ ఏజంటుకో ఇవ్వడం, అదీ కాదంటే బస్సులుండనే ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ శలవల సీజన్ లో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తూంటారు. క్రిందటి నెలలో, మా అబ్బాయి, నవ్యని తీసికుని రావడానికి, హైదరాబాద్ నుండి పూణే కి ఒక్కో టిక్కెట్టుకీ 1800/- ఇచ్చాడు.just daylight robbery !! ఇదే ముందుగా రిజర్వేషన్ చేయించుకునుంటే, వెళ్ళకపోయినా, ఆ టిక్కెట్లు క్యాన్సిల్ చేసికోడానికి మహ అయితే, ఎంతయుండేది?

   నాకు ఆ విమాన ప్రయాణాల సంగతి తెలియదు. అయినా వాటిల్లోనూ అదేదో block చేయించుకుంటారుట కదా? అలా చేయించుకున్నా, బాగానే ఉంటుంది. చెప్పానుగా ప్రతీ వాడికీ, ఆఖరి నిముషం దాకా వెయిట్ చేయడం లో అదో అలౌకికానందమనుకుంటాను. రైలు ప్రయాణాల్లో చూస్తూంటాము, స్టేషనొచ్చినప్పుడల్లా ప్లాట్ఫారం మీదకి దిగి ఓ పోజు పెట్టుకుని నుంచోడం, ట్రైను కదులుతూండగా ఎక్కడం, అందులోనూ, ఏ.సి.ల్లో ప్రయాణం చేసేవాళ్ళైతే మరీనూ! ప్రతీ వాడికీ తెలియొద్దూ, తను ఏ.సీ. లో ప్రయాణం చేస్తున్నాననీ, పైగా ఈ ఏ.సీ.బోగీల్లో, బయటివాళ్ళకి మనం కనిపించం కూడానూ! ఇదో స్టేటస్ సింబలూ!

   సిటీబస్సుల్లోనూ అంతే, ఫుట్ బోర్డ్ మీద వెళ్ళాడుతూ ప్రయాణం చేసే కొందరు ప్రాణులుంటారు. లోపల ఎంత ఖాళీ ఉన్నా సరే, ఆ ఫుట్ బోర్డ్ మీదే నుంచోడం. ముంబై లోకల్స్ వ్యవహారం వేరు, ఇక్కడ పూణె లో చూస్తూంటాను, లోకల్ ట్రైనులో, ఎంత ఖాళీ ఉన్నాకానీ, వేళ్ళాడుతూనే ప్రయాణం చేస్తారు.
ఈ లాస్ట్ మినిట్ రష్ గాళ్ళని భగవంతుడు కూడా బాగుచేయలేడు !!

4 Responses

  1. మీ అబ్బాయిని కూడా వదలలేదా. 🙂 ..పాపం పోనిద్దురు అదొ last minute సరదా…

    Like

  2. ” ఆన్ లైన్ లో టిక్కెట్లు రిజర్వ్ చేసికోడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ”

    I think that is because of laziness ..

    Like

  3. అన్నీ పద్ధతి ప్రకారం చేసేస్తే ఇంక మజా ఏముంటుందండి. చివరి నిముషంలో చేస్తే కలిగిన కష్టాలు నాల్గు రోజులు గుర్తు ఉంటాయి. అదో తృప్తి. :):)

    Like

  4. @నిరుపమా,
    అబ్బాయి అయినా, ఒక్కొక్కప్పుడు వీళ్ళు చివరి నిముషం లో పెట్టే ఉరకలూ పరుగులూ చూస్తే, వీళ్ళెప్పుడు బాగుపడతారా అనిపిస్తూంటుంది.

    @గీతా,
    బధ్ధకమే ఇంకేమిటి మరి ?

    @సుబ్రహ్మణ్యం గారూ,

    దానికి సాయం అనుభవం కూడా వస్తుంది !!

    Like

Leave a comment