బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఇరుకు జీవితాలు…


   ఇదివరకటి రోజులకీ, ప్రస్తుతపు రోజులకీ,స్పష్టంగా కనిపించేదేమిటంటే– moving space- ఎక్కడ చూసినా ఇరుకే.ఇదివరకటి రోజుల్లో మనం ఉండే ఇళ్ళు ఎలాగుండేవి? అది ఓ భవనమైనా సరే,ఓ పూరిపాకైనా సరే.మండువా ఇళ్ళూ, ప్రతీ కార్యక్రమానికీ, అంటే భోజనానికీ, వంటకీ,పురుళ్ళకీ,చివరాఖరికి ఇంట్లో ఆడవారు ‘బైట’ ఉన్నప్పుడు, వారు విడిగా, ఎవరినీ తగలకుండా ఉండేటట్టుగా ఉండడానికి సైతం, ఓ గది విడిగా ఉండేది. ఇంటి పెద్ద ఏ వకీలో అయితే, పార్టీలతో మాట్లాడడానికి ఓ ‘కచేరీ సావిడి’ అనేదొకటుండేది. అంతదాకా ఎందుకూ, ఓ మరుగు దొడ్డి ఉండేదా, అదికూడా ఓపెన్ గానే ఉండేది ( ఓ తలుపూ, గడియా ఉండేవనుకోండి), ఊరగాయలకి ఓ గదీ, మామిడికాయలు పండబెట్టుకోడానికో గదీ, ధాన్యం ఉంచడానికి ఓ గాదె.కొబ్బరికాయలుంచుకోడానికి,పాత ఇత్తడి సామాన్లుంచుకోడానికీ ఓ అటకా.అలా ఆర్ధిక పరిస్థితి బాగా ఉండేవాళ్ళిళ్ళు విశాలంగా,ఓ మండువా సహితంగా ఉండేవి. ఆఖరికి మనం త్రాగే నీళ్ళకి కూడా ఓ బావి(నుయ్యి) ఉండేది. అందువలనేమో ఆ ఇంటివాళ్ళ హృదయాలుకూడా అంత విశాలంగానూ ఉండేవి. దానితో, ఊళ్ళో ఉండే ప్రతీవారూ ప్రేమాభిమానాలతో ఉండేవారనుకుంటాను. వసుధైక కుటుంబం అనే మాట, ఆరోజుల్లో వినబడేది, పుస్తకాల్లో చదవబడేది. ఇప్పుడో ‘వసుధా’ లేదూ, ‘కుటుంబం’ లేదూ !! వసుధంతా SEZ ల పాలయింది, కుటుంబం ‘Nuclear’ అయిపోయింది

   ఈ రోజుల్లో ఇల్లనండి, వేసికునే వేషం అనండి, తినే తిండి అనండి,పెట్టుకునే బొట్టనండి, ఏది తీసికున్నా సరే, ఎంత చిన్నదిగా ( ఇరుగ్గా) ఉంటే అంత గొప్ప! పైగా చూసే ప్రతీవాడూ కూడా , ‘అబ్బ ఎంత ‘cute’ గా ఉందో అనే పొగడ్తోటీ! దానితో మన ప్రవర్తనా, వ్యక్తిత్వమూ,అన్నీకూడా ‘ఇరుకు’ అయిపోయాయి.ఇదివరకటి రోజుల్లో కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత బాగా ఉండేదనేవారు. ఇప్పుడో, భార్యా, ఐతే గియితే ఒకళ్ళో ఇద్దరో పిల్లలూ, వీళ్ళని పెంచి పెద్దచేసేటప్పటికే తల ప్రాణం తోక్కి వస్తోంది.

   ఇదివరకటి రోజుల్లో, స్కూళ్ళల్లో ఎలా ఉండేది? క్లాసు రూమ్ములు విశాలంగా, ఆడుకునే గ్రౌండులు విశాలంగా, ఆఖరికి ఏ ట్యూషన్ కో వెళ్ళవలసి వచ్చినా( ఊరికే చెప్పేవారు!)అక్కడ మాస్టారింట్లో, అరుగు మీదే చెప్పేవారు. ఇప్పుడు ఊరికే చెప్పే మాస్టర్లూ లేరూ, అరుగులూ లేవూ .ఓ ఎపార్ట్మెంట్ అద్దెకు తీసేసికుని, దాంట్లోనే ఓ స్కూలూ, అక్కడే ఓ వరండాలో ఓ లాబొరేటరీ.ఇంక ఇళ్ళ సంగతి అడక్కండి, ఎక్కడ చూసినా, apartment culture,అదికూడా, సింగిల్ బెడ్ రూమ్మో,డబల్ బెడ్ రూమ్మో, మహా అయితే ఇంకో రూమ్ము. అన్నీ దాంట్లోనే.చెయ్యిచాపితే ఏ గోడకో కొట్టుకునేటట్లు బాత్ రూమ్మూ,గాలీ, వెలుతురూ తగలని టాయిలెట్లూ, మనం త్రాగే, వాడకానికి ఉపయోగించే నీళ్ళు కూడా ఓ ‘ఇరుకు’ అయిన పైప్పులలోంచే వస్తాయి! కార్పొరేషను/మ్యునిసిపాలిటీ వాడు నీళ్ళొదలలేదంటే, ఆరోజుకి స్నానం పానం బంధ్. పైగా వీటికి ‘ రక్షిత మంచినీటి పథకం’ అని పేరోటీ.

   ఇదివరకు ఓ వేణ్ణీళ్ళు కాచుకోవాలన్నా,ఓ వంట చేసికోవాలన్నా, హాయిగా ఓ పొయ్యిమీద చేసేసేవారు.ఇప్పుడు గ్యాస్ వచ్చిన తరువాత, పైగా కొన్ని చోట్ల, పైప్పు లైన్లలో వస్తుందిట, సిలిండరయిపోయిందా, ఇంక అంతే సంగతులు.ఇంక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, అక్కడుండే పరిస్థితి ఏమిటీ? అగ్గిపెట్టెల్లాగ, ఓ క్యాబినూ, దాంట్లో ఓ రెండో మూడో కంప్యూటర్లూ, ఓ ఆడా మగా మెళ్ళో ఓ తాడేసికుని, దానిమీదో పేరూ, రోజంతా ఆ కంప్యూటరులోకి చూస్తూ, బోరుకొట్టినప్పుడో,ఇంకోప్పుడో పక్కనుండే వాళ్ళ మొహం చూడ్డమూ. సాయంత్రం అదృష్టం బాగుండి, ఆ మానేజరో, టీం లీడరో ఎవరో మళ్ళీ ఏదో గుర్తొచ్చి పిలవకుండా ఉంటే, కంపెనీ బస్సులోనో స్వంత బైక్కో,కారులోనో ఆపసొపాలు పడుతూ, ‘ఇరుకు’ గా ఉండే రోడ్లమీద ప్రయాణం చేసి, ‘ఇరుకు’ గా ఉండే కొంపకి చేరడం. మరి ఇలాటి పరిస్థితుల్లో, ఏదో అమ్మా నాన్నలు పెట్టిన పేరులో తప్ప జీవితంలో’ విశాలం’ ఎక్కడుంటుందీ?

   ఇంక,పిల్లలు కూడా తమ కుటుంబం అంటే, మమ్మీ డాడీ యే అనుకుంటారు. తాతలూ, అమ్మమ్మలూ, నానమ్మలూ ‘also ran’ కోవలోకే వస్తారుకానీ, ‘integral part of the family’ లోకి రారు.అప్పుడెప్పుడో ఓ కథ చదివాను, ఫామిలీ ఫొటో( శ్రీ చంద్రశేఖర్ ఆజాద్) అని. మీ ఫామిలీ ఫొటో తీసికుని రమ్మంటే, ఆ పిల్ల తనూ, అమ్మా నాన్నా, ఉంటే గింటే తమ్ముడూ ఉన్న ఫొటో తెస్తుంది. అదేమిటీ, మీ grandparents లేరేమిటీ అంటే, వాళ్ళు ఫామిలీ కాదుకదా అంటుంది.అదండి సంగతి.

   పోనీ ఏ శలవురోజో బయటకు వెళ్దామా అంటే, రోడ్డులు ఇరుకు, ఫుట్ పాత్లు ఇరుకు, హొటళ్ళు ఇరుకు, చివరాఖరికి ఇలాటి వాతావరణం లో పెరిగి, మన గుండె నుండి రక్తాన్ని మిగిలిన భాగాలకి తీసికెళ్ళే ‘Artieries’ కూడా ఇరుకైపోయి,ఏవేవో రోగాలూ రొచ్చులూ వచ్చేసి, ఎప్పుడు టపా కట్టేస్తామో తెలియని పరిస్థితి!

11 Responses

 1. ఒక చిన్న సలహా మీ బ్లాగ్ లో ఫాంట్ కూడా కొంచెం ఇరుకుగా ఉంటుంది

  Like

 2. రవితేజా,

  చదవడానికి వీలుగా ఉంటుంది కదా అని సైజు ‘3’ పెడుతూంటాను. మరీ లైనుకీ,లైనుకీ ఖాళీ ఎక్కువగా ఉంటే, మరీ పెద్దదిగా ఉండి, చదవడం మానేస్తారేమో అని భయం ఒకటీ! అయినా మీ సలహా కి కృతజ్ఞతలు.

  Like

  • ఎప్పటి నుంచో చెప్దాము అనుకుంటున్నాను సందర్బం వచ్చింది కాబట్టి చెప్పాను అన్యదా భావించకండి

   Like

 3. Absolutely correct sir!!
  One of your best posts, I’ve ever read.

  Like

 4. వెంకట గణేష్,

  నా టపా అంతబాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

  Like

 5. chalaa baaga vishleshincharu .nijam.

  Like

 6. 🙂 చాలా బాగా చెప్పారు. కానీ.. మన జనాభాకి, ఉన్న వనరులకి ఉన్న లంకే వల్ల ఈ ఇరుకుదనం తప్పదు … పార్కింగ్ దగ్గర్నించి, మనసుల దాకా..

  Like

 7. పేర్లు మాత్రం విశాలంగా ఎక్కడండీ, అవీ షార్ట్ కట్టేగా!
  మంచి టాపిక్సు రాస్తున్నారు

  Like

 8. సారు,
  ఇప్పటికే చాలా రీలేషన్స్ మాయమయ్యాయి. ఒకప్పుడు ఎక్కువమంది ఉండటం వలన పెద్దమ్మా,పిన్నమ్మా, పెద్దనాన్న, చిన్నాన్న, మామా, అత్తా, మేనత్త మొద|| చుట్టరికాలు ఉండేవి. ఈ తరం వారికి ఈ రిలేషన్షిప్/ చుట్టరికాలు ఎమీ తెలియదు, దాదాపు 1975 సం|| పెళ్ళిచేసుకొన్న వారిని గమనిస్తే వారు ఇద్దరితో సరిపేట్టుకొన్నారు. ఆ తరువాత తరం వారు అంతా ఇలా కుటుంబ నియత్రణని కొనసాగిస్తూ చుట్టరికాలను మాయం అవ్వటానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొనే వారు ఒకరితో సరి పుచ్చుతున్నారు. రానున్న తరం వారికి పెళ్ళి అనేది ఒల ఆప్షన్ మాత్రమే. చేసుకొంటే చేసుకొంటారు, చేసుకొన్నా ఎక్కువ రోజులు కలసి ఉంటారన్న నమకం లేదు. భర్యా భర్తలకి ఒకరి పై ఒకరికి అనుమానాలు ఎక్కువ ఉండటం మూలాన పిల్లలని కనటం అనేది అరుదైపోతుంది. ఈ పరిస్థితి ఇలాగే విషమిస్తూ, మహా ఐతే ఇప్పుడు పుట్టిన వారు పెద్దయ్యే సరికి పెళ్ళిలు పిల్లలు అనేవి సగానికి సగం తగ్గిపోతాయి. ఆవిధం గా ఎన్నో ఆశలు, డబ్బుల సంపాదనలో పడ్డ మనిషికి అనుభవించే వారసులు లేకుండా కథ త్వరలో ముగిసిపోతుంది. డబ్బు పిచ్చి పెరిగేకొద్ది మనుషులు మాయమైపోతారు. దాచుకొన్న డబ్బులు బాంక్ పరమో లేక ఇతరుల పరమో అయిపోతుంది.

  Like

 9. మీ పోస్టులన్నీ చదువుతుంటాను. వ్యాఖ్య వ్రాయలేదు ఎప్పుడూ.
  సరదాగా ఉంటుంది, ఇంట్లో పెద్ద వారితో మాట్లాడినట్టు, మీ పోస్టులు చదువుతుంటే.
  ఈ టపా చదివాక చిన్న అనుమానం తీర్చుకోవాలనిపించి వ్రాస్తున్నాను.
  “మండువా ఇళ్ళూ, ప్రతీ కార్యక్రమానికీ, అంటే భోజనానికీ, వంటకీ,పురుళ్ళకీ,చివరాఖరికి ఇంట్లో ఆడవారు ‘బైట’ ఉన్నప్పుడు, వారు విడిగా, ఎవరినీ తగలకుండా ఉండేటట్టుగా ఉండడానికి సైతం, ఓ గది విడిగా ఉండేది. ఇంటి పెద్ద ఏ వకీలో అయితే, పార్టీలతో మాట్లాడడానికి ఓ ‘కచేరీ సావిడి’ అనేదొకటుండేది. అంతదాకా ఎందుకూ, ఓ మరుగు దొడ్డి ఉండేదా, అదికూడా ఓపెన్ గానే ఉండేది ( ఓ తలుపూ, గడియా ఉండేవనుకోండి), ఊరగాయలకి ఓ గదీ, మామిడికాయలు పండబెట్టుకోడానికో గదీ, ధాన్యం ఉంచడానికి ఓ గాదె.కొబ్బరికాయలుంచుకోడానికి,పాత ఇత్తడి సామాన్లుంచుకోడానికీ ఓ అటకా.”
  ఇవి (వకీళ్ళా విషయం పక్కన పెడితే) వ్యవసాయం చేసే వారి నివాసాల వర్ణన అనిపిస్తోంది. ఇవి అప్పుడైనా ఇప్పుడైనా పల్లెటూళ్ళలో కాదా ఉండేవి? ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఉండటంలేదా?
  అమెరికాలో చాలా ఇళ్ళు ఇలానే ఉంటాయి, ఎన్నో గదులు, మనుషులు మాత్రం కొందరే.
  అంత పెద్ద ఇళ్ళు ఉన్నా, శుభ్రం చేసుకోవడం కష్టమని పిల్లల పుట్టిన రోజు పార్టీల వంటివి బయటే జరుపుకుంటుంటారు కొంత మంది.
  ఇంకా అపార్టుమెంటుల్లోనే నయం. కాస్త వెచ్చగా ఉంటే చాలు పిల్లలు బయటికి వచ్చి ఆడుకుంటారు. పిల్లల తల్లులు వాళ్ళను చూస్తూ కబుర్లు చెప్పుకుంటుంటారు.
  మనసు ఇరుకు కాకపోతే స్థలం చిన్నదైనా బానే ఉంటుంది. ఇలా అనిపిస్తుంటుంది మరి నాకు 🙂

  Like

 10. @చిన్నీ,

  ధన్యవాదాలు.

  @కృష్ణప్రియా,

  అదీ నిజమే. చేయకలిగింది ఏమీ లేకపోయినా, ఉన్న విషయమేదో అందరితోనూ పంచుకోవాలనే ప్రయత్నం.

  @తెరెసా,

  ధన్యవాదాలు.

  @శ్రీరాం,

  మరీ అంత పెసిమిజం పనికిరాదేమో? దునియా గోల్ హై అన్నట్లు, తిరిగి తిరిగి ‘మంచి’ రోజులు రావొచ్చేమో ?

  @లలిత గారూ,

  ఇంట్లో పెద్దవారితో మాట్లాడినట్లెందుకుండదూ, దగ్గర దగ్గర 70 ఏళ్ళొస్తున్నాయి నాకు! ఏదో తిట్టకుండా చదువుతున్నారని వ్రాసుకుంటూ పోతున్నాను. ఇంక మీరు వ్యక్త పరచిన అనుమానం- నేను, అమలాపురంలో మా అమ్మమ్మ గారి ఇంటిని దృష్టిలో పెట్టుకుని వ్రాశాను. ఆ మధ్య ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు, ఆ ఇల్లంతా డెవెలప్మెంటు కి ఇచ్చి, ఎపార్ట్మెంట్స్ లాగ మార్చడంతో కలిగిన బాధ ఆపుకోలేక వ్రాసినదీ టపా. మీరు చాలా కాలం నుండి దేశం బయటే ఉన్నట్లనిపిస్తోంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా,ప్రతీవారూ ‘అగ్గిపెట్ల’ లాటి కొంపలకే మొగ్గు చూపుతున్నారు.మీరన్నట్లు వాటిల్లో ఉన్న సదుపాయాలు/సుఖాలూ మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.ఎంతో ఓపిగ్గా వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: